DailyDose

సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం…ముగ్గురు యువకులు మృతి-CrimeNews-July 25 2024

సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం…ముగ్గురు యువకులు మృతి-CrimeNews-July 25 2024

* మాదాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన రేవ్‌ పార్టీని తెలంగాణ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు భగ్నం చేశారు. 14 మంది యువకులు, ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. మిగిలిన వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. ఇందులో కొందరు డ్రగ్స్‌ తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రేవ్‌ పార్టీలో ఒక గ్రాము కొకైన్‌, రెండు గ్రాముల ఎండీఎంఏ, మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.1.25లక్షలు విలువ చేసే మద్యం, డ్రగ్స్‌ సీజ్‌ చేశారు. బేగంపేటకు చెందిన నాగరాజు పుట్టిన రోజు సందర్భంగా ఈ రేవ్‌ పార్టీ ఏర్పాటుచేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈవెంట్‌ ప్రమోటర్‌ కిషోర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

* సంగారెడ్డి జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. కంది మండలం తునికిళ్ల తండా శివారులో జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. నాందేడ్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీని వెనుక నుంచి ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. మృతులను పుల్కల్‌ మండలం గంగోజీపేటకు చెందిన సందీప్‌, నవీన్‌, అభిషేక్‌గా గుర్తించారు. ఈ ముగ్గురూ అక్షయపాత్రలో డెలివరీ బాయ్స్‌గా పనిచేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

* ఆర్థిక ఇబ్బందులతో తల్లీకుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలోని చైతన్యపురి పీఎస్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్తపేటలోని ఎస్‌ఆర్‌ కాలనీలో తల్లి గంజి పద్మ (40), కుమారుడు వంశీ (18) అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. పద్మ భర్త శివ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో ఆమె కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో బుధవారం రాత్రి పద్మ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి మృతిని తట్టుకోలేక కుమారుడు వంశీ కూడా ఉరివేసుకుని చనిపోయాడు. సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఏపీలోని ఒంగోలుకు చెందిన వీరి కుటుంబం కొన్నేళ్లుగా ఎస్‌ఆర్‌ కాలనీలో ఉంటోంది.

* చోరీకి గురైన సెల్‌ఫోన్లను సైబరాబాద్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చరవాణులు పోయినట్టు పోర్టల్‌ ద్వారా బాధితులు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతికంగా వాటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గత నెల రోజులుగా నేర విభాగం డీసీపీ నర్సింహ ఆధ్వర్యంలో దాదాపు 345 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లను గురువారం బాధితులకు అందజేశారు. పోయిన ఫోన్లు చేతికందడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న వారు ఎన్‌సీఆర్పీ పోర్టల్‌లో కాని, 1930 నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

* పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎస్‌ఎస్‌ఎన్‌ (శ్రీ సుబ్బరాయ, నారాయణ) ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాల వసతి గృహంలో ర్యాగింగ్‌ వికృత క్రీడ వెలుగుచూసింది. జూనియర్‌ విద్యార్థులను సీనియర్లు కర్రలతో కొడుతున్నట్లున్న వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసిన వీడియోపై నరసరావుపేట పట్టణ, గ్రామీణ సీఐలు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి, ఈ ఘటన ఫిబ్రవరిలో జరిగిందని తేల్చారు. ఈ కళాశాలలో ఎన్‌సీసీ ఉండటంతో తల్లిదండ్రులు పిల్లల్ని చేర్పించేందుకు ఆసక్తి చూపుతారు. ఇటీవల దాచేపల్లికి చెందిన ఓ తండ్రి తన కుమారుడిని చేర్పించాలని చూస్తుండగా.. అందులో ర్యాగింగ్‌ ఎక్కువగా ఉందని సదరు విద్యార్థి ఈ వీడియోను తండ్రికి చూపించారు. అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ర్యాగింగ్‌ వ్యవహారం వెలుగుచూసింది.

* ఉగ్రవాదుల ఆగడాలను అరికట్టేందుకు భారత సైన్యం (Indian Army) సిద్ధమైంది. జమ్ముకశ్మీర్‌లో (Jammu Kashmir) ఉగ్రకదలికలు పెరిగిన తరుణంలో ఇండియన్‌ ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టింది. ముఖ్యంగా 55 మంది ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ‘ఆపరేషన్‌ సర్ప్‌ వినాశ్ 2.0 (Operation Sarp Vinaash 2.0)’ను ప్రారంభించింది. గత 21 ఏళ్లలో భారత్ ఆర్మీ చేపట్టిన అతిపెద్ద ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ ఇదే. ప్రధాని కార్యాలయమే ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తుంది. ఇందులో భాగస్వాములైన అధికారులు నేరుగా జాతీయ భద్రతా సలహాదారు, చీఫ్ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z