ఒలింపిక్స్ ఆర్చరీలో భారత్‌కు ఇప్పటివరకూ ఒక్క పతకం కూడా రాలేదు. కానీ పారిస్‌లో మాత్రం పతక బోణీ కొట్టేలా కనిపిస్తోంది. అందుకు ప్రధాన కారణం బొమ్మదేవర ధీరజ్. అవును.. ఈ విజయవాడ ఆర్చర్ పతక ఆశలు రేకిత్తిస్తున్నాడు. ఇటీవల అంతర్జాతీయ వేదికలపై నిలకడైన ప్రదర్శనతో 22 ఏళ్ల ధీరజ్ అంచనాలు పెంచేశాడు. ఈ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో అతను బరిలో దిగబోతున్నాడు. పురుషుల జట్టుతో కలిసి నిరుడు ఆసియా క్రీడల్లో రజతం, ఈ ఏడాది షాంఘై ప్రపంచకప్‌లో చారిత్రక స్వర్ణం ఖాతాలో వేసుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లోనే మిక్స్‌డ్ విభాగంలోనూ కాంస్యాన్ని ముద్దాడాడు. అంటాల్యాలో వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ కాంస్యాలు నెగ్గాడు. భారత నంబర్‌వన్ రికర్వ్ ఆర్చర్‌గా ఎదిగాడు. అతను ఇదే నిలకడ కొనసాగిస్తే ఒలింపిక్ విలువిద్యలో భారత్‌కు పతకం దక్కడం ఖాయమే.
జ్యోతి యర్రాజి.. ఈ పేరు వింటే రికార్డులు బద్దలుకొట్టడం.. చరిత్ర సృష్టించడమే గుర్తుకొస్తుంది. 100 మీటర్ల హర్డిల్స్‌లో ఈ విశాఖ అమ్మాయి అంతలా ప్రభావం చూపుతోంది. ఈ విభాగంలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మొట్టమొదటి భారత అమ్మాయి ఆమెనే. పాఠశాలలో మొదలైన ఆమె పరుగు పేదరికం అడ్డంకులను దాటుకుని విజయతీరాల వైపు సాగుతోంది. 24 ఏళ్ల జ్యోతి ఇప్పటికే చాలా సార్లు జాతీయ రికార్డును బద్దలుకొట్టింది. 100మీ. హర్డిల్స్‌ను 13 సెకన్లలోపు పూర్తి చేసిన తొలి భారత అథ్లెట్ ఆమెనే. ఆమె వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన 12.78 సెకన్లుగా ఉంది. నిరుడు ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో 100 మీ. హర్డిల్స్‌లో పసిడి, 200మీ.పరుగులో రజతంతో చరిత్ర నమోదు చేసింది. ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో కాంస్యం, ఆసియా క్రీడల్లో రజతం.. ఇలా ఇదివరకెప్పుడూ భారత హార్డిల్స్ అథ్లెట్ సాధించని ఘనతలను ఆమె ఖాతాలో వేసుకుంది. 60 మీ. హర్డిల్స్‌లోనూ జాతీయ రికార్డు (8.13సె) ఆమెదే. భువనేశ్వర్‌లోని ఒడిశా రిలయన్స్ అథ్లెటిక్స్ హైపర్‌ఫార్మెన్స్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న జ్యోతి ఒలింపిక్స్‌లో తొలి అడుగే ఘనంగా వేయాలనే లక్ష్యంతో ఉంది.
