Agriculture

ఏసీబీకి పట్టుబడిన రంగారెడ్డి జాయింట్ కలెక్టర్-CrimeNews-Aug 13 2024

ఏసీబీకి పట్టుబడిన రంగారెడ్డి జాయింట్ కలెక్టర్-CrimeNews-Aug 13 2024

* హైదరాబాద్‌లోని తన ఇల్లు విక్రయానికి పెట్టిన ఓ ఎన్‌ఆర్‌ఐ వైద్యురాలి బ్యాంకు ఖాతా లావాదేవీలను సైబర్‌ పోలీసులు నిలిపివేశారు. రూ.10 కోట్లకు సంబంధించి జరిగిన లావాదేవీల్లో సైబర్‌ మోసం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో నగరానికి వచ్చిన ఆమె జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలో నివసించే డాక్టర్‌ బినోతి మార్తాండ్‌కు జూబ్లీహిల్స్‌ నందగిరిహిల్స్‌లో 334 చదరపు గజాల స్థలంలో ఇల్లు ఉంది. దీన్ని విక్రయించడానికి నిర్ణయించి వివరాలు ఇంటర్నెట్‌లో పెట్టారు. గురునాథ్‌ అనే రియల్‌ఎస్టేట్‌ ఏజెంట్‌ను కూడా నియమించుకున్నారు. అతని ద్వారా 2022లో షేక్‌ బషీర్‌ అలియాస్‌ బాబు అనే వ్యక్తి ఆమెను వాట్సప్‌లో సంప్రదించారు. అయితే ఎలాంటి ఒప్పందానికి రాలేదు. తాజాగా ఈ ఏడాది జులైలో బషీర్‌ ఆమెకు ఫోన్‌చేసి.. రూ.12.5 కోట్లకు ఒప్పందం చేసుకోగా మూడు విడతలుగా రూ.11 కోట్లు ఆమె సూచించిన ఖాతాకు బదిలీ చేశారు. మరో రూ.1.5 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. టీడీఎస్‌కు డబ్బులు కట్టాల్సి ఉందని బషీర్‌ కోరడంతో ఆమె రూ.1,48,75,000 అతని ఖాతాలో వేశారు. ఈ క్రమంలో జులై 16న షేక్‌ బషీర్‌ ఆ ఇంటిని తన అధీనంలోకి తీసుకున్నారు. అయితే 19వ తేదీన ఊహించని రీతిలో ఎన్‌ఆర్‌ఐ ఖాతాను సైబర్‌ పోలీసులు సీజ్‌ చేశారు. ఈ చెల్లింపుల్లో సైబర్‌ మోసం జరిగిందంటూ ఖాతాను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. దీంతో షాక్‌కు గురైన వైద్యురాలు వెంటనే బషీర్‌కు ఫోన్‌ చేశారు. స్పందించపోవడంతో 28న తన కుమారుడు జాన్‌ మార్తాండ్‌తో ఆమె హైదరాబాద్‌కు వచ్చారు. ఇంటివద్దకు వెళ్లగా బషీర్‌కు చెందిన సెక్యూరిటీ సిబ్బంది కనిపించారు. అంతకుముందు ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను తొలగించి వేరేవి పెట్టినట్లు గుర్తించారు. బషీర్‌ తన ఫోన్‌కాల్స్‌కు స్పందించకపోవడంతో ఆమె ఈ విషయమై ఫిర్యాదు చేసినట్లు జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

* రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాలోని ఓ మహిళ తన సోదరి ఇంటికి వెళ్లాలనుకుంది. అందుకు అంగీకరించని భర్త ఆమెను ద్విచక్ర వాహనానికి కట్టేసి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి చిత్ర హింసలకు గురిచేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగౌర్‌కి చెందిన ప్రేమ్‌రామ్‌ మేఘ్వాల్‌(40) భార్య జైసల్మేర్‌లోని సోదరి ఇంటికి వెళ్లాలనుకుంది. కానీ, ఆమె భర్త అందుకు నిరాకరించడంతో ఇరువురి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ప్రేమ్‌రామ్‌ తన భార్య కాళ్లను ద్విచక్రవాహనం వెనక కట్టి మట్టి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఈ వీడియోని కొందరు వ్యక్తులు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ మహిళ జైసల్మేర్‌లో ఉన్నట్లు వెల్లడించారు.

* అగ్రిగోల్డ్‌ భూముల విషయంలో అవకతవకలు జరిగాయని ఏసీబీ అడిషినల్‌ ఎస్పీ సౌమ్యలత తెలిపారు. ఈ కేసులో జోగి రాజీవ్‌, మండల సర్వేయర్‌ రమేష్‌లను అరెస్టు చేశామని తెలిపారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు సీఐడీ అటాచ్‌మెంట్‌లో ఉన్నాయని, ఆ భూముల సర్వే నెంబర్‌ను మార్చారన్నారు. సీఐడీ అధికారుల నివేదికను కూడా తెప్పిస్తున్నట్టు వెల్లడించారు. పీసీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశామని, ప్రభుత్వ అధికారులు ఈ కేసులో దోషులుగా ఉన్నారని చెప్పారు. అందుకే తమ విచారణ వేరుగా సాగిస్తున్నట్టు తెలిపారు. సీఐడీ, ఏసీబీ అధికారుల విచారణ నివేదికలను ఉన్నతాధికారులకు వివరిస్తామన్నారు. తమ దర్యాప్తులో ఐదుగురు పేర్లు ఉన్నాయని, విచారణలో మరి కొన్ని పేర్లు రావొచ్చన్నారు. జోగి రమేష్ పాత్రపై విచారణ జరుగుతోందని, ఆయన ప్రమేయంపై నిర్ధారణ అయితే కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. 87 సర్వే నెంబరులో ఎలాంటి సబ్‌డివిజన్‌లు జరగలేదన్నారు. అవ్వా శేష నారాయణ ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించామని, అక్రమ రిజిస్ట్రేషన్‌లు జరిగాయని తేలాకే కేసు నమోదు చేశామని చెప్పారు. సర్వే నెంబర్‌ 88లో స్థలం కొని 87 సర్వే నెంబర్‌లో ఉందని మార్పు చేసుకున్నారని, ఇదంతా కుట్ర ప్రకారమే జరిగిందని వెల్లడించారు. గ్రామ, మండల సర్వేయర్లను మేనేజ్‌ చేశారన్నారు. సర్వేయర్‌ రమేష్‌, జోగి రాజీవ్‌లను కోర్టులో హాజరుపరుస్తామన్నారు.

* రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ) భూపాల్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఆయనతో పాటు కలెక్టరేట్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌మోహన్‌రెడ్డి కూడా పట్టుబడ్డారు. ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితా నుంచి భూమి తొలగింపునకు జాయింట్‌ కలెక్టర్‌ రూ.8 లక్షల లంచం డిమాండ్‌ చేశారు. డబ్బును సీనియర్‌ అసిస్టెంట్‌ ద్వారా జేసీ తీసుకున్నారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు దాడి చేసి జేసీ, సీనియర్‌ అసిస్టెంట్‌ను పట్టుకున్నారు. మరోవైపు నాగోల్‌లోని జేసీ భూపాల్‌రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు చేపట్టారు. ఇంటిలో రూ.16లక్షల నగదు, కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z