* దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే 2,400 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్.. ఇంట్రాడేలో 2600 పాయింట్ల వరకు నష్టాల్లోకి జారుకుంది. నిఫ్టీ 24,300 దిగువన ఖాతా తెరిచిన నిఫ్టీ.. ఓ దశలో 24 వేల స్థాయిని కోల్పోయింది. ఆఖర్లో కాస్త కోలుకుని 24 వేల ఎగువన ముగిసింది. దలాల్ స్ట్రీట్‌లో ఒక్కసారిగా ఏర్పడిన కుదుపు కారణంగా రూ.15 లక్షల కోట్లు ఆవిరైంది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.457 లక్షల కోట్ల నుంచి రూ.442 లక్షల కోట్లకు పడిపోయింది. సెన్సెక్స్ ఉదయం 78,588.19 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 80,981) పాయింట్ల వద్ద భారీ నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 78,295 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 2,222.55 పాయింట్ల నష్టంతో 78,759.40 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 662 పాయింట్ల నష్టంతో 24,055 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.02గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌యూఎల్, నెస్లే ఇండియా షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగడం గమనార్హం. టాటా మోటార్స్ (7.32%), అదానీ పోర్ట్స్ (5.93%), టాటా స్టీల్ (5.31%), ఎస్‌బీఐ (4.34%), పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ (4.19%) ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 75.35 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2,465 డాలర్ల స్థాయిలో కొనసాగుతోంది.
అమెరికాలో మాంద్యం భయాలు: అమెరికాలో జులై నెలలో ఉద్యోగాల కల్పన అంచనాల కంటే నెమ్మదించింది. దీంతో మాంద్యం ముంచుకొస్తుందనే ఊహాగానాలు బలపడ్డాయి. వ్యవసాయేతర రంగాల్లో జులై నెలలో 1.14 లక్షల ఉద్యోగాలు మాత్రమే నమోదైనట్లు అక్కడి లేబర్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. వాస్తవానికి ఇది 1.75 లక్షల వరకు ఉండొచ్చని ముందుగా అంచనా వేశారు. జనాభా వృద్ధికి అనుగుణంగా ఉపాధి అవకాశాలను కల్పించాలంటే ఈ సంఖ్య 2 లక్షల వరకు ఉండాలని గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవంగా ఆ సంఖ్య చాలా దిగువన ఉండటంతో మాంద్యం రావొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు అక్కడ నిరుద్యోగిత రేటు 4.3 శాతానికి చేరుకుంది.
జపాన్‌లో అమ్మకాలు: బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇటీవల వడ్డీరేట్లను 0.25 శాతం పెంచింది. అలాగే బాండ్ల కొనుగోళ్లను తగ్గించింది. ఫలితంగా అక్కడి కరెన్సీ యెన్ బలపడింది. దీంతో నష్టాలను నివారించడం కోసం మదుపర్లు తమ వాటాలను విక్రయించడం ప్రారంభించారు. ఫలితంగా అమెరికా టెక్ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీని ప్రభావం ఆసియా సహా మొత్తం ప్రపంచ మార్కెట్లపై కనిపించింది. జపాన్ నికాయ్ సూచీ సోమవారం ఓ దశలో 14 శాతానికి పైగా కుంగింది. ఇతర ప్రపంచ మార్కెట్లూ అదే బాటలో కొనసాగాయి.
భౌగోళిక ఉద్రిక్తతలు: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సైతం మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణం ఎప్పుడు భగ్గుమంటుందోనని మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం.. సోమవారమే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయొచ్చని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ జీ7 దేశాలకు సమాచారమిచ్చారు. చమురుకు కేంద్రమైన పశ్చిమాసియాలో నెలకొన్న ఈ యుద్ధ వాతావరణం ఎప్పుడు ఏ రూపం దాలుస్తుందోనని ప్రపంచ దేశాలు భయభ్రాంతులకు గురవుతున్నాయి.
అధిక విలువలకు స్టాక్స్: గతవారం భారత మార్కెట్ సూచీలు రికార్డు గరిష్ఠాలను తాకాయి. బఫెట్ ఇండికేటర్‌గా పిలిచే మార్కెట్ క్యాప్, జీడీపీ నిష్పత్తి రికార్డు గరిష్ఠమైన 150 శాతానికి చేరింది. దీంతో అనేక కంపెనీల స్టాక్స్ అధిక విలువల వద్ద ట్రేడవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి స్థిరీకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ మేరకు మార్కెట్‌లో దిద్దుబాటు తప్పకపోవచ్చునని వివరించారు.
ఉత్సాహపర్చని త్రైమాసిక ఫలితాలు: ఇప్పటి వరకు వెలువడ్డ వివిధ కంపెనీల త్రైమాసిక ఫలితాలన్నీ మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. కానీ, ఎక్కడా మార్కెట్లను ఉత్సాహపరిచేంతటి పాజిటివ్ న్యూస్ లేకపోవడం గమనార్హం.
