* కేఫ్ కాఫీ డే పేరిట రిటైల్ చైన్‌ను నిర్వహిస్తున్న కాఫీ డే గ్రూప్ మాతృ సంస్థ కేఫ్ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై (Coffee Day Enterprises) జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ.228.45 కోట్లు చెల్లించడంలో విఫలమైందంటూ ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీససెస్ లిమిటెడ్ (IDBITSL) దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌సీఎల్‌టీ బెంగళూరు బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అప్పుల్లో కూరుకుపోయిన ఈ కంపెనీపై దివాలా ప్రక్రియ సజావుగా సాగేలా మధ్యవర్తిత్వ పరిష్కార నిపుణుడిని ఏర్పాటు చేసింది.
* బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గుతున్న వేళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బ్యాంకులకు కీలక సూచన చేశారు. ప్రజల నుంచి డిపాజిట్లను ఆకర్షించడానికి వినూత్న ఉత్పత్తులను తీసుకురావాలని సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బోర్డు సమావేశం అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. రుణాలకు, డిపాజిట్లకు సమతూకం ఉండాలన్నారు. డిపాజిట్ల సేకరణ విషయంపై బ్యాంకులు దృష్టి సారించాలని నిర్మలా సీతారామన్ అన్నారు. తద్వారా వచ్చిన నిధులను అవసరమైన వారికి రుణాలుగా సమకూర్చాలన్నారు. అప్పుడే డిపాజిట్లకు, రుణాలకు మధ్య ఉన్న అంతరం తగ్గుతుందన్నారు. ఇందులో భాగంగా వినూత్న, ఆకర్షణీయ డిపాజిట్ పథకాలను తీసుకురావాలని బ్యాంకులకు సూచించారు.
* ప్రముఖ వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌కు (Youtube) సుదీర్ఘకాలం పాటు సీఈఓగా సేవలందించిన సుశాన్ వొజ్కికి (56) కన్నుమూశారు. క్యాన్సర్‌తో పోరాడుతూ మృతి చెందారు. ఆమె మృతిపట్ల గూగుల్ పిచాయ్ విచారం వ్యక్తంచేశారు. ఇంటర్నెట్ ప్రపంచంలో యూట్యూబ్‌ను వీడియో అగ్రగామిగా నిలపడంలో వొజ్కికి కీలకపాత్ర పోషించారు. 1998లో గూగుల్ చేరిన ఆమె.. 2014 నుంచి 2023 వరకు యూట్యూబ్‌కు సీఈఓగా కొనసాగారు.
* టెక్ కంపెనీల్లో లేఆఫ్‌ల (layoffs)ల పర్వం ఇంకా కొనసాగుతోంది. మొన్నటివరకు మాంద్యం భయాలతో పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించిన సంస్థలు ఇప్పుడు ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకొనే క్రమంలో లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. ఇటీవల ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్ (Dell) పెద్దఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించగా.. తాజాగా ప్రముఖ నెట్‌వర్కింగ్ సంస్థ సిస్కో (Cisco) సైతం అదే బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రెండో రౌండ్ తొలగింపులను చేపట్టనుందని సమాచారం. తగ్గిన డిమాండ్, సరఫరాల్లో అంతరాయం వల్ల కంపెనీ తన ప్రధాన వ్యాపారంలో సవాళ్లను ఎదుర్కొంటోంది. మరోవైపు సైబర్ సెక్యూరిటీ, ఏఐ.. వంటి రంగాల వైపు దృష్టిసారించే పనిలో సిస్కో పడింది. 2025 నాటికి ఏఐ ఉత్పత్తుల ఆర్డర్‌లో బిలియన్‌కు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులోభాగంగా ఉద్యోగులను తగ్గించుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరిలో 4,000 మందికి లేఆఫ్‌లు ప్రకటించిన సంస్థ తాజాగా అదే సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కంపెనీ నాలుగో త్రైమాసిక ఫలితాలతో పాటు ఉద్యోగుల తొలగింపు ప్రకటన అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. ఇదిలాఉండగా.. డెల్ గతేడాది రెండు రౌండ్లలో ఏకంగా 13 వేల మందికి ఉద్వాసన పలికింది. ఇంటెల్ సంస్థ ఇటీవల 15వేల మందికి ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే.
* అదానీ గ్రూప్ కంపెనీలపై గతేడాది అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ (Hindenburg) ఇచ్చిన నివేదిక దేశ వ్యాపార రంగాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. దానిపై ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ పరిణామాల వేళ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తాజాగా మరో పోస్ట్ చేసింది. శనివారం ఉదయం తన ‘ఎక్స్’ ఖాతాలో ‘సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా’ అని రాసుకొచ్చింది. దీంతో భారత (India) మార్కెట్లలో మరో బాంబు పేల్చనుందా? అని నెట్టింట్లో ఆందోళన మొదలైంది. ఈసారి ఏ కంపెనీపై నివేదిక విడుదల చేయనుందో అనే చర్చ జరుగుతోంది. గత కొన్ని రోజులుగా భారత స్టాక్ మార్కెట్లు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయి. ఇలాంటి సమయంలో హిండెన్‌బర్గ్ ఇచ్చే నివేదిక ట్రేడింగ్‌పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే హిండెన్‌బర్గ్ ఇలా కుట్రపూరిత ఆరోపణలు చేస్తోందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
* ఇటలీ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్గిని, ఎస్‌యూవీ మోడల్ ఉరుస్‌లో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్‌ను శుక్రవారం విపణిలోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.4.57 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఉరుస్ ఎస్‌ఈ మోడల్‌లో అమర్చిన ట్విన్ టర్బో 4.0 వీ8 టర్బో పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌తో కలిసి పనిచేయనుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కలిగిన ఈ ఫోర్-వీల్ డ్రైవ్ ప్రీమియం ఎస్‌యూవీ, ఒక్కసారి ఛార్జింగ్‌తో 60 కి.మీ ప్రయాణం చేయొచ్చు. 25.9 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఈ కారుకు ఉంది. 3.4 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం ఈ కారు ప్రత్యేకత.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z