Editorials

సరిహద్దు గ్రామాల అభివృద్ధికి ₹1000కోట్లు-NewsRoundup-July 24 2024

సరిహద్దు గ్రామాల అభివృద్ధికి ₹1000కోట్లు-NewsRoundup-July 24 2024

* పాలనపై దృష్టి పెట్టకుండా ప్రత్యర్థుల్ని టార్గెట్‌ చేయడాన్ని కొనసాగిస్తే.. ఒంటరిగా మిగిలిపోతారని తమిళనాడు సీఎం స్టాలిన్‌ (MK Stalin) ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) విధానాలను దుయ్యబట్టారు. మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో పలు రాష్ట్రాల్ని విస్మరించారంటూ ‘ఇండియా కూటమి’ ఎంపీలు నిరసనకు దిగిన నేపథ్యంలో స్టాలిన్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘‘ఎన్నికలు అయిపోయాయి.. ఇప్పుడు మనం దేశం గురించి ఆలోచించాలి’ అని మీరే అన్నారు కదా. కానీ, నిన్నటి బడ్జెట్‌- 2024 మీ ప్రభుత్వాన్ని కాపాడుతుంది గానీ.. ఈ దేశాన్ని కాదు. ప్రభుత్వాన్ని నిష్పక్షపాతంగా నడపండి. మిమ్మల్ని ఓడించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోవద్దు. రాజకీయ ఇష్టాయిష్టాల ప్రకారం సర్కారును నడిపితే మీరు ఒంటరి అయిపోతారు’’ అని స్టాలిన్‌ పేర్కొన్నారు.

* తన తదుపరి చిత్రం ‘బడ్డీ’ (Buddy) ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నారు నటుడు అల్లు శిరీష్‌ (Allu Sirish). తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సోదరుడు అల్లు అర్జున్‌ (Allu Arjun) గురించి మాట్లాడారు. తన సినిమాలను ప్రమోట్‌ చేయమని అన్నయ్యను కోరడం ఇష్టం ఉండదన్నారు. ‘‘నా సినిమాని ప్రమోట్‌ చేయమని అన్నని ఎప్పుడూ అడగలేదు. ఇప్పటివరకూ నటించిన చిత్రాల్లో ‘ఒక్క క్షణం’ ఆడియో ఫంక్షన్‌కు మాత్రమే అన్న హాజరయ్యాడు. నా సినిమా గురించి ట్వీట్‌ చేయమని అడగడానికి ఇష్టపడను. నా ప్రాజెక్ట్‌ ప్రమోషన్స్‌ కోసం తనని సంప్రదించకూడదని పాలసీ పెట్టుకున్నా. గతంలో హిందీలో మ్యూజిక్‌ వీడియో చేశా. వేరే రాష్ట్రానికి వెళ్తున్నా కదా.. కాస్త ప్రమోట్‌ చేయమని అడుగుదాం అనుకున్నా. కానీ విరమించుకున్నా. ఎందుకంటే.. నా వెనుక ఉండి ప్రమోట్‌ చేస్తున్నాడనే భావన ప్రేక్షకులకు కలుగుతుందనిపించింది. అదృష్టవశాత్తు, ఆ వీడియో 100 మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకుంది. అప్పుడు కంగ్రాట్స్‌ చేస్తూ ట్వీట్‌ చేశాడు. నా గత చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’ ప్రమోషన్స్‌కు కూడా పిలవలేదు. సక్సెస్‌మీట్‌కు మాత్రమే పిలిచా’’ అని వెల్లడించారు.

* గుంటూరు జిల్లాలో వైకాపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య రాజీనామా చేశారు. గుంటూరులో తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా వైకాపాపై రోశయ్య తీవ్ర విమర్శలు చేశారు. ‘‘వైకాపా కొందరు వ్యక్తుల చేతుల్లోనే నడుస్తోంది. కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు ఉండదు. ఉమ్మారెడ్డి అనుభవాన్ని వినియోగించుకోలేదు. మండలిలో ప్రతిపక్ష నేత విషయంలో కనీసం చర్చించలేదు. మండలిలో చైర్మన్ అన్నారు.. ప్రతిపక్ష నేతగా కూడాఉమ్మారెడ్డికి అవకాశం ఇవ్వలేదు. గుంటూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా నన్ను నిలబెట్టారు. కొందరు మానసికంగా కుంగదీశారు. ఎన్నికల తర్వాత కూడా వారి ఇష్టాలతోనే పార్టీని నడుపుతున్నారు. వైకాపాలో నేను కొనసాగలేను’’ అని రోశయ్య స్పష్టం చేశారు.

