* భారత్‌పై (India) పొరుగు దేశం చైనా (China) అవకాశం దొరికినప్పుడల్లా విషం చిమ్ముతూనే ఉంది. వ్యూహాత్మక ప్రాంతాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ (Galwan) ఘటన తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇదే సమయంలో సమస్యాత్మక సరిహద్దు ప్రాంతాల్లో కాలనీలు ఏర్పాటు చేయడం, అరుణాచల్ ప్రదేశ్‌ను (Arunachal Pradesh) తమ భూభాగంలో చూపించడం లాంటి విపరీత చర్యలకు డ్రాగన్ పాల్పడింది. భారత్‌కు నష్టమని తెలిసినప్పటికీ.. బ్రహ్మపుత్ర నదిపై భారీ జలవిద్యుత్ కేంద్రం (సూపర్ డ్యామ్) నిర్మాణానికి సిద్ధమైంది. గత కొన్నాళ్లుగా ఈ వ్యవహారం స్తబ్దుగా ఉంది. కానీ, తాజాగా మరోసారి ఆ దిశగా చైనా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ (ASPI) ఓ నివేదిక విడుదల చేసింది. భారత్‌కు ముంచి ఉన్న ముప్పు గురించి ప్రమాద ఘంటికలు మోగించింది.
* చైనాకు చెందిన వింగ్ సూట్ ఫ్లైయర్ జాంగ్ షుపెంగ్.. హులున్‌బ్యూర్‌లోని మెర్గెల్‌గోల్ నదిపై వెయ్యి మీటర్ల ఎత్తులో గాల్లో ఎగిరాడు. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజియన్‌లో ఈ విన్యాసాన్ని నిర్వహించాడు. ప్రత్యేకంగా తయారు చేసిన వింగ్ సూట్‌తో అసాధారణ విన్యాసం ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. వింగ్ సూట్ ఫ్లయింగ్ ప్రపంచ మేటి క్రీడాకారుల్లో జాంగ్ షుపెంగ్ ఒకరు. ఈ సాహస క్రీడ సవాలుతో కూడినదిగా క్రీడాకారులు చెబుతారు.
* కమల్‌హాసన్ (Kamal Haasan) ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం ‘భారతీయుడు 2’ (Indian 2). శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది.
* పారిస్ ఒలింపిక్స్‌లో (Paris Olympics 2024) రెండు పతకాలు సాధించిన భారత షూటర్ మను బాకర్‌కు అరుదైన గౌరవం లభించింది. పోటీల ముగింపు వేడుకల్లో మను బాకర్ (Manu Bhaker) మహిళా పతాకధారిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 11న ఒలింపిక్స్ ముగింపు వేడుకలు జరగనున్నాయి. ఇప్పటి వరకు భారత్ మూడు కాంస్యాలను మాత్రమే సాధించింది. ఇందులో రెండు బాకర్‌వే కావడం విశేషం. మరో షూటర్ సరబ్‌జోత్ సింగ్ కాంస్యం గెలిచాడు. మరోవైపు పురుష పతాకధారి ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు.
* ఇంద్రకీలాద్రిపై పవిత్ర ఆషాఢసారె కార్యక్రమం వైభవంగా ముగిసింది. ఆషాఢమాసం నెలరోజులూ దుర్గాదేవికి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు సారె పేరుతో రకరకాల కానుకలు అర్పించారు. జగన్మాతకు సారెను ఇవ్వడం వల్ల సౌమాంగళ్యం సిద్ధిస్తుందని, పంటలు బాగా పండుతాయని, ఆరోగ్యంగా ఉంటామని భక్తుల నమ్మకం. ఇంద్రకీలాద్రిపై స్వర్ణాభరణాలతో పసిడికాంతులు వెదజల్లే కనకదుర్గమ్మను ఆడపడుచుగా భావించి పిల్లాపాపలతో సహా తరలివచ్చి భక్తులు సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీక్రోధి నామసంవత్సరం ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని గత నెల ఆరోతేదీ నుంచి ప్రారంభమైన ఈ పవిత్రసారె కార్యక్రమం ఆదివారంతో ముగిసింది.
