Sports

ఒలంపిక్స్ షూటింగ్‌లో భారతీయుల ఘనత-NewsRoundup-July 27 2024

ఒలంపిక్స్ షూటింగ్‌లో భారతీయుల ఘనత-NewsRoundup-July 27 2024

* ప్రపంచమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్స్‌(Olympics) వేడుకలు పారిస్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సందర్శకులు సందడి చేస్తున్నారు. ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi) కుటుంబసమేతంగా ఈ వేడుకలకు హాజరయ్యారు. పారిస్‌లో మెగా ఫ్యామిలీ ఎంజాయ్‌ చేస్తోన్న వీడియోలను ఉపాసన (Upasana), రామ్‌చరణ్‌ ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్‌ అవుతున్నాయి

* గోదావరిలో వరద మళ్లీ క్రమంగా పెరుగుతోంది. నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన ప్రవాహం.. శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరదనీరు రాజమహేంద్రవరం వైపుగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 13.75 అడుగుల నీటి మట్టం కొనసాగుతుండటంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రంలోకి 13లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాలువలు, కల్వర్టులకు ప్రజలు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. భద్రాచలం వద్ద గంట గంటకు వరద ప్రవాహం పెరగటం ఆందోళన కలిగిస్తోంది. కోనసీమలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదీ పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కోనసీమలోని లంక గ్రామాలను వరదనీరు చుట్టు ముట్టేస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

* నగర పరిధిలోని జగన్నాథగట్టుపై ఉన్న ట్రిపుల్ ఐటీ (డీఎం)లో విద్యార్థి ఆత్మహత్య కలకలం సృష్టించింది. విజయనగరం జిల్లాకు చెందిన సాయి కార్తీక్ నాయుడు మూడో ఏడాది ఈసీఈ చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం అధ్యాపకులు మందలించడంతో మనస్తాపానికి గురై శనివారం మధ్యాహ్నం ట్రిపుల్ ఐటీ భవనం 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రికి తరలించేలోపే విద్యార్థి మృతి చెందినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి వివరాలు బయటికి రాకుండా ఇద్దరు అధ్యాపకులు ప్రయత్నించినట్టు సమాచారం. ఘటనా స్థలిని వెంటనే శుభ్రం చేయడంతో విద్యార్థులు అధ్యాపకుల తీరుపై మండిపడుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు.

* గోదావరి నది భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహంతో శనివారం రాత్రి 7 గంటలకు నీటి మట్టం 53.6 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి ఉద్ధృతి గంట గంటకూ పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ముంపు ప్రాంతాల్లోని బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్టు సమాచారం.

* జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. నీతి ఆయోగ్‌ భేటీ అనంతరం ఆయనతో ప్రత్యేకంగా సమావేశమై పోలవరం ప్రాజెక్టు అంశంపై చర్చించారు. తాజా ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. వైకాపా హయాంలో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ చేసిన నష్టాన్ని పూడ్చే బాధ్యత ప్రజలు ఎన్డీయేకు అప్పగించారన్నారు. పోలవరానికి సంబంధించి పాతబకాయిలు ఇవ్వాలని కోరామని తెలిపారు. గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా కేంద్రం నిధులను దారి మళ్లించిందని, ఇదే విషయాన్ని కేంద్రంలోని ఆయా శాఖలు చెబుతున్నాయన్నారు. నవంబర్‌ నాటికి పోలవరం నిధులు విడుదల చేస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, తెదేపా ఎంపీలు సీఎం వెంట ఉన్నారు.

* వైకాపా హయాంలో నిర్వాసితులను గాలికి వదిలేశారని ఏపీ మంత్రులు విమర్శించారు. గోదావరి వరద కారణంగా ఇబ్బందులు పడుతున్న నిర్వాసితులను పరామర్శించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రుల బృందం శనివారం పోలవరం విలీన మండలాల్లో పర్యటించింది. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి, హోం మంత్రి వంగలపూడి అనితతో కూడిన మంత్రుల బృందం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పర్యటించింది. కుక్కునూరు మండలం దాచారం పునరావాస కాలనీని సందర్శించిన మంత్రులు.. అక్కడ నిర్వాసితులకు అందుతున్న ప్రభుత్వ సహాయాన్ని పరిశీలించారు. సహాయ కార్యక్రమాలపై బాధితులు, అధికారులను ముఖాముఖి అడిగి తెలుసుకున్నారు.

* కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి, ముఖ్యంగా రాజధాని అమరావతికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర సమాచారశాఖ సహాయమంత్రి మురుగన్‌ తెలిపారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి 2040 లక్ష్యంగా బడ్జెట్ కేటాయించామన్నారు. ఆయా ప్రాంతాల్లో 8.2 శాతం ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. కేంద్ర బడ్జెట్ అనంతరం మేధావులు, వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశమయ్యేందుకు విజయవాడ వచ్చిన కేంద్ర మంత్రి మురుగన్‌.. ఓ హోటల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

* పెన్సిల్వేనియా ర్యాలీలో తనపై కాల్పులు జరిపిన చోటే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. సోషల్‌ మీడియా పోస్టులో మా ప్రియమైన ఫైర్‌ఫైటర్‌ కోరే గౌరవార్థం ఆయనను స్మరించుకుంటూ నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహించబోతున్నాను. ర్యాలీ కోసం పెన్సిల్వేనియాలోని బట్లర్‌కు తిరిగి వెళ్తున్నాను. ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయాలను త్వరలో తెలియజేస్తాను’’ అని పేర్కొన్నారు.

* ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)ను బాయ్‌కాట్ చేయాలంటూ నెట్టింట్లో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న కమలా హారిస్‌(kamala harris)కు ఆ ఓటీటీ సహ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్‌ భారీ విరాళం ఇచ్చినట్లు కథనాలు వెలువడటమే అందుకు కారణం. ఆయన సుమారు 7 మిలియన్ల డాలర్లు విరాళం ఇచ్చినట్లు వాటి సారాంశం. ఒక రాజకీయ ప్రచారానికి ఇప్పటివరకు హేస్టింగ్స్ ఇచ్చిన పెద్దమొత్తం ఇదేనని సమాచారం. ‘‘నిరాశకు గురిచేసిన డిబేట్ తర్వాత మేం మళ్లీ గేమ్‌లోకి వచ్చాం’’ అని హారిస్‌ను ఉద్దేశించి హేస్టింగ్స్ వెల్లడించినట్లు తెలుస్తోంది. దాంతో క్యాన్సిల్ నెట్‌ఫ్లిక్స్ హ్యాష్‌ట్యాగ్‌ నెట్టింట్లో ట్రెండ్ అవడం మొదలైంది. ‘‘నేను గతంలోనే ఆ పనిచేశా. మీరు క్యాన్సిల్ చేయకపోతే ఇప్పుడు చేయండి’’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. ‘‘మనకు ఎన్నో ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. దేశభక్తులారా ఏం చేయాలో మీకు తెలుసుగా..? ఆయన మద్దతుకు ప్రతిఫలం అందించండి’’ అంటూ మరొకరు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. వీరంతా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారులని కొన్ని కథనాలు పేర్కొన్నాయి.

* ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌. తాజాగా వెంకటగిరి నుంచి వచ్చిన ఓ ఫిర్యాదుపై తిరుపతి జిల్లా ఎస్పీతో నేరుగా ఫోన్‌లో మాట్లాడారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, భారీ శబ్దం చేసే సైలెన్సర్లను బైక్‌లకు బిగించి వీధుల్లో చక్కర్లు కొట్టే యువతకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని సూచించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు క్షేత్రస్థాయికి వెళ్లి, ఆకతాయి యువకులను పిలిచి వార్నింగ్‌ ఇచ్చారు. వీధుల్లో బైక్‌లు వేగంగా నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.

