* మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి భారత్‌తో అంటీముట్టనట్టుగా వ్యవహరించిన మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) మరోసారి యూటర్న్ తీసుకున్నారు. భారత్ పట్ల సానుకూల వ్యాఖ్యలు చేశారు. మాల్దీవులు సన్నిహిత మిత్ర దేశాల్లో భారత్ ఒకటని, ముఖ్యమైన భాగస్వామి అని వ్యాఖ్యానించారు. తమ దేశం అవసరంలో ఉన్నప్పుడల్లా సాయంలో ముందుంటుందని వ్యాఖ్యానించారు. అధ్యక్ష కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ విధంగా స్పందించారు. మాల్దీవుల్లోని 28 ద్వీపాలకు నీటి సరఫరా, మురుగునీటి పారుదల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ సౌకర్యాల కల్పనకు భారత్ సహకరించింది. ఇందుకోసం ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రాయితీతో రుణాన్ని అందించింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన కార్యక్రమంలోనే ముయిజ్జు మాట్లాడారు. ఈ ప్రాజెక్టులు రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మైలురాయని వ్యాఖ్యానించారు. భారత్‌తో ఉన్న చారిత్రక సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. తమ దేశం పట్ల చూపుతున్న ఉదారతకు ప్రధాని నరేంద్రమోదీ, భారత ప్రభుత్వం, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
* పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024)లో తాము బస చేసే క్రీడా గ్రామంలో వసతులు సరిగా లేవంటూ ఇప్పటికే చాలామంది అథ్లెట్లు అసంతృప్తి వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఒలింపిక్ పతకంపై ఓ అథ్లెట్ పెట్టిన పోస్ట్ మరో వివాదానికి తెర లేపింది. పారిస్‌లో కాంస్యం సాధించిన అమెరికా స్కేటర్ నిజా హ్యూస్టన్.. వారానికే దాని రంగు పోయిందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ మేరకు పతకం తాజా ఫొటోను షేర్ చేస్తూ నాణ్యత గురించి ప్రశ్నించాడు. ‘‘ఈ ఒలింపిక్ పతకాలు కొత్తగా ఉన్నప్పుడు చాలా అద్భుతంగా కన్పించాయి. కానీ దాన్ని నేను వేసుకున్నాక చెమట తగిలి కొంత రంగు మారిపోయింది. అనుకున్నంత నాణ్యతగా లేవు. కాస్త గరుకుగా మారిపోయింది. ముందువైపు రూపు మారింది. ఈ పతకాల నాణ్యతను మరింత పెంచితే బాగుంటుంది. ఈ పతకాన్ని చూస్తుంటే ఏదో యుద్ధానికి వెళ్లి వచ్చినట్లుగా అనిపిస్తోంది’’ అని హ్యూస్టన్ పేర్కొన్నాడు. రంగు మారిన పతకం ఫొటోను షేర్ చేశాడు. గతవారం జరిగిన స్ట్రీట్ స్కేట్‌బోర్డింగ్‌లో ఈ స్కేటర్ కాంస్య పతకం నెగ్గాడు.
* బంగ్లాదేశ్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఈసారి నిరసనకారులు సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఇతర న్యాయమూర్తులు దిగిపోవాలంటూ కోర్టు వద్ద నిరసనలు చేశారు. దాంతో ఆయన దిగొచ్చారు. తాను రాజీనామా చేస్తానని వెల్లడించారు. బంగ్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. ఇతర న్యాయమూర్తులతో సమావేశానికి పిలుపునిచ్చారు. అయితే దీనికి తాత్కాలిక ప్రభుత్వం అనుమతి లేదని, అలాగే ఆయన దేశం విడిచి పారిపోవచ్చనే వార్తలతో ఈ నిరసనలు ఒక్కసారిగా చెలరేగాయి. విద్యార్థులతో పాటు పలువురు నిరసనకారులు సుప్రీంకోర్టు వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. దీంతో న్యాయమూర్తుల సమావేశం అర్ధంతరంగా ఆగిపోయింది. అక్కడితో శాంతించని ఆందోళనకారులు కోర్టును చుట్టుముట్టారు. చీఫ్ జస్టిస్ గంటలో దిగిపోవాలంటూ డిమాండ్లు చేయగా.. ఆయన అందుకు అంగీకరించాల్సి వచ్చింది. రిజర్వేషన్లపై విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో.. ప్రధానిగా ఉన్న షేక్ హసీనా ఇటీవల వైదొలిగిన విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు దేశాధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేశారు. తాత్కాలిక పరిపాలన యంత్రాంగానికి యూనస్‌ను సారథిగా నియమితులయ్యారు. జులై నుంచి దశలవారీగా జరుగుతోన్న ఆందోళనల్లో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీటిన వెనక విదేశీ హస్తం ఉందంటూ కథనాలు వెలువడ్డాయి.
