* లోక్‌సభ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. బడ్జెట్‌పై ప్రసంగం వేళ విపక్షనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం చెలరేగింది. ఇద్దరు ప్రముఖ పారిశ్రామికవేత్తలు దేశంలోని మౌలిక సదుపాయాలను నియంత్రిస్తున్నారని రాహుల్ వ్యాఖ్యానించడం ఇందుకు కారణమయ్యింది.
* వరదల కారణంగా దిల్లీ (Coaching Centre tragedy)లో ముగ్గురు సివిల్స్ విద్యార్థుల మృతి సంచలంగా మారింది. నగర అధికారులు, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందంటూ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారి మరణాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సివిల్స్ విద్యార్థి ఒకరు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్‌కి లేఖ రాశాడు.
* వైకాపా అధ్యక్షుడు జగన్ మూర్ఖత్వానికి ఆయన్ను మ్యూజియంలో పెట్టాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయాలని చెబితే.. ఆయనకు కొమ్ముకాసినట్లుందా?అని ప్రశ్నించారు. జగన్ అద్దంలో చూసుకుంటే ఇప్పుడు కూడా ఆయనకు చంద్రబాబే కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
* తెలంగాణలో రెండో విడత రుణమాఫీ ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. అసెంబ్లీ ప్రాంగణం నుంచి సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హాజరు కానున్నారు. రెండో విడతలో లక్షన్నర వరకు రైతుల రుణాలు మాఫీ చేయనున్నారు.
* పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ త్రుటిలో ఒక పతకం చేజార్చుకుంది. షూటింగ్ (Shooting) 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల ఫైనల్‌లో అర్జున్ బబుతా 208.4 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఒకదశలో రెండో స్థానంలో నిలిచిన అర్జున్ తర్వాత నాలుగో స్థానానికి పడిపోయి పతకాన్ని చేజార్చుకున్నాడు.
* అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాల దహనం కేసులో కొందరు అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. పూర్వ ఆర్డీవో మురళి, ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఉత్తర్వులు జారీ చేశారు.
* భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో అధికారులు మూడు గేట్లను 10 అడుగుల మేర గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 878.40 అడుగులు ఉంది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అప్పు (Centre debt) రూ.185 లక్షల కోట్లకు చేరనుంది. విదేశీ రుణాలతో కలుపుకొని ప్రస్తుత ధరల వద్ద ఈ మొత్తానికి చేరొచ్చని కేంద్రం అంచనా వేసింది. ఇది దేశ జీడీపీలో 56.8 శాతానికి సమానమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి వెల్లడించారు.
* ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన ఖరీదైన బ్లాక్ లక్సెస్ కారుతో ఏకంగా నడుములోతు నీటిలోకి వెళ్లారు. ఇదంతా ఎందుకని అంటారా..? దేశంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వచ్చిన వరదల పరిస్థితిని అంచనావేసేందుకు ఆయన అలా చేయాల్సివచ్చింది.
* ఓ పక్క ఫ్రాన్స్‌లో విశ్వ క్రీడలు (Olympics 2024) జరుగుతుండగా.. మరో వైపు ఆ దేశ మౌలిక వసతులపై దాడులు తీవ్రమయ్యాయి. తాజాగా ఆ దేశానికి చెందిన రెండు దిగ్గజ టెలికాం కంపెనీల వనరులను గుర్తుతెలియని వ్యక్తులు పలు చోట్ల ధ్వంసం చేశారు.
* పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ త్రుటిలో ఒక పతకం చేజార్చుకుంది. షూటింగ్ (Shooting) 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల ఫైనల్‌లో అర్జున్ బబుతా 208.4 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఒకదశలో రెండో స్థానంలో నిలిచిన అర్జున్ తర్వాత నాలుగో స్థానానికి పడిపోయి పతకాన్ని చేజార్చుకున్నాడు. అర్జున్ తన 13వ షాట్‌కు 9.9 పాయింట్లే సాధించాడు. తర్వాత పుంజుకున్న అతడు.. మళ్లీ 18వ షాట్‌కు 10.1 పాయింట్లు సాధించి నాలుగో స్థానానికి పడిపోయాడు. చివరి షాట్‌కు అర్జున్ 10.5 పాయింట్లు సాధిస్తే పతకం సాధించేవాడు. కానీ, 9.5 పాయిట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచాడు.
* సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారం చిత్ర పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది. అగ్ర నిర్మాణ సంస్థల పేరు చెప్పి, అవకాశాలు ఇప్పిస్తామంటూ సైబర్ నేరగాళ్లు అమాయకులకు వల వేస్తున్నారు. అది నిజమేనని మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Stdios) ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. తమ ప్రొడక్షన్ హౌస్ పేరుపై కొత్త నటీనటుల ఎంపిక అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరింది. ఇలాంటి వాటి బారిన పడవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం, డబ్బులు పంపడం చేయొద్దని తెలిపింది. అలాగే ఫేక్ ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తమ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే ఏ సమాచారమైనా అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలు, వెబ్‌సైట్ ద్వారానే పంచుకుంటామని తెలిపింది.
* ఎనిమిది పదుల వయసులోనూ విశ్రాంతి తీసుకోకుండా.. వరుస సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan). సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆయన తాజాగా ఓ ఆసక్తికర వీడియో షేర్ చేశారు. 1990లో తాను హీరోగా నటించిన ‘అగ్నిపథ్’లో రన్నింగ్ చేస్తున్న ఓ సన్నివేశాన్ని.. ఇటీవల తన నివాసంలో పరిగెడుతున్న మరో క్లిప్‌ను కలిపి దీనిని క్రియేట్ చేశారు. ‘‘అగ్నిపథ్’ నుంచి ఇప్పటికీ పని కోసం పరిగెడుతున్నా’’ అని క్యాప్షన్ జత చేశారు. దీనిపై పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు స్పందించారు. అమితాబ్‌ను మెచ్చుకున్నారు. హీరో రణ్‌వీర్ సింగ్ స్పందిస్తూ.. ‘‘ది సిగ్నేచర్ రన్నింగ్ స్టైల్’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ వయసులోనూ వర్క్ పట్ల మీరు చూపిస్తున్న నిబద్ధత మాలో స్ఫూర్తి నింపింది’’ అని పేర్కొన్నారు.
* దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన దిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన (Coaching Centre tragedy) లోక్‌సభ (Lok Sabha)లో చర్చకు వచ్చింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేసిన విపక్షాలు.. కోచింగ్ సెంటర్ల మాఫియాపై మోదీ సర్కార్ చర్యలు తీసుకుంటుందా? అని ప్రశ్నించాయి. ఇందుకు స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan).. నేరుగా సమాధానం చెప్పలేదు. ప్రశ్నోత్తరాల సమయంలో దిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనను కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కేసీ వేణుగోపాల్ ప్రస్తావించారు. ముగ్గురు విద్యార్థుల మరణానికి కారణమైన భవనాన్ని చట్టపరమైన అనుమతి తీసుకోకుండానే నిర్మించారని.. ఇలా నగరంలో తిష్ఠ వేసిన కోచింగ్ సెంటర్ల మాఫియాలపై కేంద్రం చర్యలు చేపడుతుందా? అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్.. ‘‘దేశంలోని ఐఐటీలు, ఐఐఎంల వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో 2018-22 మధ్యకాలంలో 80 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుల వివక్ష ఇందుకు ప్రధాన కారణం’’ అని విద్యాశాఖ ఇటీవల లిఖితపూర్వక సమాధానం ఇచ్చిందన్నారు.
* ఏపీ మంత్రివర్గ సమావేశం ఆగస్టు 2 నిర్వహించనున్నారు. ఉదయం 11గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశముంది.
* కేంద్ర బడ్జెట్‌పై విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు కేంద్ర మంత్రులు దీటుగా స్పందించారు. ఈ క్రమంలో దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశమైన ‘అగ్నిపథ్’ పథకాన్ని రాహుల్ గాంధీ తప్పుదోవ పట్టిస్తున్నారని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇదే అంశంపై పార్లమెంటులో ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉన్నాట్టు తెలిపారు. మరోవైపు బడ్జెట్‌పైనా విపక్ష నేత అపోహలు వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనిపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇస్తారని అన్నారు.
* భారత్-చైనా (India-China) మధ్య సంబంధాలు మెరుగ్గా లేవని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar) తెలిపారు. అయితే, ఈ సమస్యను తామే పరిష్కరించుకోగలమని, ఇందులో మూడో దేశం ప్రమేయం అక్కర్లేదని వెల్లడించారు. క్వాడ్ (QUAD) దేశాల విదేశాంగ మంత్రుల స్థాయి సదస్సు నిమిత్తం జపాన్ పర్యటనలో ఉన్న ఆయన.. టోక్యోలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా చైనాతో సరిహద్దు వివాదం అంశాన్ని ప్రస్తావించారు.
