ScienceAndTech

ChatGPTలో ఇక అవి ఉచితం-NewsRoundup-Aug 09 2024

ChatGPTలో ఇక అవి ఉచితం-NewsRoundup-Aug 09 2024

* 16 మంది నూతన నటీనటులతో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu). నిహారిక కొణిదెల (Niharika Konidela) సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాకు వస్తున్న స్పందన గురించి నిహారిక, యదు వంశీ మాట్లాడారు. ‘‘మా చిత్రాన్ని ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇంత మంచి ఫీచర్‌ ఫిల్మ్‌ తీస్తానని నేనెప్పుడూ అనుకోలేదు’’ అని నిహారిక కొణిదెల చెప్పారు.

* వైకాపాకు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు జిల్లాకు చెందిన ముఖ్యనేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌కు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆళ్ల నాని పేర్కొన్నారు. ఈ మేరకు రాజీనామా లేఖను వైకాపా అధ్యక్షుడు జగన్‌కు పంపించారు. వైకాపా హయాంలో డిప్యూటీ సీఎం పదవితో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఆళ్ల నాని పనిచేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవలే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా వైకాపాను వీడిన సంగతి తెలిసిందే.

* సూర్య (Suriya) హీరోగా దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజు తెరకెక్కిస్తున్న చిత్రం ‘సూర్య 44’ (Suriya 44) (వర్కింగ్‌ టైటిల్‌). ఆ సినిమా షూటింగ్‌లో సూర్య తలకు గాయమైందంటూ కోలీవుడ్‌లో వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. దానిపై నిర్మాత రాజశేఖరన్‌ పాండియన్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. సూర్యకు స్వల్ప గాయమైందని ధ్రువీకరించిన ఆయన.. నటుడు కోలుకున్నారని తెలిపారు. ఆందోళన చెందొద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

* ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌ ఫైనల్స్‌కు చేరిన వినేశ్‌ ఫొగాట్‌.. అదనపు బరువు కారణంగా పతకానికి దూరమైన విషయం తెలిసిందే. దీనిపై కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (CAS) విచారణ జరపనున్న నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ స్పందించారు. వినేశ్‌ ఫొగాట్‌ రజత పతకానికి అర్హురాలేనన్నారు. అంపైర్‌ తీర్పునకు సమయం ఆసన్నమైందన్న ఆయన.. వినేశ్‌కు రజత పతకం వస్తుందని ఆశిద్దామంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘ప్రతి ఆటలోనూ నియమాలుంటాయి. వాటిని సందర్భోచితంగా చూడాల్సి ఉంటుంది. స్వచ్ఛమైన ఆటతీరుతో వినేశ్‌ ఫొగాట్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్స్‌కు ముందు అదనపు బరువు కారణంగా అనర్హత వేసి రజత పతకానికి దూరమైంది. ఇందుకు సహేతుక కారణం కనిపించకపోవడంతోపాటు క్రీడా స్ఫూర్తి లోపించినట్లే’’ అని సచిన్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

* టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యుడు, పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూబ్లీహిల్స్‌లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. టీ20 ప్రపంచకప్‌ సాధించిన తర్వాత హైదరాబాద్‌ చేరుకున్న సిరాజ్‌.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశాడు. ఆయనకు టీమ్‌ ఇండియా జెర్సీని కూడా బహూకరించాడు. సిరాజ్‌ను అభినందించిన సీఎం.. హైదరాబాద్‌లో ఇంటిస్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయిస్తూ జీవో జారీ చేసింది.

* దిల్లీ మద్యం కేసులో ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియాకు బెయిల్‌ వచ్చిందని.. అరవింద్‌ కేజ్రీవాల్‌, కవితకు కూడా వస్తుందని భావిస్తున్నామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఛార్జ్‌షీట్‌ వేశాక జైల్లో ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కవితకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశామన్నారు. త్వరలోనే బెయిల్‌ వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. జైల్లో కవిత 11 కిలోల బరువు తగ్గారని.. బీపీ, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని కేటీఆర్‌ తెలిపారు.