* బాలీవుడ్ చిత్రం ‘లాపతా లేడీస్ (Laapataa Ladies)’ను శుక్రవారం సుప్రీంకోర్టులో ప్రదర్శించారు. ఈ సినిమాను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ (CJI DY Chandrachud) సహా న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు, ఇతర రిజిస్ట్రీ అధికారులు కలిసి వీక్షించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకురాలు కిరణ్ రావు, నిర్మాత ఆమిర్ ఖాన్ పాల్గొన్నారు. దీనిని తెరకెక్కించడానికి గల కారణాన్ని తెలియజేశారు. ‘‘కొవిడ్ సమయంలో షూటింగ్స్ లేక ఇంట్లో ఉన్నప్పుడు నాకొక ఆలోచన వచ్చింది. అప్పుడు నా వయసు 56 ఏళ్లు. కెరీర్ పరంగా ఇది చివరిదశ అనిపించింది. మహాఅయితే ఇంకో 15 సంవత్సరాలు పనిచేస్తా. 70 ఏళ్ల తర్వాత నా లైఫ్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు. ఇన్నేళ్ల కెరీర్‌లో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఈ దేశం, సమాజం, పరిశ్రమ నాకెంతో ఇచ్చింది. దానిని తిరిగి ఇవ్వాలనుకున్నా. ఒక నటుడిగా ఏడాదికొక సినిమా మాత్రమే చేయగలను. కానీ, ఒక నిర్మాతగా గొప్ప కథలను ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకున్నా. ఆవిధంగా నూతన దర్శకులు, రచయితలు, నటీనటులకు అవకాశం ఇవ్వాలనిపించింది. అందుకు నేను వేసిన తొలి అడుగు ‘లాపతా లేడీస్’. ఇలాంటి టాలెంట్‌ను నేను ప్రోత్సహించాలనుకుంటున్నా. ఏడాదిలో ఐదారు చిత్రాలు నిర్మించాలనుకుంటున్నా. ఆవిధంగా ఇలాంటి అద్భుతమైన చిత్రాలను సమాజానికి అందించవచ్చు’’ అని ఆమిర్‌ఖాన్ తెలిపారు.
* రాజకీయాల్లో అన్నింటితో పాటు కుటుంబాన్నీ కోల్పోయానంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కన్నీరు పెడుతుంటారని, నిజానికి అది మొసలి కన్నీరని ఆయన భార్య, టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి, కుమార్తెలు ఆరోపించారు. గురువారం ప్రారంభమైన ఈ వివాదం శుక్రవారానికి మరింత తీవ్రమైంది. టెక్కలిలో విలేకరులతో వాణి మాట్లాడారు. వ్యక్తిత్వం లేని ఆయన వైఖరితో కుటుంబమే కాదు.. నమ్ముకున్న కార్యకర్తలు, ప్రజలు, పార్టీ రోడ్డున పడిందని ఆరోపించారు. వేరే మహిళతో అక్కవరం వద్ద నిర్మించిన ఇంట్లో ఉంటూ తమ గౌరవాన్ని, రాజకీయ జీవితాన్ని మంటగలిపారని మండిపడ్డారు. చాలా రోజుల నుంచి ఓపిక పట్టామని, గతంలో అప్పటి సీఎం జగన్‌కు పరిస్థితి వివరించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు వరకు పలాసలోనే ఉండే దువ్వాడ శ్రీనివాస్ ఎన్నికల సమయంలో ఇక్కడకు వచ్చారని, ఎన్నికలయ్యాక ఆయనతో ఆమె అదే ఇంట్లో కలిసి ఉంటున్నారని వాపోయారు. తండ్రితో మాట్లాడేందుకే తన కుమార్తెలు హైందవి, నవీన గురువారం అక్కవరం సమీపంలోని ఆయన ఇంటికి వెళ్లారని చెప్పారు. మధ్యాహ్నం 3 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు కుమార్తెలు వేచి ఉన్నా తలుపు తీయకుండా గేట్లు వేసి, లైట్లు ఆపేసి ఎందుకు దూరం పెట్టారో చెప్పాలన్నారు.
* కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేత, కోతల ప్రభుత్వమని భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. పింఛన్ పెంపు, రైతుబంధు, తులం బంగారం.. మాటలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో ఆయన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. పింఛన్ పెంపు దేవుడెరుగు, 2 నెలల నుంచి ఉన్న పింఛనే రావట్లేదని ఆరోపించారు. ‘‘తులం బంగారం దేవుడెరుగు. కేసీఆర్ ఇచ్చిన రూ.లక్ష కూడా ఎగ్గొట్టారు. అబద్ధాలు, మాయ మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గ్రామాల్లో చెత్త పేరుకుపోతోంది. ట్రాక్టర్ డీజిల్‌కు కూడా డబ్బుల్లేవు. మధ్యాహ్న భోజనం కార్మికులకు 8 నెలలుగా జీతాలు లేవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో పని చేసే కార్మికులకు జీతాల్లేవు. గ్రామాల్లో కుక్కలు, వసతి గృహాల్లో ఎలుకలు దాడి చేస్తున్నాయి’’ అని హరీశ్‌రావు అన్నారు.
* పారిస్ ఒలింపిక్స్ (paris olympics 2024) జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించాడు పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్(Arshad Nadeem). దీంతో ఆ దేశం సంబరాల్లో మునిగిపోయింది. అతడి ప్రతిభపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలు అతడిని ఆకాశానికి ఎత్తుతున్నారు. మరోవైపు పాక్ ప్రభుత్వం కూడా అతడిని ఘనంగా సత్కరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అతడికి భారీగా రివార్డులు, అవార్డులను ప్రకటిస్తున్నారు. నదీమ్ 150 మిలియన్ పాకిస్థాన్ రూపాయల (రూ.4.5 కోట్లు) కంటే ఎక్కవ మొత్తం అందుకోనున్నట్లు సమాచారం.
* ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఐదేళ్ల విధ్వంసాన్ని సరి చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన తెలంగాణ ముఖ్యనేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, సభ్యత్వాల నమోదుపై చర్చించారు. నాలుగు దశాబ్దాల్లో పార్టీ ఎత్తుపల్లాలు, విజయాలను ప్రస్తావించిన ఆయన అన్నింటినీ తట్టుకొని నిలబడ్డామని గుర్తు చేశారు.
* ప్రపంచమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్స్ (Olympics) క్రీడలు పారిస్‌లో వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఒలింపిక్స్‌లో భారతదేశం తరఫున పాల్గొని విజయం సాధించిన క్రీడా విజేతలందరికీ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు. ‘‘షూటింగ్ స్టార్స్ సరబ్‌జ్యోత్ సింగ్, మను బాకర్, స్వప్నిల్, ఇండియా హాకీ టీమ్, హాకీ ఆటగాడు శ్రీజేశ్, జావెలిన్ ఛాంపియన్ నీరజ్‌చోప్రా, స్టార్ రెజ్లర్ అమన్ సెహ్రావత్ సహా, ఒలింపిక్స్‌లో పాల్గొన్న 117 మంది క్రీడాకారులకు నా ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా వినేశ్ ఫొగాట్ నీవు నిజమైన పోరాట యోధురాలివి’’ అంటూ అందరికి ఎక్స్ వేదికగా తన సందేశాన్ని పోస్ట్ చేశారు.
* దాయాది దేశాలైన ఉత్తర, దక్షిణ కొరియా(South korea- North korea)ల మధ్య ఎప్పుడూ ఉద్రిక్త వాతావరణమే ఉంటుంది. కిమ్ రాజ్యం పొరుగుదేశంపై తాజాగా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. దక్షిణ కొరియా వైపుగా ఉత్తర కొరియా చెత్త బెలూన్లను ఎగురవేసినట్లు సియోల్ పేర్కొ. ఈ నేపథ్యంలోనే జాగ్రత్తగా ఉండాలంటూ దేశ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. సియోల్‌కు ఉత్తరాన ఉన్న ప్రాంతాల వైపుగా బెలూన్లను ఎగురవేసినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపింది. గగనతలం నుంచి వచ్చే చెత్త బెలూన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు. తమ సమీపంలో ఏదైనా బెలూన్లు, అనుమానిత వస్తువులు గుర్తిస్తే తక్షణమే మిలటరీ లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z