Politics

ఎంపీ మిథున్‌రెడ్డిపై రాళ్ల దాడి-CrimeNews-July 18 2024

ఎంపీ మిథున్‌రెడ్డిపై రాళ్ల దాడి-CrimeNews-July 18 2024

* ఆస్తిలో వాటా ఇవ్వలేదని తండ్రిని కారుతో ఢీకొట్టి తనయుడు హత్య చేసిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో బుధవారం రాత్రి జరిగింది. పట్టణంలోని పుల్లారెడ్డి వీధికి చెందిన మీరుగట్టు చిన్నరెడ్డప్పరెడ్డి (65)కి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రఘునాథరెడ్డి ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. చిన్నకుమారుడు శంకర్‌రెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. పెద్దకుమారుడు రఘునాథరెడ్డి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేస్తూ రూ.16 లక్షల వరకు అప్పులపాలయ్యాడు. అప్పుల వేధింపులు ఎక్కువవ్వడంతో తన తండ్రిని ఆస్తిలో వాటా ఇవ్వాలని కోరాడు. గత కొంతకాలంగా తండ్రీ కొడుకుల మధ్య ఈ వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి భోజనం చేశాక సమీపంలోని వాకింగ్‌ ట్రాక్‌పై నడుస్తున్న చిన్నరెడ్డప్పరెడ్డిని రఘునాథరెడ్డి నిలదీశాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన రఘునాథరెడ్డి తన కారుతో తండ్రిని ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని బెంగళూరులో ఉన్న సోదరుడికి ఫోన్‌ చేసి చెప్పాడు. శంకర్‌రెడ్డి స్థానికంగా ఉన్న బంధువులకు సమాచారం ఇవ్వడంతోపాటు పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో బంధువులు, పోలీసులు రాత్రంతా చిన్నరెడ్డప్ప కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

* భారీ వర్షాలతో ఏలూరు జిల్లాలో వాగులు పొంగుతున్నాయి. ఈ క్రమంలో వేలేరుపాడు మండలంలో ఓ కారు వాగులో కొట్టుకుపోయింది. అశ్వారావుపేట నుంచి వేలేరుపాడు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొట్టుకుపోయిన కారులో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు ఉన్నారు. రక్షించాలని వారంతా హాహాకారాలు చేసినట్లు స్థానికులు తెలిపారు. వారు పోలీసులకు సమాచారమిచ్చారు. కారులో ఉన్నవారిని డ్రైవర్‌ రామారావు, జ్యోతి, గడ్డం కుందనకుమార్, సాయి జ్యోతి, గడ్డం జగదీశ్‌కుమార్‌గా గుర్తించారు. కొద్దిదూరం వెళ్లాక కారు నుంచి బయటకు వచ్చి వాగులోని పొదల్లో ఆ ఐదుగురూ చిక్కుకున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, గజ ఈతగాళ్లను రప్పించేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. వాగు భారీగా పొంగుతుండటంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది.

* తిరుపతి జిల్లాలో ఇంటర్‌ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. రౌడీషీటర్‌ వినయ్‌ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కత్తితో బెదిరించి బలవంతంగా ఆటోలో ఎక్కించి అత్యాచారం చేశాడు. ఈ ఘటనతో బాధిత విద్యార్థిని అవమాన భారంతో కుంగిపోయింది. ఈ క్రమంలో తలకు రాసే నూనె తాగింది. గమనించి కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* తనపై హత్యాయత్నం చేశారని సీఎం జగన్‌, సీఐడీ అధికారులపై ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేసుకు సంబంధించి వివరాలు, పురోగతి గురించి తెలుసుకునేందుకు ఆయన గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు సీఐడీ కార్యాలయంలో తనను చంపేందుకు కుట్ర పన్నారని, మీడియా వల్లే బతికిపోయానని తెలిపారు. ‘‘నా ఫిర్యాదు మేరకు మాజీ సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌, విజయ్‌ పాల్‌, మాజీ సీఎం జగన్‌, జీజీహెచ్‌ ప్రభావతిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాలు తెలుసుకోవడానికే ఎస్పీ కార్యాలయానికి వచ్చాను. నా దగ్గర ఉన్న సమాచారం అందించాను. అప్పటి కలెక్టర్‌ తీసుకున్న చర్యలు కూడా నిబంధనకు విరుద్ధంగా ఉన్నాయి. కేసు నమోదైంది కాబట్టి.. సీఐడీ అధికారుల్ని సస్పెండ్‌ చేయాలి’’అని రఘురామ అన్నారు.

