* ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI q1 results) అంచనాలను మించి రాణించింది. ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో స్టాండలోన్ ప్రాతిపదికన బ్యాంక్ రూ.17,035 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.16,884 కోట్ల నికర లాభాన్ని ప్రకటించడం గమనార్హం. గతేడాదితో పోలిస్తే లాభం స్వల్పంగా పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.1,22,688 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో ఈ మొత్తం రూ.1,08,039 కోట్లుగా ఉందని ఎస్‌బీఐ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. బ్యాంక్ వడ్డీ ఆదాయం రూ.95,975 కోట్ల నుంచి రూ.1,11,526 కోట్లకు పెరిగింది. ఇక బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 2.76 నుంచి 2.21 శాతానికి తగ్గినట్లు బ్యాంక్ తెలిపింది. నికర నిరర్థక ఆస్తులు 0.71 నుంచి 0.57 శాతానికి తగ్గినట్లు బ్యాంక్ పేర్కొంది. ఏకీకీకృత ప్రాతిపదికన బ్యాంక్ లాభం రూ.18,537 కోట్ల నుంచి రూ.19325 కోట్లకు పెరగడం గమనార్హం. మొత్తం ఆదాయం సైతం రూ.1.32 లక్షల కోట్ల నుంచి రూ.1.52 లక్షల కోట్లకు పెరిగింది.
* అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో డిపాజిట్ ఖాతాకు ఇకపై నలుగురు నామినీలను పెట్టుకునేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నామినీల సంఖ్యను పెంచడంతో పాటు బ్యాంకింగ్ చట్టాల్లో అనేక మార్పులను ఆమోదించింది. ఈ చర్యతో క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం బ్యాంకులు సేవింగ్, ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం ఒక నామినీనే జత చేసేందుకు అనుమతి ఉంది. కేంద్రం తీసుకురాబోయే మార్పులతో ఈ సంఖ్య నాలుగు వరకు పెరగనుంది. ప్రస్తుతం కేంద్రం నిర్వహిస్తున్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ (PPF)కు ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా చేర్చేందుకు వెసులుబాటు ఉంది. కొత్త మార్పులు అమల్లోకి వస్తే యజమాని మరణించిన తర్వాత జాయింట్ ఖాతాదారులకు, వారసులకు డబ్బులు అందించడం సులభంగా మారనుంది.
* తెలియని ప్రదేశాలకు వెళ్లాలంటే వెంటనే గుర్తొచ్చేది గూగుల్ మ్యాప్స్ (Google Maps). ఈ అప్లికేషన్ సాయంతో ప్రయాణం కొనసాగిస్తుంటాం. రద్దీగా ఉన్న మార్గాలను హైలెట్ చేస్తూ, ఫ్లై ఓవర్‌ల గురించి డిస్‌ప్లే చేయడం వంటి ఫీచర్లను మ్యాప్స్ అందిస్తుంది. అయితే ఒక్కోసారి అనుకోకుండా జరిగే ప్రమాదాల కారణంగా రోడ్డు రద్దీ, హెచ్చరికలు వంటి సమస్యలు తెలుసుకోవాలంటే కష్టం. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గూగుల్ మ్యాప్స్ కొత్త సదుపాయం తీసుకొచ్చింది. దీని సాయంతో వినియోగదారులే హెచ్చరికలు జారీ చేస్తూ ఇతరులకు సాయం చేయొచ్చు. ప్రమాదాలు, ఏదైనా కారణంగా రోడ్డుపై ప్రయాణాన్ని మళ్లించడం, పెద్ద ఎత్తున జనం గుమిగూడటంతో వాహనాలు నిలిచిపోవడం వంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయి. వీటి గురించి యూజర్లే స్వయంగా అప్‌డేట్ అందించేలా ఈ ఫీచర్‌ని తీసుకొచ్చింది. అంటే ఇకపై రోడ్డు ప్రయాణ సమయంలో ఎదురయ్యే ఎటువంటి సమస్యల గురించి అయినా.. అదే మార్గంలో ప్రయాణించాలనుకొనే ఇతర యూజర్లను అప్రమత్తం చేయొచ్చు. దీంతో అటువైపుగా ప్రయాణించాలనుకొనే వారు వేరే మార్గాల్ని ఎంచుకునే సౌలభ్యం కలుగుతుంది. సమయం ఆదా అవుతుంది. గూగుల్ మ్యాప్స్‌లో మీరు చేరాల్సిన గమ్యస్థానాన్ని ఎంటర్ చేయాలి. నావిగేషన్ ప్రారంభించాక, కింద కనిపించే బార్‌ను స్వైప్ చేయాలి. అందులో ‘Add a report’ అని కనిపించే ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో క్రాష్, రోడ్ వర్క్స్, లేన్ క్లోజర్.. అంటూ అనేక ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో మీకు ఎదురైన సమస్యను ఎంచుకొని రిపోర్ట్ చేయాలి. మీ రిపోర్ట్‌ని కన్ఫార్మ్ చేయగానే అటువైపుగా వచ్చే ఇతర యూజర్లను మ్యాప్స్ అప్రమత్తం చేస్తుంది.
* టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఛార్జీలను పెంచడంతో అందరి చూపు ప్రభుత్వరంగ టెలికాం కంపెనీ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) మీద పడింది. తక్కువ ధరకే ప్లాన్లు అందిస్తుండడంతో చాలామంది ఈ నెట్‌వర్క్‌కు మారుతున్నారు. మరోవైపు 4జీ నెట్‌వర్క్ సేవల్ని మరింత విస్తృతం చేసేందుకు బీఎస్ఎన్‌ఎల్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. తమ నెట్‌వర్క్‌కు మారాలనుకొనేవారికి ఆన్‌లైన్‌లోనే సులువుగా నచ్చిన నంబర్‌ను ఎంపిక చేసుకొనే సదుపాయం కల్పిస్తోంది.
*** ఆన్‌లైన్‌లో ఇలా..
మీకు అందుబాటులో ఉన్న సెర్చ్ ఇంజిన్‌లో ‘‘BSNL Choose Your Mobile Number’’ అని సెర్చ్ చేయాలి.
కింద కనిపించే వెబ్‌పేజెస్‌లో ‘‘cymn’’ పై క్లిక్ చేసి.. మీ జోన్, రాష్ట్రాన్ని ఎంచుకోవాలి.
నచ్చిన నంబర్‌ల కోసం వెతికేందుకు ప్రత్యేక ఆప్షన్లను తీసుకొచ్చింది. అందులో ‘‘search with series, start number, end number, sum of numbers’’ అని నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి.
ఫ్యాన్సీ నంబర్ కోసం పక్కనే ఫ్యాన్సీ నంబర్ ట్యాబ్ కూడా ఉంటుంది.
వీటిలో ఒక ఆప్షన్‌ను ఎంచుకొని మీకు నచ్చిన అంకెలను ఎంటర్ చేసి ‘search’పై క్లిక్ చేయాలి.
మీరు ఎంటర్ చేసిన నంబర్ ఆధారంగా కొన్ని ఫోన్ నంబర్లను చూపుతుంది.
అందులో నచ్చిన నంబర్ ఎంచుకున్నాక దాన్ని రిజర్వ్ చేసుకొనేందుకు ‘Reserve Number’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
ప్రస్తుతం వినియోగిస్తున్న మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయగానే మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే మీరు ఎంచుకున్న నంబర్ రిజర్వ్ అవుతుంది.
ఈ ప్రక్రియ పూర్తయ్యాక మీ దగ్గరలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్‌కు వెళ్లి సిమ్ కార్డ్ తీసుకోవచ్చు.
* కేంద్ర ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) సబ్‌స్క్రైబర్ల పునాది క్రమంగా పెరుగుతున్నదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ పరిధిలో 4జీ సేవలు అందుబాటులో ఉన్నాయని, దాన్ని 5జీ లోకి కన్వర్ట్ చేసే ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర టెలికం శాఖ మంత్రి సింధియా శనివారం మీడియాతో చెప్పారు. ఆత్మ నిర్బర్ భారత్ (Atmanirbhar Bharat) ఇన్షియేటివ్ కింద స్వదేశీ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న 4జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉందని తెలిపారు. త్వరలో బీఎస్ఎన్ఎల్ ద్వారా 4జీ సేవలు అందరికీ లభిస్తాయన్నారు. ‘రిలయన్స్ జియో, భారత్ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా 4జీ నెట్ వర్క్ సేవలు అందుబాటులోకి తెస్తున్నప్పుడు బీఎస్ఎన్ఎల్ లో 4జీ నెట్వర్క్ ఎందుకు తేవడం లేదని పలువురు ప్రశ్నించారు. చైనా, ఏ ఇతర విదేశీ కంపెనీ పరికరాలు వాడకుండా దేశీయంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నెట్ వర్క్ అభివృద్ధి చేయాలని ప్రధాని నిర్ణయం తీసుకున్నారు’ అని సింధియా పేర్కొన్నారు. అందుకే స్వదేశీ పరిజ్ఞానంతోనే 4జీ నెట్వర్క్ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z