Sports

హాకీలో ఆస్ట్రేలియాపై భారత్ గెలుపు-NewsRoundup-Aug 02 2024

హాకీలో ఆస్ట్రేలియాపై భారత్ గెలుపు-NewsRoundup-Aug 02 2024

* తెలంగాణ అసెంబ్లీలో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. హైదరాబాద్‌ నగరంలో అభివృధ్ధి కార్యక్రమాలపై సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. చర్చను ప్రారంభించిన ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌.. భారాస సభ్యులనుద్దేశించి పరుష పదజాలం ఉపయోగించారని ఆ పార్టీ సభ్యులు నిరసనకు దిగారు. దానం వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన భారాస సభ్యులు పోడియంవైపు దూసుకొచ్చారు. ప్రతిగా దానం కూడా పోడియంవైపు రావడంతో కాంగ్రెస్‌ సభ్యులు ఆయన్ను వెనక్కి తీసుకెళ్లారు. దానం నాగేందర్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే కేటీఆర్‌ భారాస సభ్యులతో కలిసి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దానం నాగేందర్‌ చేసిన వ్యాఖ్యల్లో అన్‌ పార్లమెంటరీ వ్యాఖ్యలు ఉంటే రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ ప్రకటించారు.

* ఎలక్టోరల్‌ బాండ్ల(Electoral Bonds)పై కోర్టు పర్యవేక్షణలోని ప్రత్యేక దర్యాప్తు బృందంతో (SIT) విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాజకీయ పార్టీలు, కార్పొరేట్‌ దాతల మధ్య క్విడ్‌ ప్రో కో జరిగిందంటూ వచ్చిన ఆరోపణపై న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని దాఖలైన పలు పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారించింది

* మాజీ సీఎం జగన్‌ను కలిసేందుకు వచ్చిన వైకాపా కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది. సమస్యలతో వచ్చిన వారిని జగన్‌ స్వయంగా కలిసి ఆర్థిక సాయం అందిస్తారని వైకాపా నేతలు ప్రచారం చేయడంతో జగన్‌ను కలిసేందుకు వివిధ జిల్లాల నుంచి ఆ పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ఆశతో వచ్చిన వారి సెల్‌ఫోన్లను జగన్‌ వ్యక్తిగత భద్రతా సిబ్బంది విసిరేశారని, బయటకు నెట్టేశారని కార్యకర్తలు వాపోయారు. జగన్‌ నివాసం వద్ద తమకు ఎదురైన అనుభవంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు.

* కేరళలోని వయనాడ్‌ జిల్లాలో కొండ చరియలు విరిగిపడి భారీఎత్తున ప్రాణనష్టం సంభవించింది. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా రాహుల్ ఒక హమీ ఇచ్చారు. తమ పార్టీ తరఫున బాధితులకు 100కు పైగా ఇళ్లను కట్టి ఇస్తామని తెలిపారు.

* భారత్‌లో విస్తరిస్తున్న డిజిటల్‌ విప్లవాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్(Dennis Francis) ప్రశంసించారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాకింగ్‌ సేవలను విస్తరించడంపై హర్షం వ్యక్తంచేశారు. కేవలం స్మార్ట్‌ఫోన్లు ఉపయోగించడం వల్ల గత 6 ఏళ్లలో 80కోట్ల మంది భారతీయులను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చారని పేర్కొన్నారు.

* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఏయే ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయాలనే విషయాలను క్యాలెండర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. నోటిఫికేషన్‌ విడుదల చేసే నెల, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే వివరాలతో పాటు నియామకాలు నిర్వహించే ఏజెన్సీ, ఉద్యోగానికి కావాల్సిన అర్హతల గురించి అందులో పొందుపర్చారు. ఈ మేరకు జాబ్‌ క్యాలెండర్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంంబ్లీలో ప్రకటించారు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్‌-1 పరీక్షలు అక్టోబరులో, గ్రూప్‌-2ను డిసెంబరులో, గ్రూప్‌-3 నవంబరులో నిర్వహించనున్నారు.

* దేశ రాజధాని దిల్లీ (Delhi)లోని ఓ ఐఏఎస్‌ స్టడీ సెంటర్‌లోకి ఇటీవల వరదనీరు పోటెత్తి సివిల్స్‌కు శిక్షణ పొందుతున్న ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఘటన (Coaching Centre Tragedy) తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు, మున్సిపల్‌ అధికారుల ప్రవర్తిస్తున్న తీరుపై దిల్లీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కొన్ని సంస్థలు తాము చట్టానికి అతీతమన్నట్లుగా ప్రవర్తిస్తున్నాయని ఆగ్రహించింది.

