* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల (Stock market) లాభాల పరంపరకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు నష్టపోయాయి. వచ్చే వారం కేంద్ర బడ్జెట్ ప్రకటన నేపథ్యంలో ముఖ్యంగా మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతో ఒక్క సెషన్‌లో ఏకంగా రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం రూ.454.4 లక్షల కోట్ల నుంచి రూ.446.4 లక్షల కోట్లకు తగ్గింది. సెన్సెక్స్ ఉదయం 81,585.06 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,343.46) లాభాల్లో ప్రారంభమైంది. ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. రోజంతా అదే ఒరవడి కొనసాగింది. చివరికి 738.81 పాయింట్ల నష్టంతో 80,604.65 వద్ద ముగిసింది. నిఫ్టీ 269.95 పాయింట్ల నష్టంతో 24,530.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.66గా ఉంది. సెన్సెక్స్‌లో ఇన్ఫోసిస్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు మినహా అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 85 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు ధర కాస్త క్షీణించి 2,414.30 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
* భారత యువత ఒక బబుల్‌లో జీవిస్తోందని భారత్‌పే (BharatPe) మాజీ సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ (Ashneer Grover) వ్యాఖ్యానించారు. వాస్తవిక అనుభవాలను పొందడం ద్వారా యువత ఆ బబుల్‌ను పేల్చివేయాలన్నారు. ఒక పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ యువతరం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అమెరికాలోని యువత అమాయకులని మనం భావిస్తున్నాం. కానీ అది నిజంకాదు. భారత్‌లోని నవతరం ఒక బబుల్‌లో జీవిస్తోంది. గేటెడ్ సొసైటీల్లో నివసిస్తూ.. గేట్ల బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో అవగాహన లేకుండా ఉన్నారు. ఖరీదైన కార్లలోనే ఆ గేట్లు దాటి బయటకు వెళ్తారు. వారి పాఠశాలలు కూడా బబుల్సే.. అక్కడ విద్యార్థులపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. తొమ్మిదో తరగతి నుంచే కళాశాల విద్యకు సిద్ధం అవుతుంటారు. అలా అయితే వారికి ప్రపంచంలోని విషయాలు ఎలా అనుభవంలోకి వస్తాయి’’ అని ప్రశ్నించారు. ఈ దేశం, ఆర్థిక వ్యవస్థ ఎలా నడుస్తుందనే విషయాలపై వారు దృష్టి సారించడం లేదన్నారు. వృత్తిపరమైన అంశాల్లో వైఫల్యాలను వాస్తవిక ప్రపంచ అనుభవాన్ని పొందడం ద్వారా భారతీయ యువత తమ బబుల్స్‌ని పగలగొట్టాల్సిన అవసరం ఉందని సూచించారు.
* ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో త్రైమాసిక ఫలితాలను (Wipro Q1 Results) ప్రకటించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 3003.2 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.2,870 కోట్లతో పోలిస్తే నికర లాభంలో 4.6 శాతం వృద్ధి నమోదైంది. ఆదాయం మాత్రం 3.8 శాతం క్షీణించి రూ.21,963.8 కోట్లుగా నమోదైంది. గతేడాది ఈ మొత్తం రూ.22,831 కోట్లుగా ఉంది.
* మైక్రోసాఫ్ట్ విండోస్‌లో శుక్రవారం తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై స్పందించిన టెక్ దిగ్గజం.. సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపట్టింది. ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్’కు కారణమైన క్రౌడ్ స్ట్రయిక్ అప్‌డేట్ వెనక్కి తీసుకుంది. దీనికి డీబగ్‌ను రూపొందించామని, ప్రస్తుతం సమస్య పరిష్కారమైనట్లు కంపెనీ ప్రకటించింది. కానీ, ఇంకా మైక్రోసాఫ్ట్ (Microsoft) 365 యాప్స్, సర్వీసుల్లో సమస్య కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అటు సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రయిక్ (CrowdStrike) సీఈఓ జార్జ్ కుర్జ్ కూడా దీనిపై స్పందించారు. ‘‘సింగిల్ కంటెంట్ అప్‌డేట్‌లో బగ్‌తో తలెత్తిన కస్టమర్లతో మా కంపెనీ సంప్రదింపులు జరుపుతోంది. మ్యాక్, లైనక్స్ సిస్టమ్‌లపై ఎలాంటి ప్రభావం పడలేదు. అయితే, ఇది భద్రతాపరమైన వైఫల్యమో, సైబర్ దాడో కాదు. సమస్యను గుర్తించి డీబగ్‌ను ఫిక్స్ చేశాం. క్రౌడ్ స్ట్రయిక్ కస్టమర్ల భద్రతకు మేం పూర్తి ప్రాధాన్యమిస్తాం’’ అని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
* పేటీఎం బ్రాండ్‌తో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫిన్‌టెక్ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ నష్టాలు మరింత పెరిగాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ కంపెనీ (Paytm) రూ.838.9 కోట్ల ఏకీకృత నష్టాన్ని నివేదించింది. క్రితం ఏడాది ఇదే మూడు నెలల కాలంలో రూ.357 కోట్ల నష్టాన్ని నివేదించింది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికపు ఆదాయం వార్షిక ప్రాతిపదికన రూ.2,464 కోట్ల నుంచి 33.5 శాతం తగ్గి రూ.1,639 కోట్లకు చేరింది. ‘ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ ఓనర్‌షిప్ ప్లాన్’ నష్టం (ESOP loss) రూ.545 కోట్లను పక్కనపెడితే తమ ఆదాయం, EBITA అంచనాలకు అనుగుణంగానే ఉందని కంపెనీ (Paytm) తెలిపింది. రెండో త్రైమాసికంలో ఇది మరింత మెరుగవుతుందని పేర్కొంది. వ్యయాల సర్దుబాటు, కార్యకలాపాలు మెరుగవడం అందుకు దోహదం చేస్తుందని తెలిపింది. ఉద్యోగులపై చేసే వ్యయంలో ఏటా రూ.400- 500 కోట్లు పొదుపు చేయాలని కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. త్రైమాసిక ప్రాతిపదికన ఈ వ్యయంలో తొమ్మిది శాతం తగ్గుదల నమోదైనట్లు కంపెనీ పేర్కొంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z