* బ్రిటన్‌లోని భారతీయులకు ఊరట కలిగించే విషయం. బ్రిటిష్ పౌరులు, శాశ్వత నివాసితులు (భారత వారసత్వం ఉన్నవారితో సహా) తమ బంధువులను కుటుంబ వీసాపై తీసుకువచ్చేందుకు ఉన్న నిబంధనలపై కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇందుకు సంబంధించి వార్షిక ఆదాయ పరిమితిని పెంచుతూ రిషి సునాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పక్కనపెట్టింది. దీంతో వార్షికాదాయం 38వేల పౌండ్లు (41.5లక్షలు) ఉండనవసరం లేదు. లేబర్ పార్టీ నిర్ణయం అక్కడ నివసిస్తోన్న అనేక మంది భారతీయులకు ఉపశమనం కలిగించనుంది. కుటుంబ ఆదాయ పరిమితిని 29వేల పౌండ్ల నుంచి 38,700 పౌండ్లకు పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు బ్రిటన్ హోంశాఖ మంత్రి యెవెట్ కూపర్ ఇటీవల పేర్కొన్నారు. 2025 నుంచి అమల్లోకి తీసుకురానున్న ఈ విధానాన్ని వలసవాద సలహా కమిటీతో సమీక్షించాలని నిర్ణయించామన్నారు. అంతవరకు ప్రస్తుతమున్న కుటుంబ ఆదాయ పరిమితి 29వేల పౌండ్లుగానే ఉండనుందని చెప్పారు. వలసలకు సంబంధించి తమ ప్రభుత్వం కొత్త విధానాన్ని అనుసరిస్తుందని పేర్కొన్న కూపర్.. విదేశీయులను నియమించుకునే ముందు, స్థానిక శ్రామిక శక్తికి నైపుణ్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తామన్నారు.
* ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ (Badminton) విభాగంలో ఈసారి భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. పారిస్‌లో ఒక్క పతకమూ సాధించకుండానే భారత క్రీడాకారులు వెనుదిరిగారు. చివరి వరకు పోరాడిన స్టార్ షట్లర్ లక్ష్య సేన్ (Lakshya Sen) కీలక పోరులో తడబడి పతకాన్ని చేజార్చుకున్నాడు. ఈ క్రమంలోనే అతడి ప్రదర్శనపై లక్ష్య మెంటార్, బ్యాడ్మింటన్ దిగ్గజ ఆటగాడు ప్రకాశ్ పదుకొణె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు మరింత బాధ్యతగా వ్యవహరించాలని అన్నాడు. దీనికి మరో స్టార్ షట్లర్ అశ్విని పొన్నప్ప (Ashwini Ponnappa) ఘాటుగా బదులిచ్చారు. సోమవారం జరిగిన పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) పురుషుల సింగిల్స్ కాంస్య పతక పోరులో మలేసియా ఆటగాడు లీ జియా చేతిలో లక్ష్య సేన్ 21-13, 16-21, 11-21తో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌పై ప్రకాశ్ పదుకొణె (Prakash Padukone) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘కేవలం ఒక్క ఆటగాడి విజయంతో మనం సంతృప్తి చెందలేం. అందరిపైనా దృష్టి పెట్టాల్సిందే. మీకు ఏం కావాలో అడుగుతున్నప్పడు.. దానికి తగిన జవాబుదారీతనం కూడా ఉండాలి. ఆటగాళ్లు మరింత బాధ్యత తీసుకోవడం నేర్చుకోవాలి’’ అని మీడియాతో అన్నాడు.
* పారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అదరగొడుతోంది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగం క్వార్టర్స్‌లో 7-5 తేడాతో లివచ్ ఒక్సానా (ఉక్రెయిన్)పై విజయం సాధించి ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీస్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో ఆరంభంలో వినేశ్ 4-0తో ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ దశలో ప్రత్యర్థి కూడా గట్టి పోటీ ఇచ్చి పాయింట్లు రాబట్టడంతో స్కోరు 5-4గా మారింది. చివర్లో వినేశ్ పుంజుకుని విజయం సాధించింది. అంతకుముందు డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్‌కు చెందిన సుసాకీకి వినేశ్ షాక్ ఇచ్చింది. నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఆమెను ప్రిక్వార్టర్స్‌లో 3-2 తేడాతో ఓడించింది. తొలుత 0-2తో వెనుకబడిన భారత రెజ్లర్ చివర్లో గొప్పగా పుంజుకుంది. ఆఖరి ఐదు సెకన్లలో మూడు పాయింట్లు సాధించి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. వినేశ్.. సెమీస్‌లో గెలిస్తే భారత్‌కు మరో పతకం ఖాయమవుతుంది. ఇవాళ రాత్రి జరిగే 10: 15 గంటలకు జరిగే సెమీ ఫైనల్‌లో యుస్నీలిస్ లోపెజ్ (క్యుబా)తో తలపడుతుంది.2016 రియో ఒలింపిక్స్‌లో మోకాలికి తీవ్ర గాయమవడంతో వినేశ్ అర్ధంతరంగా నిష్క్రమించాల్సి వచ్చింది. టోక్యోలో ఆశలు రేపినా క్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. ఇప్పుడు పతకం గెలవడానికి ఆమెకు మంచి అవకాశం దొరికింది.
* వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు విషయంలో ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్పష్టత ఇచ్చారు. జీవో 33తో స్థానిక విద్యార్థులు నష్టపోతారంటూ మాజీ మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా చేసిన వ్యాఖ్యలకు మంత్రి స్పందించారు. ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపునకు సంబంధి 2017 జులై 5న అప్పటి భారాస ప్రభుత్వం జారీ చేసిన జీవో 114ని ప్రస్తావించిన మంత్రి.. ఆ జీవోలోని 9 నుంచి 12 తరగతి వరకు చదివిన విద్యార్థులను స్థానికులుగా పరిగణిస్తూ చేసిన నిబంధనను జీవో 33లో కొనసాగించామని పేర్కొన్నారు. అయితే, అదే జీవోలోని 6 నుంచి 12 వరకు కనీసం నాలుగేళ్లు విద్యార్థులు చదివిన ప్రాంతానికి స్థానికతను వర్తింపజేయాలన్న నిబంధనను కొనసాగించలేమని మంత్రి స్పష్టం చేశారు. జీవో 114లోని ఈ నిబంధన ప్రకారం విద్యార్థి నాలుగేళ్లు తెలంగాణలో.. మిగిలిన మూడేళ్లు ఏపీలో చదివితే వారిని తెలంగాణ స్థానికులుగా పరిగణించారని గుర్తు చేశారు. అయితే ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జూన్ 2తో పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో నిబంధనను కొనసాగించలేమని మంత్రి పేర్కొన్నారు.
* టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లోనూ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన క్వాలిఫికేషన్ (గ్రూప్ బి)లో తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. ఈ గ్రూప్‌లో నీరజ్‌దే అగ్రస్థానం. చోప్రాతోపాటు తొలి ప్రయత్నంలోనే గ్రెనెడాకు చెందిన పీటర్స్ అండర్సన్ (88.63 మీ) రెండో స్థానంలో, పాకిస్థాన్‌కు నదీమ్ అర్షద్ (86.59 మీ) మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు క్వాలిఫై అయ్యారు. బ్రెజిల్ అథ్లెట్ డా సిల్వా లూయిజ్ మారిసియో మూడో ప్రయత్నంలో 85.91 మీటర్లు విసిరి నాలుగో స్థానంలో నిలిచాడు. మల్దోవాకు చెందిన ఆండ్రియన్ మూడో ప్రయత్నంలో (84.13 మీ) ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించాడు. ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించాలంటే జావెలిన్‌ను 84 మీటర్ల దూరం విసరాలి. ఆగస్టు 8న రాత్రి 11:55 గంటలకు ఫైనల్ పోటీలు జరగనున్నాయి. భారత్‌కు చెందిన మరో జావెలిన్ త్రోయర్ కిశోర్ జెనా ఫైనల్‌కు చేరుకోలేకపోయాడు. గ్రూప్ ఎలో అతడు అత్యుత్తమంగా తొలి ప్రయత్నంలో 80.73 మీటర్ల ప్రదర్శన చేశాడు. రెండో ప్రయత్నంలో ఫౌల్ చేశాడు. మూడో ప్రయత్నంలో జావెలిన్‌ను 80.21 మీటర్లు విసిరాడు.
