* నిజామాబాద్ నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారి నరేందర్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీల్లో భారీగా నగదు, బంగారం గుర్తించినట్టు సమాచారం. శుక్రవారం ఉదయం 5గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీల్లో రూ.6.07 కోట్ల విలువ చేసే అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. అక్రమాస్తులు కలిగి ఉన్నాడనే సమాచారంతో నిజామాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు నరేందర్ ఇంట్లో సోదాలు జరిపారు. ఇంటితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, కోటగల్లి, నిర్మల్‌లోని ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. వినాయక్‌నగర్‌లోని అశోక టవర్‌లో ఉన్న నరేందర్ ఇంట్లో ఏకంగా రూ.2.93 కోట్ల నగదు గుర్తించారు. అలాగే ఆయన భార్య బ్యాంకు ఖాతాలో రూ.1.10 కోట్ల నగదు, 51తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.1.98 కోట్లు విలువ చేసే 17 స్థిరాస్తులను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం నరేందర్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. ఈ దాడుల్లో నాలుగు బృందాలు పాల్గొన్నాయని పేర్కొన్నారు.
* మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో తిహాడ్ జైలు నుంచి ఈ సాయంత్రం బయటకు వచ్చారు. దిల్లీ మద్యం విధానం కేసులో గతేడాది ఫిబ్రవరిలో సీబీఐ అధికారులు అరెస్టు చేయగా.. దాదాపు 17నెలలకు పైగా తిహాడ్ జైలులోనే ఉన్న విషయం తెలిసిందే. విడుదల సందర్భంగా భారీ సంఖ్యలో ఆయన మద్దతుదారులు జైలు వద్దకు చేరుకొని ఆయనకు స్వాగతం పలికారు.
* దేశంలోని బాలికల పెళ్లి వయసు (Legal Age Of Marriage For Girls)కు సంబంధించి పార్లమెంట్‌లో ఇరాక్ (Iraq) ప్రభుత్వం ప్రతిపాదించిన ఓ బిల్లుపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అమ్మాయిల వివాహ వయసును 9 సంవత్సరాలకు కుదించాలంటూ ఆ బిల్లులో ప్రతిపాదించడమే అందుకు కారణం. ఈ వివాదాస్పద బిల్లును ఇరాక్ న్యాయ మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టింది. పర్సనల్ స్టేటస్ లాను సవరించే ఉద్దేశంతో దీనిని తీసుకువచ్చారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఇరాక్‌లో అమ్మాయిల వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. ఒకవేళ ఈ బిల్లు పాస్ అయితే బాలికలు 9 ఏళ్లు, బాలురు 15 ఏళ్లకు వివాహం చేసుకోవడానికి చట్టపరంగా ఎలాంటి అడ్డంకి ఉండదు. ఇది బాల్యవివాహాలు పెరిగేందుకు కారణమవుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. లింగ సమానత్వం, మహిళల హక్కుల విషయంలో ఇంతకాలం సాధించిన పురోగతిని దెబ్బతీస్తుందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
* నిత్యం రద్దీగా ఉండే ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్‌లోనూ డ్రగ్స్ భూతం బయటపడింది. హాస్టళ్ల అడ్డాగా మూడు పువ్వులు అరు కాయలుగా డ్రగ్స్ దందా సాగుతున్నట్లు హైదరాబాద్ నగర పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని ఒక బాయ్స్ హాస్టల్ లో నలుగురు యువకులు డ్రగ్స్ సేవిస్తుండగా.. పోలీసులు వారిని రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఆ ప్రాంతంలో డ్రగ్స్ సరఫరా జరుగుతుందని సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ హాస్టల్ కు డ్రగ్స్ సరఫరా చేశారని తెలుసుకుని, ఆ హాస్టల్ లో తనిఖీలు చేయగా యువకులు డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డారు. వారి నుంచి పెద్దమొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి నలుగురు యువకులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.
* ఓ అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో చోటు చేసుకుంది. చెన్నూరు డివిజన్ ఇరిగేషన్‌శాఖలో ఏఈ (Irrigation AE) గా పనిచేస్తున్న జాడి చేతన్ అనే ఉద్యోగి శుక్రవారం బాధితుడి నుంచి రూ. 5 వేలు లంచం(Bribe) తీసుకుంటుండా ఏసీబీ అధికారులు(ACB) రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. మిషన్ కాకతీయ ఫేజ్ -4లో చేపట్టిన పనులకు ఎంబీ రికార్డు కోసం బొమ్మ చంద్రశేఖర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ ఏఈని సంప్రదించాడు. దీంతో ఏఈ లంచం డిమాండ్ చేయగా కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం కార్యాలయంలో బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా అధికారులు పట్టుకుని కెమికల్స్ పూసిన నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ విధుల్లో ఉంటూ లంచం తీసుకోవడం చట్టరీత్యా నేరమని తెలిపారు. లంచం తీసుకున్న ఏఈపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టామని, కేసు దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z