Business

ఇక మీ UPI కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు-BusinessNews-Aug 15 2024

ఇక మీ UPI కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు-BusinessNews-Aug 15 2024

* తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆనంద్‌ మహీంద్రా ఏడాదిపాటు ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.

* డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తున్న యూనిఫైడ్‌ పేమెంట్ ఇంటర్‌ఫేస్‌ (UPI) ప్లాట్‌ఫామ్‌పై నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (NPCI) మరో కొత్త ఫీచర్‌ పరిచయం చేసింది. బ్యాంక్‌ ఖాతా లేకున్నా ఒకరి యూపీఐ అకౌంట్‌ను వేరొకరు వాడుకునేలా యూపీఐ సర్కిల్‌ (UPI circle) పేరిట కొత్త ఫీఛర్‌ను తీసుకొచ్చింది. డెలిగేట్‌ పేమెంట్స్‌గా పేర్కొనే ఈ ఫీచర్‌కు సంబంధించి తాజాగా ఓ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రస్తుతం బ్యాంక్‌ అకౌంట్‌ ఉన్నవారు తమ మొబైల్‌లో యూపీఐ సేవలను వాడుకోవచ్చు. ఎవరి యూపీఐని వారే వినియోగించుకోవడానికి వీలుంది. వేరొకరు వాడేందుకు అనుమతి లేదు. కొత్తగా తీసుకొచ్చిన యూపీఐ సర్కిల్‌తో అది సాధ్యం కానుంది. ప్రైమరీ యూపీఐ అకౌంట్‌ను కుటుంబసభ్యులు, పరిచయం ఉన్న వ్యక్తులతో పంచుకునే వెసులుబాటును కల్పిస్తోంది. అంటే ఒకరి బ్యాంక్‌ అకౌంట్‌ను వేరొకరు వినియోగించి లావాదేవీలు జరపొచ్చన్నమాట. కుటుంబసభ్యుల్లో ఎవరైనా బయటకు వెళ్లినప్పుడు వారి లావాదేవీల కోసం ఈ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. లేదంటే స్కూల్‌, కాలేజీకి వెళ్లే పిల్లలకు వారి ఖర్చుల కోసం మీ యూపీఐ ఖాతాను పంచుకోవచ్చు. లేదంటే ఇంటి ఖర్చులను ట్రాక్‌ చేసేందుకు అందరూ ఒకటే బ్యాంక్‌ ఖాతాను వినియోగించడానికీ ఈ యూపీఐ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. బ్యాంకు ఖాతా లేనందున ఇప్పటికీ నగదు లావాదేవీలపై ఆధారపడుతున్న వారిని దృష్టిలోపెట్టుకొని ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు ఎన్‌పీసీఐ పేర్కొంది. యూపీఐ యాప్స్‌, పేమెంట్‌ సర్వీసు ప్రొవైడర్లు ఈ సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నాయి. యూపీఐ డెలిగేట్ పేమెంట్ కోసం ప్రైమరీ యూపీఐ హోల్డర్‌ ఒక మ్యాండేట్‌ను క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు తన కాంటాక్టులోని నచ్చిన నంబర్‌ను ఎంచుకోవచ్చు. ఒక ప్రైమరీ యూజర్‌ గరిష్ఠంగా ఐదుగురు సెకండరీ యూజర్లను ఎంచుకోవచ్చు. సెకండరీ యూజర్‌ మాత్రం ఒక ప్రైమరీ యూజర్‌ అకౌంట్‌ను మాత్రమే వినియోగించడానికి వీలుంటుంది. ప్రైమరీ యూజర్‌.. సెకండరీ యూజర్ల చెల్లింపులకు సంబంధించి నగదు, వినియోగంపై పరిమితి విధించొచ్చు. నెలకు గరిష్ఠంగా రూ.15వేలు వరకు వినియోగించుకోవచ్చు. గరిష్ఠంగా రూ.5 వేలు వరకు లావాదేవీలు చేయొచ్చు. సెకండరీ యూజర్‌ చేసే లావాదేవీలు ప్రైమరీ అకౌంట్ హోల్డర్‌ యూపీఐ యాప్‌, బ్యాంక్‌ ఖాతాలో కనిపిస్తాయి. చెల్లింపులకు సంబంధించి పూర్తి డెలిగేషన్‌ ఇస్తే.. సెకండరీ యూజర్‌ ఎలాంటి అవాంతరాలూ లేకుండా చెల్లింపులు చేయొచ్చు. అదే పాక్షిక డెలిగేషన్ ఇస్తే.. సెకండరీ యూజర్‌ నుంచి వచ్చే రిక్వెస్ట్‌ను ప్రతిసారీ ప్రైమరీ యూజర్‌ ఆమోదించాల్సి ఉంటుంది.