* పోయస్‌గార్డెన్‌లో ఇల్లు కొనుగోలు చేయడంపై ‘రాయన్‌’ ప్రెస్‌మీట్‌లో నటుడు ధనుష్‌ (Dhanush) స్పందించారు. ఇల్లు కొనుగోలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారుతుందని అనుకోలేదన్నారు. ఆ ప్రాంతంలో ఇల్లు కొనుగోలు చేయడం తన చిన్ననాటి కల అన్నారు. ‘‘పోయస్‌గార్డెన్‌లో నేను ఇల్లు కొనుగోలు చేయడం ఇంత హాట్‌ టాపిక్‌గా మారుతుందని తెలిసి ఉంటే.. వేరే ఎక్కడైనా చిన్న అపార్ట్‌మెంట్‌ తీసుకునేవాడిని. ఆ ప్రాంతంలో నేను ఇల్లు కొనుగోలు చేయకూడదా? ఉన్నచోటనే నేను మిగిలిపోవాలా? అక్కడ ఇల్లు కొనడం వెనక చిన్న కథ ఉంది. నేను ఏ హీరోకి (రజనీకాంత్‌ను ఉద్దేశించి) వీరాభిమానినో మీ అందరికీ తెలుసు. కేవలం ఆయన ఇల్లు చూడటం కోసమే చిన్నతనంలో ఓసారి పోయస్‌ గార్డెన్‌కు వెళ్లా. ఆ ప్రాంతంలోనే జయలలితమ్మ ఇల్లు కూడా ఉందని అప్పుడే తెలిసి ఆశ్చర్యపోయా. ఏదోఒకరోజు తప్పకుండా ఈ ప్రాంతంలో ఇల్లు కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నా. పదహారేళ్ల వెంకటేశ్‌ ప్రభు (ధనుష్‌ ఒరిజినల్‌ పేరు)కు ఇప్పుడు నేనిచ్చిన బహుమతే ఆ ఇల్లు’’ అని చెప్పారు. దాదాపు రూ.150 కోట్లు పెట్టి పోయస్‌ గార్డెన్‌లో ధనుష్‌ ఇల్లు కట్టించుకున్నట్లు 2021లో కథనాలు వచ్చాయి. 2023లో అది పూర్తైందని సమాచారం.

* ‘తల్లికి వందనం’ పథకానికి విధివిధానాలను రూపొందిస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) తెలిపారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ‘తల్లికి వందనం’ ఇస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు బడుల విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. గత ప్రభుత్వ వైఫల్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో 72వేల మంది విద్యార్థులు తగ్గారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోని మంచి విధానాలపై అధ్యయనం చేస్తామని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యాశాఖలో మంచి విధానాలను అమలు చేస్తామన్నారు.

* ఉద్యోగుల సమస్య పరిష్కారంపై రవాణాశాఖ మంత్రి ఆదేశాలను ఖాతరు చేయని ఏపీఎస్‌ ఆర్టీసీ ఉన్నతాధికారిపై బదిలీ వేటు పడింది. సమస్య పరిష్కార విషయమై కడప జోన్‌ ఈడీ గిడుగు వెంకటేశ్వరరావుకు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి మూడుసార్లు ఫోన్‌ చేశారు. ఈడీ లెక్కచేయకపోవడంతో ఆయన తీరుపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో వెంటనే రిపోర్టు చేయాలని ఆదేశించారు. దీంతో ఈడీపై బదిలీ వేటు వేస్తూ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే ఆదేశాలు జారీ చేశారు.

* వజ్రాలకు పేరుగాంచిన మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో అదృష్టం ఈసారి ఓ కార్మికుడిని వరించింది. రాజు గౌఢ్‌ అనే వ్యక్తికి 19.22 క్యారెట్‌ డైమండ్‌ (Diamond) దొరికింది. దీంతో ఆ కుటుంబం ఆనందానికి హద్దుల్లేవు. ప్రభుత్వ వేలంలో దీని విలువ రూ.80 లక్షలు, అంతకన్నా ఎక్కువ ధర పలకవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇంతటి అదృష్టం వస్తుందని ఊహించలేదని రాజు అన్నాడు. తనకు వచ్చే డబ్బుతో ఆర్థిక కష్టాలు గట్టెక్కుతాయని, పిల్లల చదువు సజావుగా సాగుతుందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. కృష్ణకల్యాణ్‌పుర్‌లో లీజుకు తీసుకున్న గనిలో ఈ విలువైన వజ్రం దొరకడం ఎంతో ఆనందంగా ఉందని, వెంటనే దీన్ని ప్రభుత్వ అధికారుల వద్ద జమ చేసినట్లు తెలిపాడు. ఈ విలువైన వజ్రాన్ని తదుపరి వేలంలో విక్రయానికి ఉంచనున్నట్లు పన్నా డైమండ్ కార్యాలయ అధికారి అనుపమ్ సింగ్ వెల్లడించారు.