* దంపతుల సన్నిహిత వీడియోలను వారి ఫ్రెండ్‌ పోర్న్‌ సైట్‌లో అప్‌లోడ్‌ చేశాడు. (Couple’s Intimate Videos) వాటిని తొలగిస్తానని చెప్పి మహిళ నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్‌ చేశాడు. మహిళ ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళ భర్త మద్యానికి బానిస అయ్యాడు. దీంతో దంపతుల మధ్య తరచుగా గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో భార్య పరువు తీయాలన్న ఉద్దేశంలో వారి సన్నిహిత ఫొటోలు, వీడియోలను మొబైల్‌ ఫోన్‌లో భర్త రికార్డ్‌ చేశాడు. తన స్నేహితుడైన జాషువా ఫ్రాన్సిస్‌కు వాటిని షేర్‌ చేశాడు.కాగా, ఆ భార్యాభర్తల సన్నిహిత వీడియోలను పోర్న్‌ సైట్‌లో ఫ్రాన్సిస్‌ అప్‌లోడ్‌ చేశాడు. ఆ లింక్‌ను ఆ మహిళకు పంపాడు. ఈ వీడియోల పట్ల ఆందోళన చెందుతున్నట్లు నటించాడు. తన స్నేహితుడు వికాస్‌ సైబర్‌ నిఫుణుడని, వాటిని తొలగిస్తాడని చెప్పాడు.మరోవైపు వికాస్‌ పేరుతో ఫ్రాన్సిస్ ఆ మహిళకు వాట్సాప్‌ కాల్‌ చేశాడు. రూ.50,000 ఇస్తే ఆ వీడియోలను పోర్న్‌ సైట్‌ నుంచి తొలగిస్తానని చెప్పాడు. దీంతో ఆమె ఆ డబ్బులు పంపింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ వీడియోలు, ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అయ్యాయి. ఆ మహిళ దృష్టికి వెళ్లడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.కాగా, దర్యాప్తు చేసిన పోలీసులు భార్యాభర్తల సన్నిహిత వీడియోలను వారి ఫ్రెండ్‌ ఫ్రాన్సిస్‌ పోర్న్‌ సైట్‌లో అప్‌లోడ్‌ చేయడంతోపాటు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసినట్లు గుర్తించారు. బుధవారం అతడ్ని అరెస్ట్‌ చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* ఒక యువతి మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ ఇంటి టెర్రస్‌ పైనుంచి కింద పడింది. (Woman Falls Off Terrace) రక్తం మడుగుల్లో ఉన్న ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ యువతి అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఈ సంఘటన జరిగింది. 18 ఏళ్ల మాన్సీ అబేద్వార్ 12వ తరగతి పాస్‌ అయ్యింది. కుటుంబంతో కలిసి గోపాల్‌నగర్‌ బస్టాప్‌ సమీపంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మాన్సీ ఇంటి టెర్రస్‌పైకి వెళ్లింది. చిన్నగోడపై కూర్చొన్న ఆమె మొబైల్‌ ఫోన్‌లో ఫ్రెండ్‌తో మాట్లాడటంలో బిజీ అయ్యింది. అయితే అదుపుతప్పిన ఆమె టెర్రస్‌ పై నుంచి కిందపడింది. కాగా, మాన్సీ అరుపులు విన్న తల్లి, సోదరుడు వెంటనే బయటకు వచ్చి చూశారు. రక్తం మడుగుల్లో పడి ఉన్న ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ యువతి అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* టీడీపీ దాడుల్లో గాయపడ్డ వైసీపీ కార్యకర్తలకు పరామర్శించేందుకు వచ్చిన ఎంపీ మిథున్‌ రెడ్డి (YCP MP Mithun Reddy) పై గురువారం చిత్తూరు (Chittur) జిల్లా పుంగనూర్‌లో దాడి జరిగింది. గురువారం మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి రాకను తెలుసుకున్న టీడీపీ (TDP) శ్రేణులు రెడ్డపై ఇంటిపై రాళ్లతో దాడులకు దిగారు. దీంతో వైసీపీ శ్రేణులు సైతం ప్రతిదాడికి దిగడంతో ఉద్రిక్త (Tension) వాతావరణం ఏర్పడింది. పరస్పర దాడిని ఆపేందుకు వెళ్లిన పోలీసులకు(Police) సైతం గాయాలయ్యాయి. ఎంపీ మిథున్‌రెడ్డి, వైసీపీ నాయకుల వాహనాలను టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. పోలీసులు ముందు జాగ్రర్త చర్యగా ఎంపీ మిథున్‌రెడ్డిని బయటకు వెళ్లవద్దని సూచించారు. ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ డైరెక్షన్‌లోనే పుంగనూర్‌లో దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z