NRI-NRT

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాల పండుగ

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాల పండుగ

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో 14 జూలై 2024,ఆదివారం సాయంత్రం 6 గం౹౹ ల నుండి 10 గం౹౹ ల వరకు బోనాల పండుగని శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. దాదాపు 800 ప్రత్యక్షంగా పాల్గొని, అంతర్జాల మాధ్యమం ద్వారా 7000 మంది వీక్షించిన ఈ కార్యక్రమంలో భక్తిగీతాలు,ఒగ్గు కళ, డోలు, నృత్యం వంటి జానపద సంస్కృతి ప్రదర్శనలతో ఆనందోత్సవాల నడుమ జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న ఈ ఉత్సవాలకు బోయిన స్వరూప, పెద్ది కవిత, సరితాదేవి తులా, దీపారెడ్డి, మోతే సుమతి, గంగా స్రవంతి, సంగీత తదితరులు కుటుంబ సభ్యులతో భక్తి శ్రద్ధలతో బోనాలు ను నియమ నిష్ఠతో సిద్ధం చేయడంతో ప్రారంభం అయిన ఈ కార్యక్రమం సాంప్రదాయ, సాంస్కృతిక ప్రాముఖ్యతను తెలుపుతూ మన పల్లెలో జరుకొనే బోనాల జాతరలానే నిర్వహించబడినది అని అందరూ కొనియాడారు. ఆద్యంతం కోలాహలంగా జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు వారందరూ కుటుంబ సమేతంగా మరియు కార్మిక సోదరులు చురుకుగా పాల్గొన్నారు. బోనం అమ్మవారికి సమర్పించే నైవేద్యం. అరసకేసరి దేవాలయంలో మహిళలు తాము వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం కూడిన బోనాన్ని తమ తలపై పెట్టుకుని డప్పుగాళ్ళు, పోతురాజులు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దుర్గ అమ్మవారి గుడికి వెళ్ళారు. మహిళలు తీసుకు వచ్చిన ఈ పవిత్ర బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ, కడి (తెల్ల ముగ్గు) తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచి నిష్ఠగా బోనాల్ని అమ్మవారికి నివేదించారు. మహిళలు, పిల్లలు అందరూ జానపద సంగీతానికి అనుగుణంగా ఉత్సాహంగా నృత్యాలు చేశారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాల వితరణ జరిగినది.

ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా “ఒగ్గు కళాకారుడు” నక్కా నరేష్ చేసిన ప్రదర్శన అందరి హృదయాల్ని ఆకట్టుకుంది. ఒగ్గు (డమరుకం) తో నరేష్ 10 నిమిషాల పాటు పాటలు పాడుతూ డప్పుని వాయిస్తూ అమ్మ వారికి బోనం తీసుకువస్తూ చేసిన నృత్యం పిల్లల్ని, పెద్దల్ని కట్టిపడేసింది. పెద్దపులి ఆట, పోతురాజు వేషధారణ, వారి ఆహార్యం, మనోహరమైన జానపద నృత్యప్రదర్శన ఈ కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలిచింది. ఎంతోమంది తెలుగు వారు తమ పిల్లలకి ఈ సందర్భంగా తెలుగు సంప్రాయాన్ని, బోనాల విశిష్టతని చూపటానికి ప్రత్యేకంగా హాజరైనామని చెప్పారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి బోనాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాలు పండుగ మన తెలుగు వారికి ప్రత్యేకించి తెలంగాణ జానపద సంస్కృతితో ముడిపడి ఉన్నాయన్నారు. హాజరైన ప్రతి ఒక్కరికీ చిరస్మరణీయమైన అనుభూతిని అందించడంలో వారి కృషి మరియు అంకితభావం కీలక పాత్ర పోషించాయని , అలాగే సింగపూర్ లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే వారి కోసం ఉచిత బస్సుల్ని ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు బోయిని సమ్మయ్య తెలిపారు. తెలుగు వారందరూ బోనాల స్ఫూర్తిని పురస్కరించుకుని ఉత్సవాలలో పాల్గొనడంతో ఈ కార్యక్రమం సింగపూర్ లోని తెలుగు వారి ఐక్యత మరియు సాంస్కృతిక గొప్పతనం అందరికీ చాటి చెప్పిందని, కార్యక్రమం సజావుగా జరిగేలా చూసేందుకు తమ విలువైన సహకారాన్ని అందించిన సభ్యులందరికీ, కుటుంబ సభ్యులకు, అరసకేసరి దేవాలయం వారికి, బోనాలను సమర్పించిన మహిళలకు గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సాహంగా,భక్తి శ్రద్దలతో హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.



👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z