సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్‌పై అమెరికా షార్ట్‌సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్‌లలో మాధబి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ తాజాగా ఆరోపించింది. అదానీకి చెందిన మారిషస్, ఆఫ్‌షోర్ షెల్ సంస్థల వివరాలను తెలుసుకోవడంలో సెబీ ఆసక్తి చూపకపోవడం తమను ఆశ్చర్యపరిచిందని పేర్కొంది. ‘నియంత్రణ సంస్థల జోక్యం లేకుండా అదానీ పూర్తి విశ్వాసంతో కార్యకలాపాలు సాగించడం గమనించాం. సెబీ ఛైర్‌పర్సన్ మాధబితో అదానీ సంస్థల సంబంధాలను వివరించడం ద్వారా దీన్ని అర్థం చేసుకోవచ్చు. విజిల్‌బ్లోయర్ పత్రాల ప్రకారం.. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నియంత్రణలో కొన్ని ఆఫ్‌షోర్ బెర్ముడా, మారిషస్ ఫండ్‌లు ఉన్నాయి. ఇందులో మాధబి పురి, ఆమె భర్త ధావల్ బచ్‌లకు వాటాలు ఉన్నాయి’ అని హిండెన్‌బర్గ్ తాజా నివేదికలో ఆరోపించింది. ఈ దంపతుల వాటాల నికర విలువ 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ.83 కోట్ల) వరకు ఉండొచ్చని తెలిపింది. హిండెన్‌బర్గ్ వ్యాఖ్యలపై సెబీ ఇంకా స్పందించలేదు. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువను కృత్రిమంగా పెంచేందుకు అవకతవకలకు పాల్పడిందని, కంపెనీల ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందని ఆరోపిస్తూ గతేడాది జనవరిలో హిండెన్‌బర్గ్ నివేదిక వెలువరించింది. దీంతో అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ విలువ 150 బి.డాలర్ల మేర పతనమైనా, మళ్లీ దాదాపు పూర్వస్థితికి వచ్చింది. సెబీ, సుప్రీం కోర్టులు కూడా అదానీ గ్రూప్‌నకు క్లీన్‌చిట్ ఇచ్చాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z