Agriculture

మేడిగడ్డ నిండితే భద్రాద్రి రామయ్యకు ముప్పు-NewsRoundup-July 28 2024

మేడిగడ్డ నిండితే భద్రాద్రి రామయ్యకు ముప్పు-NewsRoundup-July 28 2024

* ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున షూటింగ్‌ విభాగంలో 12 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించుతూ.. మను భాకర్‌ (Manu Bhaker) కాంస్యాన్ని కైవసం చేసుకుంది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన మను.. ఇదంతా మాటల్లో వర్ణించలేకపోతున్నానని.. ఓ కలలా ఉందని పేర్కొంది. పతకం సాధించిన సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ.. షూటింగ్‌లో భారత్‌కు చాలా కాలం తర్వాత పతకం వచ్చిందని.. దీన్ని సాధించడం గొప్పగా భావిస్తున్నట్లు తెలిపింది.

* దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) రూపొందించిన తాజా చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr Bachchan). రవితేజ ( Ravi Teja) హీరోగా నటించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌. సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను ఆదివారం నిర్వహించింది. ప్రచార చిత్రం విడుదల అనంతరం టీమ్‌.. మీడియాతో ముచ్చటించింది. రామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) తెరకెక్కించిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double iSmart) అదే డేట్‌కు వస్తుండడాన్ని ఉద్దేశిస్తూ గురుశిష్యుల పోటీనా? అని ఓ విలేకరి ప్రశ్నించగా హరీశ్‌ స్పందించారు. ‘‘నేను దర్శకుడిగా ఎదిగే క్రమంలో ప్రోత్సహించిన దర్శకులు వీవీ వినాయక్‌, రాజమౌళి, పూరి జగన్నాథ్‌. నా సినిమాల్లోని పాటలు, మాటలు నచ్చితే ఫోన్‌ చేసి, అభినందించేవారు. వారు గురువులతో సమానం. పూరి జగన్నాథ్‌తో కలిసి ఎక్కువగా వర్క్‌ చేశా. ఆయనతో పోల్చుకునే స్థాయి కాదు. ఆయన లెజండరీ డైరెక్టర్‌. పలు కారణాల వల్ల ఒకే రోజున మా సినిమాలు విడుదల కానున్నాయి. ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ రిలీజ్‌ డేటే ముందుగా ప్రకటించారు. ఆ తేదీన మా సినిమాని విడుదల చేయాలని మేం అనుకోలేదు. ‘ఆగస్టు 15న విడుదల చేయండి.. మంచి డేట్‌’ అంటూ మైత్రీ మూవీ మేకర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ అధినేత శశి మాకు పదేపదే చెప్పారు. ఒక్క సినిమా క్లాష్‌ అయినంత మాత్రాన పూరి జగన్నాథ్‌కు, నాకు మధ్య మాటలుండవని అనుకోను. ఆయన నాకంటే మెచ్యూర్‌’’ అని సమాధానమిచ్చారు.

* లెబనాన్‌ వైపు నుంచి హెచ్‌బొల్లా (Hezbollah) ప్రయోగించిన రాకెట్లు మాజ్‌దల్‌ షామ్స్‌ అనే ప్రాంతంలో 12 మంది ఇజ్రాయెలీ (Israel) పిల్లలు, యువత ప్రాణాలు బలిగొన్నాయి. ఈ ఘటనతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఈ పిల్లల హత్యకు హెజ్‌బొల్లాపై తీవ్ర స్థాయిలో ప్రతీకారం తీర్చుకొంటామని ప్రధాని నెతన్యాహు హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం సీనియర్‌ సైనికాధికారులతో భేటీ అయ్యారు. అక్టోబర్‌ 8వ తేదీ నుంచి ఇజ్రాయెల్‌-లెబనాన్‌ మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. నాటి నుంచి ఇదే హెజ్‌బొల్లా అతిపెద్ద దాడి. ఈ ఘటన తర్వాత ఇజ్రాయెల్‌ చూస్తూ కూర్చోదని నెతన్యాహు పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ చూడనంత మూల్యం హెజ్‌బొల్లా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

* ఎర్ర కాలువ ముంపు వల్ల తూర్పుగోదావరి జిల్లాలో నష్టపోయిన పంట పొలాలను మంత్రుల బృందం పరిశీలించింది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌లతో కూడిన మంత్రుల బృందం ఉండ్రాజవరం, నిడదవోలు మండల్లాల్లోని పలు గ్రామాల్లో ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించింది. జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి పంట నష్టం వివరాలను మంత్రులకు వివరించారు. తాళ్లపాలెం గ్రామంలో వరద ముంపు వల్ల ఇళ్లలోకి నీరు చేరడంతో నష్టపోయిన బాధితులకు మంత్రులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

