Kids

హైదరాబాద్‌లో ఏడాదిన్నర బాలుడిని పీక్కుతిన్న శునకాలు-CrimeNews-July 17 2024

హైదరాబాద్‌లో ఏడాదిన్నర బాలుడిని పీక్కుతిన్న శునకాలు-CrimeNews-July 17 2024

* ఆస్తి తగాదాల నేపథ్యంలో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన ఒక వ్యక్తి అక్కడ తన తల్లికి నిప్పంటించాడు. షాకైన పోలీసులు మంటలు ఆర్చి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే తీవ్రంగా కాలిన గాయాలైన ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఈ సంఘటన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భూమి వివాదం నేపథ్యంలో ఒక కుటుంబం ఖైర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. ఒక మహిళ, ఆమె కొడుకు ఒక పక్కకు వెళ్లారు. ఆ మహిళ తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకుంది. లైటర్‌తో నిప్పంటించుకుంటానని బెదిరించింది. కాగా, పోలీసులు ఆ మహిళ ప్రయత్నాన్ని అడ్డుకుకున్నారు. ఆమె చేతిలోని లైటర్‌ను లాక్కోగా అది కింద పడింది. అయితే మొబైల్‌ ఫోన్‌లో వీడియో రికార్డ్‌ చేస్తున్న మహిళ కుమారుడు వెంటనే కింద పడిన లైటర్‌ తీసుకున్నాడు. ఆ లైటర్‌తో తన త్లలికి నిప్పంటించాడు. మంటల్లో ఆమె కాలుతుండటాన్ని మొబైల్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేశాడు. మరోవైపు ఇది చూసి పోలీసులు షాక్‌ అయ్యారు. మంటల్లో కాలుతున్న ఆ మహిళను కాపాడేందుకు ప్రయత్నించారు. గోనె సంచులు కప్పి, మట్టి చల్లి మంటలు ఆర్పివేశారు. 40 శాతం కాలిన గాయాలైన ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ మహిళ మరణించింది. మృతురాలిని హేమలతగా పోలీసులు గుర్తించారు. తల్లికి నిప్పంటించిన 22 ఏళ్ల కుమారుడు గౌరవ్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

* ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి (Anakapalli) పారిశ్రామకవాడలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు ఒకరు మృతి చెందారు. జిల్లాలోని రాంబిల్లి మండలం అచ్యుతాపురం(Achyutapuram sez) వసంత కెమికల్‌ ఫ్యాక్టరీలో రియాక్టర్‌ (Reactor explosion ) పేలింది. అక్కడే పనిచేస్తున్న ఒడిస్సా (Odissa) కు చెందిన కార్మికుడు ప్రదీప్‌రౌత్‌ తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. మరికొందరు కార్మికులు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ప్రమాదానికి కారణాలను కలెక్టర్‌కు ఫోన్‌ చేసి అడిగి తెలుసుకున్నారు.

* అల్లారుముద్దుగా పెంచుకున్న పాపానికి అమ్మమ్మనే హతమార్చాడు ఓ మనుమడు. జల్సాలకు డబ్బు లు ఇవ్వలేదన్న కోపంతో మట్టుబెట్టాడు. ఈ ఘటన ఖమ్మంలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం రోటరీనగర్‌కు చెందిన అమరబోయిన రాం బాయమ్మ (80), విశ్వనాథం దంపతులకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. ఉపాధి నిమిత్తం కొడుకులు వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. కుమార్తెలకు వివాహాలై వారిళ్లకు వెళ్లిపోయారు. భర్త విశ్వనాథం మరణించడంతో ఆమె ఒంటరిగా ఉంటున్నది. చిన్న కుమార్తె కొడుకు ఉయ్‌కుమార్‌ను పెంచి పెద్దచేసింది. టెన్త్‌ పూర్తికాగానే డిప్లొమా కోర్సులో చేరి మధ్యలోనే వదిలేశాడు. మద్యం, గంజాయికి బానిసయ్యాడు. డబ్బుకోసం తరచూ వేధించేవా డు. 3 వేలు ఇవ్వాలని సోమవారం రాత్రి ఒత్తిడి చేశాడు. తన వద్ద లేవ ని చెప్పడంతో మద్యం మత్తులో ఉన్న ఉదయ్‌కుమార్‌ ఆమెపై దాడి చేయగా అక్కడికక్కడే మరణించింది.

* హైదరాబాద్‌ జవహర్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. వీధికుక్కల దాడిలో ఏడాదిన్నర బాలుడు మరణించాడు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై ఎగబడ్డ కుక్కలు.. కొంతదూరం ఈడ్చుకెళ్లి మరీ దాడి చేశాయి. ఈ ఘటనలో మెదడులో కొంత భాగం కూడా బయటపడింది. దీంతో తీవ్రగాయాలైన బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా మిరిదొడ్డి గ్రామానికి చెందిన భరత్‌-లక్ష్మీ దంపతులకు విహాన్‌ అనే ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు. ఏదైనా పని చేసుకుని బతుకుదామని నెల కిందట హైదరాబాద్‌కు వచ్చారు. జవహర్‌నగర్‌లోని ఆదర్శ్‌నగర్‌లో నివాసం ఉంటున్న లక్ష్మీ సోదరుడి ఇంట్లోనే ఉంటున్నారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో విహాన్‌ ఇంటి ఎదుట ఆడుకుంటున్నాడు. అప్పుడే గుంపులుగా వచ్చిన వీధికుక్కలు ఒక్కసారిగా విహాన్‌పై దాడి చేశాయి. కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లాయి. కుక్కల గుంపును చూసిన ఓ స్థానికుడు అనుమానం వచ్చి వాటి దగ్గరకు వెళ్లి చూడగా.. తీవ్రగాయాలతో పడివున్న విహాన్‌ కనిపించాడు. ఒళ్లంతా కుక్కగాట్లతో రక్తం కారుతూ ఉంది. ఆ ప్రాంతంలోనే విహాన్‌ మెదడులో కొంత భాగం కూడా కనిపించింది. దీంతో వెంటనే కుక్కలను తరిమికొట్టిన స్థానికుడు.. బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే విహాన్‌ను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మద్వైద్యం కోసం గాంధీ ఆస్పత్రిలోని ఎమర్జెనీ విభాగానికి తీసుకెళ్లారు. కానీ కుక్కల దాడిలో ఒళ్లంతా గాయాలు కావడంతో పరిస్థితి విషమించింది. దీంతో రాత్రి 9.30 గంటల ప్రాంతంలో విహాన్‌ మృతి చెందాడు.