* రాష్ట్రంలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలకు అంతులేకుండా పోతుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మారుమూల గ్రామానికి వెళ్లి విధ్వంసం చేయడమేంటి? నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడమేంటి? అంటూ మండిపడ్డారు. దన్నానపేటలో వెంకునాయుడు ఇంటిని కూల్చివేయడం సరికాదన్నారు. ‘‘జిల్లాలో ఇటువంటి పరిస్థితులు ఎన్నడూ జరగలేదు. ప్రజాపత్రినిధులు అంటే ఇలాగేనా వ్యవహరించేది?. టీడీపీకి ఓటు వేయకపోతే ఇళ్లు కూల్చేస్తారా?. రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌పై ఎందుకింత కక్ష?. కక్ష సాధించడం కోసమేనా రాజకీయాల్లోకి వచ్చింది’’ అంటూ టీడీపీ నేతల తీరుపై బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు.

* ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం(జులై 27) జరిగిన నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం ముగిసింది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు చేపట్టాల్సిన ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రాల అభివృద్ధి, దేశాభివృద్ధిపై ఈ సమావేశంలో పలువురు సీఎంలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు సరైన దిశలో పయనిస్తున్నామన్నారు. వందేళ్లలో ఒకసారి వచ్చే మహమ్మారిని(కరోనా) ఓడించామని చెప్పారు. అన్ని రాష్ట్రాల సమిష్టి కృషితో 2047 నాటికి వికసిత్‌ భారత్‌ కల నెరవేర్చుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, తాను మాట్లాడుతుండగా మధ్యలో మైక్‌ కట్‌ చేశారని నీతిఆయోగ్‌ సమావేశం నుంచి వెస్ట్‌బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అలిగి వెళ్లిపోయారు. ఎన్డీఏ కీలక భాగస్వామ్యపక్షమైన జేడీయూ నుంచి బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ నీతిఆయోగ్‌కు రాకపోవడం చర్చనీయాంశమైంది. అయితే అనారోగ్యకారణాల వల్లనే నితీశ్‌ రాలేదని జేడీయూ ఓ ప్రకటనలో క్లారిటీ ఇచ్చింది.

* ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశంలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఉన్నపళంగా బయటకు వచ్చి.. వాకౌట్‌ చేస్తున్నట్లు మీడియాకు చెబుతూ వెళ్లిపోయారామె. ‘‘విపక్షాల నుంచి హాజరైంది నేను మాత్రమే. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడనిచ్చారు. మాట్లాడే టైంలో నా మైక్‌ను కట్‌ చేశారు. నీతి ఆయోగ్‌ సమావేశంలో చం‍ద్రబాబు 20 నిమిషాల పాటు మాట్లాడారు. బీజేపీ రాష్ట్రాలకు చాలా టైం ఇచ్చారు. ఇది ప్రాంతీయ పార్టీలను అవమానించడమే. ఇదేం నీతి?. అందుకే నిరసనగా బయటకు వచ్చేశా’’ అని అన్నారామె. అలాగే.. బడ్జెట్‌లో కేంద్రం వివక్ష చూపిందని, బడ్జెట్‌ రాజకీయంగా ఉందని అభిప్రాయపడ్డారామె. ‘‘బడ్జెట్‌ విషయంలో బెంగాల్‌నూ అవమానించారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇవ్వలేదు. ఈసారి బడ్జెట్‌ పూర్తి రాజకీయంగా ఉంది’’ అంటూ ఆమె కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇక.. నీతి ఆయోగ్‌ను రద్దు చేసి స్థానంలో ప్రణాళిక సంఘాన్ని పునరుద్ధరించాలని పేర్కొంటూ ఆమె డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మీటింగ్‌ హాజరై ఆమె కేంద్రాన్ని నిలదీస్తానని ఆమె ప్రకటించారు కూడా. ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి భవన్‌ కల్చరల్‌ సెంటర్‌లో ప్రధాని నేతృత్వంలో నీతి ఆయోగ్‌ భేటీ జరుగుతోంది. ‘వికసిత్ భారత్ – 2047’ ప్రధాన ఎజెండాగా ఈ భేటీ జరుగుతోంది. దీనికి కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అయితే.. బడ్జెట్‌ కేటాయింపుల్లో కేంద్రం వివక్ష ప్రదర్శించిందని ఆరోపిస్తూ ఇండియా కూటమి తరఫున ముఖ్యమంత్రులు(ఆరుగురు) మాత్రం ఈ భేటీని బహిష్కరించారు.

