Editorials

అగ్నివీరులకు భారీ తాయిలాలు-NewsRoundup-July 17 2024

అగ్నివీరులకు భారీ తాయిలాలు-NewsRoundup-July 17 2024

* తన ఆరోగ్యం గురించి అప్‌డేట్‌ ఇచ్చారు నటుడు నవీన్‌ పొలిశెట్టి. ఇటీవల తన చేతికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. పూర్తిగా కోలుకునేందుకు వైద్యుల సూచనలు పాటిస్తున్నానని తెలిపారు. ఇది తనకెంతో క్లిష్టమైన సమయమన్నారు.

* పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఏలూరు కాల్వలో వెంకటరమణ దూకినట్లు భావిస్తున్నారు. ఆయన మొబైల్‌ సిగ్నల్‌ను ట్రాక్‌ చేయగా.. విజయవాడలోని మధురానగర్‌ ఏలూరు కాల్వ వద్ద కట్‌ అయినట్లు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

* కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలో ఉండటంతో ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి తెలిపారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా పోస్టు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం, శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా దగదర్తి, శ్రీకాకుళం జిల్లా మూలపేటలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయగలుగుతున్నామన్నారు. అభివృద్ధి, కనెక్టివిటీ పెంపుతో పాటు ఆర్థిక పురోగతికి కూడా ప్రోత్సాహం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

* రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ కుమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ గంటలకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. నిన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ పరిసర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రాంతం ఈ రోజు బలహీనపడినట్లు తెలిపింది. రుతుపవన ద్రోణి ఈరోజు జైసాల్మయిర్, కోట, గుణ, కళింగపట్నం తూర్పు ప్రాంతం గుండా మధ్య బంగాళాఖాతం వరకు పయనిస్తూ సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. మరో అల్పపీడనం ఈ నెల 19న పశ్చిమ మధ్య దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

* నకిలీ పత్రాలతో తన భూమిని కొందరు కబ్జా చేశారని ఓ రైతు (Farmer) అధికారులను ఆశ్రయించాడు. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆవేదనకు గురై నిరసనగా కలెక్టరేట్‌లో పొర్లుదండాలు పెట్టారు. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన హృదయవిదారక దృశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ (Viral Video) అవుతున్నాయి. మాంద్‌సౌర్‌ ప్రాంతానికి చెందిన రైతు శంకర్‌లాల్‌ పాటిదార్‌కు తన స్వగ్రామంలో 9 బిగాల వ్యవసాయ భూమి ఉంది. అయితే, ఇందులో కొంత భూమిని కలెక్టర్‌ ఆఫీసులో పనిచేసే బాబు దేశ్‌ముఖ్‌ అనే అధికారి అక్రమంగా లాగేసుకున్నారని శంకర్‌లాల్‌ ఆరోపించారు. స్థానిక మాఫియా, గూండాల సాయంతో బలవంతంగా తమ భూమిని దేశ్‌ముఖ్‌ 2010లో తన కొడుకు పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నట్లు తెలిపారు.

* ప్రభుత్వ అనుమతి లేకుండా జీపీఎస్‌ జీవో, గెజిట్‌ విడుదలపై సీఎంవో సమాచారం సేకరిస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో విచారణ ప్రారంభించారు. ఆర్థికశాఖ, న్యాయ శాఖల్లో పనిచేసే వాళ్లలో ఎవరు దీనికి కారకులనే దానిపై విచారణ చేస్తున్నారు. ఆర్థికశాఖ డిప్యూటీ సెక్రటరీ శాంతి కుమారి, న్యాయశాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌ హరిప్రసాద్‌రెడ్డి పాత్రపై వివరాలు సేకరిస్తున్నారు. ఇద్దరు అధికారుల గత చరిత్రపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

* అగ్నిపథ్‌ పథకం (Agnipath scheme)పై హరియాణా (Haryana) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పోలీసు, మైనింగ్‌ గార్డు, జైలు వార్డెన్‌ తదితర ఉద్యోగాల నియామకాల్లో 10శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని ముఖ్యమంత్రి నాయాబ్‌ సింగ్‌ సైనీ (Nayab Singh Saini) ప్రకటించారు. అంతేకాకుండా.. వయసు సడలింపుతో పాటు ఇతర రాయితీలు ఉంటాయన్నారు. ‘‘కానిస్టేబుల్‌, మైనింగ్‌ గార్డు, ఫారెస్టు గార్డు, జైలు వార్డెన్, స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల నియామకాల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. గ్రూప్‌ సీ పోస్టుల్లో 5 శాతం రిజర్వేషన్‌తో పాటు గ్రూప్‌ సీ, డీ పోస్టుల్లో వయోపరిమితిలోనూ మినహాయింపు ఇవ్వనున్నాం. తొలి అగ్నివీర్‌ బ్యాచ్‌కు మాత్రం ఐదేళ్ల సడలింపు ఉంటుంది. అదేవిధంగా సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి రూ. 5 లక్షల వరకు వడ్డీ లేకుండా రుణాలు అందించనున్నాం’’ అని విలేకరుల సమావేశంలో సీఎం పేర్కొన్నారు.

* ఆగస్టులోపే 3 విడతల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ నిధులు విడుదల చేస్తామని చెప్పారు. తొలి విడతగా రూ.లక్ష వరకు ఉన్న రైతు రుణాలకు నిధుల విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరులోపు రూ.1.5లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఆగస్టులో రూ. 2లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని సీఎం వివరించారు.

