DailyDose

హైదరాబాద్‌లో 800కిలోల గంజాయి స్వాధీనం-CrimeNews-Aug 04 2024

హైదరాబాద్‌లో 800కిలోల గంజాయి స్వాధీనం-CrimeNews-Aug 04 2024

* మహారాష్ట్రలోని పర్యటక ప్రదేశం బోరాన్‌ ఘాట్‌లో ఓ యువతి సెల్ఫీ తీసుకుంటుండగా 100 అడుగుల లోయలోకి జారి పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు అక్కడి జలపాతాలు పొంగిపొర్లుతుండటంతో పర్యటకులు భారీగా పోటెత్తారు. పుణెకు చెందిన ఓ పర్యటక బృందం బోరాన్ ఘాట్‌ సందర్శనకు వచ్చింది. బృందంలోని నస్రీన్ అమీర్ ఖురేషీ అనే యువతి అక్కడ సెల్ఫీ తీసుకుంటుండగా జారి 100 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. వెంటనే స్పందించిన హోంగార్డు, స్థానికుల సహాయంతో లోయలోకి దిగి ఆమెను కాపాడారు. యువతిని చికిత్స నిమిత్తం సతారాలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించామని, పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.

* భర్త రోడ్డుపై శవమై కనిపించగా.. ఇంట్లో భార్య హత్యకు గురైన ఘటన ముంబయిలోని గోరెగావ్‌లో చోటు చేసుకొంది. జవహర్‌ నగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో కిషోర్‌ పడ్నేకర్‌ (58) నివాసముంటున్నారు. జిమ్‌ సామగ్రిని విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రస్తుతం అతడి కుమారుడు దిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. కిషోర్‌ భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లే మార్గంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. అతడి మెడలో రెండు తాళపు చెవులను పోలీసులు గుర్తించారు.

* నగరంలోని పెద్ద గోల్కొండ వద్ద అవుటర్ రింగ్ రోడ్డుపై పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. పెద్ద అంబర్‌పేట్‌ వైపు నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న ఓ కంటైనర్‌లో సుమారు 800 కిలోల గంజాయిని బాలానగర్‌ ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని ఒడిశా నుంచి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. పోలీసులు కంటైనర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ ఎస్‌వోటీ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. వారిని కస్టడీకి తీసుకుని విచారిస్తామని.. మరింత మంది నిందితులు పట్టుబడే అవకాశముందని చెప్పారు. కంటైనర్‌లో గంజాయి తరలించిన ఘటన ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.2.80 కోట్లు ఉంటుందని చెప్పారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు ఈ గంజాయి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీలోని అరకుకు చెందిన రాము అనే వ్యక్తిని సరఫరాలో కీలక నిందితుడిగా గుర్తించినట్లు చెప్పారు.

* మధ్యప్రదేశ్‌లో ఓ దేవాలయం గోడ కూలిన ఘటనలో తొమ్మిది మంది చిన్నారులు మరణించారు. సాగర్‌ జిల్లాలోని షాపూర్‌లో హర్దౌల్‌ బాబా గుడి దగ్గర జరుగుతున్న ఓ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరి కొంత మంది చిన్నారులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాలను తొలగించారు. మధ్యప్రదేశ్‌లోని రెవా జిల్లాలోనూ శనివారం ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటి గోడ కూలి నలుగురు మృతిచెందారు. వీరంతా 5-7 ఏళ్ల వయసులో ఉన్నవారే. స్కూల్‌ నుంచి ఇంటికి తిరిగొస్తుండగా.. ఈ ఘటన జరిగింది. ఇంటి యజమానులను పోలీసులు అరెస్టు చేశారు.

* గుంటూరు జిల్లా తాడేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. నర్సుగా పనిచేస్తున్న యువతి (23)పై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. వడ్డేశ్వరంలోని హాస్టల్‌ వద్ద బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి గాయాలయ్యాయి. ఘటనాస్థలాన్ని తాడేపల్లి పోలీసులు పరిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన యువతి ఓ ప్రైవేటు వైద్యకళాశాలలో మూడేళ్లుగా నర్సుగా పనిచేస్తోంది. వైద్యకళాశాలకు చెందిన హాస్టల్‌లోనే ఉంటూ విధులకు హాజరవుతోంది. ఆదివారం సెలవు కావడంతో చర్చికి వెళ్లి తిరిగి హాస్టల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో యువతితో మాట్లాడేందుకు బందరు సమీపంలోని క్రోసూరుకు చెందిన క్రాంతి మౌళి యత్నించాడు. తాను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకోవాలని కోరాడు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన క్రాంతి మౌళి.. తన వద్ద ఉన్న బ్లేడుతో యువతి మెడపై దాడి చేశాడు. భయంతో ఆ యువకుడిని పక్కకు నెట్టే క్రమంలో ఆమె చేతిపైనా గాయాలయ్యాయి. యువకుడు పారిపోయేందుకు యత్నించగా.. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. యువతిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

* అనంతపురంలోని రామ్‌నగర్‌ సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి ఏటీఎంను గుర్తు తెలియని దొంగలు గ్యాస్‌ కట్టర్లతో పగులగొట్టి అందులో ఉన్న సుమారు రూ.30 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఏటీఎంలో అలారం సిస్టం పనిచేసి పోలీసులు అక్కడికి చేరుకునే లోపు పరారయ్యారు. ఆదివారం ఉదయం ఏటీఎంలో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. నాలుగో పట్టణ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. డాగ్‌స్వ్కాడ్‌, క్లూస్‌ టీం ఘటనాస్థలిలో ఆధారాలను సేకరించారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. త్వరలో దొంగలను పట్టుకుంటామని సీఐ ప్రతాప్‌రెడ్డి తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z