Business

ఏపీ రైల్వేకు ₹9151 కోట్లు-BusinessNews-July 24 2024

ఏపీ రైల్వేకు ₹9151 కోట్లు-BusinessNews-July 24 2024

* ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది రైల్వేలకు రూ.9,151 కోట్లు కేటాయించామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులపై దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరించారు. యూపీఏ ప్రభుత్వంలో కేటాయింపుల కంటే పదింతలు పెంచామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా వంద శాతం రైల్వే లైన్ల విద్యుద్దీకరణ జరిగిందన్నారు. రాష్ట్రంలో రూ.73,743 కోట్లతో రైల్వే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అమృత్‌ పథకం కింద 73 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు.

* ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) నష్టాలు తగ్గినట్లు కేంద్రం పార్లమెంట్‌కు వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎబిటా రూ.2164 కోట్లు కాగా.. నష్టాలు రూ.5371 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో సంస్థకు వచ్చిన నష్టం రూ.8161 కోట్లతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. ఈ మేరకు కమ్యూనికేషన్స్‌ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఓ పార్లమెంట్ సభ్యుడు అడిగిన ప్రశ్నకు బుధవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్రం తీసుకుంటున్న చర్యలు, ఇస్తున్న ప్యాకేజీల కారణంగా బీఎస్‌ఎన్‌ఎల్‌/ ఎంటీఎన్‌ఎల్‌ 2020-21 నుంచి ఆపరేటింగ్‌ ప్రాఫిట్స్‌ అందుకుంటున్నాయని మంత్రి చెప్పారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ స్ఫూర్తితో 4జీ సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ లక్ష 4జీ సైట్లను ఆర్డర్‌ చేసిందని, వీటిని సులువుగా 5జీకి అప్‌గ్రేడ్‌ చేయొచ్చన్నారు. బీఎస్‌ఎన్ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ను పునరుద్ధరిచడానికి కేంద్రం అనేక చర్యలు చేపడుతోందని చెప్పారు. 2019లో రూ.69వేల కోట్లతో పునరుద్ధరణ ప్యాకేజీ కేంద్రం అందించిందని, 2022లో మరో రూ.1.64 లక్షల కోట్లు ప్యాకేజీ రూపంలో అందించిందని పేర్కొన్నారు. రూ.89 వేల కోట్ల విలువైన 4జీ/5జీ స్పెక్ట్రాన్ని 2023లో బీఎస్‌ఎన్‌ఎల్‌కు కేంద్రం కేటాయించిందని చెప్పారు.

* భారత్‌లోని ఐటీ కంపెనీల సీఈవోల్లో అత్యధిక వార్షిక వేతనం పొందుతున్న వారెవరో తెలుసా..? హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సీఈవో సి.విజయ్‌కుమార్‌. ఆయన 2023-24 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 10.06 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.84.16 కోట్లు) వేతనాన్ని అందుకున్నారు. ఈమేరకు ఆ కంపెనీ నివేదిక పేర్కొంది. ఆ ఏడాదికి ఐటీ సర్వీసెస్‌ కంపెనీ సీఈవోల్లో అత్యధిక వేతనం అందుకున్న వ్యక్తి ఆయనే కావడం విశేషం. హెచ్‌సీఎల్‌ టెక్‌ వార్షిక నివేదిక 2023-24 ప్రకారం.. విజయ్‌కుమార్‌ అందుకుంటున్న వేతనం గత ఏడాదితో పోల్చితే 190.75 శాతం పెరిగింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు (Stock market) నష్టాల్లో ముగిశాయి. బడ్జెట్‌లో ప్రతిపాదించిన స్వల్పకాలిక, దీర్ఘకాలిక పన్ను ప్రభావం బుధవారమూ కొనసాగింది. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి ఫైనాన్షియల్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలపై ప్రభావం చూపింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు దీనికి తోడయ్యాయి. దీంతో ఓ దశలో 650 పాయింట్లకు పైగా సెన్సెక్స్‌ నష్టపోగా.. ఆఖర్లో కోలుకొంది. సెన్సెక్స్‌ ఉదయం 80,343.38 పాయింట్ల (క్రితం ముగింపు 80,429.04) నష్టాల్లో ప్రారంభమైంది. దాదాపు రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 79,750.51 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 280.16 పాయింట్ల నష్టంతో 80,148.88 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 65.55 పాయింట్ల నష్టంతో 24,413.50 పాయింట్ల నష్టంతో 24,413.50 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.64గా ఉంది.

* వెనిజువెలా నుంచి ముడిచమురు దిగుమతికి దేశీయ అతిపెద్ద చమురుశుద్ధి సంస్థ ‘రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌’ (RIL)కు మార్గం సుగమమైనట్లు సమాచారం. అందుకు అమెరికా అనుమతించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ కీలక వ్యక్తి వెల్లడించారు. ఆ దేశం నుంచి చమురు దిగుమతిపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అనుమతి లభించినట్లు ఇటు రిలయన్స్‌గానీ, అటు అమెరికాగానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

* ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై (Fixed Deposits) వడ్డీ రేట్లను పెంచింది. కొన్ని కాలపరిమితులతో కూడిన రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తం డిపాజిట్ల రేట్లను సవరించింది. వీటిపై 20 బేసిస్‌ పాయింట్లు అదనంగా వడ్డీ ఇవ్వనున్నట్లు తెలిపింది. పెంచిన రేట్లు బుధవారం నుంచే అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది. పెంపు తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC Bank) తమ ఎఫ్‌డీ ఖాతాదారుల్లో సాధారణ పౌరులకు గరిష్ఠంగా 7.40 శాతం, సీనియర్‌ సిటిజెన్స్‌కు 7.90 శాతం వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తోంది. రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై (Fixed Deposits) వివిధ కాలపరిమితులకు బ్యాంకు ప్రస్తుతం ఇస్తున్న వడ్డీరేట్లు ఇలా..

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z