* విద్యుత్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) ‘రోడ్‌స్టర్‌’ పేరిట మోటార్‌ సైకిల్‌ను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. ప్రస్తుతం విద్యుత్‌ స్కూటర్లు మాత్రమే విక్రయిస్తున్న ఈ కంపెనీ నుంచి వస్తున్న తొలి మోటార్‌ సైకిల్ ఇదే. ఈ మోటార్‌ సైకిల్‌ ధర రూ.74,999 నుంచి ప్రారంభం అవుతుంది. రోడ్‌ స్టర్‌ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. రోడ్‌ స్టర్‌ (Roadster), రోడ్‌స్టర్‌ ఎక్స్‌ (Roadster X), రోడ్‌ స్టర్‌ ప్రో (Roadster Pro) పేరిట లభిస్తుంది. వీటిలో మళ్లీ వేర్వేరు సబ్‌ వేరియంట్లు ఉన్నాయి. ‘సంకల్ప్‌’ పేరిట నిర్వహించిన ఈవెంట్‌లో దీన్ని లాంచ్ చేసింది.

* ఐకానిక్‌ మోటార్ సైకిల్ బ్రాండ్లలో ఒకటైన బీఎస్‌ఏ (BSA) భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. గోల్డ్‌ స్టార్ 650 (Gold star 650) పేరిట ఓ బైక్‌ను మహీంద్రా గ్రూప్‌ లాంచ్ చేసింది. తద్వారా దేశీయ ప్రీమియం మోటార్‌ సైకిల్‌ సెగ్మెంట్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రపంచంలోని అతి పురాతనమైన మోటార్‌ సైకిల్‌ బ్రాండ్లలో బీఎస్‌ఏ ఒకటి. దీని అసలు పేరు బర్మింగ్‌ హామ్‌ స్మాల్‌ ఆర్మ్స్‌ కంపెనీ (BSA).

* ఆటోమొబైల్‌ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా (Mahindra) మరో కొత్త థార్‌ను దేశీయ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 డోర్‌ మహీంద్రా థార్‌ రాక్స్‌ (Mahindra Thar Roxx) లాంచ్‌ చేసింది. పెట్రోల్‌, డీజిల్‌ రెండు ఆప్షన్లలో దీన్ని విడుదల చేసింది. పెట్రోల్‌ బేసిక్‌ వేరియంట్‌ ధర రూ.12.99 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతుంది. ఇక డీజిల్‌ వెర్షన్‌ రూ.13.99 లక్షల (ఎక్స్‌- షోరూమ్‌) నుంచి మొదలవుతుందని కంపెనీ వెల్లడించింది. ఇక థార్‌ రాక్స్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులోని 2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ 160 బీహెచ్‌పీ శక్తిని, 330ఎన్‌ఎమ్‌ టార్క్‌ని అందిస్తుంది. ఇక 2.2 లీటర్ల mHawk డీజిల్‌ ఇంజిన్‌ 150 బీహెచ్‌పీ శక్తిని, 330ఎమ్‌ఎమ్‌ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లు సిక్స్‌ స్పీడ్‌ మాన్యువల్‌, ఆటో మెటిక్‌ గేర్‌ బాక్స్‌తో వస్తున్నాయి. సిక్స్‌ డబుల్‌ స్టాక్డ్‌ స్లాట్స్‌, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ ల్యాంప్‌లు ఉన్నాయి. వెనకభాగంలో సీ- షేప్డ్‌ ఎల్‌ఈడీ టెయిల్‌లైట్స్‌, టెయిల్‌గేట్‌- మౌంటెడ్‌ స్పేర్‌ వీల్‌ అమర్చారు. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టంతో వస్తోంది. ఇది యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటోకి సపోర్ట్‌ చేస్తుంది.

* ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) వడ్డీ రేట్లను సవరించింది. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ లెండింగ్‌ రేటును (MCLR) 10 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. దీంతో కన్జూమర్‌, ఆటో రుణాలు (Loans) మరింత ప్రియం కానున్నాయి. సవరించిన ధరలు ఆగస్టు 15 నుంచే అమల్లోకి వస్తాయని ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో చివరిసారిగా ఎంసీఎల్ఆర్‌ను సవరించింది. సవరించిన రేట్ల ప్రకారం.. వివిధ కాల వ్యవధులకు ఎంసీఎల్‌ఎల్‌ఆర్‌ 8.20 శాతం నుంచి గరిష్ఠంగా 9.1 శాతంగా ఉంది. ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్ 8.20 శాతానికి చేరగా.. నెల, మూడు నెలల కాల వ్యవధులకు లెండింగ్‌ రేటు 8.45 శాతం నుంచి 8.5 శాతానికి చేరింది. ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 8.85 శాతానికి, ఏడాది లెండింగ్‌ రేటు 8.85 నుంచి 8.95 శాతానికి పెరిగింది. రెండేళ్ల ఎంసీఎల్‌ఆర్ 9.05 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్ 9.1 శాతానికి పెంచుతున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z