* రాష్ట్రానికి నిధుల కోసం దిల్లీలో దీక్ష చేయాలని భారాస ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీశ్‌ రావు చేసిన డిమాండ్‌పై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద దీక్ష చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే, ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ వస్తే.. ప్రభుత్వాధినేతగా తాను వస్తానని రేవంత్‌ చెప్పారు. రాష్ట్రానికి నిధుల కోసమైనా కేసీఆర్‌ ముందుకురావాలన్నారు. మీరే తారీఖు డిసైడ్ చేయండి దీక్షకు మేం సిద్దం. తెలంగాణకు నిధులు తెచ్చుడో..సచ్చుడో తేల్చుకుందామని సవాల్‌ విసిరారు. ‘‘చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చామని మేమెప్పుడూ పదే పదే చెప్పలేదు. రూ.100 పెట్టి పెట్రోల్‌ కొన్నారు కానీ, అగ్గిపెట్టి కొనలేదు. అగ్గిపెట్టి మర్చిపోయినట్టు నటించి అమాయక విద్యార్థులను బలిగొనలేదు’’ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయంపై శాసనసభలో చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పర విమర్శలతో సభ వేడెక్కింది.

* దేశ రక్షణలో సరిహద్దు గ్రామాలు ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయి. అయితే, చొరబాట్లు, అక్రమ రవాణాకు ఆస్కారమున్న ఆ ప్రాంతాల్లో అభివృద్ధి అంతంతమాత్రమే అని చెప్పవచ్చు. ముఖ్యంగా చైనా నుంచి ముప్పు పొంచివున్న వేళ కేంద్ర ప్రభుత్వం వాటిపై దృష్టి సారించింది. డ్రాగన్‌తో సరిహద్దు ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, లద్దాఖ్‌లలోని వందల గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం తాజా బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. సరిహద్దు గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం ‘వైబ్రంట్‌ విలేజెస్‌ ప్రోగ్రామ్‌’ (VVP) పేరుతో ఫిబ్రవరి 23, 2023న కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ గ్రామాల ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, తద్వారా వలసలను తగ్గించే ఉద్దేశంతో కేంద్రహోంశాఖ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా 2022-23, 2025-26 మధ్యకాలంలో దాదాపు రూ.4800కోట్లు ఖర్చు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఈ క్రమంలో తాజా బడ్జెట్‌లో రూ.1050 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. కీలకమైన సరిహద్దు గ్రామాల్లో ఉపాధి అవకాశాల విస్తరణకు 600 ప్రాజెక్టులను చేపడతామని కేంద్రం పేర్కొంది. ఇందులో భాగంగా వ్యవసాయం, ఉద్యానవనం, ఔషధ మొక్కల పెంపకం, పర్యటక రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడం, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, గృహ నిర్మాణం, అతిథి గృహాల నిర్వహణనకు ప్రోత్సాహం, నైపుణ్యాభివృద్ధి, టెలివిజన్‌, టెలికాం కనెక్టివిటీ రంగాల్లో అవకాశాలు కల్పించడం ద్వారా ఆర్థికవ్యవస్థలో స్థానికులను భాగస్వామ్యం చేసే దిశగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు ఉపక్రమించింది.

* నన్ను చంపేందుకు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ కుట్ర – సల్మాన్ ఖాన్. నన్ను, నా కుటుంబాన్ని చంపే ఉద్దేశంతోనే కాల్పులు. ముంబయి పోలీసులకు సల్మాన్‌ ఖాన్‌ వాంగ్మూలం. ఏప్రిల్‌లో ఘటనపై ఇటీవల ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన పోలీసులు.

* అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఫైల్స్‌ దహనం ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు తెలిపారు. కార్యాలయంలో 25 అంశాలకు సంబంధించి రెవెన్యూ డాక్యుమెంట్లు దగ్ధమయ్యాయని, పాక్షికంగా కాలిపోయిన 700 డాక్యుమెంట్లు రికవరీ చేసినట్టు చెప్పారు. వీటికి సంబంధించిన నిపుణులు అందరినీ పిలిపించి నమూనాలు సేకరించామన్నారు. అధికారులు, ఇతరుల పాత్రపై విచారణ చేస్తున్నామన్నారు. కార్యాలయంలో దస్త్రాలు దహనం జరగడానికి ముందే ఇంజన్ ఆయిల్ ఉన్నట్లు గుర్తించామన్నారు. నివేదికలు వస్తే.. మరిన్ని ఆధారాలు బయటకు వస్తాయని తెలిపారు. ఇప్పటి వరకు 35 మంది అనుమానితులను గుర్తించి విచారణ జరుపుతున్నామని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు దర్యాప్తు ముమ్మరం చేశామని, ఎలాంటి డెడ్‌లైన్‌ పెట్టలేదన్నారు. ఈ ఘటనలో అసలు కుట్రదారులు ఎవరో నిష్పక్షపాతంగా తేల్చాలని సీఎం ఆదేశించారని చెప్పారు.

* భారాస, కాంగ్రెస్‌ నేతలు పోటీపడి మరీ ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లీస్తోందని, ఓట్ల కోసం తప్ప ప్రజలకు నిధులు ఖర్చు చేయట్లేదని ఆరోపించారు. సంక్షేమ పథకాల కోసం కేంద్రం రూ.6లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని భారాస, కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు.

* చంద్రుడిపై అన్వేషణకు భారత్‌ సహా వివిధ దేశాలు ఆసక్తి చూపుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాంగే-5 సాయంతో జాబిల్లి నుంచి భూమికి మట్టిని తీసుకువచ్చిన చైనా.. నాలుగేళ్లుగా పరిశోధనలు చేస్తోంది. ఈ క్రమంలో అందులో నీటి జాడ ఉన్నట్లు పేర్కొంది. తమ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించినట్లు చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ (CAS)వెల్లడించింది. చంద్రుడిపై మట్టినమూనాల సేకరణ లక్ష్యంగా 2020లో చైనా చేపట్టిన చాంగే-5 ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. చంద్రుడి ఉపరితలం నుంచి దాదాపు 2కిలోల మట్టి, రాళ్ల నమూనాలను తీసుకువచ్చింది. అనంతరం వాటిపై బీజింగ్‌ నేషనల్‌ లేబొరేటరీ ఫర్‌ కండెన్స్‌డ్‌ మ్యాటర్‌ ఫిజిక్స్‌, సీఏఎస్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఫిజిక్స్‌ పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. ఆ నమూనాల్లో విస్తృత స్థాయిలో నీటి అణువులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారని సీఏఎస్‌ ఇటీవల పేర్కొంది. ఇందుకు సంబంధించిన పరిశోధన పత్రాన్ని ఓ జర్నల్‌లో ప్రచురించినట్లు పేర్కొంది.

* ల్యాండ్ టైటిలింగ్‌ యాక్టు రద్దు, హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరణ బిల్లులను ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ ఆమోదించింది. ల్యాండ్ టైటిలింగ్‌ యాక్టు రద్దుపై రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్, హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ చర్చను ప్రారంభించారు. గత ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. సభ్యులు మాట్లాడిన అనంతరం రెండు బిల్లులు సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు.

* ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యం అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. లోతైన విచారణ తర్వాత అవసరమైతే ఈ అంశాన్ని ఈడీకీ సిఫార్సు చేస్తామని స్పష్టం చేశారు. ఎక్సైజ్‌ శాఖపై బుధవారం శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘నేరస్థులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయమవుతాయి. నేరస్థుడే రాజకీయ నేత, సీఎం అయితే ఏం జరుగుతుందో గత ఐదేళ్లలో చూశాం. మేం విడుదల చేస్తోన్న 7 శ్వేతపత్రాలు చూస్తే రాష్ట్రం ఎంత నష్టపోయిందో తెలుస్తుంది’’అని చంద్రబాబు (Chandrababu) అన్నారు. మద్యపాన నిషేధం, లిక్కర్‌ ఔట్‌లెట్స్‌ తగ్గింపు అని చెప్పి.. అన్నీ మరిచారని విమర్శించారు.

* అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాల దహనం చేసిన ఘటనలో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. గత మూడు రోజులుగా రెవెన్యూ, పోలీసు, సీఐడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో కుట్రధారులుగా అనుమానిస్తున్న పలువురు రెవెన్యూ అధికారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మదనపల్లె ఆర్డీవోగా పనిచేసిన మురళి, ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ గౌతమ్‌ను పోలీసులు.. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోనే వరుసగా మూడోరోజు కూడా విచారణ చేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z