Editorials

పశ్చిమాసియాలో యుద్ధం తప్పదా?-NewsRoundup-Aug 03 2024

పశ్చిమాసియాలో యుద్ధం తప్పదా?-NewsRoundup-Aug 03 2024

* తెలంగాణ రాష్ట్రంలో నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. శనివారం భూపాలపల్లి పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాస్‌రెడ్డి అక్కడి కలెక్టరేట్‌ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నిబంధనలకు లోబడి ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను క్రమబద్ధీకరించాలని సూచించిన మంత్రి.. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సి ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను తీసుకుంది.

* ఒలింపిక్స్‌ (Olympics)లో పతకాలు సాధించాలనేది క్రీడాకారుల చిరకాల స్వప్నం. తమ దేశాన్ని అంతర్జాతీయ వేదికలపై గెలిపించేందుకు కఠోరంగా శ్రమిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో భారత్‌ స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ (Lakshya sen) చరిత్ర సృష్టించాడు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో అతడి చేతిలో ఓడిపోయిన తైవాన్‌కు చెందిన 12 సీడ్‌ ఆటగాడు చో చెన్‌ (Chou Tien Chen) గురించి ఓ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్యాన్సర్‌ బారిన పడిన అతడు.. లక్ష్యసేన్‌కు గట్టి పోటీ ఇచ్చాడు.

* ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నర్తకిగా ఖ్యాతిగాంచిన యామినీ కృష్ణమూర్తి (Yamini Krishnamurthy) (84) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆమె.. దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో 1940లో జన్మించారు. యామినీకి 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్‌, 2016లో పద్మ విభూషణ్‌ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. గతంలో తితిదే ఆస్థాన నర్తకిగా కూడా ఆమె సేవలందించారు. దిల్లీలో ‘యామినీ స్కూల్‌ ఆఫ్‌ డ్యాన్స్‌’ స్థాపించి ఎంతో మంది యువతకు భరత నాట్యం, కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇచ్చారు. ఏ ప్యాషన్‌ ఫర్‌ డ్యాన్స్‌ పేరుతో పుస్తకం రచించారు.

* రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌ను రూ.250 కోట్లతో ప్రపంచస్థాయి రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేస్తామని భాజపా ఎంపీ పురందేశ్వరి తెలిపారు. ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పలువురు భాజపా నేతలతో కలిసి ఆమె రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. పుష్కరాలు జరిగే 2027లోగా పనులు పూర్తి చేస్తామన్నారు. స్టేషన్‌ సమస్యలపై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సానుకూలంగా స్పందించారని పురందేశ్వరి తెలిపారు. కొవ్వూరు, అనపర్తిలో మరికొన్ని రైళ్లు ఆపాలని కోరినట్లు చెప్పారు. రాజమహేంద్రవరం స్టేషన్‌ తూర్పువైపున కూడా అభివృద్ధి చేస్తామని డీఆర్‌ఎం పాటిల్ తెలిపారు. రోడ్‌ కమ్‌ రైలు వంతెనపై భారీ వాహనాలు నిషేధించాలని కోరామన్నారు.

* పారిస్ ఒలింపిక్స్‌లో మన ఆర్చర్ల పోరాటం ముగిసింది. ఈ సారి కూడా పతకం లేకుండానే ఇంటిముఖం పట్టారు. వ్యక్తిగత విభాగంలో భారత మహిళా ఆర్చర్లు నిరాశపర్చారు. క్వార్టర్‌ ఫైనల్‌లో దీపికా కుమారి 4-6 తేడాతో నామ్ సుహ్యెన్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమిపాలైంది. మరో ఆర్చర్ భజన్‌ కౌర్‌ ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. క్వార్టర్స్‌లో తొలి సెట్‌ను 28-26తో సొంతం చేసుకున్న దీపిక.. రెండో సెట్‌లో మొదటి బాణం విసిరి 10కి 10 పాయింట్లు సాధించింది. తర్వాత గురి తప్పి ఆరు పాయింట్లే సాధించడంతో సెట్‌ను కోల్పోయింది. మూడో సెట్‌లో పుంజుకుని 29-28తో నెగ్గింది. తర్వాత రెండు సెట్లలో దీపిక ఆశించిన మేరకు ప్రదర్శన చేయలేదు. నాలుగో సెట్‌లో రెండు బాణాలకు 10కి 10కి పాయింట్లు సాధించిన భారత ఆర్చర్‌.. ఒక దానికి మాత్రం 7 పాయింట్లే రాబట్టి మూల్యం చెల్లించుకుంది. ఈ సెట్‌లో ప్రత్యర్థి 29 పాయింట్లు సాధించి స్కోరు సమం చేసింది. చివరి సెట్‌లో దీపిక వరుసగా 9, 9, 9 పాయింట్లు చేయగా.. దక్షిణ కొరియా ఆర్చర్ 10, 9, 10 పాయింట్లు చేసి విజయం సాధించింది. దీంతో ఆర్చరీలో భారత్ పతక ఆశలకు తెరపడింది.

* అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్‌ఎస్‌)కి చేపట్టబోయే యాత్ర కోసం ప్రధాన వ్యోమగామిగా గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లాను ఎంపిక చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ యాత్రకు అమెరికాకు చెందిన అనుభవజ్ఞురాలైన వ్యోమగామి పెగ్గీ అన్నటె విట్సన్‌ కమాండర్‌గా వ్యవహరించనున్నారు. పెగ్గీ విట్సన్‌.. సుశిక్షుతులైన బయోకెమిస్ట్‌. ఆమెకు నాలుగుసార్లు స్పేస్‌లోకి వెళ్లిన అనుభవం ఉంది. ఈ ఆస్ట్రోనాట్‌ 2018లో నాసా నుంచి పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం ప్రైవేటు అంతరిక్ష సంస్థ యాక్సియమ్‌ స్పేస్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. అక్కడ మానవ సహిత అంతరిక్ష ప్రొగ్రామ్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ రోజులు(675 రోజులు) అంతరిక్షంలో గడిపిన మహిళా వ్యోమగామిగా ఆమె చరిత్ర సృష్టించారు.

* పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయ పౌరులకు మన రాయబార కార్యాలయం తాజా అడ్వైజరీ జారీ చేసింది. అప్రమత్తంగా ఉంటూ భద్రతా నియమాలను పాటించాలని సూచించింది. భారత పౌరుల ప్రయాణాలకు సంబంధించి లెబనాన్‌లోని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీచేసిన మరుసటి రోజు ఇజ్రాయెల్‌లోని కార్యాలయం మన పౌరులను అప్రమత్తం చేసింది. ‘‘ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయ పౌరులు జాగ్రత్తగా వ్యవహరించండి. దేశంలో అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండండి. సురక్షిత ప్రదేశాలకు దగ్గర్లో ఉండండి. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. మన దేశ పౌరుల భద్రతకు సంబంధించి ఇజ్రాయెల్‌ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నాం’’ అని ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, కన్నడ భాషల్లోనూ అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన నంబర్లను పోస్టు చేసింది.

* ఇజ్రాయెల్‌ హమాస్‌ యుద్ధం (Israel Hamas conflict), మధ్యలో హెజ్‌బొల్లా, ఇరాన్‌ జోక్యంతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హమాస్‌ చీఫ్‌ హనియా హత్యకు ప్రతీకారంగా ఇరాన్‌ (Iran), దాని మిత్రదేశాలు ఇజ్రాయెల్‌ (Israel)పై ఏ క్షణమైనా దాడి చేసే ముప్పు పొంచి ఉంది. దీంతో ఐడీఎఫ్‌ అప్రమత్తమైంది. మరోవైపు, టెల్‌ అవీవ్‌కు అండగా ఉండేందుకు అమెరికా (USA) రంగంలోకి దిగింది. పశ్చిమాసియాకు యుద్ధ నౌకలు, ఫైటర్‌ జెట్లను పంపిస్తోంది. అమెరికా సిబ్బందితో పాటు ఇజ్రాయెల్‌ రక్షణ కోసం అదనపు యుద్ధ నౌకలు, ఫైటర్‌ జెట్లను అగ్రరాజ్యం పంపించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వీటితో పాటు బాలిస్టిక్‌ క్షిపణి సామర్థ్యం కలిగిన అదనపు క్రూజర్లు, డిస్ట్రాయర్లను కూడా పంపించేందుకు పెంటగాన్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z