Business

ఒక డాలరుకు ₹83కు పైనే మారకం-BusinessNews-Aug 09 2024

ఒక డాలరుకు ₹83కు పైనే మారకం-BusinessNews-Aug 09 2024

* విశాఖ- సికింద్రాబాద్‌ మధ్య వందేభారత్‌ రైలు షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు. డిసెంబర్‌ 10 నుంచి ఈ రైలుకు ప్రతి మంగళవారం సెలవు ప్రకటించారు. ప్రస్తుతం ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు నడుస్తోంది.

* యూపీఐ (UPI) చెల్లింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్‌ షాప్‌లో చెల్లించే ఐదు రూపాయల దగ్గర నుంచి.. వేలాది రూపాయల లావాదేవీల వరకు ఎంతమొత్తమైనా క్షణాల్లో యూపీఐతో చెల్లింపులు చేయొచ్చు. డబ్బులు పంపేందుకు జస్ట్‌ నాలుగు/ఆరంకెల పిన్‌ ఎంటర్‌ చేస్తే చాలు.. అవతలి వాళ్ల ఖాతాల్లో డబ్బులు జమ అయిపోతున్నాయి. ఎంతో ఆదరణకు నోచుకున్న ఈ డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థను మరింత సురక్షితంగా మార్చేందుకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) సిద్ధమైంది. ఇకపై యూపీఐ చెల్లింపుల ధ్రువీకరణ కోసం స్మార్ట్‌ ఫోన్లలో బయోమెట్రిక్‌ లేదా ఫేస్‌ ఐడీని వినియోగించాల్సి రావొచ్చు. ప్రస్తుతం మనం వాడే ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఫింగర్‌ ప్రింట్ సెన్సర్ కామన్‌గా ఉంటోంది. అలాగే, ఐఫోన్లలో ఫేస్‌ ఐడీ ఉంటోంది. ఇకపై యూపీఐ చెల్లింపుల కోసం ఫోన్లలో ఉండే ఈ బయోమెట్రిక్‌ ఫీచర్లను వినియోగించుకోవాలని ఎన్‌పీసీఐ భావిస్తోంది. ఇందుకోసం యూపీఐ సేవలను అందిస్తున్న గూగుల్‌ పే, ఫోన్‌ పే, అమెజాన్‌ పే, పేటీఎం సహా ఇతర యాప్‌లతో చర్చలు జరుపుతోంది. అయితే, పిన్‌ లేదా బయోమెట్రిక్‌ను ఆయా కంపెనీలు ఆప్షనల్‌గా ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

* అమెరికాకు చెందిన బయోటెక్‌ దిగ్గజం యాంజెన్‌.. హైదరాబాద్‌లో కొత్త టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. హైటెక్‌ సిటీలో RMZ స్పైర్‌ టవర్‌లో 2025, మార్చిలోపు తమ పనులను ప్రారంభించనుంది. ఇందులో గరిష్ఠంగా 3,000 మంది నిపుణులకు ఉపాధి లభించనున్నట్లు సంస్థ తెలిపింది. ఆర్జిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI), డేటా సైన్స్‌, లైఫ్‌ సైన్స్‌తో పాటు కాలక్రమేణా ఇతర అదనపు గ్లోబల్‌ సామర్థ్యాలతో సహా యాంజెన్‌ వ్యాపారంలోని కీలక రంగాలను బలోపేతం చేసే సేవలను అందించనుంది. కాలిఫోర్నియాకు చెందిన ఈ యాంజెన్‌ సంస్థ 40 ఏళ్లుగా బయోటెక్నాలజీలో అగ్రగామిగా ఉంది. యాంజెన్‌ (2023లో) 28.20 బిలియన్‌ డాలర్ల ఆదాయంతో దాదాపు 27 వేల మంది ఉద్యోగులతో ప్రపంచంలోని ప్రముఖ బయోటెక్‌ కంపెనీల్లో ఒకటి. ఈ సంస్థ భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాల్లో ఉనికిని కలిగి ఉంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. సెన్సెక్స్ 800 పాయింట్ల మేర లాభపడగా.. నిఫ్టీ 24,350 ఎగువన ముగిసింది. అమెరికాలో నిరుద్యోగ క్లెయింలు అంచనాల కంటే తక్కువగా నమోదైనట్లు గణాంకాలు వెల్లడి కావడం.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న మాంద్యం భయాలు కొంతమేర తొలగాయి. దీంతో ప్రపంచ మార్కెట్లతో పాటు మన సూచీలూ లాభపడ్డాయి. మదుపర్ల సంపద దాదాపు రూ.4 లక్షల కోట్లు మేర పెరిగింది. సెన్సెక్స్‌ ఉదయం 79,984.24 పాయింట్ల (క్రితం ముగింపు 78,886.22) వద్ద భారీ లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం అదే ఒరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 79,549.09 – 79,984.24 పాయింట్ల మధ్య కదలాడిన సూచీ చివరకు 819 పాయింట్ల లాభంతో 79,705.91 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 250.50 పాయింట్లు లాభంతో 24,367.50 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.80గా ఉంది. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.445.8 లక్షల కోట్ల నుంచి రూ.450 లక్షల కోట్లకు పెరిగింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z