Kids

తొటి విద్యార్థిని కత్తితో పొడిచిన 16ఏళ్ల బాలుడు-CrimeNews-July 24 2024

తొటి విద్యార్థిని కత్తితో పొడిచిన 16ఏళ్ల బాలుడు-CrimeNews-July 24 2024

* ఏపీలోని చిత్తూరు జిల్లా (Chittoor District) పులిచర్ల మండలం గొట్టిగంటివారిపల్లె సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో (Road accident) ఒకరు మృతి చెందగా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది. ఒంగోలుకు చెందిన ఏవీఆర్‌ సంస్థలో బిహార్ (Bihar)‌, ఒడిశా (Odissa)కు చెందిన నిర్మాణ రంగ కూలీలు పనిచేస్తున్నారు. వీరంతా గొట్టిగంటివారిపల్లె వద్ద వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణానికి వెళ్తుండగా ట్రాక్టర్‌ అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుత్‌ తీగలు తెగిపడి ఒకరు మృతి చెందగా 13 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పోలీసులు తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

* అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఫైల్స్‌ దహనం ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు తెలిపారు. కార్యాలయంలో 25 అంశాలకు సంబంధించి రెవెన్యూ డాక్యుమెంట్లు దగ్ధమయ్యాయని, పాక్షికంగా కాలిపోయిన 700 డాక్యుమెంట్లు రికవరీ చేసినట్టు చెప్పారు. వీటికి సంబంధించిన నిపుణులు అందరినీ పిలిపించి నమూనాలు సేకరించామన్నారు. అధికారులు, ఇతరుల పాత్రపై విచారణ చేస్తున్నామన్నారు. కార్యాలయంలో దస్త్రాలు దహనం జరగడానికి ముందే ఇంజన్ ఆయిల్ ఉన్నట్లు గుర్తించామన్నారు. నివేదికలు వస్తే.. మరిన్ని ఆధారాలు బయటకు వస్తాయని తెలిపారు. ఇప్పటి వరకు 35 మంది అనుమానితులను గుర్తించి విచారణ జరుపుతున్నామని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు దర్యాప్తు ముమ్మరం చేశామని, ఎలాంటి డెడ్‌లైన్‌ పెట్టలేదన్నారు. ఈ ఘటనలో అసలు కుట్రదారులు ఎవరో నిష్పక్షపాతంగా తేల్చాలని సీఎం ఆదేశించారని చెప్పారు.

* ఓ దుండగుడు అర్థరాత్రి లేడీస్ హాస్టల్లో చొరబడి ఓ యువతి గొంతు కోసి హతమార్చిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని లేడీస్‌ హాస్టల్‌లోకి అర్థరాత్రి ఓ వ్యక్తి చొరబడ్డాడు. బిహార్‌కు చెందిన కృతి కుమారి(24) అనే యువతి గదిలోకి ప్రవేశించి కత్తితో యువతి గొంతు కోసి, దారుణంగా హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

* తరగతిగదిలో అప్పటివరకు సరదాగా సాగిన సంభాషణ ఒక్కసారిగా వివాదంగా మారడంతో 16 ఏళ్ల బాలుడు ఆవేశంలో తోటి విద్యార్థిని కత్తితో పొడిచాడు. ఈ ఘటన దిల్లీలోని జనక్‌పురిలోని ఒక పాఠశాలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తరగతి గదిలో ‘పదో తరగతి విద్యార్థులు సరదాగా మాట్లాడుతుండగా ఒక జోక్‌ విషయంలో వివాదం చెలరేగింది. అదికాస్తా ఇద్దరి విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీయడంతో ఓ విద్యార్థి, మరో విద్యార్థిని కత్తితో పొడిచాడు. తోటి విద్యార్థులు కలగజేసుకొని బాధితుడికి ప్రథమ చికిత్సను అందించారు. పరిస్థితి విషమించడంతో ఉపాధ్యాయులు అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

* వివాహమైన ఆరునెలలకే అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చోటుచేసుకుంది. పట్టణంలోని రామ్‌నగర్‌కు చెందిన సాయి ప్రియాంక (24)కు అదే మండలంలోని బాబూకాలనీకి చెందిన మణికంఠతో ఈ ఏడాది జనవరిలో ప్రేమ వివాహం జరిగింది. గత రెండు నెలల నుంచి రూ.5లక్షల అదనపుకట్నం తీసుకురావాలంటూ సాయి ప్రియాంకను భర్త మణికంఠ, అత్తింటివారు వేధింపులకు గురిచేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి సాయి ప్రియాంక అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. ఉరి వేసుకుని చనిపోయినట్లుగా మృతదేహం ఉంది. తమ కుమార్తెను భర్త మణికంఠ, ఆయన కుటుంబ సభ్యులే హత్య చేశారని మృతురాలి తల్లి లక్ష్మీదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై మదనపల్లె రూరల్‌ ఎస్సై రవికుమార్‌ అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు తమపై పోలీసులకు ఫిర్యాదు చేశారని మణికంఠ తల్లి ఉష బుధవారం ఉదయం ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z