Business

ద్వితీయశ్రేణి నగరాల్లో 94శాతం పెరిగిన ఇంటి ధరలు

ద్వితీయశ్రేణి నగరాల్లో 94శాతం పెరిగిన ఇంటి ధరలు

గత నాలుగేళ్లలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు సహా దేశంలోని 30 ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇళ్ల ధరలు 94% వరకు పెరిగాయని స్థిరాస్తి డేటా అనలిటిక్‌ సంస్థ ప్రాప్‌ఈక్విటీ వెల్లడించింది. నివాసాలకు అధిక గిరాకీయే ఇందుకు కారణమని తెలిపింది. 2023-24లో సగటు ఇళ్ల ప్రాజెక్టుల ప్రారంభ ధరను.. 2019-20 ధరలతో పోల్చి ఈ వివరాలను సంస్థ ప్రకటించింది. దేశంలో ప్రధానమైన 30 ద్వితీయశ్రేణి మార్కెట్లలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, అమృత్‌సర్, మొహలి, లుధియానా, చండీగఢ్, పానీపట్, దెహ్రాడూన్, భివాండీ, సోనేపట్, జయపూర్, ఆగ్రా, లఖ్‌నవూ, భోపాల్, ఇందౌర్, మంగళూరు, మైసూర్, కోయంబత్తూర్, కోచి, త్రివేండ్రం, రాయపూర్, భువనేశ్వర్, అహ్మదాబాద్, గాంధీనగర్, వడోదరా, సూరత్, నాసిక్, నాగ్‌పూర్, గోవా ఉన్నాయి. ఇందులో 24 నగరాల్లో ఇళ్ల ధరలు రెండంకెల్లో పెరగ్గా, 6 నగరాల్లో ధరలు ఒక అంకె వృద్ధి సాధించాయి. అగ్రగామి 10 నగరాల్లో ఇళ్ల ధరలు 54% నుంచి 94% పెరిగాయి.

ఆగ్రాలో 2019-20లో చదరపు అడుగు ధర రూ.3692గా ఉండగా, 2023-24కు 94% పెరిగి రూ.7163కు చేరింది. గోవాలో 90%, లుధియానా 89%, ఇందౌర్‌ 72%, చండీగఢ్‌ 70%, దెహ్రాదూన్‌ 68%, అహ్మదాబాద్‌ 60%, భువనేశ్వర్‌ 58%, మంగళూరు 57%, త్రివేండ్రం 54% ధరలు పెరిగాయి. విశాఖపట్నంలో ధరలు 11% అధికమయ్యాయని ప్రాప్‌ఈక్విటీ సీఈఓ సమీర్‌ జాసుజా అన్నారు. ఆర్థికాభివృద్ధిపై విశ్వాసం, నగరాలకు అనుసంధానత పెరగడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, బలమైన ఉద్యోగాల సృష్టి ఇందుకు కలిసొస్తున్నాయని తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z