* ప్రకృతి సృష్టించిన విలయానికి కేరళలోని వయనాడ్ అతలాకుతలమైంది. ఈ కఠిన సమయంలో కొందరు యువత ప్రాణాలకు తెగించి, సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వారిలో ప్రజీశ్ కూడా ఒకరు. కొండచరియలు విరిగిపడటంతో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రమాదాన్ని లెక్కచేయలేదు. ఎంతో మందిని కాపాడిన అతడి జాడ ఇప్పుడు తెలియకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి విపత్తు గురించి తెలియగానే వయనాడ్‌లోని చూరాల్‌మలకు చెందిన ప్రజీశ్ రంగంలోకి దిగారు. తోటివారికి అవసరం అంటే ఏమాత్రం ఆలోచించకుండా సహాయం చేయడంలో ముందుంటారన్న పేరుంది. ముండక్కై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయని తెలియగానే, రక్షించేందుకు ప్రమాదకర కొండ ప్రాంత మార్గంలో జీప్‌లో వెళ్లారు. అలా రెండుసార్లు పలువురిని కాపాడారు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అంతలోనే సహాయం కోసం మరో ఫోన్ కాల్ వచ్చింది. దాంతో మళ్లీ అదే ప్రాంతానికి జీప్‌లో వెళ్లి తిరిగి రాలేదు. చూరాల్‌మల ప్రాంతంలో ధ్వంసమైన జీప్ కనిపించింది. కానీ అతడి జాడ మాత్రం తెలియరాలేదని స్థానికులు వెల్లడించారు. ‘‘ప్రజీశ్ అంటే అందరికీ ఇష్టం. మా ఇళ్లలో ఎలాంటి కార్యక్రమమైనా ముందుండి తనవంతు సహకారం అందిస్తాడు. నా కుమార్తె పెళ్లికి అతడు చేసిన సహాయం మరువలేనిది’’ అని మరొకరు తెలిపారు.
* గతంలో చైనా అధిక జనాభా ఉన్న దేశాల్లో మొదటి స్థానంలో ఉండేది. జనాభా నియంత్రణకు అప్పట్లో అధికారవర్గాలు చర్యలు తీసుకోవడంతో క్రమంగా జననాల సంఖ్య తగ్గడంతో అధిక జనాభా ఉన్న దేశంగా భారత్ ప్రథమస్థానంలోకి వచ్చింది. తాజా లెక్కల ప్రకారం చైనాలోని జనాభా సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఒక వైపు జననాల రేటు పడిపోతుండగా మరోవైపు వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ పెళ్లిళ్లు కూడా తగ్గుముఖం పడుతుండటంతో ప్రభుత్వ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఈ ఏడాది తొలి ఆరునెలల్లో 34 లక్షల జంటలు మాత్రమే ఒక్కటయ్యాయని అధికారులు పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం వివాహాల సంఖ్య 4.98 లక్షలు తగ్గిందని తెలిపారు. చైనాలో రోజురోజుకు ఉద్యోగావకాశాలు తగ్గుతుండటం దీనికి కారణమని, ఉద్యోగాల్లో స్థిరపడిన అనంతరమే వివాహాలు చేసుకోవాలనే ఆలోచన, యువకుల సంఖ్య తగ్గుముఖం పట్టడం, ఖర్చులు ఎక్కువ కావడం, మారుతున్న నిర్ణయాలు వివాహాల నమోదు తగ్గడానికి కారణాలని పేర్కొన్నారు.
* నవంబర్ 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అమెరికాలోని పలు సంస్థలు ఎన్నికల ఫలితాలపై సర్వేలు నిర్వహిస్తున్నాయి. తాజాగా ప్రఖ్యాత సీబీఎస్ న్యూస్ సంస్థ విడుదల చేసిన పోల్ సర్వేలో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్.. ట్రంప్ కంటే ముందజంలో ఉన్నట్లు తేలింది.