* కృత్రిమ మేధ (AI) ఆధారంగా ఓపెన్‌ ఏఐ సంస్థ రూపొందించిన చాట్‌జీపీటీ (ChatGPT) బాగా ప్రాచుర్యం పొందింది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేస్తోంది. తాజాగా తీసుకొచ్చిన డాల్‌- ఇ 3 ఏఐ మోడల్‌ అందరికీ అందుబాటులోకి తేవాలని నిర్ణయించుకుంది. దీంతో ఇప్పటివరకు చాట్‌జీపీటీ ప్లస్‌ సబ్‌స్క్రైబర్లకు మాత్రం యాక్సెస్‌ ఉన్న ఈ ఫీచర్‌ను అందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే దీనిపై పరిమితి ఉంది. టెక్ట్స్‌ సాయంతో ఇమేజ్‌ను రూపొందించే సదుపాయంతో చాట్‌జీపీటీ డాల్-ఇ 3 ఎఐ మోడల్‌ను రూపొందించింది. దీన్ని గతేడాది సెప్టెంబరులో తీసుకొచ్చింది. అయితే అప్పటి నుంచి కేవలం చాట్‌జీపీటీ ప్లస్‌ చందాదారులకు మాత్రమే యాక్సెస్‌ చేసే సదుపాయం ఉండేది. ఓపెన్‌ఏఐ తాజా నిర్ణయంతో ఈ ఫీచర్‌ను అందరూ ఉచితంగా వినియోగించుకొనే వెసులుబాటు వచ్చింది. దీనిపై పరిమితిని నిర్ణయించింది. రోజుకు రెండు చిత్రాలను మాత్రమే క్రియేట్‌ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ విషయాన్ని చాట్‌జీపీటీ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించింది. సంబంధిత వీడియోను కూడా పోస్ట్‌ చేసింది.

* దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం మరో అరుదైన సందర్భానికి వేదికైంది. బాలీవుడ్‌ చిత్రం ‘లాపతా లేడీస్‌ (Laapataa Ladies)’ను నేడు సుప్రీంకోర్టులో ప్రదర్శిస్తుండటమే అందుకు కారణం. సాయంత్రం 4.15 గంటల నుంచి ఈ సినిమా ప్రదర్శన ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు ఆమిర్‌ ఖాన్‌, ఆ చిత్ర దర్శకురాలు కిరణ్ రావ్‌ ఆ సినిమాను వీక్షించేందుకు సుప్రీంకోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమిర్‌ వస్తున్నట్లు ప్రకటించిన సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ సరదా వ్యాఖ్యలు చేశారు. ‘‘కోర్టులో తొక్కిసలాట తరహా పరిస్థితిని నేను కోరుకోను. కానీ ఈరోజు ఇక్కడ ఆమిర్‌ ఉన్నారు..’’ అంటూ చమత్కరించారు. ఈ సినిమాను సీజేఐ, ఇతర న్యాయమూర్తులు, వారి కుటుంబాలు, ఇతర సిబ్బంది వీక్షిస్తున్నారు. తన చిత్రాలతో సామాజిక అంశాలను లేవనెత్తే ఆమిర్ సొంత బ్యానర్‌పై ‘లాపతా లేడీస్‌ (Laapataa Ladies) తెరకెక్కిన విషయం తెలిసిందే.

* పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకం సాధించడం క్రీడాకారుల జీవితకాల స్వప్నం. ఈ విశ్వక్రీడల్లో సత్తా చాటేందుకు నిరంతరం ఎంతో శ్రమిస్తుంటారు. ఇక టోర్నీ సమయంలో పతకమే లక్ష్యంగా అవిశ్రాంతంగా సాధన చేస్తారు. కానీ, ఇందుకు భిన్నంగా మహిళ పట్ల సభ్యంగా ప్రవర్తించిన ఓ రెజ్లర్‌ను ఫ్రెంచ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఒలింపిక్స్‌ నిర్వహకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒలింపిక్స్‌ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ఈజిప్టు రెజ్లర్‌ ముహమ్మద్ అల్-సయ్యద్ గురువారం అర్థరాత్రి తాగిన మత్తులో ఓ మహిళను అసభ్యంగా తాకినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో శుక్రవారం తెల్లవారుజామున అతడిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, బుధవారం జరిగిన 67 కేజీల గ్రీకో-రోమన్ రెజ్లింగ్‌లో ముహమ్మద్ అల్-సయ్యద్ అజర్‌బైజాన్‌ దేశానికి చెందిన హస్రత్ జఫరోవ్ చేతిలో ఓడిపోయాడు. అరెస్టయని అతడిని విడుదల చేసే అంశంపై ఇంకా స్పష్టత రాలేదని నిర్వాహకులు తెలిపారు. కాగా.. 2021లో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో అల్-సయ్యద్‌ కాంస్యం సాధించాడు.

* పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) ముగిశాయి. ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి (adjourned sine die). ఇక ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా నీట్‌ లీకేజీ వ్యవహారం, రైల్వే భద్రత తదితర అంశాలు ఉభయ సభలను కుదిపేశాయి. పార్లమెంట్‌ సమావేశాలు గత నెల 22 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు 2023-24 ఆర్థికసర్వేను ఆర్థిక మంత్రి లోక్‌ సభలో ప్రవేశపెట్టారు. ‘భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటూ భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పటిష్టంగా ఉంది’ అని ఈ ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. ఆ తర్వాత 23వ తేదీన 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఎన్డీయే కూటమి ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌పై ఉభయ సభల్లో వాడీవేడిగా చర్చ కొనసాగింది. చర్చ అనంతరం కేంద్ర బడ్జెట్‌కు సభ ఆమోదం తెలిపింది. ఇక ఈ సమావేశాలు ఆగస్టు 12వ తేదీ వరకూ కొనసాగుతాయని ప్రభుత్వం ముందే ప్రకటించినప్పటికీ ఉభయ సభలు ముందుగానే నిరవధికంగా వాయిదా పడ్డాయి.

* జోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఆయన సెల‌బ్రిటీల‌ జాతకం చెబుతూ.. ఆయన కూడా ఓ సెల‌బ్రిటీ అయిపోయాడు. అయితే ఈ మ‌ధ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌లో జ‌గ‌న్ గెలుస్తాడ‌ని చెప్పి బొక్కబోర్లా పడ్డాడు. దీంతో ఆయ‌న‌పై విప‌రీతంగా ట్రోల్స్ వ‌చ్చాయి. ఇక ట్రోల్స్‌ని త‌ట్టుకోలేని వేణుస్వామి ఇక‌పై తాను ఎవ‌రి జాత‌కం చెప్ప‌న‌ని ప్ర‌క‌టించాడు. దీంతో ఈ వివాదం స‌ద్దుమ‌ణిగింది. అయితే తాజాగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జంట‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు వేణుస్వామి. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జాత‌కం క‌ల‌వ‌లేద‌ని అలాగే వాళ్లిద్ద‌రు ఎంగేజ్‌మెంట్ చేసుకున్న స‌మ‌యం క‌రెక్ట్ కాద‌ని వేణు స్వామి వెల్ల‌డించాడు. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి చేసుకున్న అనంత‌రం ఒక అమ్మాయి వ‌ల‌న 2027లో విడిపోతార‌ని ప్ర‌క‌టించాడు.

* ప్రపంచ ఆదివాసీ దినోత్సం సందర్భంగా ఆదివాసీ, గిరిజనులకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు. విధ్వంసపు దారుల నుంచి వికసిత తోవలు.. మోడువారిన బతుకుల్లో మోదుగు పూల పరిమళాలు గుభాలిస్తున్నాయని చెప్పారు. గిరిజనులు, ఆదివాసీల దశాబ్దాల డిమాండ్లను నెరవేర్చిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు. ఆదివాసీల మూడు డిమాండ్లయిన స్వయంపాలన, రిజర్వేషన్ల పెంపు, పోడు భూముల పట్టాలను కేసీఆర్‌ నిజం చేశారని తెలిపారు.

