* దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉందని, 4శాతానికి దిగువన కొనసాగుతోందని ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఏడు శాతం వృద్ధిరేటు సాధ్యమే అయినప్పటికీ రుతుపవనాల పురోగతిపై ఇది ఆధారపడి ఉంటుందన్నారు. వృద్ధిరేటు అంచనా వేయడంలో వివేకంతో వ్యవహరించాలని కోరుకుంటున్నామని.. అందుకే FY25 వృద్ధి రేటును 6.5 నుంచి 7 శాతంగా అంచనా వేశామని తెలిపారు. ఆర్థిక సర్వే 2023-24 ముందుమాటలో పలు అంశాలను ప్రస్తావించిన ఆయన.. వ్యవసాయ రంగంలో విధానాలపై దేశవ్యాప్త చర్చ జరగాలన్నారు.
* గూగుల్‌కు చెందిన ప్రముఖ వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్‌లో (Yఔతుబె) సాంకేతిక సమస్య తలెత్తింది. యూట్యూబ్ యాప్, వెబ్‌సైట్‌లో ఈ అంతరాయం ఏర్పడింది. వీడియోలు అప్‌లోడ్ కావడం లేదంటూ పలువురు యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ఈ సమస్య ప్రారంభమైంది. ఈ అంతరాయానికి గల కారణమేంటన్నది తెలియ రాలేదు. యూట్యూబ్ దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. కేవలం వీడియోల అప్‌లోడింగ్ విషయంలోనే ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో చిన్నపాటి సాంకేతిక సమస్య అయి ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. కాసేపట్లో సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. మంగళవారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో సూచీలు రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా మార్కెట్ అంచనాలు అందుకోని కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ విషయంలో ఏమైనా మార్పులు చేస్తారా అనే దానిపై దేశీ, విదేశీ మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెన్సెక్స్ ఉదయం 80,408.90 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 80,604.65) నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొంది. ఇంట్రాడేలో 80100.65- 80800.92 పాయింట్ల మధ్య కదలాడిన సూచీ చివరికి 102 పాయింట్ల నష్టంతో 80,502 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 21.65 పాయింట్ల నష్టంతో 24,509.25 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.67గా ఉంది. సెన్సెక్స్‌లో ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభపడగా.. కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్, ఐటీసీ, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 82.56 డాలర్లు వద్ద, బంగారం ఔన్సు 2,406 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.
* దేశంలో శ్రామిక జనాభా క్రమంగా పెరుగుతోందని ఆర్థిక సర్వే వెల్లడించింది. వారి అవసరాలకు అనుగుణంగా వ్యవసాయేతర రంగంలో ఉపాధి కల్పన జరగాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. 2030 నాటికి ఏటా దేశ ఆర్థిక వ్యవస్థలో 78.5 లక్షల ఉద్యోగాల సృష్టి అవసరమని స్పష్టం చేసింది. పనిచేసే సామర్థ్యం ఉన్నవారందరికీ ఉద్యోగాలు అవసరం లేదని.. వీరిలో కొంతమంది ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉంటారని వ్యాఖ్యానించింది. మరికొందరు స్వయంఉపాధి పొందే అవకాశం ఉందని తెలిపింది. 2023 నాటికి వ్యవసాయ రంగంలో శ్రామిక జనాభా 45.8 శాతంగా ఉన్నట్లు సర్వే (ఏచొనొమిచ్ శుర్వెయ్) వెల్లడించింది. 2047 నాటికి ఇది 25 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలు, ముద్ర, మిత్ర టెక్స్‌లైట్ వంటి పథకాలను మరింత పటిష్ఠం చేయడం ద్వారా వచ్చే ఐదేళ్లలో వ్యవసాయేతర రంగాల్లో పెద్దఎత్తున ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని తెలిపింది. ఫలితంగా కార్మిక శక్తిని సంఘటిత రంగంలోకి తీసుకురావాలన్న దీర్ఘకాల లక్ష్యం కూడా నెరవేరుతుందని పేర్కొంది. ఫలితంగా వారికి సామాజిక భద్రత పథకాలను విస్తరించే వెసులుబాటు ఉంటుందని వివరించింది. భూ చట్టాలు సహా ఇతర నిబంధనలను సడలించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఉపాధి అవకాశాలను మెరుగుపరచవచ్చని సర్వే సూచించింది.
* కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సర్వేను (ఏచొనొమ్య్ శుర్వెయ్) సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక స్థితిగతులకు అద్దం పట్టే ఈ కీలక నివేదికలో ప్రభుత్వం తమ తదుపరి వ్యూహాలను సైతం వెల్లడించింది. ఆర్థిక పురోగతి, సుస్థిరత కోసం ఆరు కీలక రంగాలపై దృష్టిసారించి.. ‘అమృత కాలం’లో ప్రభుత్వం అనుసరించనున్న వృద్ధి వ్యూహాన్ని ఆవిష్కరించింది.
ప్రైవేట్ పెట్టుబడులను పెంచడం: ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడానికి వీలుగా ప్రైవేటు రంగ పెట్టుబడులను పెంచాలి. అందుకోసం ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించాలి.
ఎంఎస్‌ఎంఈల విస్తరణ: భారత్‌లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ధి, విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆర్థిక వ్యవస్థలో వాటి పాత్రను గుర్తించి తగిన ప్రాధాన్యం కల్పించాలి.
వృద్ధి చోదకంగా వ్యవసాయం: ఇప్పటికే ఉన్న విధానపరమైన అడ్డంకులను తొలగించడం ద్వారా వ్యవసాయాన్ని ప్రధాన వృద్ధి చోదకంగా తీర్చిదిద్దాలి. ఫలితంగా ఆ రంగంలోని శక్తి, సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవాలి.
గ్రీన్ ట్రాన్సిషన్ ఫైనాన్సింగ్: దేశ సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ దిశగా చేపడుతున్న హరిత, స్వచ్ఛ పరివర్తన చర్యలకు ఆర్థికంగా అండగా నిలవాల్సిన అవసరం ఉంది.
విద్య-ఉపాధి అంతరాన్ని తగ్గించడం: శ్రామికశక్తి సంబంధిత నైపుణ్యాలు కలిగిఉండేలా విద్య, ఉపాధి మధ్య అంతరాన్ని పూడ్చడం చాలా కీలకం.
ప్రభుత్వ సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించడం: ప్రభుత్వ విధానాలను సమర్థంగా అమలుచేస్తూ వృద్ధిని ముందుకుతీసుకెళ్లేందుకు పబ్లిక్ సెక్టార్ పాత్ర చాలా కీలకం. అందుకనుగుణంగా ప్రభుత్వ సంస్థల శక్తి సామర్థ్యాలను బలోపేతం చేయాలి.
* చైనా కేంద్ర బ్యాంకు ‘పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా’ కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను (ఛిన ఈంతెరెస్త్ ఋఅతెస్) తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఐదేళ్ల లోన్ ప్రైమ్ రేటుతో పాటు ఏడాది రుణరేట్లను కూడా తగ్గిస్తున్నట్లు తెలిపింది. తనఖా రుణాలకు ప్రామాణికంగా తీసుకొనే ఐదేళ్ల వడ్డీ రేటును చైనా కేంద్ర బ్యాంకు పది బేసిస్ పాయింట్లు తగ్గించి 3.85 శాతానికి చేర్చింది. ఏడాది కాలపరిమితితో కూడిన రుణరేట్లను 3.35 శాతంగా నిర్ణయించింది. రుణాలు తీసుకునేటప్పుడు బ్యాంకుల్లో ఉంచాల్సిన తనఖా నిబంధనలను సైతం సులభతరం చేసింది. బాండ్ మార్కెట్‌పై ఒత్తిడిని తగ్గించడమే తమ లక్ష్యమని పేర్కొంది. కొవిడ్ సంక్షోభం నుంచి చైనా ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ముఖ్యంగా స్థిరాస్తి రంగం కుదేలైంది. గత త్రైమాసికంలో దేశ వృద్ధిరేటు 4.7 శాతానికి కుంగింది. ప్రభుత్వం నిర్దేశించుకున్న ఐదు శాతం లక్ష్యానికి ఇది దూరంగా ఉంది. తాజా వడ్డీ రేట్ల కోత నిర్ణయంతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. స్థిరాస్తి రంగం తిరిగి కోలుకుంటుందని ఆశిస్తోంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z