Sports

మలేసియా చేతిలో భారత బ్యాడ్మింటన్ జోడీ ఓటమి-NewsRoundup-Aug 01 2024

మలేసియా చేతిలో భారత బ్యాడ్మింటన్ జోడీ ఓటమి-NewsRoundup-Aug 01 2024

* ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కర్నూలు జిల్లా సున్నిపెంటలో నిర్వహించిన ‘మన నీరు-మన సంపద’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సుప్రీం తీర్పుపై స్పందించారు. ‘‘సామాజిక న్యాయం, దామాషా ప్రకారం ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెదేపా సిద్ధాంతం. గతంలో వర్గీకరణకు సంబంధించి ఏబీసీడీలుగా కేటగిరీ తీసుకొచ్చాను. అందరికీ న్యాయం జరగాలి. ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు కూడా అలాగే చేశాం. ఈ ప్రభుత్వం అందరిది.. మీ అందరివాడిగా ఉంటా’’ అని చంద్రబాబు తెలిపారు.

* కరోనా తర్వాత బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాది చిత్రాలు పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై ఘన విజయాన్ని అందుకుంటున్నాయి. వివిధ భాషల్లో ఎక్కువమంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఈవిషయంపై బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు నిఖిల్‌ అడ్వాణీ తాజాగా స్పందించారు. ఒకానొక సమయంలో హీరోయిజం ఎలివేట్‌ చేసేలా బాలీవుడ్‌లో గొప్ప చిత్రాలు తెరకెక్కాయన్నారు. ‘‘గతంలో అల్లు అర్జున్‌తో నేనొక సినిమా చేయాలనుకున్నా. అందుకోసం ఆయన్ని కలిశా. బాలీవుడ్‌ పరిస్థితిపై ఆయన నిరాశ వ్యక్తంచేశారు. ‘బాలీవుడ్‌కు ఏమైంది? హీరోలను ఎలా చూపించాలో మీరెందుకు మర్చిపోయారు?’ అని అడిగారు. ఆయన చెప్పింది నిజమే.. దక్షిణాది చిత్రాల్లో హీరోయిజం, అందులోని కీలక భావోద్వేగాలను చక్కగా చూపిస్తారు. ఆవిధంగా ప్రేక్షకులను కథకు కనెక్ట్ అయ్యేలా చేస్తారు. ఒకానొక సమయంలో బాలీవుడ్‌లో అలాంటి చిత్రాలు ఎన్నో వచ్చాయి. మంచి విజయాన్ని అందుకున్నాయి. నేడు హిందీ సినిమాల్లో అది లోపించింది’’ అని నిఖిల్‌ అన్నారు. ‘కల్‌ హో నా హో’, ‘చాందీ చౌక్‌ టు చైనా’, ‘దిల్లీ సఫారీ’, ‘హీరో’ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన తెరకెక్కించిన సరికొత్త చిత్రం ‘వేదా’. జాన్‌అబ్రహం హీరోగా ఇది రూపుదిద్దుకుంది. ఆగస్టు 15న విడుదల కానుంది.

* దేశంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించాలని ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా (Raghav Chadha) డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో మాట్లాడుతూ ఈ అంశం లేవనెత్తారు. ఎన్నికల బరిలో నిలిచేందుకు అభ్యర్థుల కనీస వయసు ప్రస్తుతం 25 ఏళ్లుగా ఉంది.

* ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు 27 ఏళ్లుగా పోరాటం చేశారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శాసనసభలో సీఎం కీలక ప్రకటన చేశారు. ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణను అమలు చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. ‘‘వర్గీకరణ కోసం గతంలో ఇదే శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చాం. అప్పుడు నాతో పాటు సంపత్‌కుమార్‌ను సభ నుంచి బహిష్కరించారు. గత ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణ అంశంపై ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని చెప్పింది. అలా తీసుకెళ్లకుండా మాదిగ సోదరులను మోసం చేశారు. డిసెంబర్‌ 3, 2023న ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచన మేరకు మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో శాసనసభ్యులు, అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ)ను దిల్లీకి పంపించాం. న్యాయకోవిదులతో చర్చించి వర్గీకరణపై సుప్రీంకోర్టులో బలమైన వాదనను కాంగ్రెస్‌ ప్రభుత్వం వినిపించింది.

* పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం వచ్చింది. యువ షూటర్‌ స్వప్నిల్ సత్తా చాటాడు. మెన్స్‌ 3 పొజిషన్‌ షూటింగ్‌ ఫైనల్‌లో మూడో స్థానంలో నిలిచాడు. దీంతో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. కాస్త నెమ్మదిగా ప్రారంభించిన స్వప్నిల్.. కీలక సమయంలో పుంజుకొన్నాడు. ఒక దశలో నాలుగు, ఐదు స్థానాల మధ్య కొనసాగిన అతడు.. టాప్‌-3లోకి వచ్చాక మాత్రం వెనక్కి తిరిగిచూడలేదు. చివరికి 451.4 పాయింట్లను సాధించి కాంస్యం అందుకొన్నాడు. చైనాకు చెందిన లి యుకున్ (463.6) స్వర్ణం, ఉక్రెయిన్‌ షూటర్ కులిష్‌ సెర్హియ్‌ (461.3) రజతం కైవసం చేసుకున్నారు.

* కేరళలోని వయనాడ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఇంకా వందల సంఖ్యలో ప్రజల ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ తరుణంలో కేరళ పోలీసులు చేసిన అభ్యర్థనతో డార్క్‌ టూరిజం (Dark Tourism) అనే పదం వైరల్‌గా మారింది. కేరళ పోలీసులు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘పర్యటనల కోసం విపత్తు ప్రాంతాలకు వెళ్లకండి. దానివల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. సహాయం కోసం 112కు కాల్ చేయండి’’ అని రెండురోజుల క్రితం ఒక పోస్టు పెట్టారు. ఈ క్రమంలోనే డార్క్ టూరిజం (Dark Tourism) మరోసారి వెలుగులోకి వచ్చింది. చెర్నోబిల్ అండ్ ది డార్క్‌ టూరిస్ట్ టీవీ షోతో ఈ తరహా పర్యటకం బాగా పాపులర్‌ అయింది. మరణం, విషాదం, హింస, అసాధారణ పరిస్థితులు జరిగిన ప్రాంతాలను సందర్శించడాన్ని డార్క్ టూరిజం(Dark Tourism) అంటారు. వాటిలో యుద్ధభూమి, జైలు, మార్చురీ, మాసోలియంలు(సమాధులు), ఉరితీసిన ప్రాంతాలు, విపత్తు సంభవించిన ప్రదేశాలు ఉంటాయి. ఉదాహరణకు పోలెండ్‌లోని ఆష్విట్జ్‌ క్యాంప్‌, ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ జోన్, కాంబోడియాలోని కిల్లింగ్‌ ఫీల్డ్స్‌, అమెరికాలోని 9/11 మెమోరియల్ వంటివి ఈ టూరిజం డెస్టినేషన్లుగా ఉన్నాయి.

* ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త రేషన్‌ కార్డుల జారీ విధివిధానాల రూపకల్పనకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు విడిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీలో ఔటర్‌ గ్రామల విలీనానికి కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రులు సీతక్క, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

* వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో శిథిలాలను తీస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే 200లకు పైగా దేహాలను బయటకు తీసినట్లు సమాచారం. అయితే, దారుణ స్థితిలో ఉన్న వాటిని చూసి వైద్యులు కూడా వణికిపోతున్నట్లు తెలుస్తోంది. అక్కడి హృదయవిదారక పరిస్థితులతో కలత చెందుతున్నట్లు శవపరీక్షలు చేస్తోన్న వైద్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో ఛిద్రమైన మృతదేహాలకు పోస్టుమార్టం చేయలేక పారిపోవాలనుకున్నట్లు ఓ ప్రభుత్వ వైద్యురాలు చెప్పడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది.

* ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ దాదాపు పూర్తయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 96శాతం పింఛన్లు పంపిణీ పూర్తి చేశారు. ఒక్క రోజులోనే పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల ద్వారా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. సత్యసాయి జిల్లా మండకశిర మండలం గుండుమలలో సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛను డబ్బులు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 4గంటల సమయానికి 96శాతం పింఛన్లు పంపిణీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. మిగిలిన నాలుగుశాతం పెన్షన్లు పంపిణీ చేసేలా సచివాలయ ఉద్యోగులు ప్రయత్నిస్తున్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లా, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో పెన్షన్ల పంపిణీ జరిగింది.

* వైకాపా ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. అవినీతి, విధ్వంసం, అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమలలో నిర్వహించిన ప్రజావేదికలో పింఛను లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన వారే వైకాపా పాలనలో ఇష్టానుసారం దోపిడీ చేశారని విమర్శించారు. సర్వే రాళ్ల కోసం రూ.700 కోట్లు ఖర్చు చేసి వాటిపై కూడా ఫొటోలు వేయించుకున్నారని విమర్శించారు.

* ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి డబుల్స్‌ పతకాన్ని అందిస్తారని ఆశించిన సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి జోడీ నిరాశపర్చింది. గురువారం జరిగిన క్వార్టర్స్‌ ఫైనల్స్‌లో ఈ జంట (21-13, 21-14, 21-16) ఆరోన్‌- సో వూయి (మలేసియా) చేతిలో ఓటమిపాలైంది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన మలేసియా జంటపై తొలి గేమ్‌లో సాత్విక్‌-చిరాగ్ ద్వయం ఆధిపత్యం ప్రదర్శించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో మలేసియా జోడీ అద్భుతంగా ఆడింది. ఒకదశలో 4-0తో వెనకబడిన ఆరోన్‌- సో వూయి ద్వయం తర్వాత వేగంగా పుంజుకుని భారత జోడీపై ఎదురుదాడికి దిగి గేమ్‌ను వంశం చేసుకుంది. మూడో గేమ్‌లో 2-5తో వెనుకబడిన భారత ద్వయం జోరు పెంచి 5-5తో స్కోరును సమం చేసింది. తర్వాత గేమ్ హోరాహోరీగా సాగింది. ఒకదశలో 16-16తో స్కోర్లు సమం అయ్యాయి. అనంతరం భారత జోడీ తేలిపోయింది.

* భారీ వర్షాలకు కేరళలో విరిగిపడుతోన్న కొండచరియలు ఊళ్లకు ఊళ్లనే నాశనం చేస్తున్నాయి. వందల మందిని బలితీసుకుంటున్నాయి. వయనాడ్‌లో ఇటీవల సంభవించిన ఘటనలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా అనేక మంది ఆ శిథిలాల కిందే చిక్కుకుపోయారు. కనీవినీ ఎరుగని ఈ విపత్తుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) విడుదల చేసింది. అక్కడ సంభవించిన విలయాన్ని 3డీ రూపంలో చూపించింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 86వేల చ.మీటర్ల భూభాగం జారిపడిపోయినట్లు ఇస్రో అంచనా వేసింది. సముద్రమట్టానికి 1550 మీటర్ల ఎత్తులో ఈ కొండచరియలు విరిగిపడిన ప్రదేశాన్ని గుర్తించింది. ఇరువంజిపుళ నదిలో దాదాపు 8కి.మీ మేర ఈ శిథిలాలు కొట్టుపోతున్నట్లు సమాచారం. వయనాడ్‌లో చోటుచేసుకున్న భారీ వినాశనాన్ని అంచనా వేసేందుకు ఇస్రోకు చెందిన కార్టోశాట్‌-3, ఆర్‌ఐఎస్‌ఏటీ అత్యాధునిక ఉపగ్రహాలను నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (NRSC) ఆ ప్రాంతంలో అంతరిక్షం నుంచి తీసిన 3డీ చిత్రాలను విశ్లేషించింది. గతంలోనూ అదే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన విషయాన్ని పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z