* జనతాదళ్ (సెక్యులర్) పార్టీ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ దిల్లీ పర్యటనలో భాగంగా ఆదివారం అక్కడి మెట్రోలో ప్రయాణించారు. మాజీ ప్రధాని తమతో ప్రయాణించడంతో ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేవెగౌడ అధికారులతో ముచ్చటిస్తూ మెట్రో సేవల గురించి తెలుసుకున్నారు. కాగా దిల్లీలో ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రుల మ్యూజియాన్ని దేవెగౌడ శనివారం సందర్శించారు. దానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
* ఒలింపిక్స్‌లో సెమీఫైనల్ చేరుకుని చరిత్ర సృష్టించిన భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ కీలక మ్యాచ్‌లో తడబడ్డాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో 20-22, 14-21 తేడాతో విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం చవిచూశాడు. దీంతో ఫైనల్‌కు చేరి స్వర్ణం లేదా రజతం గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. లక్ష్యసేన్ ఇప్పుడు కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. తొలి గేమ్ ఆరంభంలో వెనుకబడినట్లు కనిపించిన లక్ష్యసేన్ తర్వాత పుంజుకున్నాడు. ఒక దశలో 15-11తో ఆధిక్యంలో నిలిచాడు. మరోవైపు అక్సెల్సెన్ క్రమంగా జోరు పెంచాడు. అయితే, లక్ష్యసేన్ మూడు గేమ్ పాయింట్‌లు వృథా చేసుకున్నాడు. అదే సమయంలో అక్సెల్సెన్ వరుసగా ఐదు పాయింట్లు సాధించి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌లో లక్ష్యసేన్ 7-0తో భారీ ఆధిక్యం కనబరిచినా తర్వాత తేలిపోయాడు. డెన్మార్క్ షట్లర్ జోరు పెంచి వరుసగా పాయింట్లు సాధించి తిరిగి పోటీలోకి వచ్చి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఆగస్టు 5న జరగనున్న కాంస్య పతక పోరులో లక్ష్యసేన్.. లీ జీ జియా (మలేసియా)తో తలపడనున్నాడు.
* ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు దూకుడు కొనసాగుతోంది. ఆదివారం క్వార్టర్‌ఫైనల్లో ప్రపంచ నంబర్-2 బ్రిటన్‌ను ఓడించి సెమీస్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్‌లో భారత్ 1 (4)- 1 (2) తేడాతో విజయం సాధించింది. తొలుత మ్యాచ్ 1-1తో టై అయింది. షూటౌట్‌లో భారత్ 4-2తో గెలుపొందింది. తొలి క్వార్టర్‌లో ఇరుజట్లు గోల్ చేయలేదు. రెండో క్వార్టర్ ఆరంభమైన కాసేపటికే భారత డిఫెండర్ అమిత్ రోహిదాస్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. హాకీ స్టిక్‌తో బ్రిటన్ ఆటగాడి తలపై ఉద్దేశపూర్వకంగా కొట్టాడని భావించిన రిఫరీలు రోహిదాస్‌ను రెడ్‌కార్డ్ ద్వారా బయటికి పంపారు. దీంతో తర్వాత భారత్ 10 మందితోనే ఆడింది. 22వ నిమిషంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించి భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు. 27వ నిమిషంలో మోర్టన్ లీ గోల్ చేయడంతో స్కోర్ సమం అయింది. తర్వాతి రెండు క్వార్టర్స్‌లో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. దీంతో మ్యాచ్ షూటౌట్‌కు దారితీసింది.
* అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త డగ్లస్ ఎమ్‌హోఫ్ తనకు గతంలో వివాహేతర సంబంధం ఉన్నట్లు అంగీకరించారు. తన మొదటి వివాహం సమయంలో తాను వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో తాను మొదటి భార్యను మోసగించినట్లు చెప్పారు.
* అత్యుత్తమ ప్రదర్శన చేసినప్పటికీ పారిస్ ఒలింపిక్స్‌లో (Paris Olympics) భారత్ బాక్సర్ నిశాంత్ దేవ్‌కు నిరాశ ఎదురైంది. 71 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్‌లో మెక్సికో బాక్సర్ మార్కో వెర్డే చేతిలో 4-1 తేడాతో నిశాంత్ ఓడిపోయాడు. తొలి రౌండ్‌లో ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ.. వరుసగా రెండు రౌండ్లలో ప్రత్యర్థి గెలిచాడు. నిశాంత్ ప్రతి రౌండ్‌లోనూ మెరుగ్గానే రాణించినా.. జడ్జీలు మాత్రం వెర్డెను విజేతగా ప్రకటించడంతో విమర్శలు వచ్చాయి. నిశాంత్‌కు మద్దతుగా భారత మాజీ ఛాంపియన్ విజేందర్ సింగ్, బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా పోస్టులు పెట్టారు. ‘‘అసలు స్కోరింగ్ సిస్టమ్ ఎలా చేశారో అర్థం కావడం లేదు. ఇది గొప్ప ఫైట్. నిశాంత్ చాలా అద్భుతంగా పోరాడాడు. బాధపడొద్దు నిశాంత్’’ అని విజేందర్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు. బాలీవుడ్ స్టార్ రణ్‌దీప్ హుడా కూడా ఒలింపిక్ కమిటీపై కాస్త ఘాటుగానే స్పందించాడు. ‘‘ఈ పోటీలో నిశాంత్ విజయం సాధించాడు. స్కోరింగ్ విధానం సరైందేనా? నీ నుంచి పతకాన్ని దోచేశారు. కానీ, నువ్వు మా మనసులను గెలిచావు. అత్యంత బాధాకరం. ఇలాంటివి చాలా జరిగాయి’’ అని పేర్కొన్నాడు.