* గతంలో చైనా అధిక జనాభా ఉన్న దేశాల్లో మొదటి స్థానంలో ఉండేది. జనాభా నియంత్రణకు అప్పట్లో అధికారవర్గాలు చర్యలు తీసుకోవడంతో క్రమంగా జననాల సంఖ్య తగ్గడంతో అధిక జనాభా ఉన్న దేశంగా భారత్ ప్రథమస్థానంలోకి వచ్చింది. తాజా లెక్కల ప్రకారం చైనాలోని జనాభా సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఒక వైపు జననాల రేటు పడిపోతుండగా మరోవైపు వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ పెళ్లిళ్లు కూడా తగ్గుముఖం పడుతుండటంతో ప్రభుత్వ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఈ ఏడాది తొలి ఆరునెలల్లో 34 లక్షల జంటలు మాత్రమే ఒక్కటయ్యాయని అధికారులు పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం వివాహాల సంఖ్య 4.98 లక్షలు తగ్గిందని తెలిపారు. చైనాలో రోజురోజుకు ఉద్యోగావకాశాలు తగ్గుతుండటం దీనికి కారణమని, ఉద్యోగాల్లో స్థిరపడిన అనంతరమే వివాహాలు చేసుకోవాలనే ఆలోచన, యువకుల సంఖ్య తగ్గుముఖం పట్టడం, ఖర్చులు ఎక్కువ కావడం, మారుతున్న నిర్ణయాలు వివాహాల నమోదు తగ్గడానికి కారణాలని పేర్కొన్నారు.
* అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) తన వారసత్వ ప్రణాళికను ప్రకటించారు. 70 ఏళ్ల వయసులో బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన వయసు 62 సంవత్సరాలు. 2030లో తన కుమారులకు వ్యాపారాలను అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ విషయాలను ఆయన తాజాగా బ్లూమ్‌బెర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. బాధ్యతల బదిలీ ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా, సజావుగా జరగాలని రెండో తరానికి సూచించినట్లు అదానీ పేర్కొన్నారు. ప్రస్తుతం అదానీ గ్రూప్ (Adani Group) కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 213 బిలియన్ డాలర్లు. మొత్తం 10 నమోదిత సంస్థలు ఉన్నాయి. మౌలికం, పోర్టులు, షిప్పింగ్, సిమెంట్, స్వచ్ఛ ఇంధనం, విమానాశ్రయాలు, మీడియా సహా పలు రంగాల్లోకి అదానీ గ్రూప్ విస్తరించింది. తన తర్వాత వ్యాపారాలను ఉమ్మడిగా నిర్వహిస్తారా లేక ఎవరికివారు వేరుగా ఉంటారా అని కుమారులు కరణ్, జీత్‌లతో పాటు సోదరుల వారసులు ప్రణవ్, సాగర్‌లను ప్రశ్నించినట్లు ఈ ఇంటర్వ్యూలో గౌతమ్ అదానీ వెల్లడించారు. నిర్ణయించుకోవడానికి వారికి మూడు నెలల సమయం ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం తిరిగొచ్చిన వాళ్లు.. కలిసికట్టుగానే ముందుకెళ్తామని సమాధానమిచ్చినట్లు తెలిపారు. వ్యాపారాలన్నింటినీ వీరు ఒక కుటుంబ ట్రస్ట్ కింద నిర్వహిస్తున్నారు. ఈ ట్రస్ట్‌లో వీరు నలుగురూ సమాన వాటాదారులని గౌతమ్ అదానీ వెల్లడించారు.
* పెట్రోల్, డీజిల్ కార్ల స్థానంలో పర్యావరణ హిత సాంకేతికతతో నడిచే వాహనాలను భర్తీ చేసే విధాన పరమైన నిబంధనావళి కోసం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) ఎదురు చూస్తోందని ఆ కంపెనీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ వెల్లడించారు. ఎంఎస్‌ఐ వార్షిక నివేదిక (2023-24)లో వాటాదార్లనుద్దేశించి ఆయన ఏమన్నారంటే..‘విద్యుత్ వాహనాల తయారీలో ఎంఎస్‌ఐ నిదానంగా ఉందని కొందరు అంటున్నారు. కానీ పెట్రోల్, డీజిల్ కార్ల స్థానంలో పర్యావరణ హిత కార్లను తీసుకొచ్చే సాంకేతికతలను ప్రోత్సహించే విధానాల కోసం ఎదురుచూస్తున్నాం. ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులు, వనరుల లభ్యతను పరిగణనలోకి తీసుకుని విభిన్న సాంకేతికతలతో, వివిధ ధరల్లో మెరుగైన కార్లను అందించడమే మా వ్యూహం. హైబ్రిడ్ కార్లు ఇంధన సామర్థ్యాన్ని 35-45% మెరుగుపరుస్తాయి. కర్బన ఉద్గారాలను 25-35% తగ్గించడంలో సహాయపడతాయి. సీఎన్‌జీ కార్లు హైబ్రిడ్ కార్లంత శుభ్రంగా ఉండవు. కానీ పెట్రోల్, డీజిల్ కార్ల కంటే మెరుగ్గా ఉంటాయి. సీఎన్‌జీ పంపిణీకి మౌలిక సదుపాయాల నిర్మాణం జరుగుతున్నందున, సీఎన్‌జీ కార్ల విక్రయాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది మారుతీ 6 లక్షల సీఎన్‌జీ కార్లను విక్రయించే అవకాశం ఉంది’.
* ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో బిజినెస్ క్లాస్ సీట్లను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది. నవంబరు మధ్య నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. సంస్థ కార్యకలాపాలు ప్రారంభమై 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విషయాలు వెల్లడించింది. కొత్తగా ప్రవేశపెట్టనున్న బిజినెస్ క్లాస్ టికెట్లు మంగళవారం నుంచే బుకింగ్‌కు అందుబాటులోకి వస్తాయని ఇండిగో (IndiGo) సీఈవో పీటర్ ఎల్బర్స్ తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా మాత్రమే దేశీయ మార్గాల్లో బిజినెస్ క్లాస్ సీట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ‘ఇండిగో బ్లూచిప్’ పేరిట కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్‌ను కూడా తీసుకొస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z