* క్రెడిట్ స్కోరుకు (Credit score) సంబంధించి బ్యాంకులకు ఆర్‌బీఐ (RBI) ఇటీవల కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇకపై క్రెడిట్ ఇన్ఫర్మేషన్‌ను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు (CIC) త్వరితగతిన అప్‌డేట్ చేయాలని సూచించింది. ప్రస్తుతం నెల రోజులకోసారి సమాచారాన్ని చేరవేస్తుండగా.. ఇకపై 15 రోజులకోసారి అప్‌డేట్ చేయాలని బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకులు ఎవరికైనా రుణాలు జారీ చేసే ముందు వారి యోగ్యతను తెలుసుకునేందుకు క్రెడిట్ ఇన్ఫర్మేషన్‌ను తనిఖీ చేస్తాయి. సిబిల్, ఈక్విఫాక్స్ వంటి క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ స్కోరును ఇస్తుంటాయి. సాధారణంగా 750 కంటే సిబిల్ స్కోరు మెరుగ్గా ఉంటే వారికి రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులు సంశయించవు. అదే క్రెడిట్ స్కోరు 550లోపు ఉంటే రిస్క్‌గా భావించి వెనకడుగు వేస్తుంటాయి. రుణాల జారీలో ఎంతో ముఖ్యమైన ఈ క్రెడిట్ స్కోరును ఇకపై 15 రోజులకోసారి అప్‌డేట్ చేయాలని బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశించింది. 2025 జనవరి 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. అంతకంటే ముందే ఈ సూచనలు అమలయ్యేలా చూడాలని పేర్కొంది.
* దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం (Inflation) ఐదేళ్ల కనిష్ఠానికి చేరింది. జులై నెలలో 3.54 శాతంగా నమోదైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించుకున్న 4 శాతం దిగువకు చేరడం ఇదే తొలిసారి. ఆహార పదార్థాల ధరలు తగ్గడమే దీనికి కారణం. ఈ మేరకు సోమవారం కేంద్ర గణాంక కార్యాలయం డేటాను వెలువరించింది. వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూన్ నెలలో 5.08 శాతంగా నమోదు కాగా.. గతేడాది జులైలో 7.44 శాతంగా ఉంది. చివరిసారిగా 2019 సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం 4 శాతం దిగువన ముగిసింది.
* దామోదర్ వ్యాలీ కార్పొరేషన్(DVC) నుంచి 1,600 మెగావాట్ల ప్రాజెక్టును దక్కించుకున్నట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని బీహెచ్‌ఈఎల్(BHEL) సోమవారం తెలిపింది. ఈ బొగ్గు ఆధారిత యూనిట్‌ను జార్ఖండ్‌లోని కొడెర్మా జిల్లాలో EPC(ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్) ప్రాతిపదికన నిర్మిస్తామని BHEL ఒక ప్రకటనలో తెలిపింది. 2×800 మెగావాట్ల కోడెర్మా సూపర్‌క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్(STPP)లను అంతర్జాతీయ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా పొందింది. ఈ ప్రాజెక్ట్ కోసం కీలకమైన పరికరాలను BHELకు సంబంధించిన తయారీ యూనిట్లు సరఫరా చేస్తాయి. BHEL..DVCతో సుదీర్ఘ భాగస్వామ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్‌లో అనేక బొగ్గు ఆధారిత పవర్ స్టేషన్లకు తన తోడ్పాటును అందించింది. BHEL, భారతదేశంలోని అతిపెద్ద ఇంజనీరింగ్, తయారీ కంపెనీల్లో ఒకటి.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. హిండెన్‌బర్గ్- అదానీ వ్యవహారం మరోసారి చర్చకు రావడంతో ఆ ప్రభావం సూచీలపై పడింది. ఆరంభంలో దీని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ.. తర్వాత సూచీలు కోలుకున్నాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. ఆఖర్లో కాస్త అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 79,330.12 పాయింట్ల (క్రితం ముగింపు 79,705.91) వద్ద నష్టాల్లో ప్రారంభైమైంది. ఇంట్రాడేలో దాదాపు 500 పాయింట్ల మేర నష్టాల్లోకి జారుకున్న సూచీ.. 79,226.13 వద్ద కనిష్ఠాన్ని తాకింది. తర్వాత కోలుకుని లాభాల్లోకి వచ్చింది. 80,106 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరికి 56 పాయింట్ల నష్టంతో 79,648.92 వద్ద ముగిసింది. నిఫ్టీ 20.50 పాయింట్ల నష్టంతో 24,347 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84గా ఉంది.
* అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg) తాజా ఆరోపణలు మరోసారి అదానీ గ్రూప్‌స్టాక్స్‌ను కుదిపేశాయి. ఈసారి అదానీ గ్రూప్ సంస్థలను నేరుగా లక్ష్యంగా చేసుకోనప్పటికీ.. గతంలో చేసిన ఆరోపణలకు కొనసాగింపుగా ఈసారి సెబీ చీఫ్‌ను ఈ వ్యవహారంలోకి లాగడం గమనార్హం. దీంతో అదానీ గ్రూప్ (Adani group) స్టాక్స్‌పై మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో ఆ గ్రూప్ కంపెనీల షేర్లన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ఈ ఉదయం బీఎస్‌ఈలో ఏకంగా 17 శాతం మేర నష్టపోయింది. అదానీ టోటల్ గ్యాస్ 13.39 శాతం, ఎన్డీటీవీ 11 శాతం, అదానీ పవర్ 10.94 శాతం చొప్పున నష్టపోయాయి. అదానీ గ్రీన్ ఎననర్జీ 6.96 శాతం, అదానీ విల్మర్ 6.49 శాతం, అదానీ ఎంటర్ ప్రైజెస్ 5.43 శాతం, అదానీ పోర్ట్స్ 4.95 శాతం, అంబుజా సిమెంట్స్ 2.53 శాతం, ఏసీసీ 2.42 శాతం చొప్పున నష్టపోయాయి. అయితే, తర్వాత కాస్త కోలుకున్నాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z