Business

సిమ్ కార్డులు ఎక్కువ తీసుకుంటే జరిమానా

సిమ్ కార్డులు ఎక్కువ తీసుకుంటే జరిమానా

నేటి డిజిటల్‌ ప్రపంచంలో ఒక్క సిమ్‌ కార్డు సరిపోవటం లేదు. ఆఫీసు వ్యవహారాలకు ఒకటి, సొంత పనులకు ఒకటి, కుటుంబ పనులకు మరోటి.. ఇలా బోలెడన్ని సిమ్‌లు ఎడాపెడా తీసేసుకుంటున్నారు. అయితే తమ పేరుతో ఎక్కువ సిమ్‌ కార్డులు ఉండటమూ చిక్కే. ఇది కొన్నిసార్లు న్యాయ, ఆర్థిక సమస్యలకు దారితీస్తుందని చాలామందికి తెలియదు కూడా. వ్యక్తిగత సిమ్‌ కార్డుల గరిష్ఠ సంఖ్యకు సంబంధించి టెలికమ్యూనికేషన్స్‌ చట్టం, 2023 కఠినమైన పరిమితులను విధించింది. దీన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానా పడొచ్చు. జైలు శిక్ష పడే అవకాశమూ ఉంది. దేశవ్యాప్తంగా ఎవరైనా తమ పేరు మీద గరిష్ఠంగా 9 సిమ్‌ కార్డులు తీసుకోవచ్చు. అయితే జమ్మూ కశ్మీర్, అసోం, నార్త్‌ఈస్ట్‌ లైసెన్స్‌డ్‌ సర్వీస్‌ ఏరియాల్లో మాత్రం ఆరుకే పరిమితం చేశారు. మోసాలను అరికట్టటానికి, టెలికం వనరుల నిర్వహణను మెరుగు పరచటానికి ఈ నిబంధనలు ప్రవేశపెట్టారు.

అనుమతించిన సంఖ్య కన్నా ఎక్కువ సిమ్‌లు తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. తొలిసారి పరిమితిని ఉల్లంఘిస్తే రూ.50వేల వరకూ జరిమానా పడుతుంది. అప్పటికీ మారకపోతే రూ.2 లక్షల జరిమానా పడుతుంది. అనుచిత మార్గాల్లో సిమ్‌ కార్డులను పొందటమూ నేరమే. ఇందుకు గాను మూడేళ్ల వరకూ జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా విధిస్తారు. లేదా ఒకేసారి రెండూ విధించొచ్చు.ఒకరి పేరు మీద ఉన్న సిమ్‌ కార్డుల సంఖ్యను టెలికం సంస్థలు పర్యవేక్షిస్తుంటాయి. ఎవరైనా మోసపూరితంగా మన పేరు మీద సిమ్‌ కార్డును పొంది ఉన్నట్టయితే దాన్ని గుర్తించి, రిపోర్టు చేయటం ముఖ్యం. ఇందుకోసం టెలికమ్యూనికేషన్‌ విభాగం ప్రత్యేకంగా సంచార్‌ సాథీ పోర్టల్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో మన పేరుతో ఎన్ని సిమ్‌ కార్డులున్నాయో తెలుసుకోవచ్చు. అప్పుడప్పుడూ ఇందులో తనిఖీ చేసుకుంటుంటే ఎవరి జాగ్రత్తలో వారుండొచ్చు.

* ముందుగా సంచార్‌ సాథీ వెబ్‌సైట్‌ https://sancharsaathi.gov.in/ లోకి వెళ్లాలి.
* హోం పేజీలో సిటిజన్‌ సెంట్రిక్‌ సర్వీసెస్‌ విభాగంలో నో యువర్‌ మొబైల్‌ కనెక్షన్స్‌ మీద క్లిక్‌ చేయాలి.
* కొత్తగా తెరచుకున్న పేజీలో పదంకెల ఫోన్‌ నంబరు, దాని కింద బాక్సులో క్యాప్చియా సంకేతాన్ని టైప్‌ చేయాలి. అప్పుడు ఫోన్‌ నంబరుకు ఓటీపీ వస్తుంది.
ఓటీపీని ఎంటర్‌ చేయగానే మన పేరుతో ముడిపడిన ఫోన్‌ నంబర్ల జాబితా కనిపిస్తుంది. అవసరం లేనివాటిని తొలగించుకునే ఆప్షన్‌ కూడా ఇందులో ఉంటుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z