* ‘పుష్ప’ (Pushpa)తో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు నటి రష్మిక (Rashmika). కొన్నిరోజుల క్రితం కేరళలో జరిగిన ఓ పబ్లిక్‌ ఈవెంట్‌లో ఆమె సందడి చేశారు. ఆమెను చూసేందుకు దాదాపు రెండువేలమంది అభిమానులు తరలివచ్చారు. దీనిపై తాజాగా రష్మిక స్పందించారు. అభిమానులను ఉద్దేశించి ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా పోస్ట్‌ పెట్టారు. ‘‘ఓ కార్యక్రమంలో భాగంగా జులై 25న కేరళలోని కరునాగపల్లికి వెళ్లా. కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. వాళ్లు నాపై చూపించిన ప్రేమ చూసి ఆశ్చర్యపోయా. అంత ప్రేమను అస్సలు ఊహించలేదు. వారి అభిమానంతో నా హృదయం నిండింది. నన్ను ఆరాధిస్తున్నందుకు, కేర్‌ తీసుకున్నందుకు థ్యాంక్యూ. ఇంతమంది ప్రేమ పొందేందుకు ఏం చేశానో తెలియదు. కానీ, సంతోషంగా ఉన్నా. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’’ అని రాసుకొచ్చారు.

* వైకాపా అధ్యక్షుడు జగన్‌పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానని అనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు జగన్‌ను ఉద్దేశించి సోషల్‌ మీడియాలో షర్మిల పోస్ట్‌ చేశారు. ‘‘సిగ్గు సిగ్గు!! ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతానని అనడం మీ అజ్ఞానానికి నిదర్శనం. ఇంతకుమించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడా కనబడదు. మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు. కానీ.. మిమ్మల్ని ఎన్నుకుని, అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా, వింతగా మోసం చేయడం.. ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళాకోరుతనం.”

* ఎన్నికల సమయంలో విశాఖపోర్టుకు అక్రమంగా బ్రెజిల్‌ నుంచి వచ్చిన మాదకద్రవ్యాలతో కూడిన కంటెయినర్‌ కేసు ఏమైందో ప్రభుత్వం విచారణ చేపట్టాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. సుమారు 25 కిలోల చొప్పున వేయి బ్యాగులను కంటెయినర్‌లో మాదకద్రవ్యాలతో కూడి సరుకు విశాఖ పోర్టుకు రాగా… కేంద్ర దర్యాప్తుసంస్ధ సీబీఐతో పాటు ఇంటర్‌పోల్‌ పట్టుకున్న విషయాన్ని బొత్స గుర్తుచేశారు. గతంలో మేం అధికారంలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వమే చేసిందని…. ఆరోపణలు కూడా చేశారని… అధికార పక్షంతో పాటు విపక్షంలో ఉన్నవారు కూడా వీటిపై పరస్పర ఆరోపణలు చేసుకున్నారన్నారు. ఈ వ్యవహరంలో భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి బంధువులకు చెందిన సంధ్యా ఆక్వా ఎక్ట్స్‌పోర్ట్‌ లిమిటెడ్‌ సంస్ధ దిగుమతి చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చిన విషయాన్ని బొత్స గుర్తుచేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఒకవైపు అధికారులు విచారణ చేపట్టడంతో పాటు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో ఉత్తరాంధ్రాకు చెందిన ఎంపీలు దీనిపై పార్లమెంట్‌లో ప్రశ్నించాలని ఆయన డిమాండ్‌ చేసారు. రూ.25వేల కోట్లకు సంబంధించిన వ్యవహారంపై వాస్తవాలు ఏమిటి? ఇందులో ఎవరిపాత్ర ఉంది? నిందితులను ఎందుకు ఉపేక్షిస్తున్నారో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ విచారణలో ఆ ఆరోపణలు వాస్తవం కాకపోతే విశాఖపట్నం క్లీన్‌ ఇమేజ్‌ నిలబడుతుందన్నారు.

* ఢిల్లీ కోచింగ్‌ సెంటర్‌ ఘటనపై ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ప్రభుత్వ సంస్థల బాధ్యతారాహిత్యానికి సామాన్య ప్రజలు మూల్యం చెల్లించకుంటున్నారని మండిపడ్డారు. భారీ వర్షాల కారణంగా సివిల్స్‌ శిక్షణా కేంద్రంలోకి వరద పోటెత్తి ముగ్గురు అభ్యర్థులు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాల పట్ల రాహుల్‌ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘ఢిల్లీలోని ఓ భవనం బేస్‌మెంట్‌లో నీరు చేరి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మృతి చెందడం చాలా బాధాకరం. గతంలో వర్షాలకు విద్యుత్‌ షాక్‌ కారణంగా ఓ విద్యార్థి మృతి చెందాడు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ ఘటన వ్యవస్థల వైఫల్యం. అసురక్షిత నిర్మాణం, పేలవమైన భవన నిర్మాణ ప్రణాళిక, సంస్థల బాధ్యతారాహిత్యం వల్ల సామాన్య పౌరులు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. సురక్షితమైన, సౌకర్యవంతమైన జీవితం ప్రతీ పౌరుడి హక్కు. దాన్ని అందించడం ప్రభుత్వాల బాధ్యత’’ అంటూ రాహుల్‌ ట్విట్‌ చేశారు.