వైద్యురాలు కావాలనే తన ఇష్టాన్ని పక్కనపెట్టి నాన్న కల కోసం ట్రాక్‌పై సంచలన ప్రదర్శనతో సత్తాచాటుతోంది దండి జ్యోతిక శ్రీ. 23 ఏళ్ల ఈ తణుకు అమ్మాయి ‘ఈనాడు’ సీఎస్‌ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అండదండలతో పతకాల వేట కొనసాగిస్తోంది. పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 4×400 మీటర్ల రిలేలో ఆమె తలపడనుంది. శుభ వెంకటేశన్, విథ్య రామరాజ్, పూవమ్మతో కలిసి దేశానికి పతకం అందించాలన్నదే ఆమె లక్ష్యం. ఒకప్పటి బాడీబిల్డర్ అయిన తండ్రి శ్రీనివాసరావు ప్రోత్సాహంతో జ్యోతిక ట్రాక్‌పై అడుగులు వేసింది. పదో తరగతిలో 97 శాతం మార్కులు తెచ్చుకున్న ఆమె వైద్యురాలు కావాలనుకుంది. కానీ తండ్రి అథ్లెటిక్స్ వైపు నడిపించడంతో పరుగుపై ప్రేమ పెంచుకుంది. వ్యక్తిగతంగా 400మీ. విభాగంలో బరిలో దిగే ఆమె.. ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో దేశం కోసం రిలేలో అద్భుత ప్రదర్శన చేస్తోంది. 2017లో అండర్-18, 2021లో అండర్-23 జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన జ్యోతికకు 2023 నుంచి ‘లక్ష్య’ అన్ని రకాలుగా సహకారం అందిస్తోంది. నాగపురి రమేశ్ శిక్షణతో ఆమె ఎంతో మెరుగైంది. నిరుడు జాతీయ ఓపెన్ ఛాంపియన్‌షిప్ గెలిచింది. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ మహిళల 4×400మీ. రిలేలో దేశానికి కాంస్యం రావడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఏడాది జాతీయ ఛాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన (52.73సె) నమోదు చేసింది. గతేడాది మోకాలి గాయం కారణంగా ఆసియా క్రీడలకు అర్హత సాధించలేకపోయింది. గొప్ప పోరాట పటిమతో దీని నుంచి కోలుకున్న ఆమె.. ఈ ఏడాది ప్రపంచ రిలే ఛాంపియన్‌షిప్స్‌లో అద్భుత ప్రదర్శనతో అమ్మాయిల రిలే జట్టు పారిస్ బెర్తు దక్కించుకోవడంలో ప్రధాన భూమిక వహించింది. ఇప్పుడు తన తొలి ఒలింపిక్స్‌కు సిద్ధమవుతోంది.
2008లో విజేందర్ సింగ్, 2012లో మేరీకోమ్, 2021లో లవ్లీనా.. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు అందించిన బాక్సర్లు వీళ్లు. కానీ అవన్నీ కాంస్యాలే. ఈ విశ్వక్రీడల్లో భారత్‌కు బాక్సింగ్ స్వర్ణాన్ని అందించడమే లక్ష్యంగా నిఖత్ జరీన్ బరిలో దిగుతుంది. ఈ 28 ఏళ్ల నిజామాబాద్ బాక్సర్‌కు ఇవే తొలి ఒలింపిక్స్. కానీ ఆమెపై అంచనాలు మాత్రం భారీస్థాయిలో ఉన్నాయి. వరుసగా రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడమే కారణం. 2022, 2023లో ప్రపంచ టైటిల్ ఆమెదే. కామన్వెల్త్ క్రీడల్లోనూ స్వర్ణం నెగ్గిన ఆమె.. నిరుడు ఆసియ క్రీడల్లో కాంస్యం ముద్దాడింది. ఒలింపిక్స్‌లో మాత్రం 50 కేజీల విభాగంలో బంగారు పతకంతోనే తిరిగొస్తానని ధీమాగా చెబుతోంది. ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో దాదాపుగా ఏకపక్ష విజయాలు సాధించడం ఆమె ఆధిపత్యానికి నిదర్శనం.