* అనకాపల్లిలో ఓ ప్రేమోన్మాది ప్రేమ పేరుతో బాలికను చిత్రవధ చేసి చంపి తానూ బలవన్మరణానికి పాల్పడిన ఘటన మరువక ముందే.. ఉమ్మడి జిల్లాలో మరొక ఘటన చోటు చేసుకుంది. విశాఖ న్యూపోర్ట్‌ పరిధిలో ఓ ప్రేమోన్మాది కత్తి దూశాడు.వుడా కాలనీ సమీపంలో నివసించే శ్యామల అనే అమ్మాయిని సిద్ధూ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో కాలేజ్‌ వద్ద ఆ యువతితో సిద్ధూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు మైనర్‌ కావడంతో గాజువాక పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడ్ని అరెస్ట్‌ చేశాడు.అయితే జైలు నుంచి బయటకు వచ్చిన సిద్ధూ.. శ్యామలపై కక్ష గట్టాడు. మంగళవారం రాత్రి కత్తితో ఆమెను చంపాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమె తల్లి సావిత్రి అడ్డురావడంతో ఆమెకు గాయాలు అయ్యాయి. తల్లీకూతుళ్లు కేకలు వేయడంతో స్థానికులు రావడంతో సిద్ధూ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న న్యూపోర్ట్‌ పోలీసులు సిద్ధూ కోసం గాలిస్తున్నారు.ఇదిలా ఉంటే.. అనకాపల్లి జిల్లాలో రాంబిల్లి మండలం కొప్పుగుండపాలెంలో సురేష్‌ అనే యువకుడు స్థానికంగా చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థిని ప్రేమ పేరుతో వేధించాడు. అందుకు ఒప్పుకోకపోవడంతో కోపం పెంచుకుని ఆమెను ఇంటిదాకా ఫాలో అయ్యి.. నరికి చంపాడు. ఆపై శవమై తేలడంతో సురేష్‌ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

* గత ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదం కేసులో దాదాపు రెండు కోట్ల నష్ట పరిహారం చెల్లించాలంటూ ఇన్సూరెన్స్‌ కంపెనీని ట్రిబ్యూనల్‌ ఆదేశించింది. రూ.1.21 కోట్ల‌ను ప‌రిహారంగా, 77.61 ల‌క్ష‌ల‌ను వ‌డ్డీ రూపంలో.. మొత్తం రూ. 1.98 కోట్లను మృతుడి తల్లిదండ్రులకు 30 రోజుల్లోగా ఇవ్వాలని ఆదేశించింది.వివరాలు 2016 ఏప్రిల్‌ 4న ఢిల్లీలో హిట్‌ అండ్‌ రన్‌ ఘటన జరిగింది. సివిల్స్‌ లైన్‌ ప్రాంతంలో ఓ మైనర్‌ బాలుడు నిర్లక్ష్యంగా మెర్సిడెస్‌ బెంజ్‌ కారు నడపడంతో రోడ్డు దాటుతున్న 32 ఏళ్ల సిద్ధార్థ్‌ శర్మ అనే వ్యక్తి మరణించాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సిద్ధార్థ్‌ను ఢీకొట్టిన తర్వాత కారు ముందు టైర్‌ పగిలిపోవడంతో దూరంగా వెళ్లి ఆగిపోయింది. ఘటన అనంతరం నిందితుడైన మైనర్‌ కారును అక్కడే వదిలి తన స్నేహితులతో కలిసి పారిపోయాడు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మైనర్‌ అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు తేల్చారు. కారు ఢీకొన్న సమయంలో సిద్ధార్థ్‌ 20 అడుగుల దూరంలో ఎగిరిపడినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. తాజాగా ఈ ఘటనపై విచారణ చేపట్టిన మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్‌ ట్రిబ్యూనల్‌ బాధతుడైన సిద్ధార్థ శర్మ తల్లిదండ్రులకు రూ.1.21 కోట్ల‌ను ప‌రిహారంగా, 77.61 ల‌క్ష‌ల‌ను వ‌డ్డీ రూపంలో.. మొత్తం రూ. 1.98 కోట్లను 30 రోజుల్లోగా ఇవ్వాల‌ని ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది.అంతేగాక కారు రిజిస్ట్రేషన్‌ చేసిన మైనర్‌ తండ్రి నుంచి పరిహారం మొత్తాన్ని రికవరీ చేసుకునేదుకు బీమా కంపెనీకి కోర్టు అనుమతినిచ్చింది. మైన‌ర్ కుమారుడిని మెర్సిడెస్‌ కారు నడుపడం అడ్డుకోవ‌డంలో తండ్రి విఫ‌ల‌మైన‌ట్లు చెబుతూ అతన్ని కూడా బాధ్యులుగా ట్రిబ్యున‌ల్ పేర్కొం‌ది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z