* రాజ్య‌స‌భ(Rajya Sabha) చైర్మెన్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌, ఎంపీ జ‌యాబ‌చ్చ‌న్ మ‌ధ్య మ‌రోసారి మాట‌ల యుద్ధం సాగింది. జ‌యా అమితాబ్ బచ్చ‌న్ మాట్లాడాల‌ని కోరుతూ చైర్మెన్ ధ‌న్‌క‌ర్ పిలిచారు. ఆ స‌మ‌యంలో లేచిన జ‌యా.. త‌న‌కు జయా అమితాబ్ బ‌చ్చ‌న్ అని పిలువాల‌ని లేద‌న్నారు. తాను ఒక ఆర్టిస్టును అని, శ‌రీర భాష‌ను అర్థం చేసుకోగ‌ల‌నని, మీ స్వ‌రం ఆమోద‌యోగ్యంగా లేదని చైర్మెన్‌ను ఆమె త‌ప్పుప‌ట్టారు. దీంతో చైర్మెన్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ సీరియ‌స్ అయ్యారు. ఇక చాలు. నువ్వు ఎవ‌రైనా కావొచ్చు. కానీ స‌భా మ‌ర్యాద పాటించాలని, డైరెక్ట‌ర్ ఆధీనంలోనే న‌టులు ఉంటారన్నారు. నువ్వు సెల‌బ్రిటీవే కావొచ్చు. నాకే గుర్తింపు ఉంద‌న్న‌ భావ‌న‌లోనే ఉండ‌కండని తెలిపారు. తాము కూడా గుర్తింపుతోనే ఈ స్థాయికి వ‌చ్చిన‌ట్లు ధ‌న్‌క‌ర్ తీవ్ర స్వ‌రంలో చెప్పారు.

* కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్(MLA Sanjay) మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఫిట్స్(Fits) వచ్చిన వ్యక్తికి ప్రథమ చికిత్స(First aid) చేసి ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల-మెట్‌పల్లి రహదారిపై ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న డిచ్‌పల్లికి చెందిన వ్యక్తికి అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి కిందపడిపోయాడు. అదే సమయంలో అటువైపు వెళ్తున్న ఎమ్మెల్యే సంజయ్ గమనించి ఫిట్స్ వచ్చిన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించారు. ఏమీ కాదని తగ్గిపోతుందని భరోసా కల్పించారు. సకాలంలో స్పందించి వైద్యమందించిన ఎమ్మెల్యేను పలువురు అభినందించారు.

* వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ రెండో పెళ్లి వ్యవహారం ఇప్పుడు సెన్సేషనల్‌గా మారింది. కొంతకాలంగా మొదటి భార్యను విడిచిపెట్టి రెండో భార్యతోనే ఉంటున్నాడని మొదటి భార్య కుమార్తెలు రోడ్డెక్కారు. నాన్నను కలవాలని ఉందంటూ దువ్వాడ ఇంటిముందు అర్ధరాత్రి దాకా పడిగాపులు పడ్డారు. ఈ విషయం ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్‌ సతీమణి వాణి స్పందించారు. తన భర్త దువ్వాడ శ్రీనివాస్‌తో ఉండాలని కోరుకోవడం లేదని దువ్వాడ వాణి స్పష్టం చేశారు. ఆయన వల్ల తన కుటుంబం పరువు పోతుందని అన్నారు. దువ్వాడ శ్రీనివాస్‌ టెక్కలి వదిలివెళ్లాలని డిమాండ్‌ చేశారు. దువ్వాడ శ్రీనివాస్‌ వల్ల తనకేమీ ఆస్తులు రాలేదని స్పష్టం చేశారు. చొక్కా లుంగీతో వచ్చిన శ్రీనివాస్‌కు ఎలాంటి ఆస్తులు లేవని వెల్లడించారు. ఆయన రాజకీయాలతో తామే ఎక్కువగా నష్టపోయామని తెలిపారు.

* వైసీపీ ఐదేండ్ల పాలనలో ప్రజాధనం దుర్వినియోగమయిందని ఏపీ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఎంతటి వారినైనా విడిచిపెట్టేది లేదని, వారిని విచారిస్తున్నామని పేర్కొన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. తణుకులో టీడీఆర్ బాండ్ల (TDR Bonds) లో రూ.700 కోట్ల అవినీతి జరిగినట్లు తేలిందని అన్నారు. ఈ అక్రమాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటికే విచారణ కమిటీ వేశాం. నివేదిక కూడా వచ్చింది. సీఎంతో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న లేఅవుట్(Jaganna layout) ఇళ్ల నిర్మాణంపై అనేక వినతులు వస్తున్నాయని, వీటిపై విచారణ జరిపి లబ్దిదారులకు తగిన రీతిలో న్యాయం చేస్తామని వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z