NRI-NRT

కెనడా ఎంపీకి ఖలిస్థానీయుల హెచ్చరిక. గట్టిగా సమాధానమిచ్చిన ఎంపీ.

కెనడా ఎంపీకి ఖలిస్థానీయుల హెచ్చరిక. గట్టిగా సమాధానమిచ్చిన ఎంపీ.

ఖలిస్థానీవాదులతో కెనడా కలుషితమవుతోందని భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య పేర్కొన్నారు. స్థానిక చట్టాలు కల్పించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఎడ్మంటన్‌లో హిందూ దేవాలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు చేసిన దాడిని ఆయన ఖండించారు. దీనికి బదులుగా చంద్ర ఆర్య, ఆయన వర్గీయులు భారత్‌కు వెళ్లిపోవాలంటూ సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ అధినేత గురపత్వంత్‌ హెచ్చరించడంపై కెనడా ఎంపీ స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ‘ఎక్స్‌’లో పోస్టు చేస్తూ ఖలిస్థానీ చర్యలపై తీవ్రంగా మండిపడ్డారు.

‘‘హిందువులమైన మేము ప్రపంచ నలుమూలల నుంచి కెనడాకు వచ్చి స్థిరపడ్డాం. దక్షిణాసియాలోని ప్రతి దేశం, ఆఫ్రికా, కరేబియన్‌లోని అనేక దేశాల నుంచి, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చాం. కెనడా మా స్వస్థలం. కెనడా సామాజిక-ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించాం. మా సేవలు కొనసాగుతూనే ఉంటాయి, ఘన చరిత్ర కలిగిన హిందూ సంస్కృతి, వారసత్వంతో కెనడా బహుళ సంస్కృతిక సంప్రదాయాలను సుసంపన్నం చేశాం’’ అని భారత సంతతి వ్యక్తి, జస్టిస్‌ ట్రూడోకు చెందిన లిబరల్‌ పార్టీ ఎంపీ చంద్ర ఆర్య పేర్కొన్నారు. కెనడా ఇచ్చిన హక్కులను దుర్వినియోగం చేస్తున్న ఖలిస్థానీ మద్దతుదారులు.. ఈ నేలను కలుషితం చేస్తున్నారని దుయ్యబట్టారు.

కెనడాలోని ఎడ్మంటన్‌ నగరంలో బాప్స్‌ స్వామినారాయణ మందిరంపై దాడి చేసిన ఖలిస్థానీ మద్దతుదారులు.. అక్కడి గోడలపై విద్వేషపూరిత రాతలు(గ్రాఫిటీ) రాశారు. ఆలయంపై హిందూ విద్వేషపూరిత రాతలను ఎడ్మంటన్‌ పార్లమెంటు సభ్యులు తప్పుబట్టారు. ఈ దుశ్చర్యను వాంకోవర్‌లోని భారత కాన్సుల్‌ జనరల్‌ కూడా తీవ్రంగా ఖండించారు. ఇలాంటి విధ్వంసాలు కేవలం భౌతికంగానే కాకుండా హిందూ సమాజ మనోభావాలు దెబ్బతీస్తాయని కెనడియన్‌ హిందూ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తెలిపింది. గతేడాది కూడా కెనడాలోని మూడు దేవాలయాలపై ఇలాంటి దాడులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z