Health

కాలేయం గడ్డలు కడుతుంది చూసుకోండి!

కాలేయం గడ్డలు కడుతుంది చూసుకోండి!

కాలేయం మొండి అవయవం. కొంత భాగం దెబ్బతిన్నా తిరిగి కోలుకోగలదు. ఇంతటి కాలేయమూ కొన్నిసార్లు గట్టిపడొచ్చు (సిరోసిస్‌). ఇది చాలా తీవ్రమైన సమస్య. దీనికి రకరకాల అంశాలు కారణమవుతుంటాయి. ఇందులో ఏర్పడిన మచ్చ భాగం నెమ్మదిగా ఆరోగ్యంగా ఉన్న కణజాలానికీ విస్తరిస్తుంది. క్రమంగా రక్త ప్రసరణకు అడ్డుతగులుతుంది. దీంతో కాలేయం చేయాల్సిన పనులు కష్టమవుతాయి. విషతుల్యాల వడపోత, పోషకాలు, మందుల విభజన, ప్రొటీన్ల తయారీ వంటి పనులన్నీ పడకేస్తాయి. చివరికి కాలేయం పూర్తిగా పనిచేయలేని స్థితికి చేరుకుంటుంది.

కాలేయం గట్టిపడుతున్నా మొదట్లో పెద్దగా లక్షణాలేవీ ఉండవు. సమస్య తీవ్రం అవుతున్నకొద్దీ త్వరగా అలసిపోవటం, ఆకలి తగ్గటం వంటివి మొదలవుతాయి. చర్మం పాలిపోవచ్చు, దురద పెట్టొచ్చు, కమిలిపోవచ్చు. మూత్రం ముదురు రంగులోకి మారుతుంది. ఒంట్లోంచి బయటకు వెళ్లకుండా ఉన్న ద్రవాలు పేరుకోవటం వల్ల కడుపు, కాళ్లు ఉబ్బుతాయి. కొందరికి వికారంగా అనిపించొచ్చు. కొన్నిసార్లు మెదడు మొద్దుబారొచ్చు. మతిమరుపు ఆరంభం కావొచ్చు. కాలేయం గట్టిపడటానికి రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. వీటి గురించి తెలుసుకుంటే ముందుగానే జాగ్రత్త పడటానికి వీలుంటుంది.

అతిగా మద్యం తాగటం వల్ల కాలేయం ఉబ్బుతుంది. కాలేయానికి కొవ్వు పడుతుంది. ఇది చివరికి కాలేయం గట్టిపడటానికి దారితీస్తుంది. అయితే ఇది నెమ్మదిగా కొనసాగుతూ వచ్చేది కావటం వల్ల చాలామంది దీన్ని గుర్తించలేరు. కొందరు మద్యం తాగితే గుండెకు మంచిదని భావిస్తుంటారు. నిజానికి దీంతో ఒనగూరే లాభాల కన్నా నష్టాలే ఎక్కువని గుర్తించాలి. మద్యం అలవాటు లేనివారు దీని జోలికి వెళ్లకపోవటమే మంచిది. ఒకవేళ అలవాటుంటే పరిమితి మించకుండా చూసుకోవాలి.

కొందరికి మద్యం అలవాటు లేకపోయినా కాలేయానికి కొవ్వు పట్టొచ్చు (నాన్‌ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌). దీనికి కచ్చితమైన కారణమేంటన్నది తెలియదు. కానీ అధిక బరువు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు గలవారికి వచ్చే అవకాశం ఎక్కువ. కొవ్వు కాలేయాన్ని దెబ్బతీయటం మొదలెట్టినప్పుడు (నాన్‌ఆల్కహాలిక్‌ స్టీటోహెపటైటిస్‌- నాష్‌) బరువు తగ్గటం, అలసట, బలహీనత, చర్మం దురద, చర్మం కింది రక్తనాళాలు బలహీనమై ఉబ్బటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

హెపటైటిస్‌ సి ఇన్‌ఫెక్షన్‌ 6 నెలలు, అంతకన్నా ఎక్కువకాలం కొనసాగితే దీర్ఘకాల ఇన్‌ఫెక్షన్‌గా భావిస్తారు. ఇది కాలేయం గట్టిపడటానికి దారితీయొచ్చు. దీర్ఘకాల హెపటైటిస్‌కు ప్రధాన కారణం హెపటైటిస్‌ సి వైరస్‌. కొన్నిరకాల మందులు, బ్యాక్టీరియా, ఇతర వైరస్‌లు, రోగనిరోధకశక్తి పొరపాటున మన శరీరం మీదే దాడి చేయటం వంటివీ దీనికి కారణం కావొచ్చు. ఈ ఇన్‌ఫెక్షన్‌ గలవారితో అసురక్షిత శృంగారం జరపటం, వారి రక్తం, జననాంగ స్రావాలతోనూ హెపటైటిస్‌ సి ఇతరులకు అంటుకుంటుంది. మాదకద్రవ్యాలు వాడేవారు ఒకరి సూదులను మరొకరు పొడచుకోవటంతోనూ వ్యాపిస్తుంది.

కాలేయం నుంచి పిత్తాశయానికి పైత్యరసాన్ని తీసుకెళ్లే నాళాల సమస్యలూ కాలేయజబ్బుకు దారితీయొచ్చు. ఈ నాళాలు సన్నబడినా, అడ్డంకులు ఏర్పడినా కాలేయంలో పైత్యరసం పేరుకుపోతుంది. దీంతో కాలేయం ఉబ్బి, దెబ్బతినే ప్రమాదముంది. కారణాన్ని బట్టి డాక్టర్లు దీనికి చికిత్స చేస్తారు. మందులతో లేదా చిన్న శస్త్రచికిత్సతో నాళాలను తెరుస్తారు.

నొప్పులు తగ్గటానికి వాడే మెథట్రిక్సేట్, క్షయ చికిత్సలో వాడే ఐసోనియాజిడ్‌ వంటి మందులు కాలేయాన్ని దెబ్బతీసే అవకాశముంది. కొన్నిరకాల యాంటీబయాటిక్స్, కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టాటిన్లు కూడా కాలేయానికి విఘాతం కలిగించొచ్చు. కాబట్టి డాక్టర్‌ దగ్గరికి వెళ్లినప్పుడు వాడుతున్న మందుల గురించి వివరించాలి. కొత్త మందులు వాడినప్పుడు అలసటగా అనిపించినా, వికారంగా ఉన్నా, శరీరం దురద పెడుతున్నా, మొత్తంగా ఏదో బాగా లేదని అనిపించినా వెంటనే డాక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z