Editorials

కమ్మ అంటే అమ్మలాంటి వారు – కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సదస్సు ప్రారంభం

కమ్మ అంటే అమ్మలాంటి వారు – కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సదస్సు ప్రారంభం

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కమ్మ కుటుంబ సభ్యులను ఒక్క దగ్గర చేర్చడం అభినందనీయమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మాదాపూర్‌లో నిర్వహించిన కమ్మ గ్లోబల్‌ ఫెడరేషన్‌ మహాసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. 2023కి ముందే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పినట్లు తెలిపారు. అయితే.. ఎన్నికలు, ఇతర పరిస్థితుల వల్ల సాధ్యం కాలేదని పేర్కొన్నారు. 90 రోజుల్లోనే అన్ని ఏర్పాట్లు చేసుకుని కార్యక్రమం ఘనంగా నిర్వహించారని వివరించారు.

‘‘కమ్మ అంటే అమ్మలాంటి వారు. అమ్మ బిడ్డ కడుపు చూస్తుంది.. కమ్మవారు వ్యవసాయం చేసి పదిమందికి అన్నం పెడుతున్నారు. వారు కష్టపడి పంటలు పండించాలి.. పది మందికి ఉపయోగపడాలి అనుకుంటారు. నేను ఎక్కడ ఉన్నా… వారు నన్ను ఎంతో ఆదరిస్తారు. అనర్గళంగా మాట్లాడటం ఎన్టీఆర్ నుంచే నేర్చుకున్నా. ఎన్టీఆర్ లైబ్రరీలో చదివిన చదువు మమ్మల్ని ఉన్నత స్థానాలకు తెచ్చింది

రాజకీయం, నాయకత్వంలో ఎన్టీఆర్ ఓ బ్రాండ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి నాయకులు ఉన్నారంటే ఆ రోజు ఆయన ఇచ్చిన అవకాశాలే కారణం. ఎన్టీఆర్‌ తెచ్చిన సంకీర్ణ రాజకీయాలే నేడు దేశాన్ని ఏలుతున్నాయి. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే ప్రణాళికలో మీరు భాగస్వాములు కావాలి. మీలో ఉన్న ప్రతిభని అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పన్నులు కట్టే ప్రాంతంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉంటుంది. నిరసనను అణచివేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో డిసెంబర్ 3న చూశాం. దిల్లీలో ఇప్పుడు నాయకత్వ లోపం కనిపిస్తోంది. వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి, పీవీ లాంటి తెలుగు వారు లేరు. దిల్లీలో మన తెలుగు వారు రాణించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మా ప్రభుత్వం నుంచి మీకు సంపూర్ణ సహకారం ఉంటుంది’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

కేజీఎఫ్ తొలిరోజు సదస్సలో కేజీఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ ప్రారంభోపన్యాసంలో అమెరికా, కెనడా, ఆస్ర్టేలియా, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశవిదేశాల నుంచి వచ్చిన కమ్మ సోదరులకు సాదరంగా స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు ఏవీ కాలేజ్ మేట్ అని, ఇప్పుడు రాజకీయ సహచరుడని తమ సాన్నిహిత్యాన్ని వివరించారు. ప్రపంచం ఒక కుగ్రామంగా మారిన నేటి కాలంలో కమ్మ వారంతా కేజీఎఫ్ వేదికలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను వివరించారు. బంగారం వంటి పంటలు పండించే కమ్మవారు తాము ఎదుగుతూ తోటి వారికి సాయపడే మన పూర్వీకుల వారసత్వాన్ని సుసంపన్నం చేయాలన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వమే కౌతవరం తొలి కమ్మ సదస్సులోనే అవకాశాలు అందిపుచ్చుకునేందుకు విద్య ఆవశ్యకతను గుర్తించి తీర్మానించారన్నారు. అదే స్ఫూర్తితో నేడు విద్యాలయాలు హాస్టళ్లు నెలకొల్పి పేద విద్యార్ధులకు సహాయ పడుతున్నారన్నారు. కష్టించే తత్వం కమ్మ వారి సొంతమని, ఐక్యతతో మరింతగా ఎదగాలని, తోటి వారికి సాయపడాలని కుసుమ కుమార్ పిలుపు ఇచ్చారు. కమ్మవారి దాతృత్వానికి నాగార్జున సాగర్ నిదర్శనమన్నారు. మక్త్యాల రాజా అప్పట్లో 50 లక్షల ధన సహాయం, 5 వేల ఎకరాల దానం అభినందనీయమన్నారు. ఐక్యత, సుసంపన్నం కావడం, తోటి పేదలకు సహాయపడటం, ప్రపంచ వ్యాప్తంగా కమ్మ వారికి సహాయ సహకారాలు అందించడం కేజీఎఫ్ ప్రధాన లక్ష్యమన్నారు.

కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ తొలి సదస్సు తొలిరేజు శనివారం ఘనంగా జరిగింది. సదస్సు ప్రారంభ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్.ఐ.సి.సి.)లో జూలై 20 శనివారం తొలి కమ్మ గ్లోబల్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. సదస్సుకు దేశ, విదేశాల్లోని కమ్మ సోదరులు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన, గణేష్ వందనం, గోదాదేవి కల్యాణం, కేజిఎఫ్ గీతం ఆవిష్కరణ కార్యక్రమం అలరించాయి. సాయంత్రం వైద్యరంగం అంశంపై చర్చ జరిగింది.

కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సదస్సులో తమిళనాడు ఎంపీ కళానిధి వీరస్వామి, మాజీ గవర్నర్ రామమోహనరావు, కర్నాటక ఎమ్మెల్యే మునిస్వామి, కేపీసీసీ రాజగోపాల్ నాయుడు, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, యరపతినేని శ్రీనివాసరావు, దగ్గుపాటి వెంకటేశ్వరర్రసాద్, రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ మంత్రులు కట్టా సుబ్రమణ్యం నాయుడు, వసంత నాగేశ్వరరావు, మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు, మురళీ మోహన్, సత్యవాణి, తానా ప్రెసిడెంట్ శృంగవరపు నిరంజన్, మాజీ అధ్యక్షులు జై తాళ్లూరి, సతీష్ వేమన, కోమటి జయరాం, రైతు నేస్తం వెంకటేశ్వరరావు, పుల్లెల గోపీచంద్, ఎమ్మెస్కే ప్రసాద్, సీవీ రావు, రాజశేఖర్, జీవిత, తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z