DailyDose

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి-CrimeNews-July 26 2024

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి-CrimeNews-July 26 2024

* 17ఏళ్ల నాటి హత్య కేసులో బదౌనీలో ప్రత్యేక కోర్టు జడ్జి సంచలన తీర్పు ఇచ్చారు. 14 మందికి జీవిత ఖైదు, జరిమానా విధించారు. వీరిలో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌ జిల్లా ఖర్కౌల్‌ గ్రామంలో పాన్‌ సింగ్‌ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో వీరంతా దోషులుగా తేలడంతో ప్రత్యేక జడ్జి రేఖా శర్మ వారందరికీ శిక్షలు ఖరారు చేశారు. వీరిలో ఆరుగురికి రూ.50వేలు, ఎనిమిది మంది దోషులకు రూ.30వేలు చొప్పున జరిమానా విధించారని ప్రభుత్వం తరఫు న్యాయవాది వెల్లడించారు. 2007 ఫిబ్రవరిలో కరీబ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఖార్కౌల్‌ గ్రామంలో రాధేశ్యామ్‌ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జరిగిన ఎనిమిది రోజుల తర్వాత అతడి కుటుంబసభ్యులు, బంధువులు పాన్‌ సింగ్‌ ఇంటిపై దాడి చేశారు. పోలీసులకు బాధిత కుటుంబం చేసిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. పాన్‌సింగ్‌ ఇంటి వద్ద బహిరంగ కాల్పులు జరపడంతో పాటు కర్రలతో దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. ఆ తర్వాత అతడిని గొడ్డలితో నరికి చంపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. 12 మందిపై దోపిడీ, హత్య కేసులు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మరో నలుగురిపైనా ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. కేసు విచారణలో ఉండగానే వీరిలో ఇద్దరు మరణించారు. తాజాగా ఈ కేసు తుది విచారణలో రాధేశ్యామ్‌ సోదరుడు ఉర్మాన్‌తో పాటు 14మందిని దోషులుగా నిర్ధారించి వారందరికీ జీవిత ఖైదు విధిస్తూ జడ్జి రేఖా శర్మ తీర్పు ఇచ్చారు. దోషులంతా రాధేశ్యామ్‌ కుటుంబసభ్యులు లేదా బంధువులే కావడం గమనార్హం.

* దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి, ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది సయ్యద్‌ మక్బూల్‌ (52)మృతి చెందాడు. చర్లపల్లి జైలులో ఖైదీగా ఉన్న మక్బూల్‌.. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 30 రోజుల క్రితం గుండె ఆపరేషన్ జరిగింది. తర్వాత మూత్రపిండాలు విఫలమై ఆరోగ్యం క్షీణించింది. ఈక్రమంలో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. దేశవ్యాప్తంగా పలు బాంబు దాడుల్లో ఆయన హస్తం ఉన్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసులో ఆయనకు దిల్లీ కోర్టు జీవితఖైదు విధించింది. 6 నెలల క్రితం సయ్యద్‌ మక్బూల్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ట్రాన్సిట్‌ వారెంట్‌పై ఆయన్ను దిల్లీ నుంచి ఇక్కడికి తీసుకువచ్చారు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన సయ్యద్ మక్బూల్‌ ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు ఆజం ఘోరీకి సన్నిహితుడనే పేరుంది. 2006లో వారణాసి, 2007లో ముంబయి వరుస పేలుళ్లు, 2008లో జైపూర్, 2008 దిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరుతోపాటు దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల వెనుక ఇతని పాత్ర ఉన్నట్లు ఎన్ఐఏ ప్రస్తావించింది.

* దొంగల బీభత్సం సృష్టించిన షిర్డీ సాయి నగర్ టూ కాకినాడ రైలు ఖమ్మం రైల్వే స్టేషన్ చేరుకుంది. సుమారు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో దోపిడీ జరిగినట్లు బాధితులు చెబుతున్నాయి. 30 మందికి పైగా బాధితుల లగేజీ బ్యాగ్‌లు, మని పర్సులు.. మొబైల్ ఫోన్లు దొంగలు ఎత్తుకెళ్లారు. సుమారు 30 లక్షల విలువ చోరీ అయినట్టు సమాచారం. బి3,బి4,బి5 ఏసీ కోచ్‌లలో ప్రయాణికులు నిద్రలో ఉండగా దోపిడీ జరిగింది. పర్భని దగ్గర జరిగినట్లుగా ప్రయాణికులు చెబుతున్నారు. బాధితులు పర్ని బైదనాడ్ స్టేషన్ వద్ద ప్రయాణికులు తమ వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఒకటి తర్వాత ఒకరు తమ వస్తువులు పోయాయంటూ కోచ్‌లో ఆందోళన దిగారు. రైల్వే పోలీసులకు సమాచారం అందించగా సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. రైలు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకోగానే రైల్వే పోలీసులకు పలువురు ఫిర్యాదు చేశారు. మరికొందరు ఖమ్మం జీఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

* నగరంలో సినిమా తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. స్పాలో హత్యకు గురైన ఓ వ్యక్తి ఒంటిపై వేయించుకున్న పచ్చబొట్లు హంతకులను పట్టించాయి. ముంబైలోని గురు వాఘ్‌మారే అనే వ్యక్తి తనకు 22 మంది వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందంటూ వారి పేర్లను శరీరంపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఈ క్రమంలో నిజంగానే ఆ వ్యక్తిని స్పా సెంటర్‌లో దుండగులు హత్య చేశారు. పోలీసులు మృతదేహం స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించగా.. మృతుడి ఒంటిపై ఉన్న పచ్చబొట్టులో 22 మంది పేర్లను గుర్తించారు. వారిలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే స్పా యజమాని సంతోష్ షెరేకర్‌తో పాటు హత్యకు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. యూపీఐ రికార్డులో అతని పేరు మహమ్మద్ ఫిరోజ్ అన్సారీగా పోలీసులు గుర్తించారు. అన్సారీ యూపీఐ ఐడీకి లింకయిన ఫోన్ నంబర్‌కి షెరేకర్‌ పలుమార్లు ఫోన్‌ చేసినట్లు దర్యాప్తులో తేలింది. అన్సారీ బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో స్పాలోకి ప్రవేశించి, వాఘ్‌మారే గర్ల్‌ ఫ్రెండ్‌ను మరొక గదిలోకి తీసుకెళ్లారు. అనంతరం కత్తెర, బ్లేడ్‌లను ఉపయోగించి వాఘ్‌మారేను హత్య చేశారు. వాఘ్‌మారే గర్ల్‌ఫ్రెండ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. కాగా వాఘ్‌మారే సామాజిక కార్యకర్తగా చెప్పుకుంటూ 2010 నుంచి ముంబై, నవీ ముంబై, థానే, పాల్ఘర్‌లోని పలువురు స్పా యజమానుల నుంచి డబ్బు వసూలు చేసేవాడని, అతనిపై దోపిడీ, అత్యాచారం, వేధింపుల క్రిమినల్ కేసులు నమోదయినట్లు పోలీసులు వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z