Sports

ఆసుపత్రిలో జేరిన వినేస్ ఫొగాట్-NewsRoundup-Aug 07 2024

ఆసుపత్రిలో జేరిన వినేస్ ఫొగాట్-NewsRoundup-Aug 07 2024

* పారిస్‌ ఒలింపిక్స్‌ (Paris Olympics 2024) రెజ్లింగ్‌లో ఫైనల్‌కు చేరిన వినేశ్‌ ఫొగాట్‌పై అనూహ్యంగా అనర్హత వేటు పడింది. వంద గ్రాముల అధిక బరువు ఉండడం వల్ల ఒలింపిక్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో వినేశ్‌ పెద్ద నాన్న మహవీర్‌ స్పందించారు. ‘‘బంగారు పతకం కోసం దేశమంతా ఎదురు చూసింది. ఎవరైనా రెజ్లర్‌ 50-100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నా ఆడటానికి అనుమతిస్తారు. అయితే, అక్కడ రూల్స్‌ మాత్రం అలా ఉండటంతో వేటు పడింది. దేశ ప్రజలెవరూ నిరాశ చెందొద్దని కోరుతున్నా. ఆమె ఏదొక రోజు దేశం కోసం తప్పకుండా పతకం సాధిస్తుంది. ఆమెను తదుపరి ఒలింపిక్స్‌ కోసం సన్నద్ధం చేస్తా’’ అని వెల్లడించారు.

* ఒలింపిక్స్‌ (Paris Olympics 2024)లో స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ (Vinesh Phogat)పై అనర్హత వేటు పడటం యావత్‌ భారతావనిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఫైనల్‌ పోరుకు ముందు ఆమె నిర్ణీత బరువు కంటే కొన్ని గ్రాములు ఎక్కువగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల అనంతరం ఆమె అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. డీహైడ్రేషన్‌ కారణంగా స్పృహ కోల్పోవడంతో బుధవారం ఉదయం ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. వినేశ్‌ మంగళవారం బౌట్‌ సమయంలో తన బరువు నియంత్రణలోనే ఉంచుకొంది. ఆటగాళ్లు రెండ్రోజులు బరువును నిర్ణీత కేటగిరి పరిధిలోనే ఉంచుకోవాల్సి ఉంటుంది. కానీ, మంగళవారం రాత్రికి వినేశ్‌ 2 కిలోల అదనపు బరువు ఉంది. దీంతో జాగింగ్‌, సైక్లింగ్‌, స్కిప్పింగ్‌ వంటివి చేసింది. భోజనం కూడా తీసుకోకపోవడమే గాక.. బరువును తగ్గించుకునేందుకు రాత్రంతా మేల్కొనే ఉన్నట్లు సమాచారం. దీంతో డీహైడ్రేషన్‌కు గురైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఆమెకు ఒలింపిక్‌ గ్రామంలోని పాలిక్లినిక్‌లో చికిత్స అందిస్తున్నట్లు (Vinesh Phogat Hospitalised) తెలుస్తోంది. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సదరు కథనాలు తెలిపాయి.

* యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భారీగా ఆదాయం లభించింది. స్వామివారికి నెల రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించగా రూ.రెండున్నర కోట్లకు పైగా నగదు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కొండకింద శ్రీసత్య నారాయణస్వామి వ్రత మండపంలో చేపట్టిన ఈ లెక్కింపులో స్వామివారికి నగదు రూపంలో రూ.2,66,68,787, మిశ్రమ బంగారం 87 గ్రాములు, వెండి 3,300 గ్రాములు చొప్పున వచ్చినట్లు ఈవో భాస్కరరావు వెల్లడించారు. లెక్కింపులో ఈవోతో పాటు ఆలయ ధర్మకర్త నరసింహ మూర్తి, ఆలయ సిబ్బందితో పాటు సేవా సంస్థల సభ్యులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామి వారికి భారీగా విదేశీ కరెన్సీ కూడా వచ్చింది.

* తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరనున్నట్లు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకార్‌ ఉజ్‌ జమాన్‌ వెల్లడించారు. గురువారం సాయంత్రం 8 గంటలకు యూనస్‌ ప్రమాణస్వీకారం ఉంటుందన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి విలేకరులతో మాట్లాడిన ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకార్‌ ఉజ్‌ జమాన్‌.. 15 మందితో ప్రభుత్వ సలహా మండలి ఏర్పాటు కానుందని చెప్పారు. పార్లమెంటును రద్దు చేసి, యూనస్‌ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఉద్యమకారులు చేసిన డిమాండ్‌ నేపథ్యంలోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

* ఎంబీబీఎస్‌ ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 33పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం గుడ్డెద్దు చేలో పడ్డట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నూతన ఉత్తర్వుల వల్ల రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తును రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోలేదన్నారు. కొత్త ఉత్తర్వుల వల్ల రాష్ట్ర విద్యార్థులే స్థానికేతరులు అవుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ హయాంలో భారీగా ఎంబీబీఎస్‌ సీట్లు పెంచామని.. బీ కేటగిరీ సీట్లు కూడా రాష్ట్ర విద్యార్థులకే దక్కేలా చేశామని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరిగేలా ఉత్తర్వులు తీసుకొచ్చిందని విమర్శించారు. విద్యలో స్థానికత కోసం సమగ్ర విధానం తీసుకురావాలని కోరారు.