* లోక్‌సభ సమావేశల్లో భాగంగా చర్చలు జరుగుతున్న సమయంలో శుక్రవారం స్పీకర్‌ ఓం బిర్లా (Om Birla) ఓ ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో అడగాలనుకున్న విషయాలు నేరుగా అడగాలని, కథలు చెప్పవద్దని చురకలు అంటించారు. సభలో ఒడిశాకు చెందిన భాజపా సభ్యుడు ప్రదీప్‌ పురోహిత్‌ (Pradip Purohit) కేంద్ర ఆయుష్ మంత్రిని ఓ ఆయుర్వేద కళాశాల గురించి ప్రశ్నిస్తూ, అక్కడి మూలికల చరిత్ర గురించి ప్రస్తావించారు. దీంతో స్పీకర్‌ ‘‘మీరు మహాభారత కథలు చెప్పకండి.. ప్రశ్నలే అడగండి. ఈ మధ్య సభలో మహాభారతం గురించి చెప్పడం ఫ్యాషనైపోయింది’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

* పైరసీ రక్కసి రోజు రోజుకీ విజృంభిస్తుండటంతో చిత్ర పరిశ్రమ అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దా పేర్కొన్నారు. ఒకప్పుడు చిత్ర పరిశ్రమకే పరిమితమైన పైరసీ ప్రస్తుతం అంటువ్యాధిలా ఓటీటీలకూ పాకిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా ఫిల్మ్‌ ఇండస్ట్రీకి ఏడాదికి రూ.20 వేల కోట్లు నష్టం వాటిల్లుతోందన్నారు. ఈ మేరకు శుక్రవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు.

* వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే (NEET) పరీక్షను ప్రవేశపెట్టడాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ సమర్థించుకుంది. దేశంలో నీట్‌ రాకముందు వైద్య విద్య బహిరంగ వ్యాపారంగా ఉండేదని పేర్కొంది. అంతకుముందు ఒక్కో మెడికల్‌ పీజీ సీటు రూ.8 కోట్ల నుంచి రూ.13 కోట్ల వరకు అమ్ముడు పోయిందని వెల్లడించింది. గతంలో వైద్యవిద్యలో భారీగా అవినీతి చోటుచేసుకుందని తెలిపింది.

* కాంగ్రెస్‌ ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌తో యువతను మభ్య పెడుతోందని భారాస ఎమ్మెల్యే కేటీఆర్‌ విమర్శించారు. జాబ్‌ క్యాలెండర్‌లో పోస్టుల సంఖ్య పెట్టలేదంటూ అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌ వద్ద భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. జాబ్‌ క్యాలెండర్‌పై అసెంబ్లీలో చర్చించాలని అడిగితే రెండు నిమిషాలు కూడా టైమ్‌ ఇవ్వలేదన్నారు. నాలుగు పేపర్ల మీద ఇష్టం వచ్చింది రాసుకొచ్చి జాబ్‌ క్యాలెండర్‌ అంటున్నారని విమర్శించారు. తెలంగాణ శాసనసభ దుశ్శాసనసభగా మారిందని ధ్వజమెత్తారు.

* పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్లు సత్తా చాటారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్‌, అంకిత భకత్‌ ద్వయం అద్భుత ప్రదర్శనతో సెమీ ఫైనల్‌కు చేరింది. దీంతో వీరు పతకానికి మరో అడుగు దూరంలో ఉన్నారు. క్వార్టర్స్‌ ఫైనల్‌లో అంకిత, ధీరజ్‌ ధ్వయం 5-3 తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ఈ జోడి.. ఇండోనేషియా ద్వయం ఆరిఫ్‌-కోరునిసాపై 5-1తో విజయం సాధించిన విషయం తెలిసిందే. సెమీస్‌లో ఈ జంట దక్షిణ కొరియా లేదా ఇటలీతో తలపడనుంది. ఒలింపిక్స్‌ ఆర్చరీ మిక్స్‌డ్‌ డబుల్స్‌ చరిత్రలో భారత్‌ సెమీస్‌కు చేరడం ఇదే తొలిసారి. ఒలింపిక్స్‌ గ్రూప్‌ చివరి మ్యాచ్‌లో భారత హాకీ జట్టు విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో గెలుపొందింది. పూల్‌ బి నుంచి ఇప్పటికే భారత్‌, బెల్జియం, ఆసీస్‌ క్వార్డర్‌ ఫైనల్‌ చేరాయి. ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాను భారత్‌ ఓడించడం 1972 తర్వాత ఇదే తొలిసారి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z