Business

లాభాల బాటలో మార్కెట్లు-BusinessNews-Aug 07 2024

లాభాల బాటలో మార్కెట్లు-BusinessNews-Aug 07 2024

* జీవిత, ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియంలపై జీఎస్టీని (GST) రద్దు చేయాలంటూ డిమాండ్లు ఊపందుకున్న వేళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala sitharaman) స్పందించారు. ఈ అంశంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆమెకు తొలుత లేఖ రాయగా.. తాజాగా ఇండియా కూటమి సభ్యులు లోక్‌సభ వేదికగా జీఎస్టీ తొలగించాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో లోక్‌సభలో ఆమె మాట్లాడారు.

* ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ వేదికగా ఏదైనా ఆర్డర్‌ చేసే సమయంలో క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఎంచుకుంటుంటాం. అయితే డెలివరీ తీసుకున్న తర్వాత డబ్బు చెల్లించాలంటేనే అసలు సమస్య వస్తుంది. సరైన మొత్తం ఉండదు, పోనీ ఛేంజ్‌ తిరిగి తీసుకుందామంటే డెలివరీ ఏజెంట్ల వద్ద సరైన చిల్లర ఉండదు. దీంతో చిర్రెత్తిపోతాం. ఇలాంటి ఇబ్బందులు చాలా మందికి ఎదురైంటుంది. అటువంటి సమస్యలకు చెక్‌ పెట్టేందుకు జొమాటో సిద్ధమైంది. దీని కోసం కొత్త సదుపాయం తీసుకొచ్చింది. ఈ విషయాన్ని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్‌ (Deepinder Goyal) ‘‘ఎక్స్‌’’ వేదికగా వెల్లడించారు.

* సైబర్‌ నేరగాళ్లు కొత్త పంథాలతో అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటూనే ఉన్నారు. ఇన్నాళ్లు ఉద్యోగం, వ్యాపారం, చలాన్లు, ఆఫర్లు అంటూ రకరకాల పంథాల్లో మోసాలకు పాల్పడిన సైబర్‌ నేరగాళ్లు.. తాజాగా ఐటీ రీఫండ్ల పేరిట మెసేజ్‌లు పంపుతూ కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఐటీ రిటర్నులు దాఖలు చేసి రీఫండ్ల కోసం ఎదురుచూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని డబ్బు దోచుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో కేంద్ర ఐటీ శాఖ పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేసింది. ఇలాంటి సందేశాలు నమ్మొద్దంటూ ప్రకటన జారీ చేసింది.

* అపర కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) ఛైర్మన్‌ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) వరుసగా నాలుగో ఏడాదీ ఒక్క రూపాయి కూడా కంపెనీ నుంచి వేతనంగా తీసుకోలేదు. కరోనా నుంచి వేతనం తీసుకోవడం ఆపేసిన ముకేశ్‌ అంబానీ.. గడిచిన ఆర్థిక సంవత్సరంలోనూ (2003-24) ఆ ఆనవాయితీని కొనసాగించారు. తండ్రి బాటలో తనయులు కూడా ఎలాంటి వేతనం తీసుకోనప్పటికీ.. బోర్డు సభ్యులుగా సిట్టింగ్‌ ఫీజు, కమీషన్‌ రూపంలో కొంతమొత్తం అందుకున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మన సూచీలూ దూసుకెళ్లాయి. సెన్సెక్స్ ఓ దశలో వెయ్యి పాయింట్ల మేర లాభపడగా.. నిఫ్టీ 24వేల స్థాయిని తిరిగి అందుకుంది. దీంతో మూడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. బడ్జెట్లో ప్రతిపాదించిన దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విషయంలో కేంద్రం మార్పులు చేపట్టడమూ రియల్టీ షేర్లకు కలిసొచ్చింది. సెన్సెక్స్‌ ఉదయం 79,565.40 పాయింట్ల (క్రితం ముగింపు 78,593.07) వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 79,639.20 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 875 పాయింట్ల లాభంతో 79,468 వద్ద ముగిసింది. నిఫ్టీ 305 పాయింట్లు లాభపడి 24,297 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారక విలువ 83.80గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో అదానీ పోర్ట్స్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, టెక్‌ మహీంద్రా, టైటాన్‌, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ చమురు ధర 77.38 డాలర్లు వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2434 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

* టెక్‌ కంపెనీల్లో లేఆఫ్‌ల (layoffs)ల పర్వం కొనసాగుతోంది. ఇటీవల ఇంటెల్‌ (Intel) సంస్థ పెద్దఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించగా.. తాజాగా ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్‌ (Dell) సైతం అదే బాటపట్టింది. దాదాపు 12,500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఇది కంపెనీ శ్రామిక శక్తిలో 10 శాతంతో సమానం. ఈ విషయాన్ని కంపెనీ తాజా ప్రకటనలో వెల్లడించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) యుగంలో తమ వ్యాపారాన్ని పునరుద్ధరించడంపై దృష్టి సారించామని, వృద్ధిపై దృష్టి సారించామని డెల్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందులో భాగంగానే సేల్స్‌ విభాగంలో ఉద్యోగులను తగ్గించుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంతర్గత మెమోల ద్వారా ఆగస్టు 6న తొలగింపుల విషయాన్ని ఉద్యోగులకు తెలియజేశారు. అందులో పెట్టుబడులకు అధిక ప్రాధాన్యం ఇస్తూనే, వ్యాపారాన్ని నిరంతం అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేస్తున్నట్లు అందులో కంపెనీ పేర్కొంది.

* సరస్వతీ శారీ డిపో లిమిటెడ్‌ ఐపీఓ ఆగస్టు 12 – 14 మధ్య జరగనుంది. షేరు ధరల శ్రేణిని కంపెనీ రూ.152 – 160గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.160 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లు ఒక రోజు ముందే బిడ్లు దాఖలు చేయొచ్చు. రిటైల్‌ ఇన్వెస్టర్లు రూ.14,400తో కనీసం 90 (ఒక లాట్‌) షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. గరిష్ఠంగా రూ.187,200తో 13 లాట్లు కొనుగోలు చేయొచ్చు. సరస్వతీ శారీ డిపో ఈ ఐపీఓలో 65 లక్షల కొత్త షేర్లు, మరో 35 లక్షల షేర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద అందుబాటులో ఉంచనుంది. పబ్లిక్ ఇష్యూలో సమీకరించిన నిధులను నిర్వహణ మూలధనంతో పాటు సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z