* ఇంటెగ్రమ్ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుంచి 201 మెగావాట్ల ప్రాజెక్ట్ కోసం ఆర్డర్‌ను పొందినట్లు విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ‘ఐనాక్స్ విండ్’ మంగళవారం తెలిపింది. ఇది ఐనాక్స్ విండ్ తాజా 3 MW విండ్ టర్బైన్ జనరేటర్ల పరికరాల సరఫరాకు సంబంధించినది. ఐనాక్స్ విండ్, ప్రాజెక్ట్‌ను నిర్మించిన తర్వాత కొన్ని ఏళ్ల పాటు ప్రాజెక్ట్ కార్యకలాపాలతో పాటు నిర్వహణ సేవలను కూడా అందిస్తుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్‌ను అమలుజేస్తారు.
* దేశంలో ఎలక్ట్రానిక్ వాహన అమ్మకాలు ఊపందుకున్నాయి. జులైలో మొత్తం ఈవీ విక్రయాలు 1,79,038 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే సమయంలో నమోదైన 1,16,221 యూనిట్ల విక్రయాలతో పోలిస్తే 55.2శాతం వృద్ధి చెందింది. అదే సమయంలో ద్విచక్ర వాహన విక్రయాలు 96శాతం పెరిగాయని ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఫాడా (FADA) మంగళవారం వెల్లడించింది. కంపెనీలు ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందించడం, ఇ-మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్‌ను పొడిగించడమే ఇందుకు కారణమని పేర్కొంది. ద్విచక్ర వాహన విక్రయాలు జులైలో 1,07,016 యూనిట్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో వీటి విక్రయాలు 54,616 యూనిట్లకే పరితమైంది. దీంతో ఈ విభాగంలో 95.94శాతం వృద్ధి నమోదైంది. ఇక త్రీ- వీలర్ అమ్మకాలు 18.18 శాతం పెరిగి 63,667 యూనిట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో వాణిజ్య వాహనాల అమ్మకాలు 364 యూనిట్ల నుంచి 816 యూనిట్లకు చేరాయి. జులైలో 2W, 3W ఈవీ విభాగంలో పెరుగుతున్న మార్కెట్ వాటానే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణను సూచిస్తోందని ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) మరోసారి నష్టాల్లో ముగిశాయి. నిన్నటి భారీ అమ్మకాల తర్వాత నేడు ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో కోలుకున్న మార్కెట్లు.. ఆఖర్లో మళ్లీ నష్టాల బాట పట్టాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలపై పడింది. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 900కి పైగా పాయింట్లు లాభపడి.. చివరికి నష్టాల్లో ముగియడం గమనార్హం. నిఫ్టీ 24 వేల స్థాయిని కోల్పోయింది. సెన్సెక్స్ ఉదయం 78,981.97 (క్రితం ముగింపు 78,759.40) పాయింట్ల లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 78,496.57 – 79,852.08 మధ్య చలించిన సూచీ.. చివరికి 166.33 పాయింట్ల నష్టంతో 78,593.07 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 63 పాయింట్ల నష్టంతో 23992.55 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.80గా ఉంది. సెన్సెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటాన్ షేర్లు నష్టపోయాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ షేర్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ చమురు ధర 76.46 డాలర్లు, బంగారం ధర ఔన్సు 2,453.30 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.
* దేశీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు విదేశీ విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సుమారు రూ.10వేల కోట్ల పన్ను ఎగవేశారన్న ఆరోపణలపై పది విమానయాన సంస్థలకు నోటీసులు పంపించినట్లు తెలిసింది. ఇందులో బ్రిటిష్ ఎయిర్‌వేస్, లుఫ్తాన్సా, ఒమన్ ఎయిర్, ఎమిరేట్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ వంటి సంస్థలు ఉన్నాయి. 2017 నుంచి 2024 మార్చి మధ్య తమ భారతీయ శాఖల్లో పొందిన సేవలకు గానూ ట్యాక్సులు చెల్లించడంలో ఆయా కంపెనీలు విఫలమైన నేపథ్యంలో ఈ నోటీసులు పంపిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వివిధ దేశాల్లో ప్రధాన కేంద్రాలు ఏర్పాటు చేసుకుని విమాన సర్వీసులు నిర్వహించే సంస్థలు.. దేశీయంగా ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్, సిబ్బంది వేతనాలు, అద్దెలు వంటివి చెల్లిస్తుంటాయి. చట్టపరంగా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు చేసే చెల్లింపులు జీఎస్టీకి లోబడి ఉంటాయి కాబట్టి ఆయా సంస్థలు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అవి తమకు వర్తించవని విమానయాన సంస్థల వాదన.
* ఆన్‌లైన్ సెర్చ్ విషయంలో గుత్తాధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ (Google) చట్టవిరుద్ధంగా వ్యవహరించిందని అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి ఒకరు తీర్పిచ్చారు. దీన్ని అక్కడి టెక్ నిపుణులు ఒక చరిత్రాత్మక తీర్పుగా అభివర్ణిస్తున్నారు. ఇప్పటి ఇంటర్నెట్ శకంలో గూగుల్ ఆధిపత్యానికి ఇది చెంపపెట్టులాంటిదని అక్కడి మీడియా సంస్థలు విశ్లేషించాయి. ఇకపై గూగుల్ వ్యాపార విధానంలో మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలిపాయి. సెర్చ్ వ్యాపారంలో గూగుల్ (Google) తన గుత్తాధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు యత్నించిందని వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఉందని కొలంబియా డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి అమిత్ పి.మెహతా తేల్చారు. శాంసంగ్, యాపిల్ సహా బడా కంపెనీలతో గూగుల్ ఒప్పందాలు చేసుకుందని.. తద్వారా ఆయా డివైజ్‌లలో గూగుల్ సెర్చ్ డిఫాల్ట్‌గా ఉండేలా వారికి చెల్లింపులు చేసిందని ఆరోపిస్తూ అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ సహా అక్కడి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టును ఆశ్రయించాయి. గూగుల్ విధానాలు చట్టవిరుద్ధమని వ్యాజ్యంలో పేర్కొన్నాయి.
* ప్రపంచస్థాయి టెక్ దిగ్గజ సంస్థలను, పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆయన యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ ఏపీఏసీ హెడ్ సంజయ్ గుప్తాలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుపై వారితో చర్చించినట్లు చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z