* సీఎం రేవంత్‌రెడ్డి… మూడు సమావేశాల్లోనూ సభను తప్పుదోవ పట్టించారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ప్రభుత్వం డిఫెన్స్‌లో పడగానే ఒక కాగితం తీసుకొచ్చి చర్చను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గతంలో గోదావరి జలాలకు సంబంధించి విశ్రాంత ఇంజినీర్ల నివేదికను ప్రస్తావించారని, మేడిగడ్డ సాధ్యం కాదని వారు చెప్పలేదని అన్నారు. మీడియాతో ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ మేడిగడ్డ నుంచి నేరుగా ఎల్లంపల్లికి నీరు తరలించవద్దని మాత్రమే విశ్రాంత ఇంజినీర్లు చెప్పారు. సీఎం ఉద్దేశపూర్వకంగా కొన్ని మాత్రమే చదివి మిగతా వాటిని విస్మరిస్తున్నారు. విద్యుత్ మీటర్ల విషయంలో సీఎం మూడు పదాలు ఎగరగొట్టి చదివారు. సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేస్తాం. పోతిరెడ్డిపాడు విషయంలోనూ సభను సీఎం తప్పుదోవ పట్టించారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే వైఎస్ మంత్రి వర్గం నుంచి అప్పట్లో తప్పుకొన్నాం.
* భారీ వర్షాలకు వరదనీరు పోటెత్తడంతో వారం రోజులుగా కోనసీమ లంక గ్రామాలు జలదిగ్బంధంలోనే బిక్కుబిక్కుమంటున్నాయి. పి.గన్నవరం, సఖినేటిపల్లి, మామిడికుదురు, కొత్తపేట, అల్లవరం, ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాలతో పాటు ముమ్మడివరం మండలంలోని గురజాపులంక, లంక ఆఫ్ ఠానేలంక, కూనలంక జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నదీ కోత, ముంపు భయంతో పొట్టిలంక వాసులు భయం గుప్పిట్లో వణుకుతున్నారు. ఐనవిల్లి లంక వాసులు వారం రోజులుగా పడవల్లోనే రాకపోకలు కొనసాగిస్తున్నారు. దీంతో వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి అండగా నిలుస్తోంది.
* అన్నమయ్య జిల్లా మదనపల్లె ఘటన కుట్రకోణంలోనే జరిగిందని.. సబ్ కలెక్టరేట్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం లేదని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దస్త్రాల దహనం ఘటనపై వాచ్‌మెన్‌ను విచారించా. ఘటన జరిగిన 15 నిమిషాల్లోనే అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. అప్పటికే సబ్ కలెక్టరేట్‌లో కిటికీలు, అద్దాలు పగిలిపోయాయి. రసాయనం వాడకుండా భారీగా మంటలు వచ్చే అవకాశం లేదు. కార్యాలయంలోకి మోటార్ ఆయిల్ తెచ్చి ఉంటారు. కార్యాలయంలో కొన్ని తప్పుడు దస్త్రాలు ఉన్నట్లు తెలిసింది. తహసీల్దార్ నివేదికలు, సంతకం ఫోర్జరీ చేసినట్లు తేలింది. చుక్కల భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించాం. చుక్కల భూముల్లో 14వేల ఎకరాలు ఒకేసారి ఫ్రీహోల్డ్ అయ్యాయి. ఈ భూములన్నీ ప్రైవేటు వ్యక్తులకే కట్టబెట్టారు’’ అన్నారు.
* మందార పువ్వుతో చేసిన టీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటూ నయనతార పెట్టిన పోస్ట్ నెట్టింట చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. విమర్శలు రావడంతో తొలగించిన ఆమె తాజాగా ఇన్‌స్టాలో ఆసక్తికర సందేశాన్ని పంచుకున్నారు. ‘‘తెలివి తక్కువ వారితో వాదించవద్దు. ఆ విధంగా మిమ్మల్ని వారి స్థాయికి తీసుకువెళ్లి, ఓడిస్తారు’’ అని అమెరికన్ రైటర్ మార్క్ ట్వైన్ సూక్తిని షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. తనని విమర్శించిన వారిని ఉద్దేశించే ఈవిధంగా పెట్టారని పలువురు భావిస్తున్నారు. మందారపువ్వులతో చేసే టీ గురించి పోస్ట్ పెట్టారు. ఆ టీ తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుందని.. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది ఉపశమనం కలిగిస్తుందన్నారు. దీనిపై ఓ వైద్యుడు స్పందించాడు. ది లివర్ డాక్టర్ అనే ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. 8.7 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను ఆమె తప్పుదోవ పట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆమె మాటల్లో నిజం లేదని పేర్కొన్నాడు. ఆయన ట్వీట్ వైరల్‌గా మారడంతో నయనతార తన పోస్ట్‌ను తొలగించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z