* ప్రభుత్వంపై చేస్తోన్న ఫేక్ ప్రచారాలను కౌంటర్ చేయాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లు, అధికారులకు సూచించారు. అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ‘‘మంచిని చెప్పి.. ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. చెడు వచ్చినప్పుడు అది వాస్తవమని తెలిస్తే సాక్ష్యాధారాలతో సహా చెప్పాల్సిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగానిది. భట్టిప్రోలులో రెండు గ్రూపులకు మధ్య చిన్న గొడవ జరిగితే.. పోలీసుల చొక్కా పట్టుకున్నట్లు చిత్రీకరించారు. కొందరు నకిలీ వ్యక్తులు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేస్తున్నారు’’ అన్నారు. ‘‘మేం ఎవరినీ రాజకీయ బాధితులను చేయం. తప్పు చేసినవాళ్లను మాత్రం వదిలిపెట్టం. ప్రజాస్వామ్యంలో మళ్లీ తప్పులు చేయాలంటేనే భయపడాలి. 36 మందిని చంపేశారంటూ వైకాపా నేతలు దిల్లీకి వెళ్లి ధర్నా చేశారు. ఆ పేర్లు ఇవ్వండి.. ఎఫ్‌ఐఆర్ కాపీలు ఇవ్వండి చర్యలు తీసుకుంటాం అంటే ఇప్పటివరకు ఇవ్వలేదు. రాజకీయాలు కూడా మారాయి. రాజకీయ నేతలు పేపరు, టీవీలు పెట్టుకొని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి అసత్య ప్రచారం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇలాంటివి సహించరానివి’’ అని హెచ్చరించారు.
* తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడలో నీటిపారుదల శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లిఫ్ట్ ఇరిగేషన్ల పనితీరుపై పలువురు రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో రైతుల లేవనెత్తిన సమస్యలకు అధికారులు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంపై మంత్రి సీరియస్ అయ్యారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఏఈ, డీఈని హెచ్చరించారు. అలాగే, హుజూర్‌నగర్ డీఈ నవీన్‌ను సస్పెండ్ చేయాలని కలెక్టర్‌కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
* యువత పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొస్తే రుణాలతో పాటు అన్ని వసతులు కల్పిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ఎండపల్లిలో ఇండస్ట్రీయల్ పార్కు పనులకు భట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మధిరలో ఏర్పాటవుతున్న ఇండస్ట్రియల్ పార్కు రాష్ట్రానికి రోల్ మోడల్‌గా ఉండాలి. సమాజంలోని అన్ని వర్గాలనూ ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. మధిర పట్టణ విస్తరణకు కావాల్సిన బైపాస్ రోడ్లు నిర్మిస్తాం. ఇండస్ట్రియల్ పార్కుకు రూ.44కోట్లు కేటాయించాం. విద్య, వ్యవసాయక, పారిశ్రామిక కేంద్రంగా మధిరను నిలుపుతాం. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, సేవా రంగాలను అభివృద్ధిచేసుకొని సమగ్రాభివృద్ధి సాధించాలి. గ్రామాల్లో ఉన్నవారు పరిశ్రమల వైపు మళ్లితే ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహమిచ్చేందుకు సిద్ధంగా ఉంది’’ అన్నారు.
* ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని నెలల క్రితం శాంతియుతంగా మొదలైన నిరసనలు.. ఊహించని పరిణామాలకు దారితీశాయి. దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనలతో షేక్ హసీనా ప్రభుత్వం వణికిపోయింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో చివరకు దేశ ప్రధాని గద్దెదిగాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు.. వాటికి దారితీసిన కారణాలను పరిశీలిస్తే..1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాడినవారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. ప్రభుత్వ నిర్ణయం వివక్షపూరితంగా ఉందని, స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించిన ఆవామీ లీగ్ పార్టీ (హసీనా నేతృత్వంలోని) మద్దతుదారులకే అది ప్రయోజనం చేకూరుస్తుందనే వాదన మొదలైంది. దీంతో.. రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఇవి దేశవ్యాప్తంగా వ్యాపించడం, ఈ క్రమంలో చోటుచేసుకున్న ఘర్షణల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు.
* బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో పరిస్థితి చేజారింది. దాంతో సైన్యం రంగంలో దిగింది. దేశం మొత్తం దాని నియంత్రణలోకి వచ్చింది. ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నిరసనకారులు హింసామార్గాన్ని విడనాడాలని పిలుపునిచ్చారు. దీనికి ముందు షేక్ హసీనాకు ఆర్మీ అల్టిమేటం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె పదవి నుంచి దిగిపోయేందుకు 45 నిమిషాల సమయం ఇచ్చినట్లు పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే రాజీనామా చేసి, సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. త్రిపుర రాజధాని అగర్తలకు హసీనా చేరుకున్నారని తెలుస్తుంది. అక్కడి నుంచి లండన్‌కు వెళ్లనున్నారని సమాచారం.
* అద్దె చెల్లించలేక ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ వైకాపా కార్యాలయాన్ని మూసేశారు. ఎన్నికలకు రెండు నెలల ముందు వైకాపా సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావును ప్రకటించాక ఆ పార్టీ నాయకుడు నాగిరెడ్డికి చెందిన భవనంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి, అక్కడి నుంచే ప్రచార కార్యక్రమాలు, పార్టీ కార్యకలాపాలు నిర్వహించారు. అప్పుడు కార్యాలయ నిర్వహణ ఖర్చులు అధిష్ఠానమే భరించింది. అయితే ఎన్నికల్లో 42 వేల ఓట్ల పైచిలుకు తేడాతో నియోజకవర్గంలో పార్టీ ఓడిపోవడంతో రెండు నెలలుగా కార్యాలయ నిర్వహణ సందిగ్ధంలో పడింది. ఎన్నికలకు ముందు నియమించిన ముగ్గురు పరిశీలకులు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం, పోటీ చేసిన అభ్యర్థికి నిర్వహణ భారంగా మారడంతో కార్యాలయాన్ని మూసేశారు. ఈ క్రమంలో శనివారం రాత్రి కార్యాలయంలో ఉన్న ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను సైతం తొలగించేశారు. ఆర్థిక వనరులను సమకూర్చగలిగిన ఇన్‌ఛార్జి వచ్చే వరకు ఇక అంతే సంగతులంటూ కార్యకర్తలు చెబుతుండడం గమనార్హం.
* కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ బలంపై ప్రతిపక్షాలు పదేపదే ప్రశ్నలు లేవనెత్తుతుండటం పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. తమ కూటమి ప్రస్తుత పదవీకాలాన్ని సాఫీగా పూర్తిచేసుకోవడమే కాకుండా, 2029లోనూ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ధీమాగా చెప్పారు. చండీగఢ్‌లో ఆదివారం మనీమాజ్రా నీటి సరఫరా ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం షా ప్రసంగించారు. 2029లో మళ్లీ ఎన్డీయే, మోదీ రావడం ఖాయమన్నారు. గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో కలిపి కాంగ్రెస్ గెల్చుకున్న సీట్ల కంటే భాజపా 2024 ఎన్నికల్లో దక్కించుకున్న స్థానాల సంఖ్యే ఎక్కువని గుర్తుచేశారు. మొత్తం విపక్ష కూటమి కన్నా కమలదళానికే ప్రస్తుతం అధిక సంఖ్యా బలముందని తెలిపారు. ఎన్డీయే సర్కారు ఎక్కువ కాలం కొనసాగదంటూ పదేపదే చెప్పడం ద్వారా విపక్షాలు అనిశ్చితిని సృష్టించాలనుకుంటున్నాయని విమర్శించారు. గత పదేళ్లలో మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లోనూ గణనీయమైన ప్రగతి సాధించిందని షా పేర్కొన్నారు.
* తెలంగాణలో ఉపఎన్నికలు తప్పవని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయిస్తామని హెచ్చరించారు. దిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు.. న్యాయకోవిదులతో చర్చలు జరిపారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులపై దిల్లీలో భారాస న్యాయపోరాటం చేస్తుందన్నారు. రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశమవుతుందని, భారాస తరఫున త్వరలోనే సుప్రీం కోర్టులో కేసు వేస్తామని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z