Politics

తెలంగాణాలో పంచాయతీ ఎన్నికల సందడి-NewsRoundup-July 26 2024

తెలంగాణాలో పంచాయతీ ఎన్నికల సందడి-NewsRoundup-July 26 2024

* ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న టాలీవుడ్‌ సీనియర్‌ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) ఆర్థికసాయం చేశారు. రూ.లక్షను అందజేశారు. ఈ విషయంపై ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ‘‘మా అమ్మాయికి ఆపరేషన్‌ అయినప్పుడు సాయిధరమ్‌ తేజ్‌ నాకు ఫోన్‌ చేశారు. ధైర్యం చెప్పారు. వచ్చి కలుస్తానన్నారు. చాలా రోజులైపోయింది. నన్ను మర్చిపోయారేమో అనుకున్నా. కానీ, నన్ను గుర్తుపెట్టుకొని సాయం చేసినందుకు ఆయనకు నా ధన్యవాదాలు’’ అని తెలిపారు. అనంతరం, ఆమె.. సాయిధరమ్‌తేజ్‌తో వీడియో కాల్‌లో మాట్లాడి భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. చనిపోదామనుకున్నా. సమయానికి మీరు సాయం చేసి నాకూ, నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టారు’’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘‘మీరు కన్నీళ్లు పెట్టుకుంటుంటే కష్టంగా ఉంది. ఏడవకండి’’ అంటూ ఆయన ఓదార్చారు. తెలుగు ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌కు సాయిధరమ్‌తేజ్‌ రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇందులోభాగంగా రూ.లక్షను ఆమెకు అందజేయడం జరిగింది.

* నటి కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రఘు తాత’. ఆగస్టు 15న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. ఈనేపథ్యంలో ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సినిమా విశేషాలు పంచుకుంటున్నారు. తాజాగా అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు. తన చిరకాల స్నేహితుడిని ఆమె వివాహమాడనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై స్పందించారు. ‘‘ఏదైనా రూమర్‌ గురించి మనం క్లారిటీ ఇస్తే అది నిజమేనని అందరూ భావిస్తారు. అందుకే అలాంటివాటిపై నేను స్పందించను. నా నటన లేదా సినిమాల ఎంపిక గురించి ఎవరైనా వివరణాత్మక విమర్శలు చేస్తే తప్పకుండా వాటిని స్వీకరిస్తాను. అలాంటి వాటినుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతాను. నా వ్యక్తిగత జీవితం, కుటుంబం గురించి ఎవరైనా కామెంట్స్‌ చేస్తే వాటిని పరిగణలోకి తీసుకోను. వివిధ కారణాల వల్ల వాళ్లు చేసే కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు’’ అని ఆమె చెప్పారు.

* కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా తుంగభద్ర, కృష్ణా నదులకు ప్రవాహం మరింత పెరుగుతోంది. శ్రీశైలానికి తుంగభద్ర, కృష్ణా కలిసి భారీ ప్రవాహం వస్తోంది. గురువారం రాత్రి వరకు ప్రాజెక్టు వద్ద 2.54 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ఎగువ కృష్ణా ప్రాజెక్టులు ఆలమట్టి, నారాయణపూర్‌ల నుంచి 2.50 లక్షలకు పైగా వరద దిగువకు విడుదలవుతోంది. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 98 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఇలానే కొనసాగితే మరో పది రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండనుంది. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు (215.81 టీఎంసీలు) 855.20 అడుగుల (92.49 టీఎంసీలు) వద్ద ఉంది. ప్రాజెక్టు నుంచి విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 31,784 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. మూడు రోజుల క్రితం కొంత నెమ్మదించిన గోదావరి తిరిగి ఉప్పొంగుతోంది. దీంతో భద్రాచలం వద్ద 48.5 అడుగులకు నీటిమట్టం చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ వద్ద 7.71 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఇంద్రావతి నది కలిసిన తరువాత తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీ వద్ద 9.50 లక్షలు, దుమ్ముగూడెం సీతమ్మసాగర్‌ వద్ద 11.47 లక్షల క్యూసెక్కుల వరద నమోదవుతోంది.

