అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్‌కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ వైదొలగడంతో హారిస్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. అధికారికంగా ఇంకా అభ్యర్థిత్వం ఖరారు కాకపోయినా పార్టీలో కీలక నేతలంతా ఆమెకు మద్దతు పలుకుతూ ప్రకటనలిచ్చారు. అయితే ఒబామా స్పందించలేదు. దీంతో కమల అభ్యర్థిత్వంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు ఊహాగానాలొచ్చాయి. వాటికి తెరదించుతూ హారిస్‌తో ఒబామా దంపతులు ఫోన్‌లో మాట్లాడారు. ‘‘మా స్నేహితురాలు కమలా హారిస్‌కు నేను, మిషెల్ కొద్ది రోజుల క్రితం ఫోన్ చేశాం. ఆమె అమెరికాకు అధ్యక్షురాలు అవుతారని మేం భావిస్తున్నాం. మా పూర్తి మద్దతును ఆమెకు తెలియజేశాం. నవంబరు 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో కమల గెలవడానికి ఏమైనా చేస్తాం. మీరు కూడా మాతో చేరుతారని ఆశిస్తున్నాం’’ అంటూ కమలా హారిస్‌తో జరిగిన ఫోన్ సంభాషణ వీడియోను ఒబామా షేర్ చేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z