DailyDose

బేగంపేట పెట్రోల్ బంకు వద్ద మంటలు-CrimeNews-Aug 02 2024

బేగంపేట పెట్రోల్ బంకు వద్ద మంటలు-CrimeNews-Aug 02 2024

* దేశ రాజధానిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ ఆశ్రమంలో చిన్నారుల అనుమానాస్పద మరణాలు చర్చనీయాంశమయ్యాయి. గడిచిన 20 రోజుల్లోనే 14 మంది ప్రాణాలు కోల్పోవడం కలవరపెడుతోంది. అందులో ఎక్కువ మంది మానసిక వికలాంగులే కావడం కలచివేస్తోంది. మొత్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 27 మంది చనిపోగా, మరణాలకు గల కారణాలు తెలియకపోవడం సంచలనంగా మారింది. దీనిపై వార్తలు రావడం, విపక్షాలు ఆందోళనలతో స్పందించిన ‘ఆప్‌’ ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.

* మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలిలో చోటు చేసుకుంది. మృతులను గురుశేఖర్‌రెడ్డి(45), దస్తగిరమ్మ(38) దంపతులు, వారి ఇద్దరు కుమార్తెలు పవిత్ర(16), గురులక్ష్మి(10)గా గుర్తించారు. వీరంతా ఇంట్లో నిద్రిస్తుండగా గురువారం అర్ధరాత్రి మట్టి మిద్దె కూలింది. శుక్రవారం తెల్లవారుజామున గమనించిన స్థానికులు హుటాహుటిన శిథిలాలను తొలగించి మృతదేహాలను వెలికితీశారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబంలో మొత్తం ఐదుగురు ఉండగా.. రెండో కుమార్తె ప్రసన్న కడప జిల్లా ప్రొద్దుటూరు ఉషోదయ పాఠశాలలో చదువుతోంది.

* బేగంపేట‌లోని ప్ర‌జా భ‌వ‌న్‌కు స‌మీపంలోని పెట్రోల్ బంక్‌లో మంట‌లు చెల‌రేగాయి. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం బంక్‌లోని ఓ భూగ‌ర్భ ట్యాంక్ మూత తీస్తుండ‌గా ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో పెట్రోల్ కోసం వ‌చ్చిన వాహ‌న‌దారులు భ‌యంతో ప‌రుగులు తీశారు. రోడ్డు ప‌క్క‌నే పెట్రోల్ బంక్ ఉండ‌డంతో రోడ్డు మార్గానా వెళ్లేవారు కూడా తీవ్ర భయాందోళ‌న‌కు గుర‌య్యారు. అప్ర‌మ‌త్త‌మైన పెట్రోల్ బంక్ సిబ్బంది భూగ‌ర్భ ట్యాంకులో చెల‌రేగిన మంట‌ల‌ను ఆర్పేశారు. ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆస్తి న‌ష్టం కూడా సంభ‌వించ‌లేదు. ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అటు పెట్రోల్ బంక్ యాజ‌మాన్యం, ఇటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు ప‌రిస్థితిని స‌మీక్షించారు.

* వరుస వివాదాలతో వార్తల్లోకి ఎక్కిన ఏఐఎస్‌ మాజీ ప్రొబెషనరీ అధికారిణి పరారీలో ఉన్నారా?. ఆమె కోసం పోలీసులు గాలింపు చేపట్టారా?. ఢిల్లీ కోర్టు ముందస్తు బెయిల్‌ తిరస్కరించడం వెంటనే.. ఆమె దేశం విడిచి పారిపోయారా? ముందస్తు బెయిల్‌ విషయంలో పూజా ఖేద్కర్‌కు గురువారం చుక్కెదురైంది. ఓబీసీ కోటా, అలాగే దివ్యాంగుల కోటా విషయంలో ఆమె మోసం చేశారని, ఈ అంశాల్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న యూపీఎస్సీ ఆమెను సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై అభియోగాల దృష్ట్యా అరెస్ట్‌ తప్పదని ఆమె భావించారు. వెంటనే తన లాయర్‌ ద్వారా ఢిల్లీ పాటియాలా హౌజ్‌ కోర్టులో ఒక పిటిషన్‌ వేశారు. కానీ, కోర్టు అందుకు నిరాకరించింది. పూజాను కస్టోడియల్‌ విచారణ జరిపితేనే వాస్తవాలు బయటకు వస్తాయని బెయిల్‌ తిరస్కరణ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. జులై 31న అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ నిర్ణయం ప్రకటించిన నాటి నుంచి ఆమె ఫోన్‌ స్విచ్చాఫ్‌ వస్తోంది. అంతకు ముందు ముస్సోరీలోని అకాడమీ ఎదుటా హాజరై ఆమె తన వివరణ ఇచ్చుకోలేదు. దీంతో యూపీఎస్సీ ఆమెకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అయితే.. నోటీసులకు స్పందించేందుకు ఆగష్టు 4వ తేదీ వరకు ఆమె గడువు కోరారు. కానీ, యూపీఎస్సీ మాత్రం జులై 30 దాకా అవకాశం ఇచ్చింది. అయినా ఆమె గైర్హాజరయ్యారు. దీంతో ఆమె దుబాయ్‌కి వెళ్లిపోయి ఉండొచ్చని జాతీయ మీడియా కథనాలు ఇస్తోంది. దీనిపై పూజా తరఫు స్పందన రావాల్సి ఉంది. మరోవైపు.. పుణే పోలీసులు సైతం ఆమె పరారైన విషయాన్ని ధృవీకరించాల్సి ఉంది.

* రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మల్కంచెరువు సమీపంలో వేగంగా వచ్చిన కారు ఫ్లై ఓవర్ గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యి.. అందులోని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ యాక్సిడెంట్‌తో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. మృతుడ్ని ఐసీఎఫ్‌ఏఐ యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్న చరణ్‌(19)గా పోలీసులు గుర్తించారు. బీఎన్‌ఆర్‌ హిల్స్‌ నుంచి చరణ్‌ మెహదీపట్నంలోని తన ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో ఫ్లై ఓవర్‌ ఫిల్లర్‌ను ఢీ కొట్టడంతో కారు ప్రమాదానికి గురైంది. కారు నుజ్జు అయ్యి స్పాట్‌లోనే చరణ్‌ చనిపోయాడని, ఇరుక్కుపోయిన ఆ మృతదేహాన్ని కష్టం మీద బయటకు తీసినట్లు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలిపిన పోలీసులు, మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z