* వారంలో ఒక్కరోజైనా ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు. దేశంలో అతిపెద్ద అసంఘటిత ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే రంగాల్లో చేనేత ఒకటి.. ఇదొక కళాత్మకమైన పరిశ్రమ అన్నారు. ఏపీలో ఉప్పాడ, మంగళగిరి, చీరాల, పెడన, పొందూరు, ఎమ్మిగనూరు, వెంకటగిరి… చేనేత వస్త్రాలకు ప్రతీకలుగా ఉన్నాయని తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన చేనేత కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.

* మహారాష్ట్రలోని ముంబ్రాలో అనూహ్య ఘటన జరిగింది. ఐదంతస్తుల భవనం పైనుంచి ఓ పెంపుడు శునకం జారి.. కింద రోడ్డుపై వెళ్తున్న మూడేళ్ల బాలికపై పడింది. ఈ దుర్ఘటనలో బాలిక మృతి చెందగా శునకం గాయపడింది. అమృత్ నగర్‌లో ఓ బాలిక.. తన తల్లి చేయిని పట్టుకుని రహదారిపై నడుస్తూ వెళ్తోంది. అదే సమయంలో ఐదంతస్తుల భవనంపై ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో కలిసి ఉన్నాడు. ఒక్కసారిగా అది తన యజమాని దగ్గరి నుంచి దూరంగా పరిగెత్తి గ్యాలరీ పైనుంచి జారి రోడ్డుపై పడింది. అది నేరుగా బాలికపై పడటంతో.. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. తల్లి వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలిక మృతి చెందింది. కుక్కకు వెటర్నరీ ఆస్పత్రిలో చికిత్స అందించారు.

* విజయవాడలో చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని ముగించుకొని ఉండవల్లి వెళ్తూ సీఎం చంద్రబాబు మధ్యలో ఆగారు. ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి కిందకు దిగిన సీఎం.. బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లును ఆసక్తిగా తిలకించారు. వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజీ వద్దకు వచ్చిన సందర్శకులను దగ్గరకు పిలిచి మాట్లాడారు. దీంతో పలువురు సందర్శకులు సీఎంతో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కృష్ణమ్మకు జలకళ రావడం చూసి ఎంతో సంతోషిస్తున్నట్లు తెలిపారు. ఈ నీటి ప్రవాహాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉందంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

* వ్యవసాయం, రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గత ఐదేళ్లలో జలవనరుల శాఖను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆయన విమర్శించారు. మళ్లీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఆ శాఖను గాడిలో పెడుతున్నామని చెప్పారు.

* తెదేపా హయాంలో నిర్మించిన భవనాలు, రోడ్ల నిర్వహణను వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి పి.నారాయణ అన్నారు. రాజధాని అమరావతిలో ప్రత్యేక పూజల అనంతరం జంగిల్‌ క్లియరెన్స్‌ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సుమారు 24వేల ఎకరాల్లో జంగిల్‌ క్లియరెన్స్‌ చేపడతామని.. నెలలోపు ఆ పనులు పూర్తిచేస్తామన్నారు. నిర్మాణంలో ఉన్న భవనాల నాణ్యతను ఐఐటీ హైదరాబాద్‌, ఐఐటీ చెన్నై నిపుణులు పరిశీలించారని.. త్వరలో ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి అందజేస్తారన్నారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తామని చెప్పారు.

* వైకాపా నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలను పేర్ని నాని దాచారనే అనుమానం కలుగుతోందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. తెదేపా కార్యాలయంపై దాడి చేస్తే.. తన ప్రాణరక్షణకే చేశారని వంశీని పేర్ని నాని వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. తన కుమారుణ్ని పెట్టి పేర్ని నాని చేసిన గంజాయి దందా త్వరలోనే బయటపడుతుందని పేర్కొన్నారు. వైకాపా నేతల పాపాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని తెలిపారు. వైకాపా హయాంలో అవినీతి చేసిన ఎవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

* మాజీ సీఎం జగన్‌ భద్రతకు ఏటా రూ.90 కోట్ల ఖర్చు అవసరమా అని ఉండి తెదేపా ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడారు. ‘900 మంది భద్రతా సిబ్బందికి నెలకు రూ.7.50 కోట్ల చొప్పున, సంవత్సరానికి రూ.90 కోట్లు ఖర్చవుతుంది. జగన్‌ ప్రాణాలకు ప్రజల వల్ల ముప్పు లేదు. ప్రతిపక్షంలో ఉన్న ఆయన ప్రజలతో కలిసి వెళ్లాల్సిన సమయం వచ్చింది. 900 మంది సెక్యూరిటీని పెట్టుకుంటే ఎక్కడకు వెళ్తారు? విదేశాల్లో చదువుకునే ఆయన కుమార్తెలకు భద్రత ఎందుకు?’ అని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z