* రామ్‌ పోతినేని (Ram Pothineni)- పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart). కావ్యా థాపర్‌ కథానాయిక. ఆగస్టు 15న ఈ మాస్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల దీనినుంచి ‘మార్‌ ముంతా ఛోడ్‌ చింతా’ అనే మాస్‌ పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ పాట మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. మణిశర్మ సంగీత దర్శకత్వంలో రాహుల్‌ సిప్లిగంజ్‌ దాన్ని ఆలపించారు. తాజాగా ఈ పాటకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు వీళ్లిద్దరూ పంచుకున్నారు.

* జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. జీవో 317పై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ అధ్యక్షతన సభ్యులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇవాళ మరికొన్ని శాఖల నివేదికలు సమర్పించగా.. మరిన్ని విభాగాల నుంచి పూర్తి వివరాలు అందలేదని కేబినెట్‌ సబ్‌ కమిటీ తెలిపింది. వెబ్‌సైట్‌ ద్వారా అందిన దరఖాస్తుల్లో సుమారు 30 నుంచి 40శాతం పునరావృతమైనట్టు కమిటీ గుర్తించింది. అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను ఉపయోగించుకొని కొందరు సొంత జిల్లాలకు వెళ్లేందుకు తప్పుడు ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికారులు కమిటీ దృష్టికి తెచ్చారు. నష్టపోయిన వారి వివరాలు మాత్రమే గుర్తించి నివేదిక ఇవ్వాలని అధికారులకు సబ్‌ కమిటీ స్పష్టం చేసింది. సమావేశంలో వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

* కాంగ్రెస్‌ పార్టీ ద్వంద్వ విధానం మరోమారు బయటపడిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పూర్తిగా విఫలమైందని, ప్రైవేటు బీమా కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికే దాన్ని వాడుకుంటున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ జైరామ్‌ రమేశ్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం అదే పథకానికి రెడ్‌ కార్పెట్‌ పరిచి అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని ఆక్షేపించారు. అదానీకి భాజపా దోచిపెడుతుందని రాహుల్‌ గాంధీ అంటే.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అదానీతో రూ.వేల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంటోందన్నారు. దిల్లీ కాంగ్రెస్‌ చెబుతున్నది నిజమా? తెలంగాణ కాంగ్రెస్‌ చెబుతున్నది నిజమా?..ఏది వాస్తవమో స్పష్టత ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

* రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా ఆ పార్టీ సానుభూతిపరులపై ఎక్కడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరగట్లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. యాదృచ్ఛికంగా జరిగిన చిన్నపాటి ఘటనలను పెద్దవి చేసి చూపుతూ జగన్‌ రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 36 మందిని రాజకీయ హత్యలు చేశారని దిల్లీ వేదికగా జగన్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం శాసనమండలిలో ఆమె మాట్లాడుతూ.. హత్యకు గురైన వారి వివరాలను తాము అడిగితే జగన్‌ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు.

* 2023 వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ (Mohammed Shami).. గాయం కారణంగా ఆ తర్వాత జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో ఫైనల్‌ మ్యాచే అతడు చివరగా ఆడింది. గాయం బాధతోనే ఆ టోర్నీలో ఆడినప్పటికీ.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సత్తా చాటడం విశేషం. ఆ తర్వాత ఐపీఎల్‌, టీ20 ప్రపంచకప్‌ను మిస్‌ అయిన షమీ.. ప్రస్తుతం టీమ్‌ఇండియా జట్టులోకి తిరిగి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో షమీ పాటిస్తున్న డైట్‌ గురించి అతడి స్నేహితుడు ఉమేశ్‌ కుమార్‌ వెల్లడించాడు. మాంసాహారం పట్ల అతడికున్న ఆసక్తిని సరదాగా చెప్పాడు. ‘షమీ దేన్నైనా భరిస్తాడు.. కానీ మాంసాహారం లేకుండా ఉండలేడు. దానిని ముట్టకుండా ఒక్క రోజు ఉండగలడేమో. రెండో రోజు అతడిలో ఆందోళన కనిపిస్తుంది. మూడో రోజుకు నియంత్రణ కోల్పోతాడు. అతడి బౌలింగ్‌లో వేగం 15 కి.మీలకు తగ్గిపోతుంది’’ అని ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో ఉమేశ్‌ సరదాగా చెప్పాడు.