* ఎన్‌హెచ్‌ఎం కింద ప్రత్యేకంగా రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖమంత్రి సత్యకుమార్‌ తెలిపారు. దిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలిసిన అనంతరం సత్యకుమార్‌ మీడియాతో మాట్లాడారు. ‘ఆరోగ్య మందిర్‌’ భవనాల నిర్మాణానికి నిధులు అందించాలని కోరినట్టు చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ అంశాలపై కూడా చర్చించామన్నారు. ‘‘40 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కేంద్ర మంత్రులు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ సామాజిక పింఛన్ల పెంపు, ఉచిత ఇసుక విధానం, అన్న క్యాంటీన్లు, స్కిల్‌ సెన్సస్‌ తదితర అంశాలపై వివరించా’’ అని సత్యకుమార్‌ తెలిపారు.

* పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేవరకు నిద్రపోమని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పటాన్‌చెరులో నిర్వహించిన భారాస కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టులో పోరాడుతున్నామని, ఆ నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉప ఎన్నిక వస్తుందన్నారు. 2001లో కేసీఆర్ ఉద్యమాన్ని పిడికెడు మందితో ప్రారంభించారని.. అప్పుడు కూడా కుట్రలు జరిగాయని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ పార్టీకి చెందిన 12మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారన్నారు. కానీ, కుట్రలు ఫలించలేదని, న్యాయం గెలిచిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ 14 ఏళ్లు పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని హరీశ్‌రావు గుర్తు చేశారు.

* ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్‌కు ఇంకా 9 రోజుల సమయమే ఉంది. విశ్వ క్రీడాసంబరం ఒలింపిక్స్‌ ఈనెల 26 నుంచే ప్రారంభం కానుంది. పారిస్‌ వేదికగా అంగరంగ వైభవంగా క్రీడలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎప్పట్లాగే ఎన్నో ఆశలతో భారత బృందం కూడా ఒలింపిక్స్‌కు సిద్ధమైంది. ఈసారి భారత్‌ 117 మంది అథ్లెట్లను ఒలింపిక్స్‌కు పంపుతోంది. ఇందుకు సంబంధించిన జాబితాకు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అయితే, ఈ జాబితాలో మహిళా షాట్‌పుటర్‌ అబా కతువా పేరు లేకపోవడం గమనార్హం. ప్రపంచ ర్యాంకింగ్స్‌ కోటాలో ఆమె పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆమె పేరును ఎందుకు తొలగించారనే దానిపై స్పష్టత లేదు. అథ్లెట్లతోపాటు 140 మంది సహాయక సిబ్బంది, అధికారుల బృందం కూడా పారిస్‌కు వెళ్లనుంది. ఇందులో 72 మంది ఖర్చులను ప్రభుత్వం భరించనుంది. నిబంధనల ప్రకారం సహాయక సిబ్బంది సంఖ్య 67 మించకూడదు. దీంతో ఐదుగురు వైద్య బృందం, సహాయక సిబ్బంది 67 మందికి ప్రభుత్వం ఖర్చులు భరించనుంది.

* దుబాయ్‌ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భర్త షేక్‌ మనా బిన్‌ మొహమ్మద్‌ అల్‌ మక్తూమ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ దంపతులకు తొలి సంతానం కలిగిన రెండు నెలలకే ఈ ప్రకటన రావడం గమనార్హం. అయితే, ఈ విషయాన్ని ఆమె సామాజిక మాధ్యమం వేదికగా ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేసింది.

* ఉభయ కొరియా దేశాల మధ్య నిత్యం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత ఉద్రిక్తతలు ఉంటాయి. ఉత్తరకొరియా (North Korea) తరచూ దక్షిణ కొరియాను కవ్విస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఇరు దేశాల మధ్య సరిహద్దు పొడవునా కిమ్‌ సర్కారు లక్షలాదిగా ల్యాండ్‌మైన్లను అమర్చింది. అయితే, ఇప్పుడు ఆ పేలుడు పదార్థాలు దక్షిణకొరియా (South Korea)లోకి కొట్టుకొచ్చే ప్రమాదం పొంచి ఉందట. దీనిపై సియోల్‌ సైన్యం బుధవారం తమ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

* టీ20 ప్రపంచకప్‌ విజేతగా టీమ్‌ ఇండియా నిలవగానే.. సీనియర్‌ ఆటగాళ్లు పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించారు. వీరి లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపిస్తుందని పలువురు మాజీలు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మాజీ దిగ్గజం కపిల్‌ దేవ్‌ చేరాడు. రోహిత్‌, కోహ్లీలపై ప్రశంసలు కురిపించాడు. ‘‘ఏ ఫార్మాట్‌లో అయినా.. రోహిత్‌, కోహ్లీల స్థానాలను మరొకరితో భర్తీ చేయలేం. భారత క్రికెట్‌కు వారు గొప్ప సేవకులుగా ఉన్నారు. టీ20 ప్రపంచకప్‌ విజయంతో వీరికి గొప్ప వీడ్కోలు లభించింది. విరాట్‌ అన్ని ఫార్మాట్లలో ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. కచ్చితంగా అతడిని టీ20ల్లో మిస్‌ అవుతాం. వీరిద్దరూ టీమ్‌ఇండియాకు సచిన్‌, ధోనీలాంటివారు. వీరిని రీప్లేస్‌ చేయలేం’’ అని కపిల్‌ పేర్కొన్నాడు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z