* కాళేశ్వరంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు తప్ప మిగిలిన అన్ని బ్యారేజీలు నింపుతామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం(జులై 28) జలసౌధలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్‌ మాట్లాడారు. ‘కాళేశ్వరం లో మూడు బ్యారేజీలు తప్ప మిగతా అన్ని రిజర్వాయర్లను వాడుకుంటాం. కాళేశ్వరం నీళ్లు రాక ఉత్తర తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడితే దానికి కారణం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల మూడు బ్యారేజీలు డ్యామేజ్ అయ్యాయి. కేటీఆర్‌ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. కేటీఆర్ జోసఫ్ గోబెల్స్ కి మించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల్లో నీళ్లు ఆపితే జరిగే ప్రమాదానికి ఎవరు భాధ్యత వహిస్తారు. ప్రమాదం జరిగితే భద్రాచలం రాముడి గుడి కూడా మునుగుతుంది. ప్రపంచంలో ఎక్కడా మూడు, నాలుగు టీఎంసీల కంటే ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన బ్యారేజీలు లేవు. ప్రచారం కోసం, కమిషన్ల కోసం పెద్ద బ్యారేజీలు కట్టి కుంగగొట్టారు. లక్ష కోట్ల కుంభకోణంలో కేసీఆర్ అండ్ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇరిగేషన్ శాఖలో ఇక నుంచి ఒక కొత్త చాప్టర్ మొదలు పెడుతున్నాం’అని చెప్పారు.

* ఏపీలో కూటమి ప్రభుత్వంలో పచ్చ మూకలు రెచ్చిపోతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్‌ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. అలాగే, దాడులకు నైతిక బాధత్య వహించి హోం మంత్రి అనిత రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘హోం మంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదు. ‘బొల్లి’ మాటలతో కాలక్షేపం చేయడం వల్లనే, రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. బయటకు వస్తే, ఏమవుతుందో తెలియని దారుణ స్థితి నెలకొంది. దీనికి బాధ్యత హోం మంత్రిదే. హత్యలు జరగకుండా చూడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది ఇది హోం మంత్రి వైఫల్యం. నైతిక భాద్యత వహించి రాజీనామా చెయ్యాలి. ప్రభుత్వ వైఫల్యంపై కూడా గవర్నర్ విచారణకు ఆదేశించాలి’ అంటూ కామెంట్స్‌ చేశారు.

* తెలుగు ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడిగా భరత్‌ భూషణ్‌ ఎన్నికయ్యారు. వైస్‌ ప్రెసిడెంట్‌గా అశోక్‌ కుమార్‌ గెలిచారు. ఆదివారం ఉదయం జరిగిన ఫిలిం ఛాంబర్‌ (టీఎఫ్‌సీసీ) ఎన్నికల్లో మొత్తం 48 మంది సభ్యులు పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టగా అధ్యక్ష బరిలో ఉన్న భరత్‌ భూషణ్‌కు 29 ఓట్లు, ఠాగూర్‌ మధుకు 17 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్ష బరిలో ఉన్న అశోక్‌ కుమార్‌కు 28 ఓట్లు, వైవీఎస్‌ చౌదరికి 18 ఓట్లు వచ్చాయి. కాగా గతేడాది నిర్మాతల విభాగం నుంచి దిల్‌ రాజు టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా గెలుపొందారు. ఆయన పదవీకాలం ముగియడంతో నేడు మళ్లీ ఎలక్షన్స్‌ నిర్వహించారు. అయితే ఈసారి డిస్ట్రిబ్యూటర్‌ విభాగం నుంచి ఠాగూర్‌ మధు (నెల్లూరు), భరత్‌ భూషణ్‌ (విశాఖపట్టణం) బరిలో నిలిచారు. ఉపాధ్యక్ష పదవికి మాత్రం నిర్మాతలైన అశోక్‌ కుమార్‌, వైవీఎస్‌ చౌదరి పోటీపడ్డారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, స్టూడియోల యజమానులు వంటి నాలుగు సెక్టార్స్‌లోని సభ్యులు ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.

* సెంట్రల్‌ ఢిల్లీలోని రావ్‌ ఐఏఎస్‌ స్టడీ సెంటర్‌లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనపై విద్యార్థులు పెద్దఎత్తున నిరసన తెలుపుతున్నారు. తాజాగా రావ్‌ ఐఏఎస్ స్టడీ సెంటర్‌ ఓనర్‌ అభిషేక్‌ గుప్తా, కో-ఆర్డినేటర్ దేశ్‌పాల్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆదివారం తెల్లవారుజామున ఘటనా స్థలంలో ఇద్దరు విద్యార్థినులు, ఒక విద్యార్థి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనలో ఓనర్‌ అభిషేక్ గుప్తా, కో-ఆర్డినేటర్ దేశ్‌పాల్ సింగ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z