* బంగ్లాదేశ్(Bangladesh)లో ఏకంగా ప్రభుత్వాన్ని మార్చే స్థాయి ఆందోళనలు నిర్వహించింది ఓ 26 ఏళ్ల కుర్రాడు. చిన్న ఆందోళనగా మొదలైన రిజర్వేషన్ల ఉద్యమం ఏకంగా ప్రధాని హసీనా భవితవ్యాన్ని అంధకారం చేసింది. బంగ్లాదేశ్ పతాకాన్ని నుదుటకు చుట్టుకొని తరచూ ఆందోళనల్లో మీడియాకు కనిపించాడు. మొత్తం ఉద్యమాన్ని సమన్వయం చేశాడు. ఆ యువకుడి పేరు నహిద్ ఇస్లామ్. అతడు ఢాకా విశ్వవిద్యాలయంలో సోషియాలజీ విద్యార్థి. ఈ ఏడాది జులైలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నహిద్, మరికొందరు విద్యార్థులు ఆందోళన చేస్తుండటంతో పోలీసులు అరెస్టు చేశారు. తొలిసారి అతడు బంగ్లాదేశ్ ప్రజల దృష్టిని అప్పుడే ఆకర్షించాడు. ఆ తర్వాత అదే ఉద్యమం తుపానుగా మారి ప్రభుత్వాన్ని చుట్టుముట్టింది. ఈ ఘర్షణల్లో 300 మంది విద్యార్థులు మరణించారు. వీరిలో చాలా మంది వివిధ విశ్వవిద్యాలయాలకు చెందినవారు. దీంతో హసీనా పదవికి రాజీనామా చేసి భారత్‌కు వెళ్లిపోయారు. నేటి సాయంత్రం నహిద్, ఇతర విద్యార్థి నాయకులు ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్‌తో భేటీ కానున్నారు. ఈ విద్యార్థుల బృందం సైన్యం లేదా ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అంగీకరించడంలేదు. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనిస్ చీఫ్ అడ్వైజర్‌గా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. విద్యార్థి ఉద్యమం ఆమోదం లేని ఏ ప్రభుత్వాన్ని అంగీకరించబోమని నహిద్ ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నాడు. 1998 సంవత్సరంలో ఢాకాలో నహిద్ జన్మించాడు. అతడి తండ్రి ఓ టీచర్. అతడి సోదరుడు నఖిబ్. అతడు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నాడు. తన సోదరుడి గురించి నఖిబ్ చెబుతూ ‘‘అతడు ఎప్పుడూ దేశంలో మార్పు రావాలని ఆకాంక్షించేవాడు. అతడిని పోలీసులు అరెస్టు చేసి.. స్పృహతప్పేలా హింసించారు. ఆ తర్వాత రోడ్డుపై పారేశారు. అయినా భయపడకుండా పోరాటాన్ని కొనసాగించాడు’’ అని పేర్కొన్నాడు.
* భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో 52 ఏళ్ల కాంబ్లీ నడవలేని స్థితిలో కనిపించాడు. ఏదో పని మీద బయటికొచ్చిన అతడు ఓ షాప్ ముందు ఉన్న బైక్‌ని పట్టుకుని నిల్చున్నాడు. ఆ షాప్‌లోకి వెళ్లడానికి కాంబ్లీ ప్రయత్నించాడు. కానీ, అతడు సరిగ్గా నడవలేక ఇబ్బందిపడ్డాడు. దీనిని గమనించిన స్థానికులు అతడి చేతులు పట్టుకుని నెమ్మదిగా షాప్‌లో కూర్చోబెట్టారు. అయితే, ఈ వీడియో ఇప్పటిదా? పాతదా అనే దానిపై స్పష్టత లేదు. వినోద్ కాంబ్లీ కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆర్థికంగానూ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. బీసీసీఐ ఇచ్చే పింఛనుతోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లు కాంబ్లీ గతంలో పేర్కొన్నాడు. వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో అతడి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar).. తన మిత్రుడు అయిన కాంబ్లీకి సహాయం చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
* ఏపీలోని గన్నవరం విమానాశ్రయం వద్ద వైకాపా నేతలు దురుసుగా ప్రవర్తించారు. మాజీ సీఎం జగన్ రాక దృష్ట్యా ట్రాఫిక్ ఇబ్బందులు సృష్టించారు. విమాన ప్రయాణికులకు మాజీ మంత్రి వెల్లంపల్లి, అతడి అనుచరులు ఆటంకాలు సృష్టించారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన వెల్లంపల్లి.. రోడ్డుపైనే బైఠాయించి హడావుడి చేశారు. దీతో కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో వెల్లంపల్లి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
* బంగ్లాదేశ్‌లో (Bangladesh) గతకొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న ఆందోళనకర పరిస్థితులను భారత్ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ వచ్చింది. సోమవారం అది తీవ్రరూపం దాల్చి ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) రాజీనామాకు దారితీయటంతో మరింత అప్రమత్తమైంది. ఆమె భారత్‌కు వస్తున్నారని తెలుసుకున్న మన భద్రతా దళాలు గగనతలంపై నిఘా వేశాయి. అటువైపు నుంచి వచ్చే విమానం భారత్‌లోకి సురక్షితంగా ప్రవేశించేలా చూడాలని నిర్ణయించాయి. భారత వాయుసేన రాడార్లు బంగ్లాదేశ్ (Bangladesh) గగనతలాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అటు నుంచి ఓ విమానం వస్తున్నట్లు మన భద్రతా బలగాలు గమనించాయి. దాంట్లో ఎవరు వస్తున్నారో ముందే పసిగట్టిన అధికారులు దాన్ని భారత్‌లోకి అనుమతించాలని ఆదేశించారు. పైగా ఈ విమానానికి రక్షణ కల్పించేందుకు పశ్చిమ బెంగాల్‌లోని హాసీమారా వైమానిక స్థావరం నుంచి 101 స్వ్కాడ్రన్‌లోని రఫేల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. హసీనా (Sheikh Hasina) ప్రయాణిస్తున్న విమానానికి బిహార్, ఝార్ఖండ్ మీదుగా అవి రక్షణ కల్పించాయి.
* మాజీ సీఎం జగన్‌కు సరిపడా భద్రత కల్పిస్తున్నామని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. ఒక మాజీ సీఎంకు 980మందితో భద్రత అవసరమా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా, భద్రతపై రాజకీయ లబ్దికోసమే జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారన్నారు. తెదేపా కార్యాలయంలో మంగళవారం ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు వచ్చిన వినతుల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూదోపిడీ, దాడులు, అక్రమాలపైనే పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నట్లు తెలిపారు. జగన్ బాధితులు.. పులివెందుల నుంచి ప్రజా దర్బార్‌కు వస్తున్నారని ఈ సందర్భంగా అనిత వెల్లడించారు.
* తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ‘హర్ ఘర్ తిరంగా’, స్థానిక సంస్థల ఎన్నిలకపై నేతలు చర్చించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘‘భాజపా కార్యాలయంలో రుణమాఫీకి సంబంధించి కాల్‌సెంటర్ ఏర్పాటు చేశాం. దీనికి వేల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. రుణమాఫీ కాలేదని రైతులు ఫోన్ చేసి చెబుతున్నారు. రుణమాఫీ కాకపోవడంతో వారంతా ఆందోళనలో ఉన్నారు. రుణమాఫీకి ప్రాతిపదిక ఏంటో తెలియట్లేదని రైతులు చెబుతున్నారు’’ అని అన్నారు.
* ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న స్కైవాక్‌లోని ఓ లిఫ్ట్ సాంకేతిక కారణాలతో మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో అందులో ముగ్గురు విద్యార్థులు చిక్కుకుపోయారు. చాలా సమయం వరకు అది తెరుచుకోకపోవడంతో వారు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని లిఫ్ట్‌ను తెరిచి విద్యార్థులను కాపాడారు. లిఫ్ట్‌లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసినా స్పందన కరవైందని విద్యార్థులు తెలిపారు. గతంలో పలు మార్లు ఇలాంటి సంఘటనలు జరిగినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని చెబుతున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z