* ధరణి సమస్యల పరిష్కారానికి లోతుగా అధ్యయనం చేయాలని, శాశ్వత పరిష్కారం చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. సచివాలయంలో ఆయన ధరణిలో సమస్యలు, మార్పులు-చేర్పులు ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ‘‘సవరణల వల్ల కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మార్పులు, చేర్పులపై ప్రజాభిప్రాయం, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన వారి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలి. వారి అభిప్రాయాలు, సూచనలు ఆధారంగా సమగ్ర చట్టం తేవాలి. ధరణిపై అవసరమైతే అసెంబ్లీలో చర్చ చేపడదాం’’అని సీఎం రేవంత్‌ అన్నారు. సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి, కోదండరెడ్డి, కె.కేశవరావు తదితరులు పాల్గొన్నారు.

* తెలుగు సినీ ప్రియులకు సుపరిచితురాలైన నటి టబు (Tabu). ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తోన్న ఆమె తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన సినీ కెరీర్‌ ఎలా మొదలైందో చెప్పారు. అలాగే, ఇన్నేళ్ల కెరీర్‌లో ఓ ప్రాజెక్ట్‌ విషయంలో తాను విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, ఆ ప్రాజెక్ట్‌ ఎందుకు అంగీకరించానా అనే భావన కలిగిందన్నారు. ‘‘నటి షబానా అజ్మీ మాకు బంధువు. ఓసారి నేను ఆమె ఇంటికి వెళ్లినప్పుడు ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌కపూర్‌ నన్ను చూశారు. నాతో ‘దుష్మణి’ సినిమా చేయాలనుకుంటున్నట్లు ఇంట్లో వాళ్లతో చెప్పారు. అప్పుడు నేను పదోతరగతి చదువుతున్నా. చదువుపై ఆసక్తి ఉండటంతో సినిమాల్లోకి రానని చెప్పా. ఆయన చాలాసార్లు అడగడంతో చివరకు అంగీకరించా. పదోతరగతి పరీక్షలు రాసి.. సినిమాకు సంతకం చేశా. ఏమైందో ఏమో తెలియదు. ఆదిలోనే అది ఆగిపోయింది. ఆ తర్వాత అదే చిత్రాన్ని సన్నీదేవోల్‌, మనీషా కొయిరాలాతో డైరెక్టర్‌ బంటీ తెరకెక్కించారు. కొంతకాలం తర్వాత శేఖర్‌ మళ్లీ నన్ను కలిశారు. ‘ప్రేమ్‌’లో నటించమని అడిగారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నానని చెప్పా. కాకపోతే ఆయన బలవంతం చేయడంతో అంగీకరించా. సినిమాకు సంతకం చేశా. షూటింగ్‌ మొదలయ్యాక ఆయన సినిమా నుంచి వైదొలగారు. దాంతో దాదాపు ఐదేళ్లపాటు ఆ ప్రాజెక్ట్‌ చిత్రీకరించారు. ఆ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినందుకు ఎంతో బాధపడ్డా’’ అని టబు తెలిపారు.

* అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. మదనపల్లె నుంచి విజయవాడ వెళ్తూ అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌ను సందర్శించిన ఆయన.. అధికారులతో సమావేశమై రెవెన్యూశాఖ రికార్డులపై పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మదనపల్లె ఘటనపై 4 బృందాలు విచారణ చేస్తున్నాయని తెలిపారు.

* చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎటు వైపు వెళ్తుందో ఆలోచించాలని, పురోగతి వైపు వెళ్తుందా?.. తిరోగమనంలో వెళ్తోందా? గమనించాలని ఏపీ ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచకాలు, చంద్రబాబు విడుదల చేస్తున్న అబద్ధపు శ్వేతపత్రాలు, వైఎస్సార్‌సీపీ హయాంపై చేస్తున్న తప్పుడు ప్రచారాలపై తాడేపల్లిలోని తన కార్యాలయంలో జగన్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో గత 52 రోజులుగా దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం కొనసాగుతోంది. ప్రశ్నించే వాళ్లను అణచివేసే ధోరణితో పాలన ముందుకు సాగుతోంది. విధ్వంస పాలన కొనసాగుతుంటే.. పోలీసులు పూర్తిగా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏడు నెలల ఓటాన్‌ బడ్జెట్‌ పెడుతోంది. పూర్థిస్థాయి బడ్జెట్‌ పెట్టే ధైర్యం లేంటే ఎంతటి దారుణమైన, అధ్వానమైన పాలనో అర్థం చేసుకోవాలి. ఫుల్‌ బడ్జెట్‌ పెడితే చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలు ఏమైతే ఇచ్చారో.. వాటికి కేటాయింపులు చూపించాల్సిన అవసరం వస్తుంది. అందుకే ఆ పని చేయడం లేదు.”

* ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన వైసీపీ(YCP) కి వరుస షాక్‌లు తగులుతున్నాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన రెండు నెలల్లోనే వైసీపీకి చెందిన పలువురు కూటమి పార్టీలైన టీడీపీ(TDP), జనసేన(Janasena)లో చేరుతున్నారు. తాజాగా ఏపీ శాసన మండలిలో డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఉన్న వైసీపీ నాయకురాలు జకియా ఖానమ్(Jakia Khanam) కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్‌(Minister Nara Lokesh) ను శుక్రవారం కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే ఆమె టీడీపీ సీనియర్‌ నాయకుడు, మంత్రి ఫరూఖ్‌తో సమావేశమై టీడీపీ చేరే అంశం చర్చించినట్లు సమాచారం.

* ఇండియా కూటమి నేతలతో చర్చలకే జగన్‌ ఢిల్లీ వెళ్లారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. రాజకీయాల్లో ప్రతిపక్షం ఉండాలని ఆయన అన్నారు. వైఎస్‌ జగన్‌కు ప్రతిపక్ష హోదా రావడానికి ఇంకో పదేండ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద పయ్యావుల మాట్లాడుతూ.. జగన్‌కు దమ్ముంటే రాజకీయ హత్యలకు సంబంధించిన వివరాలను బయటపెట్టాలని సవాలు విసిరారు. బయట చెబుతున్న విషయాలను అసెంబ్లీలో ప్రస్తావించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు జగన్‌కు ఓట్లేసి 11 సీట్లయినా ఇచ్చింది అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చిస్తారని.. కానీ ఇలా సింగిల్‌ కెమెరాతో ప్రెస్‌మీట్‌ పెట్టడానికి కాదని పయ్యావుల అన్నారు. రాజకీయాల్లో అభిమానులు, అవమానించే వారు ఉండటం సహజమని పేర్కొన్నారు. అభిమానించినా, అవమానించినా నిలదొక్కుకున్న వాళ్లే రాజకీయంగా ఉండగలరని గ్రహించాలని జగన్‌కు హితవు పలికారు. జగన్‌ ఇలాగే పోతే 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఒక్కరిగా మిగిలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

* తెలంగాణ‌లో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు మ‌రి కొద్దిరోజుల్లోనే న‌గారా మోగ‌నుంది. త్వ‌ర‌లోనే ఎన్నిక‌ల షెడ్యూల్‌ను విడుద‌ల చేసి, ఆగ‌స్టు నెల చివ‌రి వ‌ర‌కు పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఐదేండ్ల క్రితం ఎన్నిక‌ల్లో కేటాయించిన‌ రిజ‌ర్వేష‌న్ల ప్ర‌కారమే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. ఈ రోజు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కీలక నిర్ణయం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్నందున రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లలే కొనసాగించాలని, ఆగష్టు నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు ప‌లువురు ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z