ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) నెలనెలా తెలుగు వెన్నెల శీర్షికలో భాగంగా “కవిత్వ సృజన -నా అనుభవాలు” అనే అంశంపై 204వ సాహిత్య సదస్సు ఆదివారం నాడు నిర్వహించారు. ప్రముఖ కవి, విమర్శకులు దర్భశయనం శ్రీనివాసాచార్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
సమన్విత గజాననమ్ తం గణేశ్వరం భజామి కీర్తనతో కార్యక్రమం ప్రారంభమైంది. విశ్రాంత ఉపాధ్యాయురాలు సత్యవతి కావూరి తెలుగు ఉపాధ్యాయినిగా చిన్నారులకు తెలుగు వ్యాకరణం పట్ల మమకారం పెంపొందించే విధానాలను వివరించారు. రమణ దొడ్ల సాకేత్ పొట్లతో జరిపిన “పిండంతే నిప్పటి” సంభాషణ జనరంజకంగా సాగింది. సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ యు.నరసింహారెడ్డి “మన తెలుగు సిరి సంపదలు”, లెనిన్ వేముల “తెలుగు సాహిత్యంలో వైజ్ఞానిక అంశాలు”పై ప్రసంగించి ఆకట్టుకున్నారు.
దర్భశయనం శ్రీనివాసాచార్యని సంస్థ సమన్వయకర్త దయాకర్ మాడా సభకు పరిచయం చేశారు. శ్రీనివాసాచార్య ప్రసంగిస్తూ చదువుకొనే రోజుల్లో స్కూలు లైబ్రరీలో పుస్తకాలను అదేపనిగా చదివేవాడిననీ 13ఏళ్ళ వయసులోనే కవిత వ్రాశాననీ తెలిపారు. తనకు చదువు చెప్పిన టీచరు లక్ష్మీనారాయణ సహజంగా కవి కావటంతో వ్యవసాయ కుటుంబము నుండి వచ్చిన తాను, అదే వృత్తిని నమ్ముకొని శ్రమిస్తున్న రైతుల కష్టాలను పునాదిగా చేసుకొని 17ఏళ్ళ వయసులో మరిన్ని కవితలు వ్రాయడంతో పాటు ఆంగ్లానువాదాన్ని కూడా నేర్చుకున్నానని వెల్లడించారు. ఆరుగాలం కష్టపడి పండించినప్పటికీ ప్రకృతి వైపరీత్యాలతో పంటనష్టం భరించలేని రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం చూసి చలించిపోయిన తాను వారికి మనోస్థైర్యం కలిగించే కవితలు వ్రాసి సమాజానికి ఎంతో కొంత తోడ్పడిన వైనాన్ని వివరించారు. నయాగరా జలపాతమును దర్శించిన సమయంలో వ్రాసిన కవితలను వినిపించారు. అనంతరం కార్యవర్గ సభ్యులు ఆయన్ను “కవితా విశారద” బిరుదుతో సత్కరించారు. టాంటెక్స్ అధ్యక్షులు సతీష్ బండారు, సంస్థ పూర్వాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, చినసత్యం వీర్నపు, ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ, లలితానంద ప్రసాద్, గోవర్ధనరావు నిడిగంటి, జయదేవ్ మెట్టుపల్లి, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z