Editorials

హసీన సహయాకుడి పేరున ₹248కోట్లు-CrimeNews-Aug 06 2024

హసీన సహయాకుడి పేరున ₹248కోట్లు-CrimeNews-Aug 06 2024

* బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వం కూలిపోవడంతో రాజకీయ అస్థిరత నెలకొంది. ఈ తరుణంలో ఓ విషయం వైరల్‌గా మారింది. మాజీ ప్రధాని సహాయకుడి పేరు మీద వందల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. హసీనా నివాసంలో పనిచేసిన జహంగీర్ ఆలం అనే సహాయకుడి పేరు మీద రూ.284 కోట్ల ఆస్తులున్నాయని ఓ వార్త వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఆ వ్యక్తి అమెరికాలో నివసిస్తున్నారు. ఒక సహాయకుడికే అంత ఆస్తి ఉంటే, ఐదుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన హసీనా పేరు మీద ఇంకెంత ఆస్తి ఉందో..? అని పలు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల వేళ సమర్పించిన అఫిడవిట్‌లో ఆమె ఆస్తుల మొత్తం విలువ రూ. 3.14 కోట్లుగా పేర్కొన్నారు. ఆరు ఎకరాల వ్యవసాయ భూమిలో పండించే పంట, చేపల పెంపకం తన ఆదాయంలో ప్రధాన భాగమని తెలిపారు. తన వద్ద బహుమతిగా వచ్చిన కారు ఒకటి ఉందని తెలిపారు. అధికారంలో ఉన్న సమయంలో ఆమె ఏడాదికి రూ.9.9లక్షలు వేతనం అందుకున్నారు.

* సంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మునిపల్లి మండలం కంకోల్‌ టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో తనిఖీలు చేపట్టిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సుమారు 4.8 కిలోల బంగారు ఆభరణాలను పట్టుకున్నారు. ముంబయి నుంచి హైదరాబాద్‌కు వీటిని తరలిస్తున్నట్లుగా గుర్తించారు. సరైన పత్రాలు లేకపోవడంతో చంద్రేష్‌ అనే వ్యక్తి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.బంగారంతో పాటు, దాన్ని తరలిస్తున్న వ్యక్తిని సంగారెడ్డి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

* కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్‌ బియ్యం అక్రమాలకు చెక్‌పెట్టడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఎనిమిది విభాగాల పర్యవేక్షణలో చెక్‌ పోస్ట్‌ను ఏర్పాటు చేసింది. కాకినాడ యాంకరేజ్‌ పోర్టు నుంచి ముంబయి రోడ్డులో చెక్‌ పోస్టును ఏర్పాటు చేయగా.. నిన్న ఒక్కరోజే ఆరు లారీల్లో బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో కాకినాడ పోర్టు పీఎస్‌ వద్ద మరో చెక్‌ పోస్ట్‌ ఏర్పాటు చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్‌ అధికారులను ఆదేశించారు. కాకినాడ పోర్టు మార్గంలో అన్ని లారీలూ తనిఖీ చేయాలని సూచించారు.

* రక్త సంబంధంతోనే బాంధవ్యం ఉండదని, అనురాగంతోనూ బంధాలు ముడివడతాయని నిరూపించలేని ఓ యువతి నిస్సహాయురాలైంది. తాను అన్నగా భావించి పంచిన అనురాగాన్ని అపార్థం చేసుకున్న తండ్రి మందలించటంతో మనస్తాపానికి గురై బలవన్మరణం చెందింది. ఉన్నత చదువులు చదివే యువకులు పెడతోవ పడతారన్న ఆ తండ్రి అనుమానం కూతురి ప్రాణాలు బలి తీసుకుంది. నంద్యాల జిల్లా డోన్‌ పట్టణానికి చెందిన జక్కి గౌరప్ప, రామేశ్వరి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం. వీరిలో పెద్దదైన రేణుక యల్లమ్మ (22) మాచర్లలోని న్యూటన్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో సీఈసీ రెండో సంవత్సరం చదివేది. వేసవి సెలవలు ముగించుకొని ఈమధ్య ఆమె కళాశాలకు తిరిగొచ్చింది. స్థానిక ఆంధ్రాబ్యాంకు పైనున్న కళాశాల వసతి గృహంలో తన స్నేహితులతో కలిసి ఉండేది. ఆదివారం సాయంత్రం రేణుకను చెల్లెలిగా చూసుకునే ఆమెతో పాటు ఇంజినీరింగ్‌ చదువుతున్న ఓ విద్యార్థి ఫోన్‌ చేయగా పనిలో ఉండి ఆమె స్పందించ లేదు. దీంతో ఆ విద్యార్థి ఆమె తండ్రి గౌరప్పకు ఫోన్‌ చేసి ఆమె ఫోన్‌ తీయటం లేదని చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన తండ్రి కూతురికి ఫోన్‌ చేసి గట్టిగా మందలించాడు. కళాశాలలో చదువుకునే అమ్మాయిలకు అబ్బాయిలతో పనేంటి, అతనెందుకు ఫోన్‌ చేస్తున్నాడు, ఈ విషయాన్ని కళాశాలలో తేలుస్తానంటూ ఊగిపోయాడు. రేణుక ఎంత చెప్పినా తండ్రి వినకపోగా సోమవారం తెల్లవారేసరికి కళాశాలకు వస్తాననటంతో భయపడింది. తండ్రి వస్తే జరిగే పరిణామాలను ఊహించుకుంటూ తన మరణంతోనే సమస్య తీరుతుందని భావించి.. తాను ఏ తప్పూ చేయలేదని ఉత్తరం రాసి వసతి గృహంలో ఖాళీగా ఉన్న గదిలో ఫ్యానుకు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం కూతురు కోసం వసతి గృహానికి తల్లిదండ్రులు రావటంతో ఆమె స్నేహితులు రేణుక కోసం వెతుకులాట ప్రారంభించారు. ఒక గదిలో ఆమె ఫ్యానుకు ఉరి వేసుకొని కనిపించటంతో భీతిల్లిన విద్యార్థినులు గట్టిగా కేకలు వేయగా వసతి గృహ సిబ్బంది, మృతురాలి తల్లిదండ్రులు అక్కడి చేరుకున్నారు. విషయాన్ని పోలీసులకు తెలపటంతో పట్టణ సీఐ బ్రహ్మయ్య సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. ఆమె స్నేహితుల నుంచి వివరాలు సేకరించి మృతురాలి తండ్రి గౌరప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z