* పిల్లలను బెదిరించడానికి ఓ తండ్రి చేసిన ప్రయత్నం అతని ప్రాణాలను బలితీసుకుంది. వాళ్ల అల్లరిని మాన్పించేందుకు ఆ తండ్రి చనిపోతానని హెచ్చరించాడు. కానీ వాళ్లు వినిపించుకోకపోవడంతో ఉరేసుకుంటున్నట్లు డ్రామా ఆడబోయి ఉచ్చు బిగుసుకుని మరణించాడు. ఏపీలోని వైజాగ్‌లో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిహార్‌కు చెందిన చందన్ కుమార్ (33) ఇండియన్ రైల్వేస్‌లో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్‌గా పనిచేస్తున్నాడు. ఐదేళ్లుగా వైజాగ్‌లోని కొత్తపాలెంలో నివాసం ఉంటున్నాడు. చందన్‌కు ఒక కూతురు (7), కొడుకు (5) ఉన్నారు. ఇటీవల వీళ్ల అల్లరి ఎక్కువయ్యింది. వాళ్లను ఏమైనా గట్టిగా ఒక మాట అంటే.. భార్య కూడా పిల్లలకే వత్తాసు పలుకుతుంది. తాజాగా బుధవారం రాత్రి కూడా ఇలాగే జరిగింది. చందన్ జేబులో నుంచి కరెన్సీ నోట్లను తీసుకున్న ఇద్దరు పిల్లలు వాటిని చించేశారు. అది చూసిన చందన్ వారిని మందలించాడు. కోప్పడుతున్న చందన్‌ను చూసి భార్య అడ్డుపడింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఆ గొడవ తర్వాత తనకు ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తున్నారని.. ఇలాగే చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని చందన్ బెదిరించాడు. కానీ చందన్ మాటలను భార్యాపిల్లలు పట్టించుకోలేదు. దీంతో ఫ్యాన్ హుక్‌కు చీరకట్టి దాన్ని మెడకు చుట్టుకుని వాళ్లను భయపెట్టించేందుకు ప్రయత్నించాడు. కానీ ప్రమాదవశాత్తూ చీర మెడకు బిగుసుకుపోయింది. తమను బెదిరించేందుకు చందన్ అలా చేస్తున్నాడని అతని భార్య అనుకుని చాలాసేపటి దాకా పట్టించుకోలేదు. అయితే ఎంతసేపటికీ ఉలుకుపలుకు లేకుండా అలాగే ఉండిపోయేసరికి అనుమానం వచ్చి దగ్గరికి వెళ్లి చూసి చీరను విప్పేసింది. కానీ అప్పటికే ఉరిపడటంతో తీవ్ర అస్వస్థతకు గురై చందన్ కన్నుమూశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. చందన్‌కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
* TS రాష్ట్రంలో వీధి కుక్కలు(Stray dogs) రెచ్చిపోతున్నాయి. నిత్యం ఏదో ఓ చోట కుక్కల దాడిలో ప్రజలు గాయపడుతూనే ఉన్నారు. వీధికుక్కల దాడిలో చిన్నారులు మృత్యు వాత పడిన ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటామని అధికారులు చెపుతున్నా.. కార్యరూపం దాల్చడం లేదు. చివరికి హైకోర్ట్ ప్రభుత్వాన్ని మందలించినా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. తాజాగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో రెండు రోజుల వ్యవధిలో ఓ శునకం సుమారు 30 మందిని గాయపరిచింది. అదే కుక్క హుజూరాబాద్‌లో(Huzurabad) పారిశుద్ధ్య విధులకు వెళ్తున్న గాంధీనగర్‌కు చెందిన భాగ్య, విజయ్, సీనియర్ సానిటరీ సూపర్ వైజర్ రమేష్ పై(Sanitation workers )దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. అలాగే మామిళ్లవాడలో ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులను గాయ పరిచింది. కుక్కదాడిలో గాయపడినవారిని వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు. కాగా, చిన్న పిల్లలు ఒంటరిగా కనిపిస్తే కుక్కలు దాడి చేస్తున్నాయని పలువురు పేర్కొన్నారు. దీంతో పిల్లలను బయటకు పంపించడానికే స్థానికులు వణికి పోతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
* ట్రాన్స్‌పోర్ట్ యజమాని కొడుకు అవమానించడంపై ఒక వ్యక్తి ప్రతీకారం తీర్చుకున్నాడు. (Man’s Revenge Robbery) 15 మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కంపెనీకి చెందిన కోట్ల నగదును దోచుకున్నాడు. యాజమాని ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. కిషన్ గంజ్ ప్రాంతంలో ఉన్న బికనీర్ అస్సాం ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో క్యాబ్ డ్రైవర్‌గా ఉపేంద్ర పని చేస్తున్నాడు. యజమాని కుమారుడు అతడ్ని అవమానించడంపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. కాగా, ఆ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్‌లో నగదు తరలింపు గురించి క్యాబ్ డ్రైవర్ ఉపేంద్రకు తెలుసు. దీంతో ఆ డబ్బును దోచుకోవాలని కుట్ర పన్నాడు. అదే కార్యాలయంలో పని చేసే లారీ డ్రైవర్ కైలాష్ చౌహాన్‌తో కలిసి ప్లాన్ వేశాడు. వారిద్దరూ కలిసి 15 మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. జూలై 11న ఆ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయానికి రూ.3.5 కోట్ల నగదు చేరింది. ఆ రోజు రాత్రి 15 మంది వ్యక్తులు ఆయుధాలతో ఆ ఆఫీస్‌లోకి చొరబడ్డారు. అక్కడున్న వారిని గన్స్‌తో బెదిరించారు. రూ.3.5 కోట్ల నగదు దోచుకుని రెండు కార్లలో పారిపోయారు.
* సామాజిక మాధ్యమంలో తండ్రి, కూతురు ఆడుకుంటున్న వీడియోపై అసభ్యకర కామెంట్లు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై (Praneeth Hanumanthu) మరోకేసు నమోదైంది. మత్తుపదార్థాలు సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలడంతో అతనిపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ప్రణీత్‌ను ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న అతడిని 3 రోజులు కస్టడీకి కోరుతూ సైబర్ సెక్యూరిటీ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. యూట్యూబర్ ప్రణీత్ హన్మంతును ఈ నెల 10న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అమెరికాకు పారిపోతుండగా బెంగళూరులో అతడిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్, డల్లాస్ నాగేశ్వర్‌రావు, మరో ఇద్దరు కలిసి ‘డార్క్ కామెడీ’ పేరుతో ఓ తండ్రీ-కూతురు వీడియోపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసి శునకానందం పొందారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తొలుత నటుడు సాయిధరమ్ తేజ్ స్పందించారు. ‘సోషల్ మీడియాలో మృగాలు ఎకువైపోయాయి. పిల్లల వీడియోలను సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి’ అంటూ ఆయన ఓ పోస్టు పెట్టారు. ప్రణీత్‌పై చర్యలు తీసుకోవాలని టాలీవుడ్ నటులు మంచు మనోజ్, విశ్వక్‌సేన్, అడివిశేష్, కార్తికేయ, సుధీర్‌బాబు సహా పలువురు ఏపీ, టీజీ ప్రభుత్వాలను కోరారు. ఈ నేపథ్యంలో ప్రణీత్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. మిగతా ముగ్గురిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z