* ప్యారిస్ ఒలింపిక్స్‌లో తొలి రోజు భారత్‌కు షూటింగ్‌లో ఊహించని ఫలితాలు ఎదురయ్యాయి. అయితే ఆఖరిలో మాత్రం భారత్‌కు కాస్త ఊరట లభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్ విభాగంలో మ‌ను భాక‌ర్ ఫైన‌ల్ రౌండ్‌కు ఆర్హ‌త సాధించింది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 580 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన మనూ.. తుది పోరు(మెడ‌ల్ రౌండ్‌)కు క్వాలిఫై అయింది. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌లో మరో భారత షూటర్‌ రిథమ్‌ సంగ్వాన్‌(573 పాయింట్లు) 15వ స్ధానానికే పరిమితమైంది. దీంతో తొలి రోజు షూటింగ్‌లో భారత్ ఈవెంట్‌లు పూర్తయ్యాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్స్‌ జులై 28న మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇక అంతకుముందు 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో ఎలవెనిల్‌ వలరివన్‌- సందీప్‌ సింగ్, రమిత- అర్జున్‌ బబుతా జోడీలు నిరాశపర్చగా.. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ పురుషుల విభాగంలో సరబ్‌జోత్‌ సింగ్, అర్జున్‌ చీమా కూడా ఫైనల్‌కు ఆర్హత సాధించలేకపోయారు.

* ఓల్డ్‌ సిటీ అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. అభివృద్ధి చేయకపోను ఓల్డ్ సిటీ వాసులను దొంగలుగా చిత్రీకరిస్తున్నారంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో పాతబస్తీకి మెట్రో విషయంలో ఇరువురి మధ్య మాటల యుద్ధ జరిగింది. పాతబస్తీలో కరెంటు బిల్లుల వసూళ్ల కోసం ఆదాని సంస్థకు అప్పగించారు. కేవలం పాతబస్తీని ఎందుకు సెలెక్ట్ చేశారు?. సీఎం నియోజకవర్గం కొడంగల్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గం, శ్రీధర్ బాబు నియోజకవర్గం ఎందుకు పైలెట్ ప్రాజెక్టుగా పరిగణలోకి తీసుకోలేదంటూ అక్బరుద్దీన్‌ ప్రశ్నించారు. అక్భరుద్దీన్‌ ప్రశ్నకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానమిస్తూ.. మెట్రో విషయంలో పాతబస్తీని గత ప్రభుత్వం మోసం చేసిందని.. ఎట్టి పరిస్థితుల్లో పాతబస్తీలో మెట్రో నిర్మిస్తామని రేవంత్‌ అన్నారు. అది ఓల్డ్‌సీటీ కాదు.. ఒరిజినల్‌ సిటీ. రెండో విడత మెట్రో విస్తరణపై బీఆర్‌ఎస్‌ కాకి లెక్కలు చెప్పింది. పాతబస్తీలో మెట్రో నిర్మాణం చేపట్టాలని ఎల్‌అండ్‌ టీకి చెప్పాం. లేదంటే చర్లపల్లి, చంచల్‌గూడ జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పానని రేవంత్‌ అన్నారు. ‘‘కాంగ్రెస్‌ బీ ఫామ్‌పై అక్బరుద్దీన్‌ పోటీ చేస్తే కొడంగల్‌లో గెలిపించే బాధ్యత నాది.. డిప్యూటీ సీఎంను చేసి పక్కనే కూర్చోబెట్టుకుంటా’’ అంటూ రేవంత్‌ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌గా.. మజ్లిస్ పార్టీలో తాను సంతోషంగానే ఉన్నానని.. పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. చివరి శ్వాస వరకు ఎంఐఎం పార్టీలోనే కొనసాగుతానంటూ అక్బరుద్దీన్‌ స్పష్టం చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z