* ‘ఎక్కడ చూసినా సీసీ కెమేరాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చైనా నుంచి వచ్చిన విడిభాగాలతో, చిప్‌లతోనే ఇక్కడ తయారయ్యాయి. అంటే, ఆ దేశం అనుకుంటే, మన దగ్గర ప్రతి వీధినీ చూడగలదు. ఇది ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు’ అని హెచ్‌సీఎల్ సహ వ్యవస్థాపకులు, ఎపిక్ ఫౌండేషన్ ఛైర్మన్ అజయ్ చౌధ్రీ అన్నారు. ‘గత 15 ఏళ్లుగా ఒక్క భారతీయ ఎలక్ట్రానిక్స్ బ్రాండూ కనిపించడం లేదు. ఇతర దేశాల నుంచి వచ్చిన బ్రాండ్లకు ఇక్కడి ముద్ర వేస్తున్నారు. భారత్‌లో తయారవుతున్నాయని అనుకుంటున్న ఉత్పత్తులన్నీ ఇక్కడ సేవలను మాత్రమే ఉపయోగించుకుంటున్నాయి. కొత్తగా విలువను జోడించడం లేదు. దేశంలో సెమీకండక్టర్లు తయారు చేసినా, భారతీయ బ్రాండ్లు లేకపోతే వాటిని కొనడానికి ఎవరూ ముందుకురారు’ అని ఆయన వివరించారు.
* డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ.7,672 కోట్ల ఆదాయం, రూ.1,392 కోట్ల నికరలాభం నమోదు చేసింది. త్రైమాసిక ఈపీఎస్ రూ.83.46 ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.6,738 కోట్లు, నికరలాభం రూ.1,402 కోట్లు, ఈపీఎస్ రూ.84.22 ఉన్నాయి. దీంతో పోల్చితే ప్రస్తుత మొదటి త్రైమాసికంలో ఆదాయం 14 శాతం పెరిగింది. నికరలాభం 1 శాతం తగ్గింది. 2024-25 మొదటి త్రైమాసికంలో ఉత్తర అమెరికా ఆదాయాలు 20 శాతం పెరిగినట్లు డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. ఐరోపా ఆదాయాల్లో 4 శాతం, మనదేశంలో 15 శాతం వృద్ధి నమోదైంది. రష్యా, సీఐఎస్ (కామన్‌వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్) ఆదాయాలు స్వల్పంగా తగ్గాయి. ఫార్మాసూటికల్ సర్వీసులు, యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ (పీఎస్‌ఏఐ) ఆదాయాలు 14 శాతం పెరిగాయి. సమీక్షిస్తున్న త్రైమాసికంలో డాక్టర్ రెడ్డీస్ వివిధ దేశాల్లో 11 డీఎఫ్‌ఎం (డ్రగ్ మాస్టర్ ఫైల్స్)లు దాఖలు చేసింది. నూతన ఆర్థిక సంవత్సరాన్ని మంచి ఆదాయాలతో ప్రారంభించినట్లు ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ సహ-ఛైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ అన్నారు. జనరిక్ ఔషధాల వ్యాపారం ఆకర్షణీయంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. బయోలాజిక్స్, కన్జూమర్ హెల్త్‌కేర్, పరిశోధన-అభివృద్ధి విభాగాల్లో వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించారు.
* ఉక్కు గిరాకీపై కేంద్రం ఆశావహంగా ఉంది. 2030 కల్లా దేశీయ ఉత్పత్తి 300 మిలియన్ టన్నులను అధిగమించగలదని ఉక్కు శాఖ కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా అంచనా వేశారు. కర్బన నియంత్రణ పనుల వల్ల భవిష్యత్‌లో సామర్థ్య విస్తరణకు ఎటువంటి ఇబ్బందులూ కనిపించడం లేదన్నారు. త్వరలోనే ఉక్కు రంగంలో కర్బన ఉద్గారాల తగ్గింపుపై ప్రజల సూచనలు కోరేందు కోసం ఒక ముసాయిదాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. మొత్తం ఉద్గారాల్లో ఉక్కు పరిశ్రమ వాటా 12 శాతంగా ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి ఐసీఐసీఐ బ్యాంక్ ఏకీకృత పద్ధతిలో రూ.11,695.84 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే సమయంలో నమోదైన రూ.10,636.12 కోట్లతో పోలిస్తే లాభం 10 శాతం పెరిగింది. ట్రెజరీ లాభాలు ఇందుకు దోహదం చేశాయి. అయితే బ్యాంకుకు కీలకమైన నికర వడ్డీ ఆదాయం 7.3% తగ్గి రూ.19,553 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఎం) 0.4 శాతం తగ్గి 4.36 శాతానికి చేరడం ఇందుకు కారణమైంది. దేశీయ రుణాల మంజూరులో సుమారు 16 శాతం వృద్ధి ఉంది. వడ్డీయేతర ఆదాయం (ట్రెజరీ ఆదాయాలు మినహా) 23% పెరిగి రూ.6,389 కోట్లకు చేరింది. ట్రెజరీ లాభాలు ఏడాదిక్రితం నాటి రూ.252 కోట్ల నుంచి రెట్టింపునకు పైగా పెరిగి రూ.613 కోట్లకు చేరాయి. ‘గత ఐదు త్రైమాసికాలుగా నికర వడ్డీ మార్జిన్ తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ తగ్గుదల ప్రక్రియ ఆగిపోయింది. ఇక మీదట లాభంపై ఎన్‌ఐఎం ప్రభావం ఒక శ్రేణికి లోబడి ఉంటుంద’ని ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు సందీప్ బాత్రా తెలిపారు. అయితే మున్ముందు ఎన్‌ఐఎం ఎంత మేర ఉండొచ్చనే అంచనాలను ఆయన వెల్లడించలేదు.
