Business

జీప్‌కు హృతిక్ ప్రచారం-BusinessNews-July 17 2024

జీప్‌కు హృతిక్ ప్రచారం-BusinessNews-July 17 2024

* ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ (Royal Enfield) మరో బైక్‌ను భారత మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. బైక్‌ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న గెరిల్లా 450ని (Guerrilla 450) ఎట్టకేలకు విడుదల చేసింది. ఈ బైక్‌ ధర రూ.2.39 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతుంది. మూడు వేరియంట్లు, ఐదు రకాల కలర్‌ ఆప్షన్లతో వస్తున్న ఈ మోటార్‌ సైకిల్‌ విక్రయాలు ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక ఈ మోటార్‌ సైకిల్‌ వివరాల్లోకి వెళితే.. గెరిల్లా 450లో 452 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ షెర్పా ఇంజిన్‌ అమర్చారు. ఇది 39.4 బీహెచ్‌పీని, 40Nm పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌, అసిస్ట్‌ అండ్‌ స్లిప్‌ క్లచ్‌ ఆప్షన్‌తో వస్తోంది. పెర్ఫార్మెన్స్‌, ఎకో రైడ్‌ మోడ్స్‌ ఉన్నాయి. బేస్‌ వేరియంట్‌లో సింపుల్‌ డిజిటల్‌ అనలాగ్‌ ఇచ్చారు. టాప్‌ మోడల్‌లో 4 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఇచ్చారు. గూగుల్‌ మ్యాప్స్‌తో పనిచేస్తుంది. బ్లూటూత్‌, మొబైల్‌ ఫోన్‌ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. దీంతో మ్యూజిక్‌ ప్లే చేయొచ్చు. మెసేజ్‌ అలర్ట్‌లు పొందొచ్చు.

* బుల్లెట్‌ వేగం.. మెరుగైన సదుపాయాలతో ఇతర దేశాల్లో రైళ్లు దూసుకెళుతుంటే.. ఒకప్పుడు ‘ఇవి మనకు సాధ్యమేనా?’ అన్న ప్రశ్నకు ‘వందే భారత్‌’ రైళ్ల రూపంలో సమాధానం దొరికింది. అమృత్‌ భారత్‌ పథకం కింద రైల్వేస్టేషన్ల అభివృద్ధీ ఊపందుకుంది. అదే సమయంలో కిక్కిరిసిన రైళ్లు.. వరుస రైలు ప్రమాదాలు మన రైల్వే వ్యవస్థను వెక్కిరిస్తున్నాయి. దీంతో భద్రత, రైళ్ల సామర్థ్యం పెంపుపై దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు.. ఈసారి బడ్జెట్‌లో (Union budget) అభివృద్ధికి జై కొడుతుందా? సామాన్యుల సమస్యలపై దృష్టి సారిస్తుందా?

* దేశంలో పసిడి, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు బుధవారం (జూలై 17) భారీగా పెరిగాయి. మేలిమి బంగారం పది గ్రాముల ధర రూ.75వేల మార్కును తాకింది. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల మేలిమి బంగారం తులం (10 గ్రాములు ) ధర ఏకంగా రూ.900 ఎగిసింది. దీంతో రూ. 75,000లను తాకింది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంట్‌ బంగారం కూడా రూ.980 ఎగిసి రూ.68,750 వద్దకు చేరింది. బెంగళూరు, ముంబైలలోనూ ఇలాగే బంగారం ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.900 పెరిగి రూ.68,900 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.980 పెరిగి రూ.75,150 వద్దకు ఎగిశాయి. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.900 పెరిగి రూ.69,200 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.980 ఎగిసి రూ.75,490 లకు చేరుకుంది.

* కార్ల తయారీ సంస్థ ‘జీప్‌ ఇండియా’ బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌తో కలిసి నూతన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా జీప్‌ రాంగ్లర్‌ అత్యుత్తమ ప్రదర్శన, ఆకర్షణీయ ఫీచర్లను కస్టమర్లకు తెలియజేయనుంది. ‘వన్‌అండ్‌ఓన్లీ’ ట్యాగ్‌లైన్‌ తగ్గట్లు సాటిలేని ప్రమాణాలతో వాహనాలను రూపొందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అత్యుత్తమ స్థాయిని చేరుకోవడమే కాకుండా, ఈ స్థాయిని నిలుపుకునేందుకు నిరంతరం శ్రమిస్తామని జీప్‌ ఇండియా ప్రకటించింది. హృతిక్‌ రోషన్‌ను జీప్‌ సంస్థ ఇటీవలే తమ బ్రాండ్‌ పార్ట్‌నర్‌గా నియమించుకుంది. దీనికి సంబంధించిన వీడియోను హృతిక్ రోషన్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

* టెలికం దిగ్గజాలైన రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ మొబైల్‌ సబ్‌స్ర్కైబర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నాయి. మే నెల చివరినాటికి ఈ రెండు సంస్థల నెట్‌వర్క్‌ను 34.4 లక్షల మంది ఎంచుకున్నారు. వొడాఫోన్‌ ఐడియా మాత్రం కస్టమర్లను కోల్పోతున్నది. ట్రాయ్‌ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. జియో కొత్త 21.9 లక్షల మంది చేరగా దీంతో మొత్తం సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 47.46 కోట్లకు చేరుకున్నారు. భారతీ ఎయిర్‌టెల్‌ను 12.5 లక్షల మంది చేరారు. వొడాఫోన్‌ ఐడియా మాత్రం 9.24 లక్షల మంది వైర్‌లెస్‌ యూజర్లను కోల్పోయింది. ఇదే నెలలో మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీ చేసుకునేవారి సంఖ్య 97.36 కోట్ల నుంచి 98.56 కోట్లకు చేరుకున్నారు. అలాగే బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్ర్కైబర్లు 93.5 కోట్లకు చేరారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z