13 ఏళ్లకే జాతీయ సీనియర్ ఛాంపియన్.. నిరుడు ఆసియా క్రీడల్లో ఏకంగా నాలుగు పతకాలు.. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో రెండు స్వర్ణాలు.. ఇవీ 19 ఏళ్లకే హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ సాధించిన ఘనతలు. ఈ టీనేజీ సంచలనం ఇప్పుడు తన తొలి ఒలింపిక్స్‌లోనూ పతక వేట కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఆమె పోటీపడనుంది. 25మీ. పిస్టల్‌లో 2022 జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఇషా.. సీనియర్ స్థాయిలోనూ పతకాల పంట పండిస్తోంది. గతేడాది ఆసియా క్రీడల 25మీ, 10మీ. వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో ఆమె రజతాలు దక్కించుకుంది. తండ్రి ప్రోత్సాహంతో ఆటల్లోకి అడుగుపెట్టిన ఇషా.. చిన్నప్పుడు గచ్చిబౌలి షూటింగ్ రేంజ్‌లో తుపాకీ మోతలకు ఆకర్షితురాలై షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. దిగ్గజ షూటర్ గగన్ నారంగ్ శిక్షణతో ఆమె ఆటలో మెరుగైంది.
పారిస్‌లో ఓ పతకం పక్కా.. ఈ జోడీ కచ్చితంగా పోడియంపై నిలబడుతుంది.. ఇవీ ఇప్పుడు భారత స్టార్ డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టిపై ఉన్న అంచనాలు. చిరాగ్ శెట్టి జతగా అమలాపురం కుర్రాడు సాత్విక్.. ప్రపంచ బ్యాడ్మింటన్‌పై చెరగని ముద్ర వేస్తున్నాడు. అతనితో కలిసి బ్యాడ్మింటన్ డబుల్స్‌లో గతంలో భారత్‌కు సాధ్యం కాని రికార్డులను ఇప్పుడు అందుకుంటున్నాడు. ఈ ఒలింపిక్స్‌లో సాత్విక్ జోడీకి కచ్చితంగా పతకం వస్తుందనే అంతా భావిస్తున్నారు. ఇటీవల కాలంలో వీళ్లు జోరు అలాంటిది మరి. డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకు అందుకున్న తొలి భారత ద్వయం వీళ్లే. 23 ఏళ్ల సాత్విక్ ఖాతాలో ఇప్పటికే ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్యం, థామస్ కప్, కామన్వెల్త్ క్రీడల స్వర్ణం, రజతం, ఆసియా క్రీడల స్వర్ణం, ఆసియా ఛాంపియన్‌షిప్ పసిడి ఉన్నాయి. అలాగే ఇండోనేసియా ఓపెన్, మలేసియా ఓపెన్ (సూపర్ 1000), ఫ్రెంచ్ ఓపెన్ (సూపర్ 500) టైటిళ్లతో రికార్డు నమోదు చేశారు. టోక్యోలో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన సాత్విక్ జోడీ ఈ సారి మాత్రం పతకం పట్టేసే అవకాశముంది. ఈ ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టోర్నీల్లో వీళ్లు ఫైనల్స్ చేరారు. బలమైన సాత్విక్ స్మాష్‌లకు ప్రత్యర్థి ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. పారిస్‌లో ఒత్తిడిని తట్టుకుని నిలబడితే సాత్విక్ కెరీర్‌లో మరో రికార్డు చేరుతుంది.
ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు ఎప్పుడూ నిరాశే. ఈ విశ్వ క్రీడల్లో మన టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు ఇప్పటివరకూ ఒక్క పతకాన్ని కూడా గెలవలేదు. అయితే ఈసారి మన హైదరాబాదీ ఆకుల శ్రీజ పతక ఆశలు కలిగిస్తోంది. ఈ ఏడాది డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో సింగిల్స్‌తో పాటు డబుల్స్ టైటిల్ కూడా సాధించి 25 ఏళ్ల శ్రీజ సంచలనం నమోదు చేసింది. ఇప్పుడు ఆ ఉత్సాహంతో ఒలింపిక్స్‌లోనూ పతక కలను సాకారం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. తొలిసారి ఒలింపిక్స్ ఆడబోతున్న ఆమె సింగిల్స్‌తో పాటు డబుల్స్, టీమ్ విభాగాల్లోనూ పోటీపడనుంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z