* కేరళలోని వయనాడ్‌లో సంభవించిన ప్రకృతి విపత్తు వందలాది మందిని బలి తీసుకొంది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనను జాతీయ విపత్తుగా పరిగణించాలని వివిధ వర్గాల నుంచి డిమాండ్లు వస్తుండటంతో.. నిబంధనల ప్రకారం ఈ ఘటనను జాతీయ విపత్తుగా గుర్తించడం సాధ్యపడుతుందో లేదో కేంద్రం పరిశీలించనుంది అని కేంద్ర మంత్రి సురేశ్ గోపీ (Suresh Gopi) తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలను ఆయన పరిశీలించారు.
* పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ మరో పతకాన్ని అందుకునే అవకాశాన్ని కోల్పోయింది. మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ క్వార్టర్ ఫైనల్‌లో 1-4 క్వియాన్ (చైనా) చేతిలో ఓటమిపాలై సెమీస్ చేరే అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో లవ్లీనా నెగ్గితే భారత్‌కు మరో పతకం ఖాయమయ్యేది. టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా 69 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది.
* కోలీవుడ్ నటుడు విక్రమ్ (Vikram) హీరోగా దర్శకుడు పా.రంజిత్ (Pa Ranjith) తెరకెక్కించిన చిత్రం ‘తంగలాన్’ (Thangalaan). హిస్టారికల్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా ఇది సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర దర్శకుడు పా.రంజిత్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘తంగలాన్’ను చిత్రీకరించడం అంత సులభం కాదన్నారు. ఆ సినిమా షూట్‌లో చాలాసార్లు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయానన్నారు. ‘‘ఇప్పటివరకూ నేను దర్శకత్వం వహించిన చాలా చిత్రాలు సులభంగానే చిత్రీకరించా. ఇబ్బందులు ఎదురైనప్పటికీ చిత్రీకరణ మాత్రం సులువుగానే సాగింది. ‘తంగలాన్’ కోసం నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చా. 19 శతాబ్దం నేపథ్యంలో ఈ కథ ఉంటుంది. చిత్రీకరణలో చాలా సమస్యలు ఎదురయ్యాయి. అధిక సంఖ్యలో ఆర్టిస్టులను ఒకేసారి సెట్‌లో నియంత్రించడం సవాలుగా అనిపించింది. నటీనటుల నుంచి ఉత్తమ ప్రదర్శన వచ్చే వరకూ వర్క్ చేయడం.. ఆ కాలానికి అనుగుణంగా ఉండేలా అన్ని విషయాలను పలుమార్లు చెక్ చేసుకోవడం వంటివి ఒత్తిడితో కూడుకున్న వ్యవహారాలు. సాధారణంగా సెట్‌లో కూల్‌గా ఉంటా. ఎక్కువ ఒత్తిడికి గురి కాను. కానీ, ఈ సినిమా సెట్‌లో పలుమార్లు ఆవేశానికి లోనయ్యా. ఎందుకంటే ఇది ఎంతో ఇంటెన్స్‌తో కూడుకున్నది’’ అని పా.రంజిత్ తెలిపారు.
* ఏపీని గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందని భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. వైకాపాను ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. ఆ పార్టీ వాళ్లు మళ్లీ అధికారంలోకి వస్తామని గొప్పలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌ను పులివెందులలో కూడా ఓడిస్తామన్నారు.
* భారతదేశం అంటే గుర్తుకు వచ్చేది చీరకట్టు, సంప్రదాయం అని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. చేనేతను ప్రోత్సహిస్తూ ‘ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ’ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్డులో ఆదివారం ఉదయం శారీ వాక్ నిర్వహించారు. సుమారు 8 వేల మంది మహిళలు, విశాఖ యువతులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చీరలో అమ్మతనం, కమ్మదనం ఉంటుందని తెలిపారు. భావితరాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరారు. మహిళలకు స్ఫూర్తినిచ్చే ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు చెప్పారు. చీర నేయడంలో చేనేత కార్మికుల కష్టం ఉంటుందని పేర్కొన్నారు. నేతన్నలు ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అనిత తెలిపారు.
* కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ బలాన్ని ఉటంకిస్తూ విపక్షాలు చేస్తోన్న పలు వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తమ కూటమి ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకోవడమే కాదు.. 2029లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. చండీగఢ్‌లో 24×7 మణిమజ్ర నీటి సరఫరా ప్రాజెక్టును ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
* వృద్ధుల దర్శనంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని భక్తులకు తితిదే విజ్ఞప్తి చేసింది. రోజూ వెయ్యి మంది వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పిస్తున్నామని తెలిపింది. మూడు నెలల ముందే ప్రతినెలా 23న ఆన్‌లైన్ కోటా విడుదల చేస్తున్నామని పేర్కొంది. తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పీహెచ్‌సీ లైన్ ద్వారా రోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారని వెల్లడించింది. భక్తులు సరైన సమాచారానికి తితిదే అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించాలని సూచించింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z