Devotional

మహాలక్ష్మీకి రసగుల్లాలు సమర్పించి వేడుకోనున్న జగన్నాథుడు

మహాలక్ష్మీకి రసగుల్లాలు సమర్పించి వేడుకోనున్న జగన్నాథుడు

‘అలుకమాని తలుపు తీయవే ప్రాణ సఖీ’ అంటూ జగన్నాటక సూత్రధారి జగన్నాథుడు భార్య మహాలక్ష్మిని వేడుకునే దృశ్యం శుక్రవారం రాత్రి యావన్మంది భక్తులకు వినోదం, ఆసక్తి కలిగించనుంది. ఆషాఢ శుక్ల త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రథయాత్రలో అంతిమఘట్టం నీలాద్రి బిజే (జగన్నాథ, బలభద్ర, సుభద్రల శ్రీక్షేత్ర ప్రవేశం) ఏర్పాటు కానుంది. రథయాత్రలో మహాలక్ష్మిని వెంట తీసుకెళ్లని పురుషోత్తముడు ఇచ్చిన మాట ప్రకారం పంచమినాడు మందిరానికి (శ్రీక్షేత్రానికి) రాలేదు. మాయదారి స్వామి తనను మభ్యపెట్టి పంపించేశాడని ఆగ్రహంతో ఉన్న మహాలక్ష్మి నీలాద్రి బిజే సమయంలో శ్రీక్షేత్ర ప్రధాన ద్వారం తలుపులు మూసేయాలని చెలికత్తెలను ఆజ్ఞాపిస్తుంది. జగన్నాథ, బలభద్ర, సుభద్రల రాకకు ముందుగా వారు తలుపులు మూసేస్తారు. పొహండిగా వచ్చిన ముగ్గురుమూర్తులు ఆలయం వెలుపలే ఉండిపోతారు. తర్వాత తప్పు మన్నించమని మహాలక్ష్మికి జగన్నాథుడు వేడుకుంటాడు. చివరిఅస్త్రంగా భార్యకు ఇష్టమైన జున్ను మిఠాయి (రసగుల్లాలు) తెచ్చానని, తాను స్వయంగా తినిపిస్తానని బుజ్జగిస్తాడు. తర్వాత తల్లి తలుపులు తెరిపిస్తుంది. ముగ్గురు మూర్తులు ఆలయ ప్రవేశం చేస్తారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z