* గత ఏడాది ఏప్రిల్- డిసెంబరులో పెప్సీకో ఇండియా హోల్డింగ్స్ ఏకీకృత ఆదాయం రూ.5,954.16 కోట్లుగాను, నికర లాభం రూ.217.26 కోట్లుగా నమోదైంది. ఇతర ఆదాయంతో కలిపి మొత్తం ఆదాయం రూ.6,094.70 కోట్లు అని వ్యాపారాలు, కంపెనీల రీసెర్చ్ ప్లాట్‌ఫామ్ టోఫ్లెర్ వద్ద లభ్యమవుతున్న గణాంకాల ప్రకారం తెలుస్తోంది. పెప్సీకో ఇండియా తన ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్- మార్చి నుంచి జనవరి- డిసెంబరుకు మార్చింది. అందువల్ల 2023 సంవత్సరానికి మూడు త్రైమాసికాల ఫలితాలను ఒకటేసారి కలిపి చెబుతోంది. అలాగే 2024 జనవరి నుంచి క్యాలండర్ సంవత్సరాన్నే ఆర్థిక సంవత్సరంగా పాటించనుంది. స్టాక్ ఎక్స్ఛేంజీలో ఈ సంస్థ నమోదుకాలేదు.
* గత 14 ఏళ్లలో తొలిసారిగా కోల్ ఇండియా తన భూగర్భ బొగ్గు ఉత్పత్తిలో ప్రతికూల ధోరణి నుంచి బయటపడింది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 26.021 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీసినట్లు ఛైర్మన్ పీఎం ప్రసాద్ వార్షిక నివేదికలో తెలిపారు. 2022-23లో వెలికి తీసిన 25.487 మి.టన్నుల బొగ్గుతో పోలిస్తే ఇది 2.10 శాతం అధికం. ఆధునిక సాంకేతికత, పరికరాలు ఉత్పత్తి ధోరణిని ప్రతికూలం నుంచి సానుకూలానికి మార్చాయని అధికారులు తెలిపారు. మాస్ ప్రొడక్షన్ టెక్నాలజీని ఉపయోగించి అండర్ గ్రౌండ్(యూజీ) యాంత్రీకరణను మెరుగుపర్చడానికి కోల్ ఇండియా 6 నిరంతర మైనర్‌లను ఏర్పాటు చేసింది. అదనంగా ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్), వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్), సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్‌ఈఎస్‌ఎల్)లో 2023-24లో 3 హైవాల్ మైనర్‌లను ప్రారంభించింది. గత ఆర్థిక సంవత్సరంలో వినియోగంలో లేని 11 గనులను ఆదాయ భాగస్వామ్య నమూనాలో ప్రైవేటు రంగ బిడ్డర్లకు కోల్ ఇండియా అప్పగించింది. ఈ గనుల్లో ఏడాదికి 17.86 మి.టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండగా, వీటి నుంచి మొత్తం 267.54 మి.టన్నుల బొగ్గును వెలికి తీసే అవకాశం ఉంది.
* పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) జూన్ త్రైమాసికంలో రూ.3,252 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభం రూ.1,255 కోట్లతో పోలిస్తే భారీగా పెరిగినట్లయింది. మొత్తం ఆదాయం రూ.28,579 కోట్ల నుంచి రూ.32,166 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం రూ.25,145 కోట్ల నుంచి రూ.28,556 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం రూ.9,504 కోట్ల నుంచి 10.23 శాతం పెరిగి రూ.10,476 కోట్లకు చేరింది. ఆస్తుల నాణ్యతకొస్తే స్థూల ఎన్‌పీఏలు(జీఎన్‌పీఏలు) 7.73% నుంచి 4.98 శాతానికి; నికర ఎన్‌పీఏలు 1.98% నుంచి 0.60 శాతానికి పరిమితమయ్యాయి. దీంతో మొండి బకాయిలకు కేటాయింపులు కూడా రూ.4,374 కోట్ల నుంచి రూ.792 కోట్లకు తగ్గాయి. ఏకీకృత ప్రాతిపదికన బ్యాంకు నికర లాభం రూ.1,342 కోట్ల నుంచి రూ.3,976